ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday, 22 December 2011

నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్‌ కోర్సులు

సృజనాత్మకత, నవ్యతకు ప్రాధాన్యం ఇచ్చే కెరియర్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ.

మారుతోన్న సామాజిక ధోరణులను, జీవన విధానాలను అధ్యయనం చేస్తూ, వినియోగదారుల మనోభావాలకు తగిన రీతిలో దుస్తులను డిజైన్‌ చేయడం ఈ కెరియర్‌లో చాలా కీలకం.

ఈ అంశాల్లో పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటైన సంస్థ... నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌).

ఫ్యాషన్‌ సంబంధిత అంశాల్లో గ్రాడ్యుయేషన్‌ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ రకాల కోర్సులను నిఫ్ట్‌ అందిస్తోంది. రానున్న విద్యాసంవత్సరానికి నిఫ్ట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వెలువడింది.

హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా నిఫ్ట్‌కు 15 కేంద్రాలున్నాయి.

వీటిలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌, టెక్నాలజీ, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, తదితర విభిన్న కోర్సులను అందిస్తున్నారు. సమాజంలోని వివిధ రకాల వ్యక్తుల జీవన విధానాలను, ఫ్యాషన్‌ అభిరుచులను అర్థం చేసుకుంటూ, వారికి తగిన విధంగా దుస్తులను, ఇతర సౌకర్యాలను డిజైన్‌ చేయడం ఫ్యాషన్‌ కోర్సుల్లో ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న నిఫ్ట్‌, ఫ్యాషన్‌ సంబంధిత కోర్సులకు 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌'గా పేరుపొందింది. పరిశ్రమల నిపుణుల, ఇతర ప్రముఖ సంస్థల మదింపు ఆధారంగా నిఫ్ట్‌ గత ఏడాది అన్ని కోర్సులను పూర్తిస్థాయిలో సంస్కరించడం విశేషం.
డ్యుయల్‌ డిగ్రీ కూడా...
అమెరికాలోని ఫ్యాషన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎఫ్‌ఐటీ)తో కలిసి నిఫ్ట్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో డ్యుయల్‌ డిగ్రీని అందిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి ఎంపికైన అభ్యర్థులు నిఫ్ట్‌ కేంద్రంలో మొదటి రెండేళ్లు, ఎఫ్‌ఐటీలో మూడో ఏడాది శిక్షణ తీసుకోవాలి. తర్వాత మళ్లీ నిఫ్ట్‌లో కోర్సు కొనసాగించాలి. నిఫ్ట్‌ కేంద్రాల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు చేస్తోన్న అభ్యర్థుల నుంచి ఈ కోర్సుకు అర్హులను ఎంపిక చేస్తారు. నిఫ్ట్‌కు లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ (యూకే), క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (ఆస్ట్రేలియా), కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ (అమెరికా), రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ (నెదర్లాండ్స్‌), ఫిలడెల్ఫియా యూనివర్సిటీ (అమెరికా), తదితర సంస్థలతో విద్యాపరమైన సంబంధాలు ఉన్నాయి.

కోర్సులు, సీట్ల వివరాలు...
* బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌: వ్యవధి నాలుగేళ్లు. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు... ఫ్యాషన్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, యాక్సెసరీ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌. ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్మీడియట్‌ చదివిన విద్యార్థులు అర్హులు.

* బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ: కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఇందులో అప్పారల్‌ ప్రొడక్షన్‌ స్పెషలైజేషన్‌ మాత్రమే ఉంది. మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్‌ చదివినవారు అర్హులు.

* మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌: ఇవి అడ్వాన్స్‌డ్‌ కోర్సులు. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉన్న అభ్యర్థులు అర్హులు. నిఫ్ట్‌ లేదా ఎన్‌ఐడీలో డిప్లొమా చదివినవారు కూడా దరఖాస్తు చేయవచ్చు.

* మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ: ఏ స్పెషలైజేషన్‌తోనైనా బీఈ లేదా బీటెక్‌ చదివినవారు అర్హులు. నిఫ్ట్‌లో బీఎఫ్‌టెక్‌ చేసినవారు కూడా అర్హులు.

నిఫ్ట్‌ కేంద్రాలు గల ప్రదేశాలు: హైదరాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, చెన్నై, గాంధీనగర్‌, జోధ్‌పూర్‌, కాంగ్రా, కానూర్‌, కోల్‌కతా, ముంబయి, న్యూఢిల్లీ, పాట్నా, రాయబరేలీ, షిల్లాంగ్‌. అన్ని కేంద్రాల్లో కలిపి వివిధ కోర్సుల్లో 2180 సీట్లున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంలో 214 సీట్లున్నాయి.

అన్ని కేంద్రాల్లో కలిపి కోర్సులవారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు...

బ్యాచిలర్‌ కోర్సులు...
* ఫ్యాషన్‌ డిజైన్‌ (FD): 330
* లెదర్‌ డిజైన్‌ (LD): 120
* యాక్సెసరీ డిజైన్‌ (AD): 240
* టెక్స్‌టైల్‌ డిజైన్‌ (TD): 330
* నిట్‌వేర్‌ డిజైన్‌ (KD): 210
* ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌ (FC): 150
* అప్పారెల్‌ ప్రొడక్షన్‌ (AP): 323

మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లు...
* మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (MD): 60
* మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ (MFM): 324
* మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (M.FT): 93


ఎంపిక, దరఖాస్తు విధానం
జాతీయ స్థాయిలో నిర్వహించే రాతపరీక్ష (జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుకు సంబంధించిన ఆప్టిట్యూడ్‌, సామర్థ్యాలు, తెలివితేటలను పరీక్షిస్తారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నల సంఖ్య ఏటా మారుతుంటోంది. నెగటివ్‌ మార్కులుంటాయి. రాత పరీక్షను 12 ఫిబ్రవరి, 2012న నిర్వహించనున్నారు. మనరాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి. మాస్టర్స్‌ కోర్సులకు రాతపరీక్షతోపాటు గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. రాతపరీక్షలో కింది విభాగాలుంటాయి...

* క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ
* కమ్యూనికేషన్‌ ఎబిలిటీ
* ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌
* ఎనలిటికల్‌ ఎబిలిటీ
* జనరల్‌ నాలెడ్జ్‌ - కరెంట్‌ అఫైర్స్‌


నిఫ్ట్‌ దరఖాస్తులు ఐడీబీఐ, యాక్సిస్‌ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి.
నిఫ్ట్‌ వెబ్‌సైట్‌ నుంచి కూడా దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 10 జనవరి 2012.
జూన్‌-జులైలో కౌన్సెలింగ్‌ ఉంటుంది.

No comments:

Post a Comment