ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 31 October 2011

ఏఐఈఈఈ కి పెరిగింది ప్రాధాన్యం!


ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, మరికొన్ని ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష... ఆలిండియా ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఈఈఈ).

11వ ఏఐఈఈఈ పరీక్ష 29 ఏప్రిల్‌ 2012న జరగనుంది.

దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభ్యర్థులు రాసే ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఇది. దీన్ని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. పరీక్ష మీద సరైన అవగాహనతో సిద్ధమైతే ఇందులో విజయం సాధించి మంచి సంస్థలో సీటు దక్కించుకోవడం సులభం!


గత ఏడాది సుమారు పదిన్నర లక్షల మంది విద్యార్థులు ఏఐఈఈఈ రాశారు. ఏఐఈఈఈ 2011 ద్వారా వివిధ రకాల ఇంజినీరింగ్‌ కాలేజీల్లో దాదాపు 28 వేల సీట్లు భర్తీ అయ్యాయి. ఏఐఈఈఈ 2012కు తేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్ష రెండు పద్ధతుల్లో జరగనుంది. అవి...

1) పేపర్‌-పెన్‌ పద్ధతిలో జరిగే ఆఫ్‌లైన్‌ పరీక్ష:

ఇది 29 ఏప్రిల్‌ 2012న మనదేశంలోని 63 పట్టణాల్లో, దుబాయ్‌, రియాద్‌లలో జరగనుంది.

2) కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష:
ఇది 7 మే 2012 నుంచి 25 మే 2012 వరకు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 22 నగరాల్లో జరగనుంది. మనరాష్ట్రంలో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలున్నాయి.

ఏఐఈఈఈ 2012 (ఏ పద్ధతిలోనైనా) రాయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. పరీక్ష ఫీజును డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా గానీ, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా గానీ చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపడంలో ఏమైనా ఇబ్బందులెదురైతే గత ఏడాది ఏఐఈఈఈ 2011 అప్లికేషన్‌లు విక్రయించిన సహాయ కేంద్రాల్లో సంప్రదించవచ్చు. ఆ కేంద్రాల్లో దరఖాస్తుల విక్రయం ఉండదుకానీ, ఆన్‌లైన్‌లో నింపడానికి సహాయం లభిస్తుంది.

ఏఐఈఈఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఇంజినీరింగ్‌ కోర్సులైన బీఈ/ బీటెక్‌లలో చేరదలచుకున్న విద్యార్థులు పేపర్‌-1ను, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో చేరదలచుకున్నవారు పేపర్‌-2 రాయాలి. పేపర్‌-1లో మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో సమాన ప్రాధాన్యత గల ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. పేపర్‌-2లో మేథమేటిక్స్‌, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లలో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు, డ్రాయింగ్‌ పరీక్షలుంటాయి. పరీక్ష విధానానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసంwww.cbse.nic.inలేదా www.aieee.nic.in వెబ్‌సైట్‌ చూడగలరు.

పెరుగుతోన్న ప్రతిష్ఠ
ఇటీవలి కాలం వరకు ఐఐటీ జేఈఈ తర్వాత రెండో ప్రాధాన్యత గల పరీక్షగా ఏఐఈఈఈకి పేరుంది. గత కొన్నేళ్ల నుంచి, ఐఐటీ - జేఈఈతో సమాన ప్రాధాన్యం గల పరీక్షగా ఏఐఈఈఈ గుర్తింపు తెచ్చుకుంది. 2006వ సంవత్సరం నుంచి ఐఐటీ జేఈఈ పరీక్ష ప్రతిష్ఠ క్రమేణా తగ్గుతూ వస్తోంది. పూర్తి ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షగా మారడం, పరీక్షలో సుమారు 50 శాతం ప్రశ్నలకు నెగటివ్‌ మార్కులు లేకపోవడం, ప్రశ్నల స్థాయి బాగున్నా, ఊహించి సమాధానాలు రాసే విద్యార్థులకు కూడా ర్యాంకు వచ్చేలా పరీక్ష రూపాంతరం చెందడం లాంటి విషయాలు జేఈఈని నిపుణుల విమర్శకు గురిచేశాయి.


మరోవైపు ఏఐఈఈఈకి క్రమేణా ఖ్యాతి పెరుగుతోంది. ప్లస్‌ 2 స్థాయిలోనే నాణ్యమైన ప్రశ్నలను రూపొందించడం, ప్రతి ప్రశ్నకు నెగటివ్‌ మార్కింగ్‌ ఉండటం వల్ల ఊహించి సమాధానాలు రాయడానికి అవకాశం లేకపోవడం, పరీక్షను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించడం లాంటి అంశాలు ఏఐఈఈఈ ప్రతిష్ఠను పెంచాయి. అంతేగాక, ఐఐటీల సంఖ్యను రెండింతలకుపైగా పెంచినా కొత్త ఐఐటీలకు సరైన భవనాలు, బోధనాసిబ్బంది, వసతులు లేకపోవడం వల్ల... ఐఐటీ-జేఈఈలో 3000 పైన ర్యాంకు సాధించిన విద్యార్థులు, కొత్త ఐఐటీల్లో చేరడానికి బదులు, పేరున్న ఎన్‌ఐటీలు, ఐఐఐటీలలో చేరడానికే ఇష్టపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఐటీలతో సమానంగా ఈ సంస్థలకు కూడా గుర్తింపు ఉండటం వల్ల విద్యార్థులు ఏఐఈఈఈకి కూడా జేఈఈతో సమానమైన ప్రాధాన్యం ఇచ్చి సంసిద్ధులవుతున్నారు.

మనరాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐఈఈఈ పరీక్షపై అవగాహన తక్కువనే చెప్పాలి. రాష్ట్రం నుంచి జేఈఈలో మంచి ర్యాంకులు సాధించినవారికే ఏఐఈఈఈలో కూడా మంచి ర్యాంకులు వస్తున్నాయిగానీ, జేఈఈలో విజయం సాధించని అభ్యర్థులకు ఏఐఈఈఈలో కూడా మంచి ర్యాంకు రావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐఐటీ జేఈఈలో ఏ ర్యాంకూ రాని విద్యార్థులు ఎందరికో ఏఐఈఈఈలో మంచి ర్యాంకులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే... అక్కడి విద్యార్థులు, ఐఐటీ జేఈఈ స్థాయి తమకు లేదనుకుంటే, ఆ పరీక్ష జోలికి వెళ్లకుండా, పదో తరగతి తర్వాత రెండేళ్లూ ప్రత్యేకంగా ఏఐఈఈఈ కోసం తయారవుతున్నారు. మన రాష్ట్రంలోని విద్యార్థులకు తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అంచనా వేసుకోకుండా ఐఐటీలపై మోజుతో జేఈఈ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. ఓ ఏడాది గడచిన తర్వాత నిరాశ చెంది ఏఐఈఈఈ వైపు దృష్టి సారిస్తున్నారు. సమయం వృధా కావడం వల్ల, విద్యార్థుల పరిస్థితి రెంటికి చెడినట్టుగా తయారవుతోంది.

జేఈఈ, ఈఈఈ మధ్య వ్యత్యాసం
ఐఐటీ- జేఈఈ, ఏఐఈఈఈ రెండూ దాదాపు ఒకే సిలబస్‌ మీద ఆధారపడిన ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షలే అయినా, ప్రశ్నల రూపకల్పనలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. జేఈఈలో సబ్జెక్టు లోతుల్లోని భావనలపై, చిక్కుముడి ఉన్న ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలు సాధారణంగా మార్కెట్‌లో లభించే పుస్తకాల్లో ఉండవు. కాబట్టి పరీక్ష హాల్లో విద్యార్థి తనకు సబ్జెక్టుపై ఉన్న అవగాహనతో, తాను చదువుకున్న భావనలను ఉపయోగించి, సమాధానం కనుక్కోవలసి ఉంటుంది. రెండేళ్లూ కష్టపడి సబ్జెక్టులను క్షుణ్నంగా, ఏ మూలా వదలకుండా అధ్యయనం చేసిన విద్యార్థులే ఇలాంటి ప్రశ్నలు సాధించగలుగుతారు.

ఏఐఈఈఈలో ప్రశ్నలు సబ్జెక్టు మూలాలపై ఆధారపడి ఉంటాయి. జ్ఞాపక శక్తి, వేగాన్ని పరీక్షించే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ప్రశ్నలు, మార్కెట్లో లభించే పుస్తకాల్లోని ప్రశ్నలు కూడా కొన్ని ఉంటాయి. అందువల్ల ఏఐఈఈఈకి ప్రిపేరయ్యే విద్యార్థులు సబ్జెక్టు లోతులకు వెళ్లకుండా, బేసిక్స్‌, ఫండమెంటల్స్‌ను బాగా చదువుకొని, వాటిపై ఆధారపడిన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. సరైన సాధనతో, ప్రణాళికా బద్దంగా ప్రిపేరైతే సగటు విద్యార్థి కూడా ఏఐఈఈఈలో మంచి ర్యాంకు సాధించవచ్చు.

Sunday, 30 October 2011

Buckle under pressure అంటే?

ఇంగ్లిష్ లో కొన్ని వ్యక్తీకరణలను Collocations శీర్షిక ద్వారా  తెలుసుకుంటున్నాం కదా!  ఈ కథనంలో అలాంటి నాలుగు collocations  చూడండి!






Friday, 28 October 2011

మీ లక్ష్యం ఐఐటీనా?

మీరు ఐఐటీల్లో ప్రవేశించాలనే లక్ష్యంతో  కష్టపడి చదువుతున్నారా?

అయితే మీరు కిందటి సంవత్సరం ఎన్ని మార్కులకు  ఏ ర్యాంకు వచ్చిందో,  సబ్జెక్టువారీగా  కటాఫ్ మార్కులు ఎంతో తెలుసుకోవాల్సిందే. 

చదువులో వచ్చిన ఈ కథనం పరిశీలించండి.

































హుషారుగా ఇలా తయారు
ఐఐటి-జెఇఇ కష్టమయినదే కానీ విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ఒక నిర్ణీత ప్రణాళికతో తయారయితే సాధించవచ్చు. ఏ పోటీ పరీక్షకయినా విద్యార్థి మొదట ఏర్పర్చుకోవల్సింది ఆత్మవిశ్వాసం కాబట్టి ఈ పరీక్ష రాసే విద్యార్థులు ఆత్మవిశ్వాసం ఏర్పర్చుకోవాలి. అది ఏర్పడాలంటే బోధించే అధ్యాపకులపై నమ్మకం పూర్తిగా ఏర్పర్చుకోవాలి. విశ్వాసంతో సాధన చేస్తే సమయం వృథా కాదు.

* 2011 పరీక్ష పేపరు విశ్లేషిస్తే కెమిస్ట్రీలో దాదాపు 85 శాతం ప్రశ్నలు NCERT XI, XII పుస్తకాల నుంచి, ఫిజిక్స్‌లో 60 శాతం పైన, మాథమెటిక్స్‌లో 35 శాతం వరకు వచ్చాయి. కాబట్టి విద్యార్థి ఎక్కువ పుస్తకాలు చదవటం కంటే చదివిన పుస్తకాల పునశ్చరణ ద్వారా పరీక్ష బాగా రాసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కెమిస్ట్రీ పూర్తిగా NCERT పుస్తకాలు, ఫిజిక్స్‌ హెచ్‌.సి. వర్మ, మాథమెటిక్స్‌ తను కోచింగ్‌ తీసుకుంటున్న సంస్థలోని మెటీరియల్‌కు లోబడి దానివరకు పూర్తిగా తయారుకాగలిగితే చాలు.

* రిజర్వేషన్‌ ఉన్న విద్యార్థులు సీటు సులభంగా సాధించడానికి కొన్ని నిర్ణీత చాప్టర్లకు పరిమితమైతే మేలు. ఉదాహరణకు ఫిజిక్స్‌లో గత సంవత్సరం పేపరు- 1, 2 లలో దాదాపు 50 శాతం ప్రశ్నలు యాంత్రిక శాస్త్రం నుంచే వచ్చాయి. అదేవిధంగా కెమిస్ట్రీలో ఫిజికల్‌ కెమిస్ట్రీ విభాగం నుంచి 45 - 50 శాతం వరకు ప్రశ్నలు వచ్చాయి. మేథమాటిక్స్‌లో వెక్టర్‌ ఆల్‌జీబ్రా, మాట్రిసస్‌, డిటర్‌మెంట్స్‌ నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయి.

అక్టోబరు 10 'చదువు' సంచికలో ఐఐటీ-జేఈఈ 2011 ప్రశ్నపత్ర విశ్లేషణ ఇచ్చాం. ఏ విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనేది దీనిలో సంపూర్ణంగా ఇచ్చాం కాబట్టి దాని ఆధారంగా కొన్ని అభ్యాసాలకు పరిమితమైనా సీటు సాధించవచ్చు. పరిమితమైన అభ్యాసాలను క్షుణ్ణంగా చదువుతూ మిగిలిన అభ్యాసాలలో ప్రాథమిక అంశాల వరకయినా చదవాల్సిన అవసరం ఉంటుంది.

* తుది పరీక్ష ఆరుగంటలు జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆ విధంగా తయారుకావడం ప్రారంభించాలి. అంత సుదీర్ఘ సమయం ఏకాగ్రతతో పరీక్ష రాయడానికి కచ్చితంగా కొంత అభ్యాసం తప్పనిసరి.

* గత సంవత్సరం రుణాత్మక మార్కులు బాగా తగ్గాయి కాబట్టి కొంతమంది విద్యార్థులు ఈ సంవత్సరం కూడా పరీక్ష అదే తరహాతో ఉండవచ్చు అనే అపోహతో ఉన్నారు. రుణాత్మక మార్కులు అధికంగానే ఉంటాయనుకొని తయారుకావడం శ్రేయస్కరం.

* ఇంటీజర్‌ టైపు ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి. కానీ వివిధ సంస్థల మెటీరియల్‌లో కానీ, మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాల్లో గానీ ఈ తరహా ప్రశ్నలు చాలా తక్కువ. వీలైనంతవరకూ వీటిని అభ్యసించడం మేలు.

* మ్యాట్రిక్స్‌ మ్యాచింగ్‌, పేరాగ్రాఫ్‌ తరహా ప్రశ్నల్లో విద్యార్థులు తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. పరీక్షల్లో వీలైనంతవరకూ ఈ రకమైన ప్రశ్నలపై అధిక శ్రద్ధ చూపాలి.

* 2011 ప్రశ్నపత్రానికి మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థి అన్ని రకాల ప్రశ్నలనూ అభ్యసించాలి. అలాగే ప్రశ్నపత్రం ఏ సబ్జెక్టుతో ప్రారంభించినా రాసేవిధంగా ఉండాలి. 2010లో సబ్జెక్టుల క్రమం మారిందని సరిగా రాయలేకపోయామని చెప్పిన విద్యార్థులు చాలామందే ఉన్నారు. ఒక్కో పరీక్షలో ఒక్కో సబ్జెక్టుతో ప్రారంభిస్తూవుంటే తుది పరీక్షలో ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాదు.

Thursday, 27 October 2011

మేనేజ్‌మెంట్‌లో పరిశోధనలకు ఆర్‌మ్యాట్‌

మేనేజ్‌మెంట్‌లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌ (ఆర్‌ మ్యాట్‌)ను నిర్వహిస్తోంది.

దీని ద్వారా మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేయవచ్చు. మేనేజ్‌మెంట్‌ రంగంలో ఉన్నత విద్యార్హతలు, ఉత్తమ నైపుణ్యాలు గల మానవ వనరులను తయారుచేయడం ఈ పరీక్ష లక్ష్యం.

ఆర్‌మ్యాట్‌ ఆధారంగా ఏఐఎంఏకు చెందిన సెంటర్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ (సీఎంఈ), అలీగడ్‌ ముస్లిం యూనివర్సిటీ సంయుక్తంగా పీహెచ్‌డీ (బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సును అందిస్తున్నాయి.

మేనేజ్‌మెంట్‌, దీని అనుబంధ కామర్స్‌, హ్యుమానిటీస్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారు ఆర్‌మ్యాట్‌కు అర్హులు. పీజీడీఎం లేదా పీజీడీఐటీఎం చేసినవారు కూడా దరఖాస్తు చేయవచ్చు. కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులు చేసినవారు కూడా అర్హులు. మేనేజీరియల్‌ స్థాయిలో కనీసం ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా మేనేజ్‌మెంట్‌ ఇన్ స్టిట్యూట్‌లో కనీసం మూడేళ్లు ఫ్యాకల్టీగా చేసుండాలి.

ఆర్‌మ్యాట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

పరీక్షలో 100 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి.
పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
నెగటివ్‌ మార్కులు ఉండవు.
ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.

ఆర్‌మ్యాట్‌ పూర్తిగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ఎంపికైన అభ్యర్థులకు కాంటాక్టు తరగతులను ఏఐఎంఏ, న్యూఢిల్లీలో నిర్వహిస్తారు.

* ఆర్‌మ్యాట్‌కు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రింట్‌లను సంబంధిత డాక్యుమెంట్లతో సహా 'మేనేజర్‌ (పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌), ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ -సీఎంఈ, మేనేజ్‌మెంట్‌ హౌస్‌, 14 ఇనిస్టిట్యూషనల్‌ ఏరియా, న్యూఢిల్లీ- 110003' చిరునామాకు పంపించాలి. కోర్సు ఫీజులు, ఇతర వివరాలు ఏఐఎంఏ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 18 నవంబరు 2011
* దరఖాస్తు ప్రింట్ల స్వీకరణకు చివరితేదీ: 25 నవంబరు 2011
* ఆర్‌మ్యాట్‌ తేదీ: 10 డిసెంబరు 2011

Tuesday, 25 October 2011

ఇగ్నోలో ఈ-లెర్నింగ్‌ డిప్లొమా

నిరంతరం నూతన కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఇగ్నో వివిధ రకాల అభ్యర్థులను ఆకర్షిస్తోంది. తాజాగా పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఈ-లెర్నింగ్‌ (పీజీడీఈఎల్‌) కోర్సును ఇగ్నో ప్రారంభించింది.

విద్యార్థులతోపాటు విద్యారంగంలోని అనేక ఇతర వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఇగ్నో ఈ-లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో కొనసాగనుంది.

దూరవిద్యలో ఈ-లెర్నింగ్‌ పద్ధతులను విస్తృతంగా వినియోగిస్తోన్న ఇగ్నో, ఈ నైపుణ్యాలను విద్యారంగంలో పనిచేసే వివిధ రకాల అభ్యర్థులకు అందించడానికి సిద్ధమైంది. జనవరి 2012 నుంచి పీజీడీఈఎల్‌ కోర్సును ప్రారంభించనుంది. ఇగ్నో ఆధ్వర్యంలోని స్టాఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (స్ట్రయిడ్‌) ఈ కోర్సును నిర్వహించనుంది. ఈ-లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌లకు అవసరమైన ప్రణాళిక, డిజైనింగ్‌, అభివృద్ధి, ఆచరణ, మూల్యాంకనం, తదితర అంశాల్లో నిపుణులను తయారుచేయడం ఈ ప్రోగ్రామ్‌ లక్ష్యం.

ఎవరికి ప్రయోజనకరం?
ఆన్‌లైన్‌ శిక్షణతోపాటు న్యూఢిల్లీలో ప్రాక్టికల్‌ తరగతులు ఉంటాయి. ప్రాజెక్టు వర్క్‌ కూడా చేయాలి. కోర్సు నిర్వహణ, మూల్యాంకనం ఎక్కువగా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో ఉంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉపాధ్యాయులు, ట్రైనర్లు, ట్రైనింగ్‌ మేనేజర్లు, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైనర్లు, కోర్సు డెవలపర్లకు ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఈ-లెర్నింగ్‌ పద్ధతులు పాటించే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో పనిచేసేవారికి కూడా ఉపయోగపడుతుంది.

ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. గరిష్ఠంగా రెండేళ్లలో పూర్తిచేయవచ్చు. మొత్తం సీట్లు 50. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు అర్హులు. ఉన్నత విద్యార్హతలు గలవారికి ప్రాధాన్యం ఇస్తారు. కోర్సు ఫీజు రూ.15000. ప్రవేశ సమయంలో ఫీజు చెల్లించాలి. ప్రోగ్రామ్‌లో మొత్తం 5 కోర్సులు ఉంటాయి. అవి... ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ ఈ-లెర్నింగ్‌, డిజైన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ ఆఫ్‌ ఈ- లెర్నింగ్‌ కోర్సెస్‌, మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఈ- లెర్నింగ్‌ ప్రాజెక్ట్స్‌, టెక్నాలజీస్‌ ఫర్‌ ఈ-లెర్నింగ్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌.

ఎంపికలో వివిధ రకాల అర్హతలకు వెయిటేజీ ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌కు 50 శాతం, పీజీ డిగ్రీకి 20 శాతం, ఎం.ఫిల్‌., పీహెచ్‌డీకి 10 శాతం, విద్య, సంబంధిత రంగాల్లో పనిచేస్తున్నట్లయితే 10 శాతం వెయిటేజీ ఉంటుంది. కోర్సు నుంచి మధ్యలో మానేసే అవకాశం ఉంటుంది. మొదటి ఆర్నెళ్ల తర్వాత (మూడు కోర్సులు పూర్తిచేసి) కోర్సు నుంచి వైదొలగితే సర్టిఫికెట్‌ ఇన్‌ ఈ-లెర్నింగ్‌ పట్టా లభిస్తుంది. ప్రోగ్రామ్‌లో సూచించిన ఐదు కోర్సులు పూర్తి చేస్తే డిప్లొమా ఇన్‌ ఈ-లెర్నింగ్‌ లభిస్తుంది.

* కోర్సులో చేరిన అభ్యర్థులకు పర్సనల్‌ కంప్యూటర్‌ అందుబాటులో ఉండాలి. హెడ్‌ఫోన్‌, మల్లీమీడియా సౌకర్యం తప్పనిసరి. వెబ్‌కామ్‌ కూడా ఉంటే మంచిది. వీడియో కాన్ఫరెన్సింగ్‌కు అవసరమైన స్పీడ్‌తో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి.

* ఇగ్నో ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌లను ఇతర సంబంధిత సర్టిఫికెట్‌ కాపీలతో పంపాల్సిన చిరునామా: జి. మైథిలి, ఎనలిస్ట్‌ (సెలక్షన్‌ గ్రేడ్‌), స్త్ట్రెడ్‌, ఇగ్నో. న్యూఢిల్లీ- 110068.

ఐటీఐ అభ్యర్థులకు 1755 ఉద్యోగావకాశాలు


పీజెన్‌కో పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. జూనియర్‌ ప్లాంట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను వివిధ జిల్లాల్లోని పవర్‌ జనరేషన్‌ స్టేషన్‌లలో నియమిస్తారు.

రాష్ట్రం మొత్తం మీద 1755 ఖాళీలున్నాయి. వీటిలో 1086 ఉద్యోగాలకు ఏపీజెన్‌కో గతంలోనే నోటిఫికేషన్‌ జారీచేసింది కానీ నియామకాలు చేపట్టలేదు.

ప్రస్తుతం పాత పోస్టులకు మరో 669 ఖాళీలను జతచేసి మొత్తం 1755 ఖాళీలకు సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

జేపీఏ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు వేతన స్కేలు రూ.9520 - 16085. ఇవి జిల్లా కేడర్‌ పోస్టులు. మొత్తం ఖాళీల్లో 1606 పోస్టులను జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా, 149 పోస్టులను బ్యాక్‌లాగ్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.


జిల్లాల వారీగా ఖాళీలు
* కృష్ణా: 336 (జనరల్‌ 307 + బ్యాక్‌లాగ్‌ 29)
* గుంటూరు: 17 (జనరల్‌)
*నల్గొండ: 65 (జనరల్‌)
* ఖమ్మం: 196 (జనరల్‌ 161 + బ్యాక్‌లాగ్‌ 35)
*వరంగల్‌: 449 (జనరల్‌)
* కరీంనగర్‌: 65 (జనరల్‌ 58 + బ్యాక్‌లాగ్‌ 7)
*నిజామాబాద్‌: 23 (జనరల్‌ 19 + బ్యాక్‌లాగ్‌ 23)
*మహబూబ్‌నగర్‌: 41 (జనరల్‌)
*కడప: 230 (జనరల్‌ 177 + బ్యాక్‌లాగ్‌ 53)
*కర్నూలు: 25 (జనరల్‌)

లోకల్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్‌లకు కేటాయించిన పోస్టులు:
* ఖమ్మం: 250 (జనరల్‌)
* మహబూబ్‌నగర్‌: 38 (జనరల్‌ 36 + బ్యాక్‌లాగ్‌ 2)
* విశాఖపట్నం: 20 (జనరల్‌)

ఎంపిక విధానం
జేపీఏ ఉద్యోగాల భర్తీకి వివిధ అంశాల్లో ప్రాథమిక మూల్యాంకనం ఆధారంగా అభ్యర్థులను వడపోత పోస్తారు. తర్వాత రాత పరీక్షలు ఉంటాయి. ఇంటర్వ్యూ ఉండదు. తొలిదశ మూల్యాంకనం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 100 మార్కుల్లో వివిధ అంశాలకు కింది విధంగా వెయిటేజీ కేటాయిస్తారు...

* ఐటీఐలో సాధించిన మార్కులకు: 30 శాతం
* ఐటీఐ ఉత్తీర్ణులైన దగ్గర్నుంచి ఏడాదికి 2 మార్కుల చొప్పున గరిష్ఠంగా 10 మార్కులు కేటాయిస్తారు.
* ఏపీజెన్‌కో పవర్‌ జనరేటింగ్‌ స్టేషన్‌లలో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులకు సర్వీసు వెయిటేజీ ఉంటుంది. వీరి సర్వీసు ఆర్నెల్ల లోపు ఉంటే 5 మార్కులు, ఆర్నెల్ల కంటే ఎక్కువ ఉంటే 10 మార్కులు లభిస్తాయి.

ఎంపిక విధానం...
* రాత పరీక్ష:  పైన పేర్కొన్న ప్రాథమిక అంశాల్లో మార్కుల ఆధారంగా వడపోత పోసి మెరిట్‌ జాబితా తయారుచేస్తారు. దాన్నుంచి 1:20 నిష్పత్తిలో అభ్యర్థులను రాత పరీక్షకు పిలుస్తారు. రాతపరీక్షలో 50 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున మొత్తం 25 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ప్రశ్నలు థర్మల్‌/ హైడల్‌ పవర్‌ జనరేషన్‌ స్టేషన్ల గురించి ఉంటాయి.

* ట్రేడ్‌ టెస్ట్‌: ప్రాథమిక మూల్యాంకనం, రాత పరీక్షల్లో మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ట్రేడ్‌ టెస్ట్‌ 25 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు ఐటీఐలో చదివిన ట్రేడ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పైన పేర్కొన్న అన్ని దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల అంతిమ ఎంపిక ఉంటుంది. 20 శాతం పోస్టులకు స్టేట్‌వైడ్‌ కంబైన్డ్‌ మెరిట్‌ లిస్ట్‌ (అన్ని ట్రేడ్‌లు కలిపి), 80 శాతం పోస్టులకు జిల్లా ప్రాతిపదికన కంబైన్డ్‌ మెరిట్‌ లిస్ట్‌ (అన్ని ట్రేడ్‌లు కలిపి) ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

* రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌లను విజయవాడ, హైదరాబాద్‌, కడపలో నిర్వహిస్తారు.

జేపీఏ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు జెన్‌కో స్టేషన్లలో శిక్షణ ఇస్తారు. జెన్‌కో స్టేషన్‌లు ఉన్న జిల్లాలు: విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌. శిక్షణ సమయంలో అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కంపెనీకి సమర్పించాలి. శిక్షణ కాలంలో పే స్కేలు ప్రకారం వేతనం, సంబంధిత అలవెన్సులు ఇస్తారు.

రాత పరీక్షకు సిలబస్‌
జేపీఏ రాత పరీక్షలో కింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు...

1. Thermal Power Stations: Basic Details
* Layout and Equipment: Boiler- Economiser, Super Heater, Air Pre-Heater; Mills; P A Fan, FD Fan, ID Fan, Chimney)
* Turbine- Condenser, FW Heaters
* Water Treatment
* Electrostatic Precipitator (ESP)
* Coal Plant
* Ash Plant

2. Hydel Power Stations: Basic Details
* Layout and Equipment - Trash rack, Surge rack, Pen Stock, Turbine, Generator, Transformer, Switch Yard
* Symbols of various tools and tackles and their use
* Safety, fire prevention and house keeping procedures
* Precautions to be exercised while attending the following works- Welding, Grinding, Cutting, Filling, Electrician Job Work, Turning etc.

Monday, 24 October 2011

రెండు పరీక్షలు దాటితే.. ఉపాధ్యాయ ఉద్యోగమే!

టెట్‌లో సాధించిన మార్కులు డీఎస్‌సీలో అంతిమ ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. ఈ రెండు పరీక్షల సిలబస్‌లో పోలికలు చాలానే ఉన్నాయి. పోలికలను అనుసంధానించి (ఇంటిగ్రేట్‌) చదవటం ప్రణాళికలో భాగం కావాలి. టెట్‌, డీఎస్‌సీలలో సంబంధం లేని సిలబస్‌ అంశాలున్నాయి. వాటికి ప్రత్యేకంగా చదివే విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు కొడాలి భవానీ శంకర్.

అనుసంధానం
* టెట్‌ పేపర్‌-1 కనీస అర్హత మార్కులు పొందితేనే ఎస్‌జీటీకి అర్హత లభిస్తుంది. పైగా ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్‌సీలో 20 శాతం వెయిటేజీ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది.

* టెట్‌ పేపర్‌-2 కనీస అర్హత మార్కులు పొందితేనే స్కూల్‌ అసిస్టెంట్‌కి అర్హత లభిస్తుంది. పైన పేర్కొన్న రీతిలోనే స్కూల్‌ అసిస్టెంట్‌ ఎంపికలో టెట్‌ వెయిటేజి పొందుతుంది.

అందువల్ల టెట్‌లో ఎంత గరిష్ఠ మార్కులు పొందితే అందుకు అనుగుణంగా మార్కులు డీఎస్‌సీలో కలుపుతారు. అభ్యర్థులు టెట్‌ను ప్రణాళిక ప్రకారం సిద్ధమవ్వడమే తొలి వ్యూహం.

* భాషల ఎంపికకు ప్రమాణాలను జి.ఒ. ఎం.ఎస్‌. నంబర్‌ 51 (ఏప్రిల్‌ 16, 2011) లో పేర్కొన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకోవడం కీలకం. భాష-1 కింద ఎంచుకున్న భాష మాధ్యమంగా ఉన్న పాఠశాలలో నియమితులవుతారనే విషయం పరిగణనలోకి తీసుకోవాలి.

* పండిత్‌లు, బి.కామ్‌ మొదలైన విభిన్న వర్గాల అభ్యర్థులు పేపర్‌-1కి హాజరు కావొచ్చు. మిగతా అభ్యర్థుల మాదిరిగానే ఎస్‌జీటీకి ఎంపిక కావొచ్చు.

* 34 ప్రశ్నల వరకూ పెడగాజి విభాగం కింద 2011 టెట్‌ ప్రశ్నపత్రంలో కనిపిస్తున్నాయి. అందువల్ల పెడగాజి సంబంధిత అంశాల అధ్యయనం టెట్‌లో విజయం అందించడమే కాకుండా డీఎస్‌సీ విజయానికి రాచబాట వేస్తుంది.

* భాష-1,2 లలో 'భాషా బోధనా పద్ధతులు' పండిత్‌ కాని అభ్యర్థులకు మింగుడుపడటం కష్టమే. అయినా స్కోరింగ్‌ కోసం వ్యూహం ప్రకారం ప్రిపరేషన్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే!

సిలబస్‌ స్థాయి
* పేపర్‌-1కు ఎనిమిదో తరగతి స్థాయి, పేపర్‌-2 పదో తరగతి స్థాయి (కాఠిన్యత) ఉంటుంది.
* టెట్‌ ఉత్తీర్ణతా ప్రమాణం
* జనరల్‌ అభ్యర్థి: 60 శాతం (90 మార్కులు)
* బీసీ అభ్యర్థి: 50 శాతం (75 మార్కులు)
* ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థి: 40 శాతం (60 మార్కులు)
* వికలాంగులు: 40 శాతం (60 మార్కులు)
* కేవలం అర్హత మార్కులకే పరిమితం కాకుండా గరిష్ఠ మార్కులు పొందేందుకు ప్రయత్నించటం అవసరం.

పరీక్ష వ్యూహం ఏమిటి?
* జనవరి నెలలో టెట్‌ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే డీఎస్‌సీ జరుగుతుంది కాబట్టి టెట్‌లో గరిష్ఠ మార్కులు సాధించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

* రెండు పరీక్షలకు ఉమ్మడిగా ఉన్న అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. అలాగే టెట్‌ ముందుగా జరుగుతుంది కాబట్టి తెలుగుభాష, పెడగాజి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ టెట్‌ను ముందుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.

* టెట్‌ పూర్తయిన తర్వాత జీకే అండ్‌ కరంట్‌ అఫైర్స్‌ లాంటి అదనపు అంశాలపై దృష్టి సారించాలి. ఇలా చేస్తే తేలిగ్గా డీఎస్‌సీని ఎదుర్కోవచ్చు.

* ఇప్పటికే టెట్‌ అర్హత పొందిన అభ్యర్థులు సంతృప్తి చెందకుండా తమ స్కోరింగ్‌ పెంచుకునేందుకు ప్రయత్నించాలి. కనీసం 115కి పైన టెట్‌ స్కోరు ఉండే రీతిలో ప్రిపరేషన్‌ ప్రమాణాలను నిర్దేశించుకోవాలి.

* బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ పరీక్ష అర్హత వస్తే వారు తెలుగు, ఇంగ్లిష్‌ బోధనాపద్ధతులపై కూడా దృష్టి సారించాలి (టెట్‌ కోసం). డీఈడీ అభ్యర్థులు డీఈడీ కోర్సులో భాగంగా అన్ని రకాల మెథడ్స్‌ చదువుతారు. అందువల్ల ఎస్‌జీటీ కోసం బీఎడ్‌లు వాటిని చదవకపోతే నష్టం ఎక్కువగా ఉండే అవకాశముంది.

* గ్రామీణ అభ్యర్థులు ఇంగ్లిష్‌ భాష అంశాలపై పట్టు సాధించటం విజయానికి దారితీసే సోపానమని గుర్తించాలి. తెలుగు వ్యాకరణంపై పట్టు లేనివారు టెట్‌ కోసం దీన్ని మెరుగుపరచుకోవాల్సివుంది.

* భాషా పండితులు, పీఈటీలు పేపర్‌-1 (టెట్‌లో) అందరిమాదిరిగానే రాయాల్సిందే. పేపర్‌-2 (టెట్‌లో) సాంఘికశాస్త్ర అంశాల్నే ఎన్నుకోవడం వల్ల టెట్‌ స్కోరింగ్‌ మెరుగుపడే అవకాశం ఉంటుంది.

* సొంతంగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు మారిన పాఠ్యగ్రంథాల ఆధారంగా ప్రిపరేషన్‌ సాగుతోందా లేదా అని పరిశీలించుకోవాలి. పాత నోట్సుల, పాత పాఠ్యపుస్తకాల ఆధారంగా సిద్ధమైతే బావిలో కప్ప మాదిరి పరిస్థితి ఉంటుందని గుర్తించాలి.ఈ అంశాలు గుర్తించి అధ్యయనం చేస్తే తప్పనిసరిగా సత్ఫలితాలు సిద్ధిస్తాయి!



టెట్ సిలబస్ మతలబు
ఈ సిలబస్ లో గమనించాల్సిన ముఖ్యాంశాలను వివరిస్తున్నారు వి. బ్రహ్మయ్య.

టెట్‌లోని అన్ని అంశాలూ డీఎస్‌సీ పరీక్షలో ఉపయోగపడతాయి. తొలిసారి జరిగిన టెట్‌ ప్రశ్నలు నిర్దేశిత సిలబస్‌ నుంచే అడిగారు. అయితే అభ్యర్థులు ప్రధానంగా గమనించాల్సింది- టెట్‌ సిలబస్‌ కేవలం డీఎడ్‌, బీఎడ్‌, సైకాలజీ పుస్తకాల్లో పూర్తిగా లభ్యం కాదు. ఇతర ప్రామాణిక పుస్తకాల నుంచో, ఇంటర్నెట్‌ నుంచో విషయసేకరణ చేసుకుని అభ్యసించాలి.
ఉదాహరణకు... విద్యాహక్కు చట్టం-2009, NCF-2005, వైగాట్‌స్కీ, ఛామ్‌స్కీ సిద్ధాంతాలు, వికాస అధ్యయన ఉపగమాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఉపగమాలు మొదలైనవి.

డీఎస్‌సీ పరీక్ష లాగా కేవలం డీఎడ్‌, బీఎడ్‌, తెలుగు అకాడమీ మనోవిజ్ఞాన శాస్త్రం పాఠ్యపుస్తకాలపైనే ఆధారపడితే టెట్‌లో కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయటంలో అవరోధాలు ఎదురు కావొచ్చు.

* గత ప్రశ్నపత్రం తీరును సూక్ష్మంగా పరిశీలించి ఆ వచ్చిన అవగాహనతో ప్రిపరేషన్‌ సాగించాలి.
* తొలి టెట్‌లో ప్రధానంగా శిశువికాసం-అధ్యయనానికి సంబంధించి ప్రశ్నలు అడిగిన తీరు విశ్లేషణాత్మకంగా, అనుప్రయుక్తానికి చెందినట్టు గమనించవచ్చు. జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేలా కాకుండా తరగతి గది అధ్యయనానికి చెందిన ప్రశ్నలను పరిశీలనా దృష్టితో రాసేలా అడిగారు.

* పెడగాజి విషయంలో దాదాపు ప్రశ్నలన్నీ జ్ఞానాన్ని పరీక్షించేలాగే ఉన్నాయి. ముఖ్యంగా బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు-స్పష్టీకరణలు, శిశుకేంద్ర పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం మొదలైనవి అవగాహన చేసుకుంటే తేలిగ్గా సమాధానాలు రాయవచ్చు.

* తెలుగు భాష 24 మార్కుల కంటెంట్‌ విభాగానికి సంబంధించి వ్యాకరణాంశాలను పదో తరగతి వరకూ క్షుణ్ణంగా అభ్యసించాలి. బోధనా పద్ధతుల్లో డీఎడ్‌ సిలబస్‌ తెలుగు అకాడమీని అనుసరిస్తే అభ్యసనానికి సులువు.

* ఏపీ రాష్ట్ర సిలబస్‌లోని అన్ని టాపిక్స్‌ను కాకుండా టెట్‌కు నిర్దేశించిన సిలబస్‌ ప్రకారమే అధ్యాయాల వారీగా అభ్యసించడం ఉత్తమం.
* అభ్యసించిన అంశాలను పునశ్చరణ, సాధన, మాదిరి ప్రశ్నపత్రాల సాధన చేస్తే మంచి మార్కులు సంపాదించవచ్చు.
* ప్రధాన అంశాలను పునరభ్యసనం, పునర్విమర్శ చేయాలి.

Sunday, 23 October 2011

ఉన్నతవిద్యకు సీబీఎస్ఈ ఉపకారం!

విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి   ఉపయోగపడే సమాచారంతో ఈనాడు  హైదరాబాద్ మినీ ఇవాళ ఓ కథనం ప్రచురించింది.

మిగిలిన ప్రాంత పాఠకుల కోసం ఆ కథనం యథాతథంగా అందిస్తున్నాం!

You'll eat the crow అంటే తెలుసా?

ఇంగ్లిష్‌లో కొత్తగా వస్తున్న వ్యక్తీకరణలను వివరించే శీర్షిక ఇది. దీనిలో ఇచ్చే ఉదాహరణల సాయంతో ఆ expressions పై సంపూర్ణ అవగాహన పెంచుకోవటం, వాటిని సంభాషణల్లో, రచనల్లో ప్రయోగించటం చేస్తే విద్యార్థుల ఆంగ్ల భాషాపరిజ్ఞానం మెరుగుపడుతుంది!  ఈ వ్యాస రచయిత- ఎం.సురేశన్.   

Sunayana: I wish to start my own online company. Dad says it's worth a try too, though he has cautioned me against the risks involved. He's convinced me it is going to be an uphill struggle. (నేను నా సొంత online company ప్రారంభించాలనుకుంటున్నాను. నాన్న కూడా 'ప్రయత్నించదగ్గ విషయం' అన్నాడు. కానీ దాన్లో ఉన్న ప్రమాదాలను గురించి కూడా హెచ్చరించాడు. అది చాలా కష్టమైన విషయం, అతి ప్రయాసతో కూడుకున్న పనని కూడా నాకు నచ్చేట్లు చెప్పాడు.)
Neeraja: Yea. It needs a strenuous effort and personal involvement. Look at Tara. She had started on her own, that was good. But without heeding her uncle's advice not to rely on assistants, she left everything to them. She came a cropper. (అవును. దానికి కఠోరమైన శ్రమ, వ్యక్తిగతంగా చేస్కోటం అవసరం. తార విషయం చూడు. తనూ సొంతంగానే ప్రారంభించింది, కానీ సహాయకుల మీద ఆధారపడవద్దన్న వాళ్ళ మామయ్య సలహాను పాటించకుండా అన్నీ వాళ్లకు వదిలిపెట్టింది. పూర్తిగా దెబ్బతింది.)

Sunayana: Yea. I remember that. But I am not in a particular hurry. I will start it only when I feel up to it. (అవును. అది నాకు గుర్తుంది. నేనేం అంత తొందరపడటంలేదు. నేను చేయగలననుకున్నప్పుడే అది ప్రారంభిస్తాను.)

Neeraja: Tara was confident that in no time she'd be on a roll, but in the end she had to eat the crow. (తార చాలా నమ్మకంతో ఉంది- తను తక్కువ సమయంలోనే పైకొచ్చేస్తానని. కానీ చివరకు తన తప్పు తాను తెలుసుకుంది.)

Sunayana: She was over confident and paid the price for it. But I am going to be very cautious. I'm aware that the stakes involved are high; it's dad's money that I am be investing... So I'll be careful. (తన మీద తనకున్న అతి నమ్మకంతో తగిన మూల్యం చెల్లించింది. నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండబోతున్నాను. పెట్టుబడి ఎక్కువగా ఉండబోతోంది. అదీ నాన్న డబ్బు నేను పెట్టబోయేది. కాబట్టి జాగ్రత్తగా ఉంటాను.)

Neeraja: OK. Give it your best shot. You will succeed. (నీ శక్తికొద్దీ ప్రయత్నం చేయి. నువ్వు విజయం పొందుతావు.)


Friday, 21 October 2011

ఆస్ట్రానమీ కోర్సు చేయాలంటే?

విద్యార్థి పాఠకులు వివిధ కోర్సులకు  సంబంధించి వ్యక్తం చేసిన సందేహాలకు నిపుణుల సమాధానాలు ఇక్కడ  అందిస్తున్నాం.


* నేను బి.ఎస్‌సి. ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ చదువుతున్నాను. ఇదే స్పెషలైజేషన్‌తో ఎం.ఎస్‌సి. చేయాలనుకుంటున్నాను. ఎక్కడ అందుబాటులో ఉంది?

- అర్చన, హైదరాబాద్‌

మైక్రోబయాలజీలో ఒక ముఖ్యమైన స్పెషలైజేషన్‌ ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ. ఆంధ్రప్రదేశ్‌లో పీజీ స్థాయిలో ఈ స్పెషలైజేషన్‌ను ఏ యూనివర్సిటీలోనూ అందించడం లేదు. పీజీ కోర్సులో భాగంగా ఒక పేపర్‌గా ఈ సబ్జెక్టును చదివే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో కొన్ని విద్యాసంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. అవి... గురు జంభేశ్వర్‌ యూనివర్సిటీ, తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ, మధ్యప్రదేశ్‌లోని దేవి అహల్య యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌లో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది. దీని చిరునామా: యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, చెన్నై- 600005.

ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌తో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసినవారికి ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు, ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమల్లో మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి. ఇతర కంపెనీల్లో బయోఎథిక్స్‌, టాక్సికాలజీ, వైరాలజీ, ఆగ్రోనమీ, క్వాలిటీ కంట్రోల్‌ టెక్నాలజీ, పబ్లిక్‌ హెల్త్‌, బయోమెడికల్‌ టెక్నాలజీ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. పీజీ పూర్తయ్యాక సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ద్వారా ఫెలోషిప్‌ సాధించి పీహెచ్‌డీ చేస్తే మరిన్ని మంచి అవకాశాలను అందుకోవచ్చు.

*  నేను ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ (కెమిస్ట్రీ) చేయాలనుంది. ఓయూలో పీహెచ్‌డీ కోర్సులకు ప్రవేశం ఎలా లభిస్తుంది?
- కె. నాగరాజు, వరంగల్‌

కెమిస్ట్రీలో మంచి స్పెషలైజేషన్‌తో పీహెచ్‌డీ చేయడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలను అందుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి రెండు మార్గాలున్నాయి. ఎం.ఎస్‌సి. తర్వాత పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాయవచ్చు. లేదా సీఎస్‌ఐఆర్‌ - యూజీసీ నెట్‌/ ఐసీఎంఆర్‌/ డీబీటీ పరీక్షల్లో జేఆర్‌ఎఫ్‌లో ఉత్తీర్ణులవడం ద్వారా ప్రవేశం పొందవచ్చు. సాధారణంగా ఈ అభ్యర్థులను రాత పరీక్ష దశ నుంచి మినహాయిస్తారు. పీజీలో కనీసం 55 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాయవచ్చు. మరిన్ని వివరాలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.


* ఎం.ఎస్‌సి. బయోకెమిస్ట్రీ చేశాను. ప్రస్తుతం పీజీడీసీఏ చేస్తున్నాను. నాకు ఫార్మా మార్కెటింగ్‌లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
- శ్రీనివాసరెడ్డి, అనంతపురం

బయాలజీ, కంప్యూటర్స్‌ నేపధ్యం ఉన్న అభ్యర్థులకు మంచి రంగం... బయో ఇన్ఫర్మేటిక్స్‌. మీరు ఇంకా డ్రగ్‌ డిజైన్‌ లాంటి కోర్సులు చేస్తే ఫార్మా రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. బయో ఇన్ఫర్మేటిక్స్‌, డ్రగ్‌ డిజైన్‌ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోన్న కొన్ని ప్రముఖ కంపెనీలు... హెచ్‌హెచ్‌ బయోటెక్నాలజీస్‌, ఆగ్రా; సెల్రిస్‌ ల్యాబ్స్‌, అహ్మదాబాద్‌; స్ట్రాండ్‌ జెనోమిక్స్‌, బెంగళూరు; జెన్‌బయోస్‌, బెంగళూరు; సెంటర్‌ ఫర్‌ బయోఇన్ఫర్మేటిక్స్‌, చెన్నై; బయోమెడ్‌ ఇన్ఫర్మేటిక్స్‌, హైదరాబాద్‌; రిషి బయోటెక్‌, ముంబాయి.

ఫార్మా మార్కెటింగ్‌ రంగం చాలా విస్తృతమైనది. ఫార్మా స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్‌ చేస్తే ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. నైపర్‌ ఈ కోర్సులకు బాగా పేరున్న సంస్థ. అభ్యర్థి సామర్థ్యాలను బట్టి మార్కెటింగ్‌ రంగంలో వేగంగా ఎదగవచ్చు. నైపర్‌ కోర్సుల వివరాలు సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.


* నేను ఎం.ఎస్‌సి. న్యూట్రిషన్‌ చేయాలనుకుంటున్నాను. మంచి సంస్థలను సూచించగలరు. కోర్సు పూర్తయ్యాక ఎలాంటి ఉద్యోగ అవకాశాలుంటాయి?
- ఆర్‌. స్వర్ణ, విజయవాడ

న్యూట్రిషన్‌లో పీజీ చేయడానికి మనరాష్ట్రంలోనే అనేక ప్రముఖ సంస్థలున్నాయి. వీటిలో అగ్రగామి సంస్థ... నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌), హైదరాబాద్‌. ఈ సంస్థ ఎం.ఎస్‌సి. అప్లయిడ్‌ న్యూట్రిషన్‌ కోర్సును అందిస్తోంది. అనేక సంస్థల్లో ఎం.ఎస్‌సి. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, ఫుడ్‌ సైన్స్‌, న్యూట్రిషన్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ తదితర పేర్లతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


న్యూట్రిషన్‌ సంబంధిత కోర్సులను అందిస్తోన్న మరికొన్ని ముఖ్య సంస్థలు... ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ సైన్స్‌); ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ సైన్స్‌); బుందేల్‌ ఖండ్‌ యూనివర్సిటీ, ఝాన్సీ (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ); సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, మైసూర్‌ (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ టెక్నాలజీ); చౌదరి చరణ్‌సింగ్‌ యూనివర్సిటీ, మీరట్‌ (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెక్నాలజీ); నాగపూర్‌ యూనివర్సిటీ, నాగపూర్‌ (ఎం.ఎ. హోమ్‌ ఎకనమిక్స్‌); తమిళనాడు అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, కోయంబత్తూరు (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌). వీటిలో ఎన్‌ఐఎన్‌, సీఎఫ్‌టీఆర్‌ఐ అత్యుత్తమ సంస్థలని చెప్పవచ్చు. ఇవి సీఎస్‌ఐఆర్‌, ఐసీఎంఆర్‌ పరిధిలో పనిచేస్తున్నాయి. ఫుడ్‌ సైన్స్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఉన్నత కోర్సులు చేయడానికి ఇవి మంచి సంస్థలు.


* నేను ఇంటర్‌ (ఎంపీసీ) ఫైనలియర్‌ చదువుతున్నాను. ఆస్ట్రానమీ అంటే చాలా ఇష్టం. ఈ రంగంలోకి ప్రవేశించాలంటే ఏ కోర్సులు చేయాలి?
- జి. సాకేత్‌, విశాఖపట్నం

ఇంటర్మీడియట్‌ తర్వాత మీరు బీఈ లేదా బి.ఎస్‌సి. ఇంజినీరింగ్‌ చేయాలి. తర్వాత ఆస్ట్రానమీ సంబంధిత స్పెషలైజేషన్‌తో కోర్సులు చేయవచ్చు. మనదేశంలో ఆస్ట్రానమీ స్పెషలైజేషన్‌తో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అరుదు. మాస్టర్స్‌, పీహెచ్‌డీ స్థాయుల్లో అనేక మార్గాల ద్వారా ఆస్ట్రానమీ సంబంధిత కోర్సులు చేయవచ్చు. ఈ కోర్సులను అందిస్తోన్న ప్రముఖ సంస్థలు... ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, బెంగళూరు; ఇండియన్‌ ఇన్  స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరు; రామన్‌ రిసెర్చ్‌ ఇన్ స్టిట్యూట్‌, బెంగళూరు; ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, పుణె.

ఈ సంస్థలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తాయి. ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశాక వీటిలో ప్రవేశించవచ్చు. ఐఐటీ జేఈఈ లేదా జామ్‌ పరీక్షల ద్వారా ఏదైనా ఐఐటీలో ఫిజిక్స్‌ లేదా ఫిజిక్స్‌ డ్యుయల్‌ డిగ్రీ కోర్సులో సీటు సాధిస్తే కెరియర్‌ బాగుంటుంది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు కూడా పైన పేర్కొన్న సంస్థల్లో ఆస్ట్రానమీ సంబంధిత కోర్సులు చేయవచ్చు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినవారు డా. యు.ఎస్.ఎన్. మూర్తి.

Thursday, 20 October 2011

న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ

 న్యాయశాస్త్రంలో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా మంచి అవకాశాలను కల్పిస్తోంది.

పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ పద్ధతుల్లో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌డీ (పార్ట్‌టైమ్‌) కోర్సులను అందిస్తోంది. సోషల్‌ సైన్సెస్‌, సైన్సెస్‌ నేపధ్యంతోపాటు లా డిగ్రీ ఉన్న అభ్యర్థులు పీహెచ్‌డీ కోర్సులు చేయవచ్చు.

ఈ సంస్థకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు ఉంది.
ఏపీ యూనివర్సిటీ ఆఫ్‌ లా అందిస్తోన్న కోర్సులు, అర్హతలు, ఇతర వివరాలు...

* పీహెచ్‌డీ (ఫుల్‌టైమ్‌): ఇందులో పీహెచ్‌డీ ఇన్‌ లా, పీహెచ్‌డీ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌ విత్‌ లా, పీహెచ్‌డీ ఇన్‌ సైన్సెస్‌ విత్‌ లా, పీహెచ్‌డీ ఇన్‌ హ్యూమన్‌ రైట్స్‌ లా స్పెషలైజేషన్లు ఉన్నాయి. న్యాయశాస్త్రంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు. తాము చేపట్టబోయే పరిశోధనతో సంబంధం ఉన్న ఇతర పీజీ కోర్సులు చేసినవారు కూడా అర్హులు. ఇంటర్‌ డిసిప్లీనరీ అధ్యయనాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రవేశార్హతల విషయంలో అనేక మినహాయింపులను ఏపీ యూనివర్సిటీ ఆఫ్‌ కల్పిస్తోంది. వీటి వివరాలు సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

* పీహెచ్‌డీ (పార్ట్‌టైమ్‌): ఏదైనా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జిలు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. ఎల్‌ఎల్‌బీ చేసినవారికి కనీసం పదేళ్లు, ఎల్‌ఎల్‌ఎం చేసుంటే కనీసం ఐదేళ్లు అనుభవం అవసరం. లా లో మాస్టర్స్‌ డిగ్రీ తర్వాత కనీసం మూడేళ్లు బోధన అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. న్యాయశాస్త్రం పట్ల మంచి ఆసక్తి ఉన్న సోషల్‌ సైన్సెస్‌ అభ్యర్థులు కూడా అర్హులు.

* పీహెచ్‌డీ ఇన్‌ హ్యూమన్‌ రైట్స్‌ లా: ఈ కోర్సును పార్ట్‌టైమ్‌ లేదా ఫుల్‌టైమ్‌ పద్ధతుల్లో చేయవచ్చు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ నుంచి పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు.

* పీహెచ్‌డీతోపాటు ఎల్‌ఎల్‌డీ కోర్సు కూడా అందుబాటులో ఉంది. లా లో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు దీనికి అర్హులు. ఈ కోర్సును పార్ట్‌టైమ్‌ పద్ధతిలో మాత్రమే నిర్వహిస్తున్నారు.

ఎంపిక, దరఖాస్తు విధానం
ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా పీహెచ్‌డీ కోర్సులో అడ్మిషన్‌ లభిస్తుంది. నెట్‌ / స్లెట్‌ ఉత్తీర్ణులు కూడా ప్రవేశ పరీక్ష రాయాలి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పరీక్ష సిలబస్‌, మోడల్‌ ప్రశ్నపత్రాలు, దరఖాస్తులను ఏపీ యూనివర్సిటీ ఆఫ్‌ లా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 నవంబరు 2011

* ప్రవేశ పరీక్ష తేదీ: 11 డిసెంబరు 2011

Wednesday, 19 October 2011

గీతం 'హెచ్‌బీఎస్‌'లో ఎంబీఏ


రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థ గీతం యూనివర్సిటీ (హైదరాబాద్‌ క్యాంపస్‌) మేనేజ్‌మెంట్‌ కోర్సుల నిర్వహణకు ప్రత్యేకంగా 'హైదరాబాద్‌ బిజినెస్‌ స్కూల్‌' (హెచ్‌బీఎస్‌)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఎంబీఏతోపాటు మేనేజ్‌మెంట్‌లో ఎం.ఫిల్‌., పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహిస్తోంది.

ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రోగ్రామ్‌లు, వాటికి అవసరమైన అర్హతలు, ఇతర వివరాలు...

* ఎంబీఏ: ఇందులో మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ఎం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.

క్యాట్‌, జీమ్యాట్‌, మ్యాట్‌ స్కోర్ల ఆధారంగా ఎంబీఏలో ప్రవేశం లభిస్తుంది. ఈ స్కోర్లు లేని అభ్యర్థులు సంస్థ నిర్వహించే హెచ్‌బీశాట్‌ రాయాలి. వీటితోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అవసరం. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు. ప్రొఫెషనల్‌ కోర్సుల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఎం.ఫిల్‌. మేనేజ్‌మెంట్‌ (ఫుల్‌టైమ్‌/ పార్ట్‌టైమ్‌): ఫుల్‌టైమ్‌ కోర్సుకు కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా పీజీ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు. పార్ట్‌టైమ్‌ కోర్సులో ప్రవేశానికి పై అర్హతలతోపాటు సంబంధిత రంగంలో అనుభవం అవసరం.

* పీహెచ్‌డీ - మేనేజ్‌మెంట్‌ (పార్ట్‌టైమ్‌/ ఫుల్‌టైమ్‌): ఫుల్‌టైమ్‌ కోర్సుకు కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా పీజీ డిగ్రీ అవసరం. ఎం.ఫిల్‌/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌/ జీప్యాట్‌ అర్హతలున్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది. ఎం.ఫిల్‌. ఉన్నవారికి ప్రీ-పీహెచ్‌డీ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. పార్ట్‌టైమ్‌ కోర్సులో ప్రవేశానికి పై అర్హతలతోపాటు నిర్దిష్ట కాలం అనుభవం అవసరం.

ఆయా కోర్సులకు అవసరమైన అనుభవం, కోర్సుల వ్యవధి, ఫీజుల వివరాలు జీహెచ్‌బీఎస్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఫుల్‌టైమ్‌ కోర్సుల్లో ప్రవేశం పొందిన నలుగురు అభ్యర్థులకు నెలకు రూ. 8000 చొప్పున అసిస్టెంట్‌షిప్‌ లభిస్తుంది.

 దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ - (ఎంబీఏ కోర్సుకు):

హెచ్‌బీశాట్‌ అభ్యర్థులకు                   - 21 జనవరి 2012
జీమ్యాట్‌, క్యాట్‌, మ్యాట్‌ అభ్యర్థులకు - 18 ఫిబ్రవరి 2012.

Tuesday, 18 October 2011

ఫైనాన్స్‌లో శిక్షణకు ఐ.ఎఫ్‌.ఎం.ఆర్‌.

డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌, క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్‌, తదితర ఆధునిక స్పెషలైజేషన్లతో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తోన్న ప్రతిష్ఠాత్మక సంస్థ ఇన్ స్టిట్యూట్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐ.ఎఫ్‌.ఎం.ఆర్‌). 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐఎఫ్‌ఎంఆర్‌ను జాతీయ ప్రాముఖ్యం గల సంస్థగా గుర్తించింది.

2012-14 సంవత్సరానికి వివిధ స్పెషలైజేషన్లతో నిర్వహిస్తోన్న పీజీడీఎం ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


చెన్నైలోని ఐఎఫ్‌ఎంఆర్‌ మొత్తం మూడు రకాల ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఫైనాన్స్‌ రంగానికి సంబంధించిన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రోగ్రామ్‌లను రూపొందించడం విశేషం. అన్ని ప్రోగ్రామ్‌లకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. ఆయా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, సీటీఎస్‌, సిటిబ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, మురుగప్ప గ్రూప్‌, టీవీఎస్‌ గ్రూప్‌, తదితర ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ప్రోగ్రామ్‌ల వివరాలు...

* పీజీడీఎం: ఇందులో ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, ఐటీ అండ్‌ ఆపరేషన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఫైనాన్స్‌ - ఐటీ, ఫైనాన్స్‌ - మార్కెటింగ్‌, తదితర డ్యుయల్‌ స్పెషలైజేషన్లు కూడా చేయవచ్చు.
* పీజీడీఎం - డీఎస్‌ఎఫ్‌: డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌ చేయవచ్చు.
* పీజీడీఎం - ఎఫ్‌ఈ: క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌.

ఆయా కోర్సుల్లో చివరి రెండు నెలలు ఇంటర్న్‌షిప్‌కు కేటాయిస్తారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఫైనాన్స్‌ కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నాయి.

అర్హతలు, ఎంపిక విధానం
ఏ సబ్జెక్టులతోనైనా గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు అర్హులు. క్యాట్‌ 2011 లేదా ఎక్‌.ఎ.టి. 2012 లేదా జీమ్యాట్‌ (ఆగస్టు 2009 తర్వాత రాసినది) స్కోరు అవసరం. గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఐఎఫ్‌ఎంఆర్‌ అనేక స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ప్రోగ్రామ్‌లలో పనితీరును బట్టి స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని నిర్ణయిస్తారు.

* అభ్యర్థులు ఐఎఫ్‌ఎంఆర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు. లేదా ఐఎంఎస్‌, టైమ్‌, కెరీర్‌ లాంచర్‌ కేంద్రాల నుంచి దరఖాస్తులను పొందవచ్చు.
* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 డిసెంబరు 2011 (క్యాట్‌ అభ్యర్థులకు)
* ఎక్స్‌.ఎ.టి., జీమ్యాట్‌ అభ్యర్థులకు చివరితేదీ: 31 జనవరి 2012.

ఖర్చు లేకుండా శాస్త్రవేత్త కావాలంటే... ?


స్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీలో శిక్షణ, పరిశోధనలకు మనదేశంలో అత్యుత్తమ విద్యాసంస్థ... ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ). 

కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటైన ఈ సంస్థలో ప్రవేశం లభిస్తే, ఇస్రోలో శాస్త్రవేత్త ఉద్యోగం లభించినట్లే!

ఐఐఎస్‌టీకి డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా ఉంది. 2012 సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఐఐఎస్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సంస్థ నిర్వహించే 'ఐశాట్‌' (ఐఐఎస్‌టీ అడ్మిషన్‌ టెస్ట్‌)కు బాగా పోటీ ఉంటుంది.

ఈ సంస్థ అందిస్తోన్న కోర్సులు, ఐశాట్‌ 2012 వివరాలు...

సియాలోనే మొదటి స్పేస్‌ యూనివర్సిటీ ఐఐఎస్‌టీ. స్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీ, స్పేస్‌ అప్లికేషన్స్‌, తదితర సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ, పరిశోధన కోర్సులను ఐఐఎస్‌టీ అందిస్తోంది. ఈ సంస్థ అందించే ప్రోగ్రామ్‌లలో బాగా ప్రాచుర్యం గల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఐశాట్‌లో మంచి స్కోరు తప్పనిసరి. 2011 అడ్మిషన్ల సమయంలో బీటెక్‌లో మొత్తం 156 సీట్లు ఉన్నాయి. 2012 ప్రవేశాల నాటికి సీట్ల సంఖ్యలో మార్పు ఉండొచ్చు.

ఐఐఎస్‌టీలో నాలుగేళ్లలో బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఇస్రో లేదా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. బీటెక్‌లో కనీసం 6.5 సీజీపీఏ సాధించిన విద్యార్థులు అందరికీ ఇస్రోలో అవకాశం లభిస్తుంది. అభ్యర్థులు కనీసం ఐదేళ్లు తప్పనిసరిగా ఇస్రోలో పనిచేయాలి.

* ఐఐఎస్‌టీ విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయదు. హాస్టల్‌, బోర్డింగ్‌, ట్యూషన్‌ ఫీజులను పూర్తిగా సంస్థ భరిస్తుంది. 10కి కనీసం 6 జీపీఏ సాధించిన విద్యార్థులందరికీ ఈ సౌకర్యం లభిస్తుంది. ఇవిగాక ప్రతి సెమిస్టర్‌కు బుక్‌ అలవెన్స్‌ కింద రూ.3000 ఇస్తారు. ఏదైనా సెమిస్టర్‌లో 6 జీపీఏ కంటే తక్కువ గ్రేడ్‌ సాధిస్తే తర్వాత సెమిస్టర్‌కు హాస్టల్‌, వైద్య, తదితర ఖర్చులను విద్యార్థి భరించాలి.

ఐఐఎస్‌టీలో బీటెక్‌ ప్రోగ్రామ్‌లు...
* బీటెక్‌ (ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌): ఇది నాలుగేళ్ల కోర్సు. సీట్ల సంఖ్య 59. స్పేస్‌ టెక్నాలజీ నిపుణులను తయారుచేయడం దీని లక్ష్యం. మెకానికల్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ సైన్సెస్‌, స్పేస్‌ డైనమిక్స్‌ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు కూడా ఈ కోర్సులో ఉంటాయి. మనదేశంతోపాటు విదేశాల్లో అందిస్తోన్న ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌లకు ఇది దగ్గరగా ఉంటుంది.
* బీటెక్‌ (ఏవియానిక్స్‌): సీట్ల సంఖ్య 58. వ్యవధి నాలుగేళ్లు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ కూడా ఇందులో అధ్యయనం చేస్తారు. ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌లో ఉపయోగించే డిజిటల్‌ కమ్యూనికేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సిస్టమ్స్‌లాంటి అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్‌ అంశాలు కూడా ఉంటాయి.
* బీటెక్‌ (ఫిజికల్‌ సైన్సెస్‌): దీని వ్యవధి కూడా నాలుగేళ్లు. సీట్ల సంఖ్య 39. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, తదితర బేసిక్‌ సైన్సెస్‌ పరిజ్ఞానాన్ని స్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీకి వర్తింపచేయడం ఈ కోర్సు లక్ష్యం. రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌, ఎర్త్‌ సిస్టమ్‌ సైన్సెస్‌, తదితర అంశాలను ఈ కోర్సులో అధ్యయనం చేస్తారు.

ఐఐఎస్‌టీ నిబంధలను అనుసరించి పరిమిత సంఖ్యలో విద్యార్థులను స్పెషలైజేషన్‌లు మార్చుకోవడానికి అనుమతిస్తారు. మొదటి ఏడాది తర్వాత మాత్రమే ఇది వీలవుతుంది.

పరీక్ష విధానం
ఐశాట్‌ 2012 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి... కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌. ఈ పేపర్లకు సంబంధించిన సిలబస్‌ ఐశాట్‌ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షను హైదరాబాద్‌, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహిస్తారు.

* 2011 లేదా 2012లో మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ (ఎంపీసీ) సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా +2 ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌, పదో తరగతిలో కనీసం 70 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 60 శాతం చాలు) అవసరం.
* అభ్యర్థులు ఐఐఎస్‌టీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: 1 నవంబరు 2011
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 31 డిసెంబరు 2011
* ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 6 జనవరి 2012
* హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం: 2 మార్చి 2012
* ఐశాట్‌ 2012 తేదీ: 21 ఏప్రిల్‌ 2012
* ఫలితాల విడుదల: 23 మే 2011

Monday, 17 October 2011

ఇలా వీసా... ఛలో అమెరికా!


విదేశీ విద్యాసంస్థలో ప్రవేశం పొందినంతమాత్రాన వీసాను మంజూరు చేయరు. వీసా ప్రక్రియకు అది ఆరంభం మాత్రమే.

సాధారణంగా చాలామంది విద్యార్థులకు అమెరికాలో చదవాలనేది ఓ స్వప్నం! మెజారిటీ విద్యార్థులు కోరుకునే అమెరికాలో ప్రవేశం పొందటం క్లిష్టమైన విషయమే. వీసా అనుమతిని పొందటం కోసం విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వాలనే నిబంధన చాలా తక్కువ దేశాల్లోనే ఉంది. అమెరికా దానిలో ఒకటి.

విద్యాసంస్థ నుంచి అడ్మిషన్‌ లెటర్‌ (I 20 ) పొందగానే విద్యార్థులు ఏ చర్యలు అనుసరించాలో చూద్దాం.
*I 20 పొందగానే విద్యార్థి వీసా రుసుము (ఫీ) 140 డాలర్లు (1 USD = 50 INR) చెల్లించాలి. ఎంపిక చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లోనే ఈ రుసుమును చెల్లించాలి.

ఈ లింకు చూస్తే వివరాలు తెలుస్తాయి.
https://www.vfs-usa.co.in/USIndia/pdf/HDFC%20Locationsfeescenter.pdf

* రుసుము చెల్లించేటపుడు విద్యార్థి పాస్‌పోర్ట్‌ మొదటి పేజీ తాలూకు స్పష్టమైన ఫొటో కాపీని బ్యాంకుకు సమర్పించాల్సివుంటుంది. అప్పుడు బ్యాంకు వారు వీసా రుసుము రసీదును (డూప్లికేట్‌ కాపీ- 10 అంకెల బార్‌కోడ్‌ నంబర్‌ అతికించి) ఇస్తారు. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌కు ఈ బార్‌కోడ్‌ ఉపయోగపడుతుంది. వీసా రుసుము రసీదు కొనుగోలు చేసిన తర్వాత ఒక రోజుకు ఇది యాక్టివేట్‌ అవుతుంది. వీసా రుసుమును వెనక్కి ఇచ్చెయ్యరు. ఏడాది బాటు ఇది చెల్లుతుంది.
* విద్యార్థులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ కోసం DS-160 పత్రాన్ని నింపాల్సివుంటుంది.

ఈ పత్రం లభించే లింకు:
http://ceac.state.gov/genniv/
* కన్ఫర్మేషన్‌ కాపీని ప్రింట్‌ తీసుకోవాలి. దీనిలో CEAC బార్‌కోడ్‌ నంబర్‌ ఉంటుంది. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌కి ఈ నంబర్‌ ఉపయోగపడుతుంది.
* ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ కోసం కింది లింకులు చూడండి. (హెచ్‌డీఎఫ్‌సీ రసీదు సంఖ్య, సీఈఏసీ బార్‌కోడ్‌ ముఖ్యమైనవి)

https://www.vfs-usa.co.in/ApplnForms/RegularUser.aspx
*ఇంటర్వ్యూకు వెళ్ళేముందు విద్యార్థి SEVIS రుసుము 200 డాలర్లు చెల్లించాల్సివుంటుంది.

ఈ వెబ్‌సైట్‌ ద్వారా.
.. www.fmjfee.com
దీంతోపాటు వీసా కోసం ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్‌ తయారుచేయటం చాలా ముఖ్యం.

వీసా ఇంటర్వ్యూ కోసం ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లు
విద్యార్థులు యు.ఎస్‌.లో చదువు కోసం తమవద్ద తగినన్ని నిధులుండేలా చూడాలి. బోధనా రుసుము, జీవన వ్యయం, ప్రయాణం, పుస్తకాలు, స్టేషనరీ... ఇతర రుసుములన్నిటికీ సరిపోయేలా ఈ నిధులుండాలి. చాలా విశ్వవిద్యాలయాలకు ఇది దాదాపు రూ.15-25 లక్షల మధ్య ఉంటుంది.

ఈ నిధులన్నీ ఈ రూపంలో చూపాలి.
*ఫిక్సెడ్‌ డిపాజిట్లు
*బ్యాంకు నిల్వ
*స్పాన్సర్స్‌ పీఎఫ్‌లు
* విద్యారుణాలు
* తపాలా బ్యాండ్లు
* మ్యూచ్యువల్‌ ఫండ్లు

విద్యార్థులు రూ.80 లక్షల నుంచి కోటి వరకూ ఫిక్సెడ్‌ ఆస్తులు చూపించాలి.
ఇవి ఏ రూపంలో ఉండొచ్చంటే...
* ప్లాట్లు
* ఫ్లాట్లు
* ఇల్లు
* భూములు
* పొలాలు/ వ్యవసాయ భూములు
* వార్షిక ఆదాయం కూడా చూపించవచ్చు.
* ఇవి ఎన్ని రకాలుగా ఉండొచ్చంటే...
* వేతన ఆదాయం
* వ్యాపార ఆదాయం
* వ్యవసాయ ఆదాయం
* అద్దె ఆదాయం
* పెన్షన్‌; ఎఫ్‌డీలూ మొదలైనవాటి వడ్డీ

ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లతో పాటు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్లు
* టెన్త్‌
* ఇంటర్మీడియట్‌
* డిగ్రీకి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలూ (విడి మార్కుల షీట్లతో కలిపి)
* GRE, TOEFL/IELTs స్కోరు కార్డులు
* ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌
* పాస్‌పోర్టు

* DS-160 కన్ఫర్మేషన్‌
* హెచ్‌డీఎఫ్‌సీ రసీదు
* ఇంటర్వ్యూ లేఖ
* SEVISరుసుము రసీదు
*CA & CE నివేదిక
*స్పాన్సర్స్‌ నుంచి అఫిడవిట్‌
విద్యార్థి వీసా ఇంటర్వూకు వెళ్ళేటపుడు పైన ప్రస్తావించిన డాక్యుమెంట్లన్నీ ఒరిజినల్స్‌ తీసుకువెళ్ళాలి.


వీసా ఇంటర్వ్యూ
పైన చెప్పిన డాక్యుమెంట్లన్నీ సిద్ధమైనంతమాత్రాన వీసా వచ్చేసినట్టే అనుకోవచ్చా? లేదు! అత్యంత ముఖ్యమూ, కీలకమూ అయిన వీసా ఇంటర్వ్యూ ఉంది కదా? దీన్ని ధైర్యంగా ఎదుర్కొని, వీసా అధికారి ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సివుంటుంది. ఇక్కడే చాలామంది విద్యార్థులు విఫలమవుతూ వీసా పొందలేకపోతున్నారు. ఆ పరిస్థితి ఎదురుకాకూడదంటే ఇంటర్వ్యూకు హాజరవ్వటానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యమైన ఈ ప్రక్రియ ఉద్దేశం ఏమిటంటే... విద్యార్థి తన చదువు ముగిసిన తర్వాత తన ఆర్థిక, సామాజిక బంధాలు, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా స్వదేశానికి తిరిగి రావటానికి సిద్ధంగా ఉంటాడని రుజువు కావాలి. దీన్నే వీసా అధికారి ఆశిస్తారు. ఈ ఇంటర్వ్యూ 1-3 నిమిషాల వ్యవధిలో ముగియవచ్చు.

వీసా అధికారితో మాట్లాడేటపుడు...
* వస్త్రధారణ హుందాగా ఉండాలి. మొహంలో చిరునవ్వు కనిపించాలి.
* ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. అధికారి కళ్ళలోకి చూస్తూ జవాబులు చెప్పాలి. ధీమాగా ఉంటూనే అధికారి పట్ల గౌరవం ప్రదర్శించాలి.
* అడిగిన ప్రశ్నలన్నిటికీ నిజాయతీగా, స్పష్టంగా సమాధానాలు చెప్పాలి.
* మీరు చదవబోయే విద్య, పొందబోయే డిగ్రీ భారత్‌లో మీకెంత ఉపయోగకరమో వివరించగలగాలి. స్వదేశానికి తిరిగి వచ్చాక మీ లక్ష్యాలేమిటన్నది వివరణ ఇవ్వగలిగివుండాలి.
* సుదీర్ఘంగా జవాబు చెప్పటమో, పొంతన లేని సంగతులు మాట్లాడటమో చేయకూడదు.




ప్రశ్నలు ఎలా ఉంటాయి?

వీసా ఇంటర్వ్యూలో రకరకాల ప్రశ్నలను అడుగుతుంటారు. కొన్ని నమూనా ప్రశ్నలను చూద్దాం.

అమెరికాయే ఎందుకని?
* Why do you want to study in the USA?
* Why do you wish to study in the US and not in India?

విశ్వవిద్యాలయాలూ, ప్రవేశం
* How many universities did you apply for?
* Which universities (both admits and rejects) did you apply for?
* Which universities accepted you?
* Why did you choose a specific university?
* Can you tell me some details about your university?
* Can you mention the names of some professors?
* Do you know anyone (in USA) or in your University?
* What do you plan to study at the university?

విద్యాసంబంధ అంశాలు
* Where did you do your bachelor's degree from?
* What is your undergraduate GPA/ Percentage?
* Do you have any backlogs?
* Why you have so many backlogs?
* What is your specialisation?
* Could you please show me your GRE/TOEFL scorecard?

ఉపకార వేతనాలు
* Did you receive any scholarships?
* Why do you think the university is giving a scholarship to you?
* Why haven't you received any scholarship?

భవిష్య ప్రణాళికలు
* What will you do after completing MS?
* What are your plans after graduation?
* What will you do if your visa is rejected?
* Will you comeback to home during summers?
* How will your study in the US be helpful to you in your home country after comeback?

సబ్జెక్టును మార్చుకుంటే...
* (If you have changed the field of specialisation, e.g. you have bachelor's degree in Mechanical Engineering and are going for a masters in Computer Science) Why do you want to change your major?
* What steps have you taken to ensure that you will be able to perform well in the new field you wish to change to?

ఆర్థిక విషయాలు
* Who is sponsoring you?
* What does your father do?
* What is your father's annual income? Does he pay income tax?
* How many brothers and sisters do you have?
* Are your parents retired? If yes, how will they pay for your education expenses?
* If you have xx brothers and sisters so your father's savings are for all, how will he finance you?
* Have you received any loans?
* Why you have not taken a loan?

ఇతర ప్రశ్నలు
* Do you have a brother/sister, or any other relative already at this university?
* Do you have any relatives in USA?
 (If you are currently working) why are you leaving your current job?
* Have you ever been to the US?

 ఈ వ్యాస రచయిత.. శుభకర్ ఆలపాటి.

మంచి ఎంబీఏకి మెలకువలు

 ఎంబీఏ ద్వారా మంచి కెరియర్‌ను ఆశిస్తోన్న విద్యార్థులు కేవలం కాలేజీలు అందించే సౌకర్యాల మీదనే ఆధారపడకూడదు. సొంత కెరియర్‌ ప్రణాళిక అవసరం. విజయవంతంగా ఎంబీఏ పూర్తిచేసి, మంచి మేనేజర్‌ అవ్వాలంటే కింది అంశాలపై అవగాహన అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా, మీరు ఏ లక్ష్యం కోసం ఎంబీఏలో చేరారో దానిమీదే దృష్టిపెట్టాలి. సొంతగా వ్యాపారం చేయడం, కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకోవడం, మంచి కంపెనీలో చేరడం... ఇలా మీ లక్ష్యం ఏదైనా... దానిపై పూర్తి స్పష్టత ఉండాలి. తద్వారా మీ కార్యాచరణ, లక్ష్యసాధన సులువవుతుంది.

మొదటి మెట్టు... తెలివితేటలు
సబ్జెక్టులో మంచి పట్టు, తెలివితేటలు సాధించడం ఎంబీఏలో విజయానికి తొలిమెట్టు. మేనేజ్‌మెంట్‌ భావనలు, సిద్ధాంతాలు, అనువర్తనాలను బాగా నేర్చుకోవాలి. మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, తదితర ఫంక్షనల్‌ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, ఎకనమిక్స్‌, బిజినెస్‌ స్ట్రాటజీ అండ్‌ పాలసీ, ఎథిక్స్‌ అండ్‌ గవర్నన్స్‌, లీడర్‌షిప్‌ అండ్‌ చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి ఇంటెగ్రేటెడ్‌ అంశాలను నేర్చుకోవాలి. వీటితోపాటు ఎంబీఏ అభ్యర్థులకు కింది సబ్జెక్టు అంశాల్లో సరైన అవగాహన అవసరం...

* మీకు ఆసక్తి గల స్పెషలైజేషన్‌లో తాజా పరిణామాలు, ఆధునిక అంశాలు
* సమస్యా పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ నమూనాలు, అందులోని ప్రక్రియలు
* ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌
* టీమ్‌ను తయారుచేయడం
* వ్యవస్థలను రూపొందించడం, అభివృద్ధి చేయడం

రెండో మెట్టు... సామర్థ్యాలు
కేవలం సబ్జెక్టులో తెలివితేటల ద్వారా మంచి మేనేజర్‌ కాలేరు. తెలిసిన అంశాలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. ఎంబీఏ విద్యార్థులు ప్రధానంగా ఆరు రకాల సామర్థ్యాలను బాగా పెంపొందించుకోవాలి. అవి... 1. కమ్యూనికేషన్‌, ఇంటర్‌ పర్సనల్‌ అండ్‌ ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌ 2. టీమ్‌ బిల్డింగ్‌ అండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ 3. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు 4. సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం, ఘర్షణలను నివారించడం 5. పరిశోధన, ప్రణాళిక, మదింపు సామర్థ్యాలు 6. ఆర్గనైజేషనల్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌.

మూడో మెట్టు... ఆలోచన ధోరణి
పని, వ్యక్తులు, సంఘటనల పట్ల స్పందించడంలో మెలకువలు పాటించడం తప్పనిసరి. సానుకూల ఆలోచన అవసరం. ఎంబీఏ విద్యార్థులు దృష్టిపెట్టాల్సిన అత్యంత ముఖ్యమైన అంశాలు... ఆలోచన ధోరణి, వ్యక్తిత్వం, ప్రవర్తన. ఒక వ్యాపార అంశాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కీలకంగా పనిచేస్తాయి. మేనేజ్‌మెంట్‌ కెరియర్‌లో విజయం సాధించాలంటే కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు అవసరం. అవేమిటంటే... సహోద్యోగులను గౌరవించాలి. పని పట్ల బాధ్యతాయుతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి. ఇతరుల భావాలను, నేపధ్యాన్ని అర్థం చేసుకోవాలి. సహనం, కృత నిశ్చయం, మనోనిబ్బరం అలవరచుకోవాలి. నాయకత్వం లేకపోయినా పనిలో నిబద్ధతతో పాలుపంచుకోవాలి. ఈ వ్యక్తిత్వ లక్షణాలన్నీ ఒకేసారి అలవడేవి కాదు. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగుపరచుకోవాలి.

* సాధారణ ఎంబీఏ కాలేజీల్లో పైన పేర్కొన్న అంశాలపై పెద్దగా దృష్టిపెట్టకపోవచ్చు. కానీ మీ కెరియర్‌ను సరైన రీతిలో మలచడంలో ఇవి చాలా కీలకమైన అంశాలని మర్చిపోవద్దు.

అదనంగా చేయాల్సింది ఎంతో..!
ఎంబీఏ కోర్సు ద్వారా మీరు ఆశించిన కెరియర్‌ దక్కాలంటే కింది అంశాలను ఆచరణలో పెట్టాలి. మీరు చేరిన కాలేజీలో అద్భుతమైన సౌకర్యాలు లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కేవలం తరగతి గదిలో నేర్చుకునేవి, మంచి సిలబస్‌ ఉంటే సరిపోదు. అదనంగా చేయాల్సింది చాలా ఉంటుంది. చాలా సందర్భాల్లో తరగతి గదిలో నేర్చుకునేదానికి, వాస్తవిక వ్యాపార వాతావరణానికి సంబంధం ఉండకపోవచ్చు. అందువల్ల మీరే శ్రద్ధతో తాజా అంశాలను నేర్చుకోవాలి.

* స్టాక్‌ మార్కెట్లు, బులియన్‌, క్రూడ్‌ ఆయిల్‌, ఫారిన్‌ ఎక్చేంజ్‌, ద్రవ్యోల్బణం అంశాల్లో పరిణామాలను నిత్యం గమనిస్తుండాలి.

* సీఎన్‌బీసీ, ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌ లాంటి బిజినెస్‌ న్యూస్‌ చానెళ్లను చూడొచ్చు. ఎన్డీటీవీ, బీబీసీ, తదితర న్యూస్‌ చానళ్లను కూడా చూడొచ్చు. బిజినెస్‌ లైన్‌, ఎకనమిక్‌ టైమ్స్‌, ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌, తదితర వ్యాపార పత్రికలను చదవచ్చు. రోజూ కనీసం ఒక బిజినెస్‌ వార్తా పత్రికను క్షుణ్నంగా చదివితే మంచిది.

* బిజినెస్‌ ఇండియా, బిజినెస్‌ టుడే, తదితర మేగజీన్లను చదవాలి. బడ్జెట్‌లు, క్రెడిట్‌ పాలసీలు, వ్యాపార పుస్తకాల సమీక్షలు చదవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఉపయోగపడే బిజినెస్‌ వెబ్‌సైట్లను కూడా చూస్తుండాలి.



చొరవ తప్పనిసరి
ప్రస్తుతం నేర్చుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాలేజీలో సౌకర్యాలు లేవని బాధపడటం కంటే స్వీయ చొరవతో నేర్చుకోవడానికి గల మార్గాలను అన్వేషించడం ఉత్తమం. తద్వారా తోటి విద్యార్థుల కంటే పోటీలో ముందుండగలరు. ఎంబీఏ లాంటి వృత్తి విద్యా కోర్సులో ఆచరణకు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. తరగతి గదిలో నేర్చుకునే సిద్ధాంతాలను లైవ్‌ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, కేస్‌ స్టడీల రూపంలో ఆచరణలో పెట్టడం ద్వారా ఆ అంశాలపై మరింత స్పష్టత ఏర్పడుతుంది. కింది అంశాలపై కూడా దృష్టినిలపాలి.

* గెస్ట్‌ లెక్చర్లకు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఒకవేళ మీ కాలేజీలో అలాంటివి నిర్వహించకపోతే, మీరే చొరవ తీసుకొని ఏర్పాటు చేయించడానికి ప్రయత్నించవచ్చు. సబ్జెక్టు, పరిశ్రమల నిపుణులు చెప్పే అంశాల ద్వారా అవగాహన పరిధి విస్తరిస్తుంది.

* సాధారణ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌లకు సరిగా ప్రాధాన్యం ఉండదు. సీరియస్‌గా ఇంటర్న్‌షిప్‌ చేసిన విద్యార్థులకు నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. రొటీన్‌ అంశాలపై కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే అంశాలపై ఇంటర్న్‌షిప్‌ చేయాలి.

* మేనేజ్‌మెంట్‌ రంగంలో ఉన్నన్ని సంఘాలు, సంస్థలు మిగతా రంగాల్లో ఉండవేమో! పారిశ్రామిక సంఘాలు, విద్యాసంస్థలు నిర్వహించే సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌లకు తప్పనిసరిగా హాజరవ్వాలి. వీటిల్లో సభ్యత్వం తీసుకుంటే ఇంకా మంచిది. ఈ సంఘాలు నిర్వహించే సమావేశాల్లో పరిశోధన పత్రాలు ప్రెజెంట్‌ చేసే అవకాశం వస్తే అసలు వదులుకోవద్దు.

* మేనేజ్‌మెంట్‌ కెరియర్‌లో ప్రవేశించాక వివిధ దశల్లో చాలా నివేదికలు రాయాల్సి ఉంటుంది. సెమినార్లు, వర్క్‌షాప్‌లలో పేపర్ల ప్రెజెంటేషన్‌ రూపంలో ఇప్పటి నుంచే దీన్ని సాధన చేయవచ్చు. వ్యాపార పత్రికలకు, మేగజీన్లకు ఉత్తరాలు రాయడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు.

* ప్రస్తుత వ్యాపార వాతావరణంలో నెగ్గుకురావాలంటే మేనేజర్లకు అనేక కీలకమైన సామర్థ్యాలు అవసరం. వీటిలో కొన్ని... నాయకత్వ లక్షణాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, పీపుల్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌, ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌, సమస్యలను సమర్థంగా పరిష్కరించగలగడం, ఒత్తిడిని అధిగమించడం, కుటుంబ జీవితం - విధి నిర్వహణల మధ్య సమతౌల్యం సాధించడం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం.

పోటీలో ముందుండాలంటే...
ప్రస్తుత పోటీ వాతావరణంలో తోటి విద్యార్థులకంటే ముందుండాలంటే అసలు డిగ్రీకి అదనపు హంగులు కూడా అవసరమే. ఎంబీఏతోపాటు కొద్దిపాటి శ్రమతో సాధించగల సర్టిఫికేషన్‌లు చాలా ఉంటాయి. ఎన్‌సీఎఫ్‌ఎం, ఏఎంఎఫ్‌ఐ, సెబీ, తదితర సంస్థలు అందించే సర్టిఫికేషన్‌లకు మంచి విలువ ఉంటుంది. ఈ అదనపు అర్హతలు మిమ్మల్ని మీ క్లాస్‌మేట్ల కంటే పోటీలో ముందుంచుతాయి. మీరు ఎంచుకున్న స్పెషలైజేషన్‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్లు, రిటైల్‌, తదితర సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌ కోర్సులను ఎంచుకోవచ్చు.

* ప్లేస్‌మెంట్ల గురించి కూడా మొదటి నుంచి ఆలోచించాలి. ఈ విషయంలో కాలేజీ నుంచి సరైన సహకారం లేకపోతే విద్యార్థులే ప్లేస్‌మెంట్‌ కమిటీగా ఏర్పడి కంపెనీలతో సంప్రదింపులు జరపవచ్చు.

* ప్లేస్‌మెంట్ల ధోరణిని నిరంతరం గమనిస్తుండాలి. పత్రికల్లో వచ్చే నియామక ప్రకటనలను పరిశీలిస్తే, కంపెనీలు అభ్యర్థుల నుంచి ఎలాంటి అర్హతలు, సామర్థ్యాలు ఆశిస్తున్నాయో అర్థమవుతుంది.

* క్రమం తప్పకుండా లైబ్రరీలో పుస్తకాలు, జర్నళ్లు చదవడానికి, ఎలక్ట్రానిక్‌ డేటాబేస్‌ చూడటానికి కొంత సమయం వెచ్చించాలి.
ఈ కథన  రచయిత...  ప్రొ. ఎం. భాస్కరరావు .

Sunday, 16 October 2011

ఇంగ్లిష్ లో feast your eyes!

ఆంగ్ల భాషలో feast అనే మాట  eyes తో collocate అవుతుంది.

wide తో awake  collocate అవుతుంది.

ఇలా కలిసిన పదాలతో వచ్చే collocations ను సంభాషణల ద్వారా, ఉదాహరణల ద్వారా తెలుసుకోవటానికి ఈ వ్యాసం చదవండి...


Friday, 14 October 2011

మేనేజ్‌మెంట్‌ విద్యకు 'మ్యాట్‌'



ఆంధ్రప్రదేశ్‌లో బద్రుకా గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌, గీతం యూనివర్సిటీ, ఏసియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ధ్రువ కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఐసీబీఎం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌, ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్  తదితర సంస్థలు మ్యాట్‌ స్కోరు ఆధారంగా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కల్పిస్తున్నాయి.

మ్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశం లభించే ప్రోగ్రామ్‌లకు ఏఐసీటీఈ లేదా యూజీసీ గుర్తింపు ఉంటుంది. ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న బిజినెస్‌ స్కూళ్లు సాధారణంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) అందిస్తాయి. యూనివర్సిటీలు ఎంబీఏ పేరుతో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తాయి.

దేశవ్యాప్తంగా మ్యాట్‌ స్కోరును ఆమోదించే వివిధ రకాల మేనేజ్‌మెంట్‌ సంస్థల జాబితా ఏఐఎంఏ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.

మ్యాట్‌ను దేశవ్యాప్తంగా 70కిపైగా పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

మనరాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి. ఏటా మ్యాట్‌ పరీక్షను దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. డిసెంబరు, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించే పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుంది. మ్యాట్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో రాయవచ్చు.

మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు మ్యాట్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులను వడపోత పోస్తాయి. తర్వాత గ్రూప్‌ డిస్కషన్‌లు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తాయి. మ్యాట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తోన్న సంస్థల్లో ఫీజులు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉండొచ్చు.

మంచి స్కోరు రావాలంటే..?
మ్యాట్‌ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో సాధించే స్కోరును ర్యాంకులకు పరిగణనలోకి తీసుకోరు. ఈ ప్రశ్నలు కాకుండా మిగిలిన 160 ప్రశ్నలకు 70 నుంచి 80 మార్కులు సాధిస్తే మ్యాట్‌లో మంచి స్కోరు తెచ్చుకోవచ్చు.

మ్యాట్‌ స్కోరుకు ఒక ఏడాది వరకు విలువ ఉంటుంది. అభ్యర్థులు మ్యాట్‌కు దరఖాస్తు చేసుకునేటప్పుడు తమకు ఇష్టమైన ఏవైనా 5 సంస్థలను ఎంచుకోవాలి. సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, తదితర గ్రాడ్యుయేట్లు, ఆయా కోర్సులు చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు మ్యాట్‌ రాయవచ్చు.

* అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న బిజినెస్‌ స్కూళ్లకు అవసరమైన ఇతర అర్హతలు, నిబంధనలకు లోబడి మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.

పరీక్ష విధానం ఎలా?
మ్యాట్‌ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటుంది. ఆన్‌లైన్‌ పద్ధతిలో లేదా పేపర్‌- పెన్సిల్‌ పద్ధతిలో పరీక్ష రాయవచ్చు. మ్యాట్‌లో మొత్తం 5 విభాగాలుంటాయి. అవి... లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, గణిత సామర్థ్యం, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, ఇంటెలిజన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌, ఇండియా అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌. ఆయా విభాగాల్లో కింది అంశాల నుంచి ప్రశ్నలడిగే అవకాశం ఉంటుంది...
* లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌:
ఇందులో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఒకాబ్యులరీ, ఖాళీలు పూరించడం, సమానార్థాలు, వ్యాకరణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేరాగ్రాఫ్‌ పూర్తిచేయడం, పేరాగ్రాఫ్‌ జంబ్లింగ్‌, వాక్యాల్లో దోషాలను గుర్తించి సరిచేయడం, వాక్యాలను పూరించడం, వ్యతిరేక అర్థాలనిచ్చే పదాలు కనుక్కోవడం కూడా ముఖ్యమైన అంశాలు. రోజూ దినపత్రికలను చదవడం, ప్యాసేజ్‌లను సాధన చేయడం ద్వారా ఇందులో మంచి స్కోరు తెచ్చుకోవచ్చు. జనరల్‌ అవేర్‌నెస్‌కు కూడా ఈ సాధన ఉపయోగపడుతుంది.

* గణిత సామర్థ్యాలు:
ఈ విభాగంలో మేథమేటిక్స్‌లోని ప్రాథమిక అంశాలైన అర్థమెటిక్‌, జామెట్రీ, మెన్సురేషన్‌, కాలం-దూరం, కాలం-వేగం, బారువడ్డీ, చక్రవడ్డీ, సీరీస్‌, సెట్‌ థియరీ, తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. హయ్యర్‌ మేథమేటిక్స్‌లో ప్రాబబిలిటీ, పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌ చదవడం మంచిది.

* డేటా ఎనాలసిస్‌ అండ్‌ సఫిషియన్సీ:
సమాచారం ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ విభాగంలో పట్టికలు, చార్టులు, లైన్‌ గ్రాఫ్‌లు, పై చార్టులు, డేటా సఫిషియన్సీ, కాంబినేషనల్‌ గ్రాఫ్‌, బార్‌ గ్రాఫ్‌, తదితర అంశాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.

* ఇంటెలిజన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌:
ఇందులో ముఖ్యమైన అంశాలు... డేటా అరేంజ్‌మెంట్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌ టైప్‌, క్రిటికల్‌ రీజనింగ్‌, రక్త సంబంధాలు, సీరీస్‌ పూర్తిచేయడం, కోడింగ్‌- డీకోడింగ్‌, వాదనలు, లెటర్‌ సీక్వెన్స్‌, నంబర్‌ సీక్వెన్స్‌, ఎనాలజీస్‌.

* ఇండియా అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌:
మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులకు అవసరమైన జనరల్‌ అవేర్‌నెస్‌ను ఈ విభాగం ద్వారా పరీక్షిస్తారు. ఇందులో సైన్స్‌, జాగ్రఫీ, చరిత్ర, ఎకనమిక్స్‌, కరెంట్‌ అఫైర్స్‌, రాజకీయ వ్యవస్థ, తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీన్ని ఫైనల్‌ స్కోరుకు పరిగణనలోకి తీసుకోకున్నా, కొన్ని సంస్థలు ప్రవేశాలకు సెక్షన్ల వారీగా స్కోర్లను పరిశీలిస్తాయి. అందువల్ల ఈ విభాగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

దరఖాస్తు విధానం...
* మ్యాట్‌ డిసెంబరు 2011 నోటిఫికేషన్‌ వెలువడింది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐఎంఏ స్టడీ సెంటర్ల నుంచి కూడా దరఖాస్తులు పొందవచ్చు.

* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖల్లో; అనంతపురం, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, తిరుపతిలోని యాక్సిస్‌ బ్యాంకు శాఖల్లో కూడా దరఖాస్తులు లభిస్తాయి. పూర్తి వివరాలు ఏఐఎంఏ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 12 నవంబరు 2011

* పూర్తిచేసిన దరఖాస్తులు ఏఐఎంఏ, న్యూఢిల్లీకి చేరడానికి చివరితేదీ: 15 నవంబరు 2011.

* మ్యాట్‌ డిసెంబరు 2011 పరీక్ష తేదీ: 4 డిసెంబరు 2011 (పేపర్‌ పరీక్ష); 10 డిసెంబరు 2011 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష).

సివిల్స్ మెయిన్స్‌ మెలకువలివిగో!

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలు దగ్గర్లోకి వచ్చేశాయి.

దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ఆందోళన!

పరీక్షను అర్థం చేసుకుని, విజయసూత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే 'సన్నద్ధత' ప్రయాణం సాఫీగానే సాగుతుంది. ఆ వివరాలను అందిస్తూ పునశ్చరణను పరిపుష్టం చేసుకునే విధానం వివరిస్తున్నారు... బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ

 
సివిల్స్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది కాబట్టి అది చాలా తేలికనే అభిప్రాయం చాలామందిలో కనిపిస్తుంది. నిజానికి కష్టమైన పరీక్ష ఇదే. ప్రిలిమినరీలో ప్రతి మార్కూ విలువైనదే. ఒక్క మార్కే అభ్యర్థి పోటీలో ఉండటాన్నీ, వైదొలగటాన్నీ నిర్ణయించే అవకాశముంది. పైగా మొదటిసారి ప్రిలిమ్స్‌లో నెగ్గనివారిలో ఆ కారణం మానసికంగా కొంత అవరోధాన్ని ఏర్పరిచే ప్రమాదం ఉంటుంది.

అందుకే ప్రిలిమ్స్‌ దశ దాటినవారు పెద్ద 'హర్డిల్‌' దాటేసినందుకు తమ భుజం తామే తట్టుకోవచ్చు! ఇక రెండో దశ అయిన మెయిన్స్‌ విషయానికి వస్తే... దీనిలో సాధించిన మార్కులు అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వారు ఇంటర్వ్యూకు అర్హత పొందుతారా? ఏ సర్వీసుకు ఎంపికవుతారు? ఐఏఎస్‌కో, ఐపీఎస్‌కో ఎంపికైతే ఏ రాష్ట్రంలో పనిచేస్తారు?... ఇవన్నీ!

ప్రతి మార్కూ ఇక్కడ కూడా పరిగణనలోకి వచ్చేదే. అయితే ఎక్కువ పేపర్లుంటాయి కాబట్టి ఒక పేపర్లో తక్కువ మార్కులు వచ్చినా మరో పేపర్లో అత్యధిక స్కోరు తెచ్చుకుని సర్దుబాటు చేసుకోవచ్చు.

ఆప్షనల్స్‌ ప్రత్యేకత
మెయిన్‌ పరీక్షలో తొమ్మిది పేపర్లుంటాయి. వాటిలో ఐదు తప్పనిసరి (కంపల్సరీ). మిగిలిన నాలుగూ అభ్యర్థి ఎంచుకునే ఆప్షనల్స్‌. ఈ ఆప్షనల్‌ సబ్జెక్టుల ప్రత్యేకత ఏమిటి? గత మూడేళ్ళ ఫలితాల్లో టాపర్ల మార్కులను పరిశీలిస్తే... అందరూ ఆప్షనల్స్‌లో చాలా అధిక మార్కులు స్కోర్‌ చేసినవారే! ఆశ్చర్యకరంగా జనరల్‌ స్టడీస్‌లో అందరికీ తక్కువ మార్కులే వచ్చాయి.

ఇది దేన్ని సూచిస్తోంది?

జనరల్‌ స్టడీస్‌ చాలా విస్తృతం కాబట్టి దీనిలో స్కోర్‌ చేయటం చాలా కష్టం. ఈ క్లిష్టత అభ్యర్థులందరిదీ! ఈ పేపర్‌ పూర్తిగా అనూహ్యంగా ఉండొచ్చు. ఎంత విస్తారంగా చదివినా, ఎన్ని కోచింగ్‌ తరగతులకు హాజరైనా... ప్రశ్నపత్రం అదివరకెన్నడూ ఎరగనిది చూసినట్టు అనిపిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇలాంటపుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి విచారించనక్కర్లేదు. అందుకే 2000 మార్కులున్న ఆప్షనల్స్‌ మీద దృష్టి కేంద్రీకరిస్తే 1200 మార్కులు (60 శాతం) తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతర పేపర్లలో అనూహ్య ప్రశ్నలు ఎక్కువ కాబట్టి ఆప్షనల్స్‌ మార్కులు 60 శాతమైనప్పటికీ, అభ్యర్థి విజయంలో వాటి పాత్రను 75 శాతం వరకూ లెక్కలోకి వేసుకోవచ్చు. ఈ రకంగా ఆప్షనల్స్‌లో వచ్చే మార్కులకు నేరుగా ర్యాంకుతోనే సంబంధం ఉంటుంది!

మన రాష్ట్రంలో సివిల్స్‌ విజేతల్లో ఎక్కువమంది ఎంచుకునే ఆప్షనల్స్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీ, తెలుగు సాహిత్యం, భూగోళశాస్త్రం ఉన్నాయి. తొలిసారే అర్హత పొందినవారిలో అధికశాతం ఎంపిక- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలే. దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందిన ఆప్షనల్‌- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌. గత ఏడాది విజేతలైన 900 + అభ్యర్థుల్లో 400+ మంది ఆప్షనల్‌ ఇదే! ఈ ఏడాది మెయిన్స్‌కు హాజరయ్యే 12,000 మంది అభ్యర్థుల్లో 6,500కి పైగా ఈ సబ్జెక్టునే ఆప్షనల్‌గా ఎంచుకోవటం విశేషం. ఈ సబ్జెక్టు సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు. మొదటి పేపర్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ థియరీ, రెండోదానిలో భారతీయ పాలనావ్యవస్థ. రెండూ స్కోరింగ్‌కు అనుకూలమైనవే. ప్రతి పేపర్లోనూ 300కు 200 మార్కులు తెచ్చుకున్నవారున్నారు. వీరి వ్యూహం ఏమిటంటే...

1) స్కోరింగ్‌ అంశాలను గుర్తించటం

2) ఈ అంశాల్లోని వర్తమాన పరిణామాలను చదవటం

3) జవాబులు రాసే తీరుపై దృష్టి పెట్టటం

పేపర్‌-1:
మొదటి విభాగం (సెక్షన్‌)లో తొలి ఆరు అధ్యాయాలూ, రెండో విభాగంలో మిగిలిన ఆరు అధ్యాయాలూ ఉంటాయి. మొదటి విభాగం అధిక స్కోరింగ్‌ కాబట్టి ఈ అధ్యాయాలపై అధిక దృష్టి కేంద్రీకరించవలసివుంది.

పేపర్‌-2: తొలి ఏడు అధ్యాయాలూ సెక్షన్‌-ఎలో, మిగిలిన ఏడు అధ్యాయాలూ సెక్షన్‌-బిలో ఉంటాయి. దీనిలో పేపర్‌-1 మాదిరి కాకుండా రెండో విభాగంలోనే అధిక మార్కులు స్కోర్‌ చేసే అవకాశముంది.

గత కొద్ది సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా కింది ధోరణులను గుర్తించవచ్చు.

* గతంలో కనీసం నాలుగు వ్యాసరూప (ఎస్సే) ప్రశ్నలుండేవి. ఈ తీరు మారుతోంది. ఎస్సే ప్రశ్నలు చిన్న ప్రశ్నలుగా మారుతున్నాయి. దీనిబట్టి గ్రహించాల్సింది ఏమిటంటే... అభ్యర్థులు కొన్ని అంశాలను వదిలివేసే అవకాశం లేదిప్పుడు. అన్నిటినీ చదివి తీరాల్సిందే!

* కొన్ని areasలో ప్రశ్నలు పరోక్షంగా ఉంటాయి. అవి అంత స్కోరింగ్‌ కావు. కానీ కొన్ని areasలో నేరుగా వచ్చే ప్రశ్నలుంటాయి. అవి స్కోరింగే. సమస్యేమిటంటే... ఈ areasచదవటానికి విసుగ్గా ఉంటాయి. బోరింగ్‌... కానీ స్కోరింగ్‌! అందుకే అభ్యర్థులకు మరో అవకాశం లేదని గుర్తుంచుకోండి.

* ప్రశ్నల విధానం ఏటా మారుతుంటుంది. ఇటీవల 10-15 మార్కులుండే short questions ఇవ్వటంపై దృష్టి పెరిగింది. దీనికి సిద్ధంగా ఉండాలి.

* సరికొత్త పరిణామాలను తెలుసుకుంటూ ఉండాలి. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ గతిశీలమైనది, రోజూ నూతన సంఘటనలు చోటుచేసుకునే సబ్జెక్టు. అతి ముఖ్యమైన అంశాలను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి.

* గత సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా ముఖ్యమైన అంశాల జాబితా తయారుచేసుకోవాలి. వాటిపై అధిక దృష్టి పెట్టాలి. అయితే పేపర్‌ రూపొందించేవారు మనకంటే తెలివైనవారైవుంటారు కాబట్టి ఏ అంశాన్నీ వదిలెయ్యకుండా జాగ్రత్తపడాలి.

* 'ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌' నుంచి సంబంధమున్న వ్యాసాలను చదవాలి. వాటి నుంచి చాలా ప్రశ్నలు ఆశించవచ్చు.

* పరీక్షలో ఎన్ని వీలైతే ప్రశ్నలకు జవాబులు రాయాలి. ప్రశ్నకు నేరుగా స్పందించలేకపోయినప్పటికీ ఆ అంశం గురించి ఏదో ఒకటి రాయటం మేలు. ఆ అంశానికి సంబంధించిన ముఖ్య కోణాల గురించి రాసినప్పటికీ కనీసం 40 శాతం మార్కులైనా వచ్చే అవకాశం ఉంటుంది.

Monday, 10 October 2011

గ్రూప్‌-2 గెలుపు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షలకు మిగిలింది ఐదు రోజులే!

ఇప్పుడున్న కొద్ది సమయం చాలా అమూల్యం. దీన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలి. మరోపక్క ఇటీవలి గ్రూప్‌-1 మెయిన్స్‌ ధోరణులనూ గమనంలోకి తీసుకోవాలి.

సన్నద్ధతకు ఇలా తుది మెరుగులు దిద్దుకుంటేనే ఆశించిన ఫలితం సిద్ధించేది అంటున్నారు... కొడాలి భవానీ శంకర్‌!

రీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో కనీసం 5 శాతం మంది స్వల్ప తప్పిదాల వల్ల విలువైన సమయం నష్టపోవటమే కాకుండా విజయాన్ని కూడా దూరం చేసుకుంటుంటారు.

* పరీక్ష హాల్లోకి కనీసం 20 నిమిషాలు ముందుగా వెళ్ళటం వల్ల వ్యక్తిగత వివరాలను నింపాదిగా నింపటం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

* ప్రశ్నపత్రం ఇవ్వగానే పరీక్ష సిరీస్‌ కోడ్‌ లాంటి సమాచారాన్ని ముందుగా నింపండి.

* మొదటి పేజీ సమాచారం పూర్తయిన తర్వాతే ప్రశ్నల వంక చూడటం ప్రారంభించండి.

* ఒక ప్రశ్నకు సమాధానం గుర్తించగానే వెంటనే ఓఎంఆర్‌ షీటులో సంబంధిత ప్రశ్నకు ఎదురుగా ఉన్న వృత్తాన్ని నింపాలి. ప్రశ్నపత్రంపై సమాధానాలు గుర్తించి, చివర్లో అన్నీ ఒకేసారి నింపుదామనుకోవటం సరికాదు.

సమాధానాలు ఎలా?
* జనరల్‌స్టడీస్‌ పేపర్లో బాగా సులభమనుకున్న విభాగపు ప్రశ్నలను ముందుగా సాధిస్తే ప్రేరణ పెరుగుతుంది. అయితే వీలైనంతవరకూ మొదటి ప్రశ్న నుంచి గుర్తించటం వల్ల ఒక్కో విభాగపు ప్రశ్నలు ఎక్కడున్నాయో వెతుక్కోవటానికి పట్టే సమయం వృథా కాకుండా ఉంటుంది.

* అన్ని ప్రశ్నలకూ సమాన మార్కులే కాబట్టి ఒక ప్రశ్న చదవగానే సరైన సమాధానం గుర్తించగలమా లేదా అనేది సెకన్ల వ్యవధిలోనే నిర్థారించుకోవాలి. కొంత సమయం తర్వాతనైనా సాధించగలమనుకుంటే అలాగే చేయటం ఉత్తమం.

* సమాధానం కచ్చితంగా 'తెలియదు' అనుకుంటే సమయం వ్యర్థం చేసుకోకుండా తోచిన సమాధానాన్ని ఓఎంఆర్‌ షీట్లో గుర్తించెయ్యటం మంచిది.

* రెండో రౌండులో సాధించదల్చుకున్న ప్రశ్నల వద్ద ఏదైనా గుర్తు పెట్టుకుంటే వాటికోసం వెతికే సమయం తగ్గుతుంది. ఇలా వదిలే ప్రశ్నల సంఖ్య తక్కువుండేలా చూసుకోవాలి.

* ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో 'సరైన సమాధానం కానిది ఏది' అంటూ చూసుకుంటూపోతే (ఎలిమినేషన్‌) మంచి ఫలితాలు సాధించవచ్చు. సరికానివి వదిలెయ్యటం ద్వారా సరైన జవాబును గుర్తించటం తేలికవుతుంది.

మరింత మెరుగైనదే సరైనది
ప్రశ్న చదివాక ఒక సమాధానం చూడగానే కచ్చితం అనిపించొచ్చు. కానీ మిగిలినదానిలో మరోటి 'మరికొంచెం కచ్చితం' అనిపిస్తే? దాన్నే సమాధానంగా గుర్తించాలి.

* 73వ రాజ్యాంగ సవరణ ఎన్ని అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రతిపాదించింది?

ఎ) 2 అంచెలు బి) 3 అంచెలు సి) స్పష్టంగా పేర్కొనలేదు డి) 3 అంచెలు; ఏదైనా రాష్ట్రంలో జనాభా 20 లక్షలలోపుంటే రెండు అంచెలు

ఎ, బి- రెండూ సరైనవే. అయితే డి సమాధానంలో మరింత కచ్చితత్వం ఉంది. కాబట్టి అదే సరైన జవాబు!

గ్రూప్‌-1 మెయిన్స్‌ నేపథ్యంలో...
ఇటీవల జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల ప్రశ్నల తీరుతెన్నులు గ్రూప్‌-2లో కూడా పునరావృతం అవ్వొచ్చు. దాన్ని ఎదుర్కొనే వ్యూహం అభ్యర్థుల వద్ద ఉండాలి.

* గ్రూప్‌-1లో వ్యాస రూప ప్రశ్నల్లో ఊహించనివిధంగా స్థూల అవగాహన అవసరమైన ప్రశ్నలను అడిగారు. ఈ అవగాహన లేకుండా ఏవో కొన్ని వ్యాసాలు ముక్కునపెట్టుకు వెళ్ళినవారు డీలా పడ్డారు. గ్రూప్‌-2లో కూడా స్థూల అవగాహనపై ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. అందుకని విహంగవీక్షణంతో స్థూల అవగాహన పెంచుకోవాలి.

* ఏపీ చరిత్రలో ప్రధానంగా లలితకళలు, సాహిత్యం లాంటివాటికి ప్రాధాన్యం ఇచ్చారు. గ్రూప్‌-2 2008లో కూడా ఇదే ధోరణి. ఈసారి కూడా ఇది కొనసాగవచ్చు.

* తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో తెలంగాణా సాంఘిక సాంస్కృతిక చైతన్య ప్రాముఖ్యం, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు దారితీసిన క్రమం, సంఘటనలపై కూడా ప్రశ్నలు వచ్చాయి. గ్రూప్‌-2 అభ్యర్థులు ఇలాంటి కోణాలను కూడా క్షుణ్ణంగా స్పృశించటం మంచిది.

* పాలిటీ ప్రశ్నలు కూడా అనువర్తన కోణంలోనే గ్రూప్‌-1 మెయిన్స్‌లో అడిగారు. 2008 గ్రూప్‌-2లో ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. ఈసారి కూడా దాదాపుగా అదే ధోరణి కొనసాగవచ్చు. అయితే విశ్లేషణాత్మక అంశాలపై ఒత్తిడి పెరిగినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి.

* ఎకానమీ పేపర్లో గణాంక సమాచారం కంటే స్థూల అవగాహనకే గ్రూప్‌-1 మెయిన్స్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే గ్రూప్‌-2 ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి స్థూల అవగాహనతో ప్రశ్నలు రాకపోవచ్చు. కాబట్టి కొంతమేర గణాంక ప్రభావం ఉండొచ్చు. అంతమాత్రం చేత గణాంకాలే ప్రిపరేషన్‌కు ఆధారం కారాదు. ఏపీ ఎకానమీ ప్రాథమికాంశాలు కీలకంగా భావించి అధ్యయనం మెరుగుపరచుకోవాలి.

* గ్రూప్‌-1 మెయిన్స్‌ వ్యాసరూప ప్రశ్న సరిగా రాయలేదని చాలామంది తర్వాతి పరీక్షలకు హాజరు కాలేదు. అది సరికాదని వేరే చెప్పనవసరం లేదని గ్రూప్‌-2 అభ్యర్థులు గుర్తించాలి. కఠినంగా ఉంటే అది అందరికీ వర్తిస్తుంది. ఒక పేపర్లో మార్కులు తగ్గినా మరో పేపర్లో పెరగవచ్చు. అందుకని వెనుకంజ వేయకుండా చివరివరకూ పోరాడటం అవసరం.

* మొత్తమ్మీద గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రశ్నల్లో కొన్ని హైస్కూలు విద్యార్థి కూడా రాసేలా ఉన్నాయి. మరికొన్ని దినపత్రికల సమాచారంతో రాయగలిగేలా ఉన్నాయి. కొన్ని అనువర్తన కోణంలో మాత్రమే రాసేలా ఉన్నాయి. గ్రూప్‌-2 ప్రశ్నలు కూడా స్థూలంగా (ప్రాథమికాంశాలు) బేసిక్స్‌+ అనువర్తనం ఆధారంగా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా మానసికంగా సన్నద్ధమైతే విజయం తథ్యం!

* చివరిగా... చదివినదానిలోనే ప్రశ్నలు వస్తాయని భావించి కంగు తినొద్దు. ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానం గుర్తించగలనని భావించి పరీక్షకు హాజరవటం శ్రేయస్కరం.

ఐఐటీ బాటలో... తొలి మలుపు!

ఐటి-జెఇఇ 2012 నోటిఫికేషన్‌ విడుదలైంది.

గత ఏడాది ఐఐటి-జెఇఇ పేపర్‌ని పోల్చుకుంటూ సాధించాల్సిన మార్కులూ, దానికి అవసరమైన ప్రణాళికపై దృష్టి పెట్టే తరుణమిదే. ఐఐటీ బాటలో ఈ తొలి మలుపు విద్యార్థులు సాధించబోయే గెలుపునకు నాంది అంటున్నారు పి.వి.ఆర్.కె. మూర్తి !

ఈఏడాది ఐఐటీ- జేఈఈలో విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. దీంతో తాము రాయాల్సింది ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనా, కాదా అంటూ విద్యార్థుల్లో ఒక రకమైన ఉత్కంఠ ఏర్పడింది. అయితే పరీక్షా విధానం మారే అవకాశాలు లేవని నిపుణుల వాదన.


ఎందుకంటే... ప్రపంచంలోని అన్ని పోటీ పరీక్షలూ ఆబ్జెక్టివ్‌ విధానంలోకి మారుతున్నాయి. గతంలో ఐఐటి-జెఇఇ రాసే విద్యార్థుల సంఖ్య 50 వేల లోపే ఉండేది. కాబట్టి పేపర్లు దిద్దటం కష్టమయ్యేది కాదు. ఇప్పుడు 4-5 లక్షల మంది ఈ పరీక్ష రాస్తున్నారు. అన్ని పేపర్లు దిద్దడానికి కావలసిన నిపుణులు అందుబాటులో లేకపోవటం; సబ్జెక్టివ్‌ విధానంలో ఒక అధ్యాపకునికీ వేరొక అధ్యాపకునికీ పేపర్‌ దిద్దడంలో ఏర్పడే తేడా... వీటన్నిటి దృష్ట్యా ఐఐటి-జెఇఇ 2012 పేపరు ఆబ్జెక్టివ్‌ విధానంలోనే గత సంవత్సరం మాదిరే వెలువడనున్నదని విద్యావేత్తల అంచనా.

మార్పులేమిటి?
2011తో పోల్చుకుంటే 2012లో జరిగిన ముఖ్య మార్పులు...

*  ఐఐటి-జెఇఇ దరఖాస్తు ఫారం వెల గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది- రూ. 1,000 నుంచి రూ. 1,800కు! ఒకవేళ విద్యార్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రూ. 1,600 అవుతుంది.

*  బాలికలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దరఖాస్తు రుసుమును వారికి మినహాయించారు. అంటే బాలికలందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

*  ఓఆర్‌ (ఆప్టిక్‌ రెస్పాన్స్‌) షీట్లలో గత సంవత్సరం వరకూ పెన్సిల్‌తోనే మార్కు చేయించేవారు. కానీ ఈ ఏడాది పెన్‌తో చేయాల్సి ఉంటుంది.

*  పరీక్షలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో చేసిన మార్పు- పరీక్ష అయిన వెంటనే విద్యార్థి ప్రశ్నపత్రంతో పాటు జవాబులు గుర్తించిన ఓఆర్‌ఎస్‌ పేపరు కూడా తీసుకువెళ్లవచ్చు. దీనివల్ల విద్యార్థులు 'కీ' ప్రకటించిన వెంటనే ఎన్ని మార్కులు వస్తాయో నిర్థారణకు రావచ్చు.

*  పరీక్ష జరిగిన 20 రోజులలోపు సరైన జవాబుల కీ విడుదలవుతుంది.

ఇవీ స్థూలంగా ఈ ఏడాది జరిగిన మార్పులు. ఇవి తప్ప మిగిలినవన్నీ 2011లో ఐఐటి-జెఇఇలో మాదిరే ఉంటాయి.
2012లో జరిగే పరీక్ష కూడా ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఈ రెండు పరీక్షల్లో ఏ సబ్జెక్టు ముందు ఇస్తారు; ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? అనేది విద్యార్థి పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం తెరిచిన తరవాత మాత్రమే అర్థమవుతుంది. పరీక్షాపత్రం ఎలా ఉన్నా విద్యార్థి రాయడానికి తయారై వెళ్లవలసి ఉంటుంది.

2011లో పేపరును విశ్లేషించుకుంటే విద్యార్థికి ప్రిపరేషన్‌ ప్రణాళిక సులభమవుతుంది. 2011లో జరిగిన ఐఐటి-జెఇఇ పరీక్షకు 131 నగరాల్లో 1051 సెంటర్లలో 4,85,562 మంది విద్యార్థులు రిజిస్టరు చేసుకున్నారు.

2011లోని పేపర్‌లో మొత్తం పది రకాలైన ప్రశ్నల్లో రెండు పేపర్లలోనూ కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ వరుసలో పేపర్లు ఇచ్చారు.

*  మొదటి పేపర్‌లో ప్రతి సబ్జెక్టులో 23 ప్రశ్నలతో మొత్తం 69 ప్రశ్నలు, 240 మార్కులకు ఇచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రశ్నలది ఒకే క్రమం.






ఈ పేపర్లో రుణాత్మక మార్కులు 24 మాత్రమే. 56 మార్కులకు నెగెటివ్‌ మార్కులు లేవు. అంటే పేపరు 1, 2లను కలిపిచూస్తే 100 మార్కుల వరకూ రుణాత్మక మార్కులు లేవు. 62.5 శాతం ప్రశ్నలు విద్యార్థులకు జవాబులు తెలియకపోయినా ఛాన్స్‌ తీసుకునే అవకాశం ఏర్పడింది. '2011లో పేపరు బాగా తేలికగా వచ్చింది' అని చెప్పుకోవడానికి కారణమిదే.

ఇంతవరకు జరిగిన ఐఐటి-జెఇఇల్లో తొలిసారి 2011 పేపరులో మల్టిపుల్‌ ఆన్సర్‌ టైప్‌, ఇంటెజర్‌ ఆన్సర్‌ టైప్‌, మ్యాట్రిక్స్‌ మ్యాచింగ్‌ తరహా ఒకే పేపరులో ఇచ్చారు. అంటే విద్యార్థి ఎక్కువగా ఇబ్బంది పడే ఈ మూడు రకాల ప్రశ్నలను ఒకే ప్రశ్నపత్రంలో ఇచ్చారు. పేపరు-1తో పోల్చుకుంటే పేపరు-2 కొంత క్లిష్టంగా ఉందని నిపుణుల అభిప్రాయం.