ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 3 November 2011

విద్యార్థి వీసాకు విధి విధానాలు


విదేశాల్లో చదవదల్చిన విద్యార్థులకు వీసా మంజూరు విషయంలో దేశాలను బట్టి పద్ధతులూ మారుతుంటాయి. అవసరమైన పత్రాలు, నిబంధనలు, విధానాలు నిర్దిష్టంగా తెలుసుకుని విద్యార్థులు ముందడుగు వేయాలి. ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకుని సమగ్ర వివరాలతో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ప్రయాసా లేకుండా వీసా పొందవచ్చు. ఈ సందర్భంగా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు అవసరమో శుభకర్ ఆలపాటి వివరిస్తున్నారు!


యు.ఎస్‌.ఎ. లాంటి కొన్ని దేశాలను మినహాయిస్తే ఎక్కువ దేశాల్లో విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవసరం లేదు. సంబంధిత హైకమిషన్‌/కాన్సలేట్‌ నిర్దేశించిన పత్రాలను సమర్పించే డ్రాప్‌ బాక్స్‌ పద్ధతి సరిపోతుంది. ఇంటర్వ్యూ లేకుండానే వీసా మంజూరు చేస్తారు కాబట్టి డాక్యుమెంట్లదే కీలకపాత్ర అవుతుంది. అందుకే వాటిని సమర్పించేటపుడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది.



వీసా దరఖాస్తులో కీలక సారాంశం రెండు అంశాలపై ఆధారపడివుంటుంది. ఎ) విద్యార్థి ప్రొఫైల్‌ బి) ఫైనాన్షియల్‌ డాక్యుమెంటేషన్‌

ఎ) విద్యార్థి ప్రొఫైల్‌
ఏ దేశమైనా తమ విద్యాసంస్థలకు వచ్చి చదువుకునే విద్యార్థులు ఉత్తమ నేపథ్యంతో ఉండాలని ఆశించటం సహజం. అంటే అత్యుత్తమ మార్కుల శాతం, మంచి గ్రేడ్‌లు మాత్రమే ఉండాలని కాదు. ఆ విద్యార్థులు అంతరాయం లేకుండా చదువు సాగించాలనీ, చదువు ముగిసిన తర్వాత వర్క్‌ అనుభవం కొనసాగించాలనీ ఆశించటం. ఈ కారణం వల్లనే సమర్పించే డాక్యుమెంటేషన్‌ వారిని మంచి విద్యార్థులుగా నిరూపించేలా ఉండటం చాలా ముఖ్యం.

అయితే చాలామంది సక్రమమైన, తగిన డాక్యుమెంట్లు సమర్పించటంలో విఫలమవుతుంటారు.
* ఎందరో విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్‌ తర్వాత షార్ట్‌టర్మ్‌ కోర్సులు, ఇతర ప్రిపరేటరీ కోర్సులు చేస్తుంటారు. ఇవి 3 నెలల నుంచి ఏడాది వ్యవధితో ఉంటాయి. కాబట్టి ఈ కోర్సుల గురించి తెలిపే డాక్యుమెంటేషన్‌ లేకుంటే ఈ వ్యవధిలో విద్యార్థి ఖాళీగా ఉన్నాడనే నిర్థారణకు వచ్చే ప్రమాదముంది.

* విదేశాలకు వెళ్ళటానికి ముందు చాలామంది విద్యార్థులు కొన్ని నెలలపాటు తాత్కాలికంగా పనిచేస్తుంటారు. అయితే ఆ ఎక్స్‌పీరియన్స్‌ లెటర్‌, సర్వీస్‌ సర్టిఫికెట్లను సమర్పించటంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతుంటారు.

ఇలాంటి ధోరణి సమాచార లోపాన్ని సృష్టిస్తుంది. అందుకే విద్యార్థులు స్వల్ప వ్యవధులకు సైతం డాక్యుమెంటేషన్‌ విస్మరించకుండా ఉంటే వారి ప్రొఫైల్‌ సంపూర్ణంగా ఉంటుంది. ఈ తరహా చిన్న విషయాలే విద్యార్థి ప్రొఫైల్‌ను మెరుగ్గా మారుస్తాయి; వీసా పొందే అవకాశాలను అధికం చేస్తాయి.

బి) ఫైనాన్షియల్‌ డాక్యుమెంటేషన్‌
ఇది ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుంది. సంబంధిత దేశాల ఇమిగ్రేషన్‌ రెగ్యులేషన్స్‌ను బట్టి ఇది దేశానికీ, దేశానికీ- నిన్నటికీ రేపటికీ మారుతుంటుంది. దీనివల్ల విద్యార్థులు తికమకపడిపోతుంటారు. సరైన మార్గదర్శకత్వం లేక హై కమిషన్‌ అవసరాలకు తగ్గట్టుగా డాక్యుమెంటేషన్‌ చేయకపోతే వీసా చేజారినట్టే. అందుకే తగినవిధంగా డాక్యుమెంటేషన్‌ చేయటం చాలా అవసరం.

విద్యార్థులు తమ ప్రాథమిక లక్ష్యం గురించి సందేహాలకు అతీతంగా రుజువు చేసుకోవాలి. నకిలీ డాక్యుమెంటేషన్‌కు ఆస్కారం ఇవ్వకుండా సరైన పేపర్‌ వర్క్‌నే సమర్పించాలి. సమాచారలోపం వల్లనో, మరో కారణం వల్లనో తప్పుడు డాక్యుమెంటేషన్‌ సమర్పించటం మూలంగా వీసా తిరస్కరణకే అవకాశం ఎక్కువ.



టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ
కొన్ని దేశాలకు సంబంధించిన వీసా ప్రక్రియలో భాగంగా హైకమిషన్‌ లేదా కాన్సలేట్‌ నుంచి విద్యార్థులకు ఫోన్‌ కాల్‌ రావొచ్చు. విద్యార్థి ఉద్దేశాలూ, లక్ష్యాలను తెలుసుకోవటం దీని లక్ష్యం. అలాంటి సందర్భంలో విద్యార్థి తగిన సమాచారంతో సిద్ధమైవుండాలి. అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు చెప్పగలగాలి. వీసా పొందటానికి ఇది ముఖ్యమైన అంశమే. దీని ఆధారంగా కూడా వీసా లభించటం, లభించకపోవటం వుంటుంది. ఇటీవలి కాలంలో చాలా హైకమిషన్లు ఈ తరహా టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలకే మొగ్గు చూపుతూ విద్యార్థుల తీరును అంచనా వేస్తున్నాయి.

మొత్తమ్మీద కాన్సలేట్ల అవసరాలు గ్రహించటం, వాటికి అనుగుణంగా సిద్ధమవటం వీసాను అభిలషించే విద్యార్థులకు చాలా ముఖ్యం. దేశాలన్నీ తమ ఇమిగ్రేషన్‌ వెబ్‌సైట్లలో సంపూర్ణ సమాచారాన్ని ఉంచుతున్నాయి.

వాటిని క్షుణ్ణంగా చదవటం వల్ల విద్యార్థులు వివిధ అంశాలపై స్పష్టత ఏర్పరచుకోవచ్చు.

No comments:

Post a Comment