ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 14 November 2011

ఎస్సై ఉద్యోగాలకు సై!


రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈసారి భారీస్థాయిలో ఎస్‌ఐ (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

మొత్తం 2296 పోస్టులతో రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన జారీచేసింది.

సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌, ఎస్‌పీఎఫ్‌, తదితర కేటగిరీల్లో ఎస్‌ఐ ఖాళీలున్నాయి. మొత్తం ఖాళీల్లో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్స్‌ (ఎస్‌.ఎఫ్‌.ఒ.) కేటగిరీలో 21, మహిళలకు 230 సివిల్‌ ఎస్‌.ఐ. పోస్టులను కేటాయించారు.

ఎస్‌ఐ ఉద్యోగాలకు ఈసారి అభ్యర్థులు భారీగా పోటీపడే అవకాశం ఉంది. 2008 డిసెంబరు తర్వాత పోలీస్‌ శాఖ నుంచి నోటిఫికేషన్‌లు విడుదల కాలేదు. దీంతో గత మూడేళ్లలో డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన అభ్యర్థులతోపాటు ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏలాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చేసినవారు కూడా ఎస్‌ఐ పోస్టుల కోసం పోటీలో ఉంటారు.

గత నియామక పరీక్షతో పోల్చుకుంటే ఎస్‌ఐ ఉద్యోగాలకు సిలబస్‌, ఫిజికల్‌ టెస్ట్‌లలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ, ఎంపిక విధానంలో కొద్దిపాటి మార్పులు చేశారు.

ఇవేమిటంటే...

* పోలీస్‌ శాఖ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవడం.
* కనీస అర్హతలను (వయసు, విద్యార్హతలు) పరిశీలించిన తర్వాతే 5 కి.మీ. రన్నింగ్‌కు అనుమతిస్తారు. గత రిక్రూట్‌మెంట్లలో 5 కి.మీ. రన్నింగ్‌, ఈవెంట్స్‌ పూర్తయ్యాక హాల్‌ టికెట్‌ ఇచ్చే సమయంలో విద్యార్హతలు పరిశీలించేవారు. దీనివల్ల అభ్యర్థులకు ఐదారు నెలలు ప్రిపరేషన్‌ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. మారిన పద్ధతి వల్ల అభ్యర్థుల సమయం వృధా కాదు.
* ఒ.ఎం.ఆర్‌. జవాబు పత్రంలో సమాధానాలను బ్లాక్‌ లేదా బ్లూ పెన్నుతో గుర్తించడం (గతంలో పెన్సిల్‌ ఉండేది).
* పరీక్ష అనంతరం ఓఎంఆర్‌ షీట్‌ నకలు (కార్బన్‌ కాపీ)ని అభ్యర్థులు తీసుకెళ్లవచ్చు.
* గతంలో ప్రశ్నల్లో 4 చాయిస్‌లు ఉండేవి. వీటిని 5 చాయిస్‌లుగా మార్చారు.
* సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 5 కి.మీ. పరుగు, శారీరక సామర్థ్య పరీక్షలు జరపడం వంటి మార్పులు చేశారు. అభ్యర్థుల వేలి ముద్రలను సేకరించడం ప్రవేశపెట్టారు

అర్హతలు, శారీరక ప్రమాణాలు
ఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఓసీ, బీసీ అభ్యర్థులు 1 జులై 2011 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ పూర్తి చేసిన, పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా అర్హులు.
* వయసు: జనరల్‌ అభ్యర్థులకు 1 జులై 2011 నాటికి 21 సంవత్సరాలు పూర్తయి 25 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
* ఎత్తు: అన్ని కేటగిరీల అభ్యర్థులకు 167.6 సెం.మీ. ఉండాలి. ఎస్టీ ఏజెన్సీ ప్రాంతం వారికి 160 సెం.మీ. సరిపోతుంది.
* ఛాతీ: 81.3 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. విస్తీర్ణం పెరగాలి. ఎస్టీ ఏజెన్సీ ప్రాంతం వారికి 80 సెం.మీ. సరిపోతుంది. గాలి పీల్చినప్పుడు 3 సెం.మీ. విస్తీర్ణం పెరగాలి.
* ఎస్‌.ఎఫ్‌.ఒ. ఉద్యోగాలకు వయో పరిమితిలో సడలింపులు: జనరల్‌ అభ్యర్థులకు 1 జులై 2011 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.

మహిళా అభ్యర్థులకు శారీరక ప్రమాణాలు
* ఎత్తు: అన్ని కేటగిరీల వారికి 152.5 సెం.మీ. ఉండాలి. ఎస్టీ ఏజెన్సీ ఏరియా వారికి ఎత్తు 150 సెం.మీ. సరిపోతుంది.
* బరువు: అన్ని కేటగిరీల అభ్యర్థులు 40 కేజీలకు తగ్గకుండా ఉండాలి. ఎస్టీ ఏజెన్సీ ఏరియా అభ్యర్థులు 38 కేజీలకు తగ్గరాదు.

శారీరక సామర్థ్య పరీక్షలు (పురుషులకు)
కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు శారీరక సామర్థ్య పరీక్షలు ఒకే విధంగా ఉంటాయి. అభ్యర్థులు ముందుగా 5 కి.మీ. రన్నింగ్‌ 25 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఆ తర్వాత...
* 100 మీటర్ల పరుగు: 15 సెకన్లలో పూర్తి చేయాలి.
* లాంగ్‌ జంప్‌: 3.80 మీటర్లు దూకాలి.
* షాట్‌పుట్‌ (7.26 కేజీల బరువు): 5.60 మీటర్లు విసరాలి.
* హైజంప్‌: 1.20 మీటర్లు దూకాలి.
* 800 మీటర్ల పరుగు: 170 సెకన్లలో పూర్తి చేయాలి.

మహిళలకు శారీరక సామర్థ్య పరీక్షలు
ముందుగా ప్రాథమిక పరీక్ష అయిన 2.5 కి.మీ. పరుగు పందెం ఉంటుంది. దీన్ని 16 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కింది అంశాల్లో పోటీపడాలి.
* 100 మీటర్ల పరుగు: 18 సెకన్లలో పూర్తి చేయాలి.
* లాంగ్‌జంప్‌: 2.75 మీటర్లు దూకాలి.
* షాట్‌పుట్‌ (4 కేజీల బరువు): 4.50 మీటర్లు విసరాలి.

రాత పరీక్ష విధానం
సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ నియామకం కోసం నిర్వహించే రాతపరీక్షలో మొత్తం 4 పేపర్లుంటాయి. అవి...
* పేపర్‌ 1: ఇంగ్లిష్‌. ఇది వ్యాసరూప తరహా పేపర్‌. 100 మార్కులకు ఉంటుంది.
* పేపర్‌ 2: తెలుగు. ఇది కూడా వ్యాసరూప తరహాలో ఉంటుంది. దీనికి 100 మార్కులు కేటాయిస్తారు.
* పేపర్‌ 3: అర్థమెటిక్‌ అండ్‌ రీజనింగ్‌. ఇది ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నపత్రం. మొత్తం 200 మార్కులకు ఉంటుంది.
* పేపర్‌ 4: జనరల్‌ స్టడీస్‌: ఇది కూడా ఆబ్జెక్టివ్‌ తరహాలోనే 200 మార్కులకు ఉంటుంది.

పేపర్‌ 1, పేపర్‌ 2లలో అభ్యర్థుల భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వీటిలో కనీస అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది. జనరల్‌ అభ్యర్థులు 40 మార్కులు, బీసీ అభ్యర్థులు 35, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 మార్కుల చొప్పున సాధించాలి. ఈ పేపర్లలో లేఖా రచన, వ్యాసరచన, అనువాదం, కాంప్రహెన్షన్‌, పేరాగ్రాఫ్‌ రైటింగ్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, తదితర అంశాలుంటాయి. రాత పరీక్షను రెండు రోజులు నిర్వహిస్తారు.

* మొదటిరోజు ఉదయం పేపర్‌ 1 (ఇంగ్లిష్‌), మధ్యాహ్నం పేపర్‌ 2 పరీక్షలు ఉంటాయి. ప్రతి పరీక్షకు సమయం 3 గంటలు. రెండో రోజు ఉదయం పేపర్‌ 3, మధ్యాహ్నం పేపర్‌ 4 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు సమయం 3 గంటలు.


రాత పరీక్షకు ప్రాధాన్యం
ఎస్‌ఐ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు ఎక్కువగా చేసే పొరపాటు ఏమిటంటే... ముందుగా శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతూ, రాత పరీక్ష గురించి తర్వాత ఆలోచిద్దాం అనే ధోరణిలో ఉంటారు. ఈ ఆలోచన వల్ల ఎక్కువమంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశం కోల్పోతున్నారు. శారీరక సామర్థ్య పరీక్షలు ముగిసిన తర్వాత రాత పరీక్షకు 40 నుంచి 45 రోజుల సమయం కంటే ఎక్కువ ఉండదు. అందువల్ల ఇప్పటినుంచే రాత పరీక్షకు సమయం కేటాయించి చదువుకోవాలి.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు రెండింటికీ ఒకే విధమైన ప్రిపరేషన్‌ సరిపోతుంది. రెండు రకాల ఉద్యోగాలకు శారీరక సామర్థ్య పరీక్షలు ఒకే విధంగా ఉంటాయి. రాత పరీక్షల్లో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. దేనికీ ఇంటర్వ్యూలు ఉండవు. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మొదటినుంచే శారీరక సామర్థ్య పరీక్షలతోపాటు రాత పరీక్షకు అధిక ప్రాధాన్యం ఇస్తేనే ఉద్యోగం సాధించగలరు.


No comments:

Post a Comment