ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday, 20 November 2011

ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ మేలు?


బీటెక్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌) చదువుతున్నాను. తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఏ స్పెషలైజేషన్లతో ఎంబీఏ చేస్తే ప్రయోజనం ఉంటుంది?
- జి. ప్రసన్నకుమార్‌, విశాఖపట్నం

బీటెక్‌ పూర్తయ్యాక ఎంబీఏ చేయడం ద్వారా మీ ఉద్యోగ అవకాశాలకు బాగా మెరుగుపరచుకోవచ్చు. సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాల ద్వారా మంచి కెరియర్‌ను అందుకోవచ్చు. ఎంబీఏలో అనేక ఫంక్షనల్‌ స్పెషలైజేషన్లు, సెక్టోరల్‌ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేన్ని ఎంచుకోవాలనే విషయంలో స్పష్టత అవసరం. మీ ఆసక్తి, అభిరుచిని బట్టి ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, తదితర ఫంక్షనల్‌ స్పెషలైజేషన్‌లను ఎంచుకోవచ్చు. కొన్ని ప్రత్యేక రంగాలపై ఆసక్తి ఉంటే సెక్టోరల్‌ స్పెషలైజేషన్లను తీసుకోవచ్చు. టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, మీడియా మేనేజ్‌మెంట్‌, మొదలైనవాటికి మంచి డిమాండ్‌ ఉంది. ఇవిగాక ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌, ఫారిన్‌ ట్రేడ్‌, ఐటీఈఎస్‌, తదితర రంగాలకు సంబంధించిన స్పెషలైజేషన్లు కూడా ఎంచుకోవచ్చు.

మంచి ప్రమాణాలు పాటించే బిజినెస్‌ స్కూల్‌లో మీకు నచ్చిన ఏ స్పెషలైజేషన్‌లో ఎంబీఏ చేసినా ప్రయోజనం ఉంటుంది. కొన్ని సంస్థల్లో డ్యుయల్‌ స్పెషలైజేషన్‌ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ కోర్సుల ద్వారా రెండు రంగాలకు సంబంధించిన మేనేజ్‌మెంట్‌ అంశాల్లో నైపుణ్యం సాధించవచ్చు.

* నేను ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలో బీబీఏ (ఫైనాన్స్‌) చదువుతున్నాను. బీబీఏ తర్వాత ఎంబీఏ చేయడం మంచిదేనా? బీబీఏతో ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
- కె. మధు, హైదరాబాద్‌

ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌తో బీబీఏ చేయడం మంచి ఆలోచన. బీబీఏ అభ్యర్థులకు ఆర్గనైజేషనల్‌ స్కిల్స్‌, మేనేజ్‌మెంట్‌ భావనలు, వ్యాపార క్రమశిక్షణ అంశాల్లో నైపుణ్యం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార ప్రణాళిక, ఆచరణాత్మక అంశాల్లో కూడా సామర్థ్యం ఉంటుంది. అందువల్ల సరైన సంస్థలో బీబీఏ చేసిన అభ్యర్థులకు ప్రస్తుతం కంపెనీలు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి.

బీబీఏ తర్వాత ఎంబీఏ చేయాలా, వద్దా అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి... మీ ఆప్టిట్యూడ్‌, కెరియర్‌ లక్ష్యాలు, ఆర్థిక అవసరాలు. బీబీఏ డిగ్రీతో ఏదైనా కంపెనీలు మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ లేదా ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీగా ఉద్యోగం సాధించవచ్చు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, కన్సల్టెన్సీ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, అడ్వర్టయిజింగ్‌, తదితర రంగాల్లోని కంపెనీలు బీబీఏ అభ్యర్థులకు మంచి వేతనాలతో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాయి. కనీస వేతనం రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. బీబీఏ పూర్తయ్యాక మంచి ఉద్యోగం రావాలంటే ఇప్పటినుంచే సాఫ్ట్‌స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ అంశాలపై దృష్టిపెట్టాలి. ఇంకా ఉన్నత కోర్సులు చేయాలనుకుంటే, ఎంబీఏ చదవచ్చు. క్యాట్‌, మ్యాట్‌, ఎక్స్‌ఏటీ, తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో మంచి స్కోరు సాధించి, పేరున్న సంస్థలో ఎంబీఏ చేయడం మంచిది. బీబీఏ తర్వాత రెండేళ్లు ఏదైనా కంపెనీలో పనిచేసి అనుభవం సాధించాక ఎంబీఏ చేయడం ఇంకా మంచిది. దీనికి నిబద్దత, అంకితభావం అవసరం.

* జీమ్యాట్‌ రాయబోతున్నాను. మనదేశంలోనే మంచి సంస్థలో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ జీమ్యాట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకునే సంస్థలను సూచించగలరు.
- ఆర్‌. నరేష్‌, గుంటూరు

జీమ్యాట్‌కు మనదేశంలో ఆదరణ పెరుగుతోంది. అనేక ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు జీమ్యాట్‌ను ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జీమ్యాట్‌ రాసే భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా www.mba.com/indiaపేరుతో ఓ అధీకృత వెబ్‌సైట్‌ ఉంది. వివిధ అంశాల్లో నాణ్యతా ప్రమాణాల ఆధారంగా బిజినెస్‌ స్కూళ్లను వర్గీకరించి జీమ్యాట్‌ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జీమ్యాట్‌ ఆధారంగా అంతర్జాతీయ స్థాయి బిజినెస్‌ స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకు ఈ వెబ్‌సైట్‌ చాలా ఉపయోగపడుతుంది. ఐఎస్‌బీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఐఎంలు, అనేక ఇతర ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ స్కూళ్లు జీమ్యాట్‌ స్కోరును ఆమోదిస్తున్నాయి. కొన్ని ప్రముఖ సంస్థలు... ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, హైదరాబాద్‌; ఇండియన్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంలు): అహ్మదాబాద్‌, బెంగళూరు, కలకత్తా, ఇండోర్‌, లక్నో; ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ, జంషెడ్‌పూర్‌; టాటా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ముంబాయి; ఎస్‌పీ జైన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, ముంబాయి; నార్సీ మోంజీ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ముంబాయి; ఐఐఎఫ్‌టీ, న్యూఢిల్లీ.

- ప్రొ. ఎం. భాస్కరరావు

No comments:

Post a Comment