ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday, 4 November 2011

బయోటెక్నాలజీలో పరిశోధన చేయాలంటే..?

* నేను ఎం.టెక్‌. (బయోటెక్‌) చేశాను. ప్రస్తుతం అధ్యాపకుడిగా పని చేస్తున్నాను. బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేయాలంటే ఏ పరీక్షలు రాయాలి?
- కె. ప్రశాంత్‌, కరీంనగర్‌

బయోటెక్నాలజీ, ఇతర సైన్స్‌ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేయడానికి జాతీయ స్థాయిలో అనేక ఫెలోషిప్‌ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రధానమైన పరీక్షలు.... సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌, డీబీటీ - జేఆర్‌ఎఫ్‌, గేట్‌, ఐసీఎంఆర్‌, ఐసీఏఆర్‌ నిర్వహించే పరీక్షలు. వీటిలో ఉత్తీర్ణులవడం ద్వారా జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) సాధిస్తే, జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థల్లో తేలిగ్గా పీహెచ్‌డీలో ప్రవేశం లభిస్తుంది. సీఎస్‌ఐఆర్‌, ఇతర ప్రభుత్వ విభాగాల పరిధిలో ఉండే పరిశోధన సంస్థలతోపాటు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ శాస్త్ర విజ్ఞాన సంస్థల్లో పీహెచ్‌డీ చేయవచ్చు.

 చాలా సెంట్రల్‌ యూనివర్సిటీలు పీహెచ్‌డీలో ప్రవేశానికి వేర్వేరుగా ఎంట్రన్స్‌ టెస్ట్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. ఈ మార్గంలో కూడా పీహెచ్‌డీలో ప్రవేశం పొందవచ్చు. జేఆర్‌ఎఫ్‌ సాధించిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ జేఆర్‌ఎఫ్‌, నెట్‌ అర్హతలు లేకపోతే ఏదైనా పరిశోధన సంస్థ లేదా యూనివర్సిటీ నిర్వహించే ప్రాజెక్టుల్లో చేరవచ్చు. కొంతకాలం ప్రాజెక్టులో పనిచేసిన అనుభవం సంపాదిస్తే పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుంది. వివిధ సంస్థల ప్రవేశార్హతలు, నిబంధనలను బట్టి పైన పేర్కొన్న జాతీయ స్థాయి పరీక్షలతో సంబంధం లేకుండా పీజీ అర్హతతో ప్రాజెక్టుల్లో పనిచేయవచ్చు.

 నేను ఇంటర్‌ (ఎంపీసీ) చదివాను. ఫిజిక్స్‌ అంటే బాగా ఇష్టం. ఈ సబ్జెక్టులో ఉన్నత కెరియర్‌కు అవసరమైన కోర్సులు, మంచి సంస్థలను సూచించగలరు.
- ఎస్‌. అవినాష్‌, గుంటూరు


* ఫిజిక్స్‌తో ఇంటర్మీడియట్‌ చదివాక ఉన్నత కోర్సులు చేయడానికి రెండు మార్గాలున్నాయి. అవి... బి.ఎస్‌సి. చేసిన తర్వాత ఐఐటీలు నిర్వహించే జామ్‌ పరీక్ష ద్వారా ఎం.ఎస్‌సి. ఫిజిక్స్‌, తర్వాత పీహెచ్‌డీ చేయడం ఒక మార్గం. ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ జేఈఈకి ఉన్నంత ప్రాధాన్యం జామ్‌కి లేదు. దీనివల్ల ఐఐటీల్లో ఎం.ఎస్‌సి. కోర్సుల్లో చేరుతున్న ఏపీ విద్యార్థులు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఐఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఇంజినీరింగ్‌ విద్యార్థుల మాదిరిగానే మంచి కెరియర్‌ను అందుకోవచ్చు.

ఫిజిక్స్‌లో ఉన్నత కెరియర్‌కు మరో మంచి మార్గం... ఇండియన్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లలో చేరడం. బేసిక్‌ సైన్సెస్‌లో ఉన్నత స్థాయి పరిశోధనలను ప్రోత్సహించడానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ సంస్థలను పుణె, మొహాలీ, కోల్‌కతా, భోపాల్‌, తిరువనంతపురంలలో ఏర్పాటుచేసింది.

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ సంస్థలు బి.ఎస్‌.-ఎం.ఎస్‌. ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను అందిస్తున్నాయి. మంచి ఫెలోషిప్‌ కూడా లభిస్తుంది. ఈ సంస్థల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌లో సాధారణంగా 90 శాతంపైనే మార్కులు అవసరం. ఐఐటీ-జేఈఈ, కేవీపీవై పరీక్షల్లో మంచి స్కోరు, రాష్ట్ర బోర్డుల నుంచి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఈ సంస్థల్లో సీట్లు లభించే అవకాశాలు ఎక్కువ.

వీటితోపాటు అనేక యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను అందిస్తున్నాయి. పరిశోధనల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు ఇవి మంచి కోర్సులు. ఇలాంటి సంస్థల్లో ప్రముఖమైనవి... బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి; కలకత్తా యూనివర్సిటీ; జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, కోల్‌కతా; సెంట్రల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌. సంబంధిత సంస్థల వెబ్‌సైట్లలో ప్రవేశ పద్ధతి, పరీక్ష విధానం, ఇతర వివరాలు లభిస్తాయి.

* నేను కర్ణాటకలో ఎం.ఎస్‌సి. (మెడిసినల్‌ కెమిస్ట్రీ) చేస్తున్నాను. తర్వాత అమెరికాలో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. అమెరికాలో మంచి సంస్థలను సూచించగలరు. ఫెలోషిప్‌లు లభిస్తాయా?
- ఎం. సతీష్‌, బెంగళూరు

సైన్సెస్‌లో ఉన్నత చదువులకు అమెరికాలో అనేక మంచి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో పీహెచ్‌డీ చేయాలంటే అత్యంత ముఖ్యమైనవి... మంచి అకడమిక్‌ రికార్డు, జీఆర్‌ఈ స్కోరు. జీఆర్‌ఈలో కనీసం 1200 పైన స్కోరు సాధిస్తే సీటు లభించవచ్చు. కానీ మంచి పేరున్న యూనివర్సిటీలో సీటు రావాలంటే ఇంకా మంచి స్కోరు (1300 పైన) అవసరం. కాబట్టి మీరు పీహెచ్‌డీ ఎక్కడ చేయబోతున్నారనేది చాలావరకు మీరు సాధించే జీఆర్‌ఈ స్కోరును ఆధారపడి ఉంటుంది.

అమెరికాలో ట్యూషన్‌ ఫీజులు, ఫెలోషిప్‌లు, ఇతర మార్గాల్లో ఆర్థిక సహాయం లభించడం అంశాలు యూనివర్సిటీని బట్టి వేర్వేరుగా ఉంటాయి. విద్యార్థి అకడమిక్‌ చరిత్ర, జీఆర్‌ఈ స్కోరు ఇందులో కీలకంగా పనిచేస్తాయి. మెడిసినల్‌ కెమిస్ట్రీలో పరిశోధనలు నిర్వహిస్తోన్న కొన్ని అమెరికన్‌ యూనివర్సిటీలు... ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ, లాంగ్‌ ఐలాండ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియా, సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ యార్క్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ద సైన్సెస్‌ ఇన్‌ ఫిలడెల్ఫియా, ఫ్లోరిడా ఎ అండ్‌ ఎం యూనివర్సిటీ, టెంపుల్‌ యూనివర్సిటీ.

*  ఎం.ఎస్‌సి. జువాలజీ చదువుతున్నాను. సీఎస్‌ఐఆర్‌ - యూజీసీ నెట్‌ రాయాలనుకుంటున్నాను. ఈ పరీక్ష ఎలా ఉంటుంది? ఏ పుస్తకాలు చదవాలి?
- రాజేష్‌, వరంగల్‌

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణులవడం ద్వారా దేశంలోని ప్రఖ్యాత సంస్థల్లో పరిశోధనలు చేయడానికి అవకాశం లభిస్తుంది. పరిశోధన కాలంలో మంచి ఫెలోషిప్‌ లభిస్తుంది. ప్రభుత్వ నిధులతో కొనసాగే సంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అవసరమైన లెక్చర్‌షిప్‌ అర్హత కూడా దీని ద్వారా లభిస్తుంది. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న సంస్థలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఈ పరీక్ష ఆధారంగా నేరుగా పరిశోధన కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తాయి. మీరు లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టులో సీఎస్‌ఐఆర్‌ రాయవచ్చు. సీఎస్‌ఐఆర్‌ పరీక్షలో ఒకే పేపర్‌ ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. ప్రశ్నపత్రం మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు.
ప్రశ్నపత్రంలో 3 భాగాలుంటాయి. అవి... పార్ట్‌ ఎ: ఇందులో జనరల్‌ సైన్స్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ అండ్‌ ఎనాలిసిస్‌, రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 20 ప్రశ్నలు ఇస్తారు. ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. పార్ట్‌-బి లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి 50 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. ఏవైనా 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. పార్ట్‌-సి లో ప్రశ్నలు చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా ఉంటాయి. శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి అభ్యర్థి అవగాహనను, భావనల్లో పట్టును, అనువర్తిత జ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఇస్తారు. ఏవైనా 25 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

అభ్యర్థులకు సబ్జెక్టులోని ప్రాథమిక భావనలపై బాగా పట్టు ఉండాలి. 8వ తరగతి పాఠ్యాంశాల నుంచి పీజీ వరకు సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలను క్షుణ్నంగా చదవాలి. పాఠ్య పుస్తకాలను చదవడంతోపాటు నమూనా ప్రశ్రపత్రాలు, పాత ప్రశ్న పత్రాలను బాగా సాధన చేయాలి.

*  బి.ఫార్మసీ పూర్తిచేశాను. ఎం.ఎస్‌సి. క్లినికల్‌ రిసెర్చ్‌ లేదా ఎం.ఫార్మసీ చేయాలనుకుంటున్నాను. ఈ రెండింటిలో ఏది మంచిది?
- ఎన్‌. రాజ్‌కుమార్‌, హైదరాబాద్‌

మీరు పేర్కొన్న రెండు (ఫార్మా, క్లినికల్‌ రిసెర్చ్‌) కెరియర్‌లకూ అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. క్లినికల్‌ రిసెర్చ్‌తో పోల్చుకుంటే ఎం.ఫార్మసీ స్థిరంగా ఎదుగుతోంది. ఈ రెండు సబ్జెక్టుల్లోనూ ఉన్నత కోర్సులు చేసినవారికి భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించవచ్చు. క్లినికల్‌ రిసెర్చ్‌కి ఉద్యోగ అవకాశాల పరిధి కొంత పరిమితం. వైద్య రంగం, సంబంధిత విభాగాల్లో పనిచేసే ప్రొఫెషనల్స్‌కు క్లినికల్‌ రిసెర్చ్‌ కోర్సుల వల్ల ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. ప్రత్యేక విభాగాలైన క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌, ఎనాలిసిస్‌లో బాగా ఆసక్తి ఉంటే క్లినికల్‌ రిసెర్చ్‌ వైపు వెళ్లవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... వీటిలో ఏ కోర్సు ఎంపిక చేసుకున్నా, విద్యాసంస్థ, కోర్సు నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సైన్సెస్‌, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఉద్యోగ అవకాశాలను చాలావరకు కాలేజీ పేరు ప్రతిష్ఠలు ప్రభావితం చేస్తాయి. అధ్యాపక సిబ్బంది, సౌకర్యాలు, ప్లేస్‌మెంట్‌ విషయంలో విద్యాసంస్థ నుంచి సరైన సహకారం, మొదలైన అంశాలను జాగ్రత్తగా పరిశీలించి కాలేజీని ఎంచుకోవాలి. ఫార్మా కోర్సులకు నైపర్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌) లాంటి పేరున్న సంస్థల్లో సీటు సాధించగలిగితే కెరియర్‌ బాగుంటుంది. ఈ సంస్థకు హైదరాబాద్‌లో కూడా కేంద్రం ఉంది. ఇందులో లభించే కోర్సుల వివరాలు, ప్రవేశ విధానం సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

- ప్రొ. యు.ఎస్.ఎన్. మూర్తి.

No comments:

Post a Comment