ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday, 24 November 2011

ఎస్‌.ఐ. రాత పరీక్షలో ఏవి ముఖ్యం?

దాదాపు మూడేళ్ల తర్వాత వెలువడిన ఎస్సై నియామక పరీక్షలకు అభ్యర్థులు గట్టిపోటీని ఎదుర్కొనబోతున్నారు. రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌బోర్డు నిర్వహించే పరీక్షల్లో ఎస్సై రాతపరీక్ష అత్యున్నతమైనది. ఈ పరీక్షను సవాలుగా తీసుకొని, ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతేనే ఉద్యోగం సాధించగలరు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌.ఐ.) నియామకాల కోసం నిర్వహించే రాత పరీక్షలో మొత్తం 4 పేపర్లుంటాయి. ఒక్కో పరీక్ష పేపర్‌ వ్యవధి 3 గంటలు.

సమాధానాలను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో మాత్రమే గుర్తించాలి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు, ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు గుర్తించినా అరమార్కు తీసేస్తారు.

ప్రతి పేపరులో కనీస మార్కులు ఉంటాయి. పేపర్‌ 1, పేపర్‌ 2లలో, కనీస మార్కులు సాధిస్తే సరిపోతుంది. పేపర్‌ 3, పేపర్‌ 4లు ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమంలో ఉంటాయి. అభ్యర్థి ఎందులోనైనా రాతపరీక్ష రాయవచ్చు.

పేపర్‌ 1, పేపర్‌-2
పేపర్‌ 1లో అభ్యర్థి ఇంగ్లిష్‌ భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ పేపరుకు సంబంధించిన ప్రతి అంశాన్ని తప్పకుండా రాయాలి. లేఖారచనలో ఫార్మాట్‌ అవసరం. పేరు, తేదీ, స్థలం అంశాలు మర్చిపోకుండా రాయాలి. జనరల్‌ ఎస్సే కోసం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధం ఉండే కొన్ని అంశాలు, ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి చదువుకుంటే సరిపోతుంది. అభ్యర్థికి గల కనీస భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించడం పేపర్‌ 1, పేపర్‌ 2 లక్ష్యం. ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి.

*  పేపర్‌ 2 తెలుగు భాషకు సంబంధించినది. తెలుగు భాషను సరిగా వాడటం, రాయడంలో సామర్థ్యాలను ఇందులో పరీక్షిస్తారు. షార్ట్‌ ఎస్సే, కాంప్రహెన్షన్‌, లెటర్‌ రైటింగ్‌, పేరాగ్రాఫ్‌ రైటింగ్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదం, తదితరఅంశాలపై ప్రశ్నలుంటాయి.

పేపర్‌ 3- అర్థమెటిక్‌, రీజనింగ్‌
ఈ పేపర్‌లో సంఖ్యలు వాటి ధర్మాలు, స్థాన విలువ, ముఖ విలువ, భాజనీయత సూత్రాలపై పట్టు సాధించాలి. బారువడ్డీలో కాలము, వడ్డీ, వడ్డీరేటు, అసలులలో ఏదో ఒకటి కనుక్కోవలసి ఉంటుది. వీటిని బాగా సాధన చేయాలి. సంవత్సరానికి, అర్థ సంవత్సరానికి, 3 నెలలకు, కొన్ని రోజులకు చక్రవడ్డీని లెక్కించడం, అదే విధంగా బారువడ్డీ, చక్రవడ్డీ మధ్య సంబంధంపై ఉండే ప్రశ్నలను సాధన చేయడం తప్పనిసరి.

* నిష్పత్తి- అనుపాతములో మిశ్రమ నిష్పత్తి, వర్గ నిష్పత్తి, ఘన నిష్పత్తి, విలోమ నిష్పత్తి, రెండు నిష్పత్తులకు ఒక సంఖ్య కలపడం లేదా తీసివేయడం మొదలైన ప్రశ్నలను సాధన చేయాలి.

* సగటులో సహజ సంఖ్యల సగటు, సగటు వేగం, ప్రధాన సంఖ్యల సగటు, సరి లేదా బేసి సంఖ్యల సగటు, తరగతిలోని విద్యార్థుల సగటు, మొదలైన అంశాలు ముఖ్యమైనవి.

* శాతం పాఠ్యాంశంలో పెరిగిన లేదా తగ్గిన శాతం, ఒక సంఖ్య మరో సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ, తదితర ప్రశ్నలు ఉంటాయి.

* లాభనష్టాలలో... ఒక వస్తువు కొన్న ధరకంటే ఎక్కువ లేదా తక్కువ ధరకు అమ్మితే వచ్చిన లాభం లేదా నష్టం అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

* కాలము-పనిలో... ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక పనిని కొన్ని రోజులలో చేసినట్లయితే, అందరు కలిసి ఎన్నిరోజులలో చేయగలరు? వచ్చిన డబ్బును ఏ విధంగా పంచుకోవాలి? మొదలైన అంశాలను సాధన చేయాలి.

* పని- వేతనం, కాలం -దూరం అంశాలపై కూడా ప్రశ్నలుంటాయి. కాలం-దూరం అంశంలో వేగం- దూరం - కాలం, సాపేక్ష వేగం, పరుగు పందేలు, తదితర ప్రశ్నలడగవచ్చు.

 * గడియారం, క్యాలెండర్‌, భాగస్వామ్యం, క.సా.గు., గ.సా.భా, వైశాల్యములు, ఘనపరిమాణములు, వయసులు, మొదలైన అంశాలపై కూడా ప్రశ్నలు అడగవచ్చు.

ఈ విభాగంలోని అంశాల కోసం 6, 7, 8, 9 తరగతుల్లోని గణిత పుస్తకాలను బాగా సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌, క్వికర్‌ మేథ్స్‌, టాటా మెక్‌గ్రాహిల్‌ పుస్తకాలను చదవాలి. ఆర్‌ఆర్‌బీ, ఐసెట్‌, క్యాట్‌ పరీక్షల్లో గతంలో అడిగిన ప్రశ్నలను సాధన చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.

రీజనింగ్‌లో ఏవి ముఖ్యం?
* వెర్బల్‌ రీజనింగ్‌లో దిశాత్మక పరీక్ష, కోడింగ్‌, డీకోడింగ్‌, పరిమాణ పరీక్ష, ర్యాంకింగ్‌ పరీక్ష, మిస్సింగ్‌ నంబర్‌, పోలిక, భిన్న పరీక్ష, గణిత పరీక్షలు, అక్షరమాల, నంబర్‌ సిరీస్‌, లాజికల్‌ వెన్‌ చిత్రాలు, తదితర అంశాల నుంచి ప్రశ్నలు రావచ్చు.

* నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌: ఇందులో పాచికలు, దర్పణ (అద్దం) ప్రతిబింబాలు, నీటి ప్రతిబింబాలు, శ్రేణులు, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, మొదలైన అంశాలు ముఖ్యమైనవి.

* లాజికల్‌ రీజనింగ్‌: ఇందులో ఊహనలు, ప్రకటనలు, తీర్మానాలు, తర్కవాదం, మొదలైన అంశాలను బాగా నేర్చుకోవాలి. ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌, టాటా మెక్‌గ్రాహిల్‌ రీజనింగ్‌ పుస్తకాలను బాగా చదివితే సరిపోతుంది.

జనరల్‌ స్టడీస్‌లో...
పేపర్‌-4 జనరల్‌ స్టడీస్‌కు సంబంధించింది. ప్రామాణిక జి.కె., కరెంట్‌ అఫైర్స్‌ అంశాలు ఇందులో చాలా ముఖ్యమైనవి. స్టాండర్డ్‌ జి.కె.లో సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అవార్డులు, బహుమతులు, క్రీడలు, విజేతలు, వార్తల్లోని వ్యక్తులు, ప్రధాన నియామకాలు, ప్రముఖ వ్యక్తుల మరణాలు, రాజీనామాలు, ప్రముఖుల పర్యటనలు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు, శాస్త్ర సాంకేతిక విశేషాలు, తదితర అంశాలపై ప్రశ్నలడుగుతారు.

* తీవ్రవాద సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ సామాజికాభివృద్ధి కార్యక్రమాలు, క్షిపణులు, ప్రధాన ఉద్యమాలు, పురాతన కట్టడాలు, మొదలైన అంశాలను కూడా చదవాలి. ఈ అంశాల కోసం ప్రముఖ దినపత్రికలు, టీవీలోని ముఖ్యమైన వార్తలను నోట్‌ చేసుకోవాలి.

* ఈ పేపర్‌లో భారతదేశ చరిత్ర -సంస్కృతి నుంచి ప్రశ్నలుంటాయి. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి జైనులు, బౌద్ధులు, సింధు, ఆర్య నాగరికతలు మొదలైనవి ముఖ్యమైన అంశాలు. ఆధునిక భారతదేశ చరిత్రలో... 1857 సిపాయిల తిరుగుబాటు, బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణ, జాతీయోద్యమాలు; మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి రాజవంశాలు, ఢిల్లీ సుల్తానులు మొదలైన పాఠ్యాంశాలు బాగా చదవాలి. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర గురించి సిలబస్‌లో ప్రస్తావించకపోయినా, భారతదేశ చరిత్రలో అది భాగం కాబట్టి దీన్ని తప్పకుండా చదవాలి. ఈ అంశాల కోసం 6, 7, 8, 9, 10 తరగతుల్లోని చరిత్ర అంశాలను చదవాలి.

* భారతదేశ భౌగోళిక శాస్త్రంలో నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణస్థితి, నదులు, అడవులు, ఖనిజ వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, జనాభా మొదలైన అంశాలు ఉంటాయి. దీనిలో దేశ, రాష్ట్ర అంశాలను పట్టిక రూపంలో తయారుచేసుకొని చదివితే బాగా అర్థమవుతాయి. 6 నుంచి 10 తరగతుల్లోని జాగ్రఫీ పాఠ్యాంశాలు బాగా చదవాలి.

* భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ సంస్కరణలు, కేంద్ర, రాష్ట్ర పాలనా వ్యవస్థలు, ఐరాస, అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, ముఖ్యమంత్రి, ఎన్నికలు, మంత్రిమండలి, ఆర్థిక కమిషన్లు, పంచవర్ష ప్రణాళిక, బడ్జెట్‌, జనాభా వృద్ధిరేటు మొదలైన అంశాలను చదవాలి. 8 నుంచి 10+2 వరకు సివిక్స్‌, తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి.

* జనరల్‌ సైన్స్‌లో మానవ నిర్మాణం, వ్యాధులు, రక్త గ్రూపులు, విటమిన్‌లు, ఉపగ్రహాలు, భారత రక్షణ వ్యవస్థలోని యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, పరిశోధనలు, తదితర అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు.

- విష్ణువర్థన్ రెడ్డి

2 comments:

  1. రాత పరీక్ష మాట నాకంత తెలియదు, ఖచ్చితం గా మోత పరీక్షలో మాత్రం దుడ్డు కర్ర లో తర్ఫీదు మరీ ముఖ్యం!

    cheers


    zilebi.

    ReplyDelete
  2. ఇన్వెష్టిగేషన్ పద్ధతులు నేర్చుకోవటానికి ముందు సెలక్ట్ అవ్వాలి కదా? :)) అందుకు రాత పరీక్ష గురించి బాగా పట్టించుకోవాల్సిందే!

    ReplyDelete