ప్రపంచంలో అత్యధిక వేతనాలు అందిస్తోన్న కెరియర్‌లలో ముఖ్యమైనది... హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్.
వంటలు చేయడం, హోటళ్లను అందంగా తీర్చిదిద్దడం లాంటివి చాలామందికి గొప్ప కెరియర్‌గా అనిపించకపోయినా, భారీ సంఖ్యలో నియామకాలతో అగ్రశ్రేణి కెరియర్‌గా హాస్పిటాలిటీ దూసుకెళుతోంది. హాస్పిటాలిటీ, సంబంధిత కోర్సులు చేసిన అభ్యర్థులకు హోటళ్లే కాదు, సేవారంగంలోని అనేక బహుళజాతి కంపెనీలు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.
నియామకాల విషయంలో హాస్పిటాలిటీ పరిశ్రమ ఐటీ, ఐటీఈఎస్ రంగాలను అధిగమించడం విశేషం. ప్రముఖ కన్సల్టెన్సీ Ma Foi Randstad సంస్థ ఇటీవల నిర్వహించిన 'ఎంప్లాయ్‌మెంట్ ట్రెండ్ సర్వే'లో హాస్పిటాలిటీ పరిశ్రమ గత జులై- సెప్టెంబరు మధ్య 48 వేల మందిని నియమించుకున్నట్లు తేలింది. ఇదేకాలంలో ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో 46 వేలమందికి ఉద్యోగాలు లభించాయి. ఈ ఏడాది చివరికి ఇంకా 40 వేలమందికి హాస్పిటాలిటీ రంగంలో అవకాశాలు లభించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. కొత్త హోటళ్లు నెలకొల్పడానికి అనుమతుల కోసం అనేక సంస్థలు వేచిచూస్తున్నాయి. పెద్ద నగరాలతోపాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు హాస్పిటాలిటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీనివల్ల ఈ రంగంలో అవకాశాలు బాగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం మనదేశంలో ఏటా దాదాపు 10వేల మంది హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. సగటున ప్రతి నెలా ఒక కొత్త హోటల్ దేశంలో ప్రారంభమవుతోంది. అంతేగాక ప్రస్తుతం ఉన్న నిపుణుల కొరత, ఈ పరిశ్రమ నుంచి ఇతర సేవారంగాలకు వెళ్లే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుంటే డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఫుడ్, బేవరేజ్ సర్వీసెస్, కిచెన్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ విభాగాల్లో మరిన్ని ఉద్యోగాలు లభించనున్నట్లు వెల్లడించింది.
ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు పూర్తిగా భిన్నమైనది... హాస్పిటాలిటీ. ఇంజినీరింగ్, ఇతర సాధారణ డిగ్రీల మోజులో తక్కువమంది విద్యార్థులు ఈ కెరియర్ వైపు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు పెద్ద నగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాలకు కూడా పర్యాటకం, హోటల్ రంగాలు విస్తరిస్తున్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు ద్వారా లభించే శిక్షణ నౌకా రంగం నుంచి కాల్‌సెంటర్లలో ఉద్యోగాల వరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పౌర విమానయాన రంగంలో అనేక ఉద్యోగాలకు హాస్పిటాలిటీని ప్రధాన అర్హతగా పరిగణిస్తున్నారు. ఎయిర్ హోస్టెస్, ఫ్త్లెట్ స్టివార్టు, క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు హాస్పిటాలిటీ డిగ్రీ అవసరం.
* రైల్వేలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని క్యాటరింగ్ విభాగాల్లో హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన అభ్యర్థులు ఉపాధి పొందవచ్చు. ఆరోగ్య సేవల రంగంలో పనిచేసే బీపీఓల్లో కూడా అవకాశాలుంటాయి.
* హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు చేసినవారికి ఎక్కువగా లభించే ఉద్యోగాలు... హోటళ్లలో ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్, రెస్టారెంట్ మేనేజర్ ఉద్యోగాలు.
బహుళజాతి కంపెనీల్లో...
హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ కోర్సులు చేసినవారికి కార్పొరేట్ హోటళ్లలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలుంటాయి. ఒబెరాయ్స్, తాజ్ గ్రూప్ హోటళ్లు, ఐటీసీ షెరటాన్, ఐటీసీ ఫార్చ్యూన్ హోటళ్లు ఎక్కువగా నియామకాలు చేపడుతున్నాయి. వెల్‌కమ్, తాజ్ లాంటి ప్రైవేటు హోటళ్లు స్వయంగా శిక్షణ సంస్థలను నెలకొల్పాయి. ఐటీసీ, మేరియట్ ఇంటర్నేషనల్, లీలా వెంచర్స్, తదితర గ్రూప్‌లు ప్రస్తుతం విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నందున మరిన్ని అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. హెచ్‌ఎస్‌బీసీ, జీఈ, డెల్ కంప్యూటర్స్ లాంటి బహుళజాతి కంపెనీల్లో కేటరింగ్ విభాగాల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చు.
* హాస్పిటాలిటీ రంగంలో పెరుగుతోన్న పోటీని దృష్టిలో ఉంచుకొని శిక్షణలో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటాలిటీ నిపుణులకు వ్యాపార అంశాల్లో కూడా అవగాహన అవసరం. అందుకే బిజినెస్ ప్లానింగ్, పబ్లిక్ రిలేషన్స్, ఎంప్లాయీస్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ లాంటి అంశాల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు.
జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష
ఇటీవలి కాలంలో హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులను అందిస్తోన్న సంస్థల సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ కోర్సులకు 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్,
క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్' (ఐహెచ్‌ఎం) చాలా పేరుపొందిన సంస్థ. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 24 శాఖలున్నాయి. హైదరాబాద్‌లో కూడా దీని కేంద్రం ఉంది. ఈ సంస్థ అందించే బి.ఎస్‌సి. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశానికి దేశవ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) నిర్వహిస్తారు.
జేఈఈ ద్వారా దేశవ్యాప్తంగా 7787 సీట్లు భర్తీకానున్నాయి. ఐహెచ్‌ఎంలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థలు, ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్‌లలో చేరడానికి కూడా జేఈఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 52 సంస్థలు జేఈఈ ద్వారా సీట్లను భర్తీచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఐహెచ్‌ఎంలో 242 సీట్లున్నాయి.
పరీక్ష ఎలా ఉంటుంది?
జేఈఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ఇందులో 5 విభాగాలు ఉంటాయి. అవి...
* న్యుమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్: 30 ప్రశ్నలు
* రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్: 30 ప్రశ్నలు
* జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: 30 ప్రశ్నలు
* ఇంగ్లిష్ లాంగ్వేజ్: 80 ప్రశ్నలు
* ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్: 30 ప్రశ్నలు
దేశంలోని అన్ని ఐహెచ్‌ఎం కేంద్రాల్లో దరఖాస్తులు లభిస్తాయి. ఎన్‌సీహెచ్‌ఎంసీటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 28 నవంబరు 2011 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రింటెడ్ దరఖాస్తుల అమ్మకం 5 డిసెంబరు 2011 నుంచి మొదలవుతుంది.
* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13 ఏప్రిల్ 2012
* జేఈఈ తేదీ: 28 ఏప్రిల్ 2012
* కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు: జూన్ మొదటివారం, 2012
No comments:
Post a Comment