ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday, 9 November 2011

కార్పొరేట్‌ అవకాశాలకు... కాస్ట్‌ అకౌంటెన్సీ


తంలో కొన్ని ప్రత్యేక కంపెనీలు మాత్రమే కాస్ట్‌ ఆడిటింగ్‌ చేసేవి. అకౌంటెన్సీ నిబంధనల్లో మార్పుల వల్ల గతంలో కంటే 15-20 శాతం కంపెనీలు ప్రస్తుతం కాస్ట్‌ ఆడిటింగ్‌ పరిధిలోకి వచ్చాయి. తద్వారా కాస్ట్‌ అకౌంటెంట్లకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. కాస్ట్‌ అకౌంటెన్సీ చేసినవారికి ఇటీవలి కాలం వరకు సాంప్రదాయ పరిశ్రమల్లోనే ఎక్కువగా ఉద్యోగాలు లభించేవి. ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్‌ రంగాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీలో నైపుణ్యం సాధిస్తుండటం ఉండటం వల్ల కాస్ట్‌ అకౌంటెంట్లకు అవకాశాలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం మనదేశంలో 55 వేల పైచిలుకు కాస్ట్‌ అకౌంటెంట్లు ఉన్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది సేవారంగంలోనే పనిచేస్తుండటం విశేషం. రాబోయే కొద్ది సంవత్సరాల్లో సుమారు 5 లక్షల మంది కాస్ట్‌ అకౌంటెంట్లు మనదేశంలో అవసరమవుతారని అంచనా.

భావనలపై పట్టు...
కాస్ట్‌ అకౌంటెన్సీ కోర్సులో త్వరగా విజయం సాధించాలంటే అభ్యర్థికి సబ్జెక్టు భావనల్లో మంచి పట్టు అవసరం. క్రమం తప్పకుండా చదివే అలవాటు ఉండాలి. పరీక్షల సమయంలో మాత్రమే చదవడం ద్వారా ఈ కోర్సులో విజయం సాధ్యం కాదు! అభ్యర్థికి స్వీయప్రేరణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం అవసరం. అప్పుడే సరైన సమయంలో కోర్సును పూర్తిచేయగలరు.

కోర్సులో భాగంగా వ్యక్తిత్వ వికాసం, టెక్నాలజీ అంశాల్లో శిక్షణ కూడా ఉంటుంది. కాస్ట్‌ అకౌంటెన్సీ కోర్సు చేసే అభ్యర్థులకు టెక్నాలజీలో కనీసం 100 గంటలు శిక్షణ తప్పనిసరి. కోర్సు కాలంలో సీనియర్లతో పనిచేయడం ద్వారా ఆచరణాత్మక అనుభవం లభిస్తుంది. కోర్సు మొత్తం పూర్తిచేసిన అభ్యర్థులకు ముందుగా ఐసీడబ్ల్యుఏఐ అసోసియేట్‌షిప్‌, తర్వాత ఫెలోషిప్‌ వస్తుంది. కోర్సు పూర్తి చేయడంతోపాటు కనీసం మూడేళ్లు అనుభవం ఉన్న అభ్యర్థులు అసోసియేట్‌షిప్‌కు అర్హులు. అసోసియేట్‌గా కనీసం ఐదేళ్లు పనిచేసినవారు ఫెలోషిప్‌కు అర్హులు.

కాస్ట్‌ అకౌంటెంట్లకు బ్యాంకుల్లో మేనేజ్‌మెంట్‌ కేడర్‌ ఉద్యోగాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. బీపీఓ, కేపీఓ, ఈఆర్‌పీ, ఇన్సూరెన్స్‌, కన్‌స్ట్రక్షన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కోల్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఈసీఐఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, తదితర ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా మంచి వేతనాలతో కాస్ట్‌ అకౌంటెంట్లను నియమించుకుంటున్నాయి. కాస్ట్‌ అకౌంటెన్సీ నిపుణుల కొరతను దృష్టిలో ఉంచుకొని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఇండియన్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐసీఏఎస్‌)ను ప్రవేశపెట్టింది. ఈ పరీక్ష రాయాలంటే ఐసీడబ్ల్యుఏఐలో సభ్యత్వం తప్పనిసరి.

విద్య, ఉద్యోగ అవకాశాలు
కాస్ట్‌ అండ్‌ వర్క్‌ అకౌంటెన్సీ చేసినవారికి ఉన్నత విద్యావకాశాలు అందుబాటులో ఉన్నాయి. సీడబ్ల్యుఏ తర్వాత కామర్స్‌ లేదా బిజినెస్‌ లా లో పీహెచ్‌డీ చేయవచ్చు. దేశంలోని అనేక యూనివర్సిటీలు ఐసీడబ్ల్యుఏఐ అసోసియేట్‌షిప్‌ను ఈ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీకి అర్హతగా ఆమోదిస్తున్నాయి. అధ్యాపక నియామకాలకు కూడా ఈ అభ్యర్థులు పోటీ పడవచ్చు. సీడబ్ల్యుఏ అభ్యర్థులను ఫ్యాకల్టీగా నియమించుకోవడానికి ఏఐసీటీఈ అనుమతిస్తోంది.

* సరైన ప్రణాళిక, పట్టుదలతో చదివితే సీడబ్ల్యుఏ పూర్తిచేయం తేలిక. సైన్స్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులు కూడా సీడబ్ల్యుఏ చేయవచ్చు. ఫ్రొఫెషనల్‌ కోర్సుల్లో అత్యంత తక్కువ ఖర్చుతో పూర్తి చేయగల కోర్సు సీడబ్ల్యుఏనే.

* కాస్ట్‌ అకౌంటెంట్లకు ఉండే అత్యున్నత విశ్లేషణ సామర్థ్యాల వల్ల కార్పొరేట్‌ కంపెనీలు వీరిని నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

* ఈ రంగంలో ప్రవేశ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ లేదా అకౌంట్‌ ట్రెయినీ ఉద్యోగాలుంటాయి. అనుభవం, సామర్థ్యాలను బట్టి చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌, చీఫ్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌, తదితర ఉన్నత స్థాయులకు చేరుకోవచ్చు.

మూడు దశల్లో కోర్సు
సీడబ్ల్యుఏ కోర్సు మూడు దశల్లో ఉంటుంది. అవి...

* ఫౌండేషన్‌ కోర్సు: ఇది ప్రవేశ స్థాయి కోర్సు. సబ్జెక్టుకి సంబంధించిన ప్రాథమిక అంశాలు ఇందులో ఉంటాయి. ఆర్గనైజేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫండమెంటల్స్‌, అకౌంటింగ్‌, ఎకనమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ ఫండమెంటల్స్‌, బిజినెస్‌ మేథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ఫండమెంటల్స్‌ పేపర్లు ఉంటాయి.

ఫౌండేషన్‌కు పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు పోస్టల్‌ లేదా మౌఖిక శిక్షణ తీసుకోవాలి. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్‌ ఇస్తారు. తర్వాత అభ్యర్థులు తమ తమ సామర్థ్యాలను బట్టి పరీక్షకు హాజరుకావచ్చు. ఏటా జూన్‌, డిసెంబరులలో పరీక్షలు ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణులైతే ఇంటర్‌కు ప్రవేశం లభిస్తుంది.

* ఇంటర్మీడియట్‌ కోర్సు: ఈ దశలో వృత్తికి సంబంధించిన ముఖ్యమైన సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం సబ్జెక్టులను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్‌-1లో ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌, కమర్షియల్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లాస్‌ అండ్‌ ఆడిటింగ్‌, అప్లయిడ్‌ డైరెక్ట్‌ ట్యాకేషన్‌ సబ్జెక్టులు ఉంటాయి. గ్రూప్‌-2లో కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌, ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, అప్లయిడ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సేషన్‌ ఉంటాయి.

* ఫైనల్‌ కోర్సు: ఇంటర్‌ తర్వాత ఈ దశకు వెళ్తారు. కార్పొరేట్‌ రంగానికి సంబంధించిన చట్టపరమైన అంశాలకు ఫైనల్‌ కోర్సులో ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో క్యాపిటల్‌ మార్కెట్‌ ఎనాలిసిస్‌ అండ్‌ కార్పొరేట్‌ లాస్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ - స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌డైరెక్ట్‌ అండ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ మేనేజ్‌మెంట్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌- ఎంటర్‌ప్రైజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ అండ్‌ రిపోర్టింగ్‌, కాస్ట్‌ ఆడిట్‌ అండ్‌ ఆపరేషనల్‌ ఆడిట్‌ అండ్‌ ఎథిక్స్‌, బిజినెస్‌ వాల్యుయేషన్‌ మేనేజ్‌మెంట్‌, తదితర పేపర్లు ఉంటాయి.

* అభ్యర్థులు అన్ని దశల్లో పోస్టల్‌ లేదా మౌఖిక శిక్షణ తీసుకోవాలి. గ్రాడ్యుయేట్లు ఫౌండేషన్‌ రాయకుండా నేరుగా ఇంటర్‌కు పేరు నమోదు చేసుకోవచ్చు.

అర్హతలు, దరఖాస్తు విధానం
17 ఏళ్లు నిండిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులు సీడబ్ల్యుఏ కోర్సుకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్‌ చివరి సంవత్సరం పరీక్షలు రాసినవారు కూడా అర్హులు. ప్రస్తుతం సీడబ్ల్యుఏ కోర్సుకు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఐసీడబ్ల్యుఏఐ చాప్టర్లలో పేరు నమోదు చేసుకోవచ్చు. చాప్టర్ల చిరునామాలు:

* హైదరాబాద్‌ చాప్టర్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌, ఐదో వీధి, హిమాయత్‌నగర్‌, హైదరాబాద్‌. ఫోన్‌: 040- 27635937. (సనత్‌నగర్‌లో మరో చాప్టర్‌ ఉంది. దీని ఫోన్‌ నెం: 040- 23718869)
* గోదావరి చాప్టర్‌, దానవాయిపేట పార్కు పక్కన, రాజమండ్రి. ఫోన్‌: 0883- 2441901.
* కొత్తగూడెం చాప్టర్‌, మేజిస్ట్రేట్‌ కోర్టు ఎదురుగా, రైటర్స్‌ బస్తీ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. ఫోన్‌: 08744- 247882.
* ఉక్కునగరం చాప్టర్‌, ఐసీడబ్ల్యుఏఐ భవన్‌, సెక్టార్‌-6, ఉక్కునగరం. ఫోన్‌: 0891- 2581387.
* విజయవాడ చాప్టర్‌, ఐసీడబ్ల్యుఏఐ భవన్‌, కరణంగారి వీధి, పటమట, విజయవాడ. ఫోన్‌: 0866- 2470514.
* విశాఖపట్నం చాప్టర్‌, ఐసీడబ్ల్యుఏఐ భవన్‌, పోర్ట్‌ స్టేడియం ఎదురుగా, అక్కయ్యపాలెం, విశాఖపట్నం. ఫోన్‌: 0891- 2549728.
* నెల్లూరు చాప్టర్‌, పోస్ట్‌ ఆఫీస్‌ రోడ్‌, వహాబ్‌పేట్‌, నెల్లూరు. ఫోన్‌: 0861- 2309692.

No comments:

Post a Comment