ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday 23 November 2011

వేగంగా, పారదర్శకంగా పోలీసు నియామకాలు!

రాష్ట్ర పోలీసు శాఖలో త్వరలో 20,429 పోలీస్‌ కానిస్టేబుళ్లు,  2,296 ఎస్‌.ఐ. పోస్టుల భర్తీకి నియామకాలు జరగనున్నాయి.

ఎలాంటి అనుమానాలకు చోటులేకుండా, పూర్తి పారదర్శకతతో వీటిని నిర్వహిస్తామని రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ ఎం.మాలకొండయ్య చెప్పారు. గరిష్ఠంగా ఏడాదిలోపు నియామక ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.

తాజా నియామకాలపై 'న్యూస్‌టుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విశేషాలివీ..

* కానిస్టేబుళ్ల నియామకంలో వేగం, పారదర్శకత విషయాల్లో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలేమిటి?
* ఎంపికలోని ప్రతి దశలోనూ పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది దరఖాస్తుల స్వీకరణ దశ నుంచే ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థి వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటాం. వీలైనంతవరకూ దరఖాస్తు చేసిన రోజే అభ్యర్థికి హాల్‌టికెట్‌ ఇస్తాం. దరఖాస్తులో పేర్కొన్న చెక్‌లిస్ట్‌ ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా? అనేది అప్పుడే వెరిఫై చేసుకుంటాం. దీనివల్ల అభ్యర్థి ఏదైనా సర్టిఫికెట్‌ నకలును దఖలు పరచకపోతే వెంటనే ఆ విషయాన్ని అతనికి తెలిపే వెసులుబాటు ఉంటుంది. కనీస విద్యార్హతలను పరిశీలించినతరువాత అర్హులైన అభ్యర్థులను మాత్రమే 5 కిలోమీటర్ల పరుగుకు అనుమతిస్తాం. తరువాత అర్హత పరీక్షలు, శారీరక సామర్థ్య పరీక్షలు, రాతపరీక్ష ఉంటాయి. ప్రతి దశలోనూ అర్హత సాధించినవారే ఎంపిక ప్రక్రియలో ముందుకు వెళతారు. కాబట్టి అభ్యర్థికి ఎప్పటికప్పుడే ఫలితం తెలిసిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం ఉంటాయి.

* ఏ శాఖలోనైనా ఉద్యోగ నియామకాలు జరిగే సమయంలో దళారులు ప్రత్యక్షమవుతూ ఉంటారు. పోలీసుల నియామకాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది?
* ఇక్కడ దళారుల ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ప్రతి దశలోనూ కచ్చితమైన ఫలితాలు వెలువడుతూ ఉంటాయి. అభ్యర్థులకు కూడా ఇతర అభ్యర్థుల పనితీరు, ఫలితాలు తెలుస్తూ ఉంటాయి. ఇక దళారులు కానీ, నాయకులు కానీ జోక్యం చేసుకునే అవకాశం ఎక్కడ? నేనే ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా చేయలేనంత పక్కాగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఫలితాలు ఉంటాయి. ఈ విషయంలో అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకూ లోను కాకూడదు. ఒకవేళ ఎవరైనా భిన్నంగా వ్యవహరిస్తే అనర్హత వేటు పడుతుంది. కాబట్టి, అభ్యర్థులు కేవలం ప్రతిభనే నమ్ముకోవాలి.

* పోలీసు ఉద్యోగం రిస్కుతో కూడుకున్నదనే అభిప్రాయాలూ ఉన్నాయి కదా? అభ్యర్థులు ఈ శాఖలో ఎందుకు చేరాలి?
*ఎందుకంటే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం, ఉద్యోగపరమైన సంతృప్తి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఆ అభిరుచి ఉన్నవారికి ఈ ఉద్యోగం బాగుంటుంది. విద్య, వైద్య రంగాల్లాగే ఈ రంగంకూడా ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది.

* తాజా నియామకాలు ఎప్పటిలోగా పూర్తవుతాయి?
*కనీసం తొమ్మిది నెలలు, గరిష్ఠంగా సంవత్సరం పట్టవచ్చు.

* ఎంపిక ప్రక్రియ ఆలస్యమైతే అక్రమాలకు ఆస్కారం ఉంటుంది కదా?
*దరఖాస్తుల నుంచీ ప్రక్రియ యావత్తూ కంప్యూటర్‌లో నిక్షిప్తమవుతుంది. మాన్యువల్‌గా ఎవ్వరూ ఎలాంటి అవకతవకలకూపాల్పడే అవకాశం ఉండదు. పారదర్శకత ఉన్నచోట అక్రమాలకు ఏమాత్రం ఆస్కారం లేదు. నియామకాల ప్రక్రియలో వేగం లోపిస్తే అనుమానాలు తలెత్తడం సహజమే. అందుకే అనుమానాలకు తావివ్వని విధంగా నియామకాలను నిర్వహిస్తాం. పలురకాల శారీరక సామర్థ్య పరీక్షలూ, రాతపరీక్షలూ నిర్వహించాలి కాబట్టి ఈ మాత్రం సమయం పడుతుంది. రాతపరీక్ష జరిగిన నెలలోగా ఫలితాలను ప్రకటిస్తాం. తరువాత మూడునెలల్లోగా నియామకాలు ఉంటాయి.

* పరీక్షలకు సంసిద్ధులయ్యే అభ్యర్థులకు మీరిచ్చే సలహా?
* పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రిపరేషన్‌ కూడా అదేస్థాయిలో ఉండాలి. ఇంటర్వ్యూలు ఉండవు. శారీరక సామర్థ్య పరీక్షలతో పాటు రాత పరీక్షలకు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధులు కావాలి. కానిస్టేబుళ్ల రాతపరీక్షలో కొన్ని కేటగిరీలకు 200 మార్కులకు, కొన్నిటికి వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నలన్నీ ఇంటర్‌మీడియట్‌ స్థాయిలో ఉంటాయి.

ఎస్‌.ఐ. పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. 
1. ఇంగ్లిష్‌
2. తెలుగు (ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి)
3. అరిథ్‌మెటిక్‌ (పదో తరగతి స్థాయి), టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ
4. జనరల్‌ స్టడీస్‌ (డిగ్రీ స్థాయి).

ఎస్‌.ఐ.లకు విధినిర్వహణలో ఆంగ్లంలో కూడా కొంత ప్రావీణ్యం అవసరమవుతుంది కాబట్టి డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ పేపర్‌ ఉంటుంది.

* ఈ నియామకాలతో పోలీసుల కొరత తీరుతుందని ఆశిస్తున్నారా?
* అవును. పట్టణ ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్ల కొరత ఎక్కువగా ఉంది. సుమారు 3 వేల పోస్టులు మహిళలతో భర్తీ చేయనున్నాం.

* గతంలో జరిగిన ఎంపిక ప్రక్రియలతో పోలిస్తే ఈ సారి చేసిన మార్పులను, వాటి ప్రయోజనాలనూ వివరిస్తారా?
* దరఖాస్తు ఫారాన్ని వెబ్‌సైట్‌ (www.apstatepolice.org)నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. కనీసార్హత ఉన్నవారినే 5 కి.మీ. పరుగుకు అనుమతించాలనేది ఈ సారి తీసుకున్న నిర్ణయం. ముందే వడపోత ఉండటంవల్ల ప్రయాస తగ్గుతుంది. ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగేందుకూ ఇది దోహదం చేస్తుంది. పరుగుపందెంలో ఫలితాలను కచ్చితంగా గణించడానికి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ (ఆర్‌.ఎఫ్‌.ఐ.డి.)ని ఉపయోగించాలని భావిస్తున్నాం. దీనివల్ల వందశాతం పారదర్శకత ఉంటుంది. గతంలో ఓఎంఆర్‌ షీట్‌పై జవాబులను పెన్సిల్‌తో గుర్తించేవారు. ఈ సారి బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పెన్‌తో గుర్తించాలని నిర్దేశించాం. పరీక్ష అనంతరం అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ కార్బన్‌ కాపీని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. దీనివల్ల అభ్యర్థి తనకు రాబోయే మార్కులను ముందుగానే కచ్చితంగా అంచనా వేసుకోవచ్చు. గతంలో ప్రశ్నకు నాలుగు ఆప్షన్లను ఇచ్చే సంప్రదాయం ఉంది. ఇప్పుడు ఆప్షన్లను అయిదుకు పెంచాం.

* సమీప భవిష్యత్తులో మళ్లీ నోటిఫికేషన్లు వస్తాయా?
*ప్రస్తుతం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. కాబట్టి సమీప భవిష్యత్తులో ఈ స్థాయిలో భర్తీలు ఉండకపోవచ్చు.

No comments:

Post a Comment