ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 30 August 2011

బ్రాంచి ఏదైనా కళాశాలకే ప్రాముఖ్యం !

ఇంజినీరింగ్‌ విద్య చదవాలంటే కళాశాలను చూడాలా?  బ్రాంచిని చూడాలా?

ఈ ప్రశ్న ప్రతి సంవత్సరం విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ ఎదురయ్యేదే!

ఎంసెట్‌ లో ఉత్తమ ర్యాంకులు తెచ్చుకున్నవారు దేనికి మొగ్గు చూపారు?

వారు కళాశాల పేరు ప్రఖ్యాతులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము ఎంచుకున్న కళాశాలలో ఏ కోర్సులో  సీటు వచ్చినా ఫర్వాలేదనీ, భవితకు ఢోకా ఉండదనే భావనతో చేరిపోతున్నారు.

వెబ్ కౌన్సెలింగ్ ధోరణి ఈ విషయాన్నే నిరూపిస్తోంది.  కన్వీనర్‌ కోటాలో జరిగిన సీట్ల కేటాయింపును, యాజమాన్య కోటాలో చేరే విద్యార్థులను పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య ఏడు వందలు దాటిపోవడంతో ఎందులో చేరాలనే దానిపై విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సుమారు మూడు వందల కళాశాలల నుంచి మాత్రమే రెండు బ్యాచులు బయటికొచ్చాయి. ఈ విద్యార్థులకు లభించిన ప్లేస్‌మెంట్స్‌, అర్హత, అనుభవం గల అధ్యాపకులు, మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు కళాశాలలను ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో ముఖ్యంగా యాభై కళాశాలల్లో మాత్రమే ప్రాంగణ నియామకాల ద్వారా విద్యార్థులను చేర్చుకునేందుకు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇదే సమయంలో విశ్వవిద్యాలయాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో, రాష్ట్రంలోని టాప్‌ 10 నుంచి 20 కళాశాలల్లో ఏ సీటు వచ్చినా చేరేందుకు విద్యార్థులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

టాప్‌ 100 ర్యాంకర్లలో చేరింది నలుగురే!
కాలేజీల ఎంపిక సమయంలో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించి, ఇంజినీరింగ్‌ కళాశాలలకు గ్రేడింగ్‌ ఇవ్వడానికి ఉన్నత విద్యాశాఖ కసరత్తుచేసినా... న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి పక్కనబెట్టింది. దీనివల్ల విద్యార్థులు కళాశాలల నేపథ్యంపై సమాచారాన్ని సేకరిస్తూ, సరైన నిర్థారణకు వచ్చిన తర్వాతే వాటిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో జరిగిన సీట్ల కేటాయింపును పరిశీలిస్తే (పట్టిక చూడండి) ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

* ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో తొలి వంద ర్యాంకులు సాధించినవారిలో నలుగురు మాత్రమే కళాశాలల్లో సీట్లు పొందారు. విశ్వవిద్యాలయాలకు చెందిన ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే వీరికి సీట్ల కేటాయింపు జరిగింది. రెండో ర్యాంకరు ఆంధ్రా వర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ సీటు పొందారు. 500 ర్యాంకులలోపు ఉన్న విద్యార్థుల సంఖ్య స్వల్పంగానే ఉంది.

* ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంకులు పొందిన వారిలో ఎక్కువమంది ఐఐటీ జేఈఈ, ఏఐఈఈఈ, ఇతర పోటీ పరీక్షల్లోనూ అగ్రస్థానాల్లో నిలుస్తున్నారు. దీనివల్ల ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చినప్పటికీ ఇతర విద్యాసంస్థల్లో చేరుతున్నారు.

* జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు బాగా ఆసక్తి కనబరిచారు.

* ఓయూలో ఓపెన్‌ కేటగిరీలో 379 ర్యాంకరు ఈసీఈలో సీటు సంపాదించారు. అదే జేఎన్‌టీయూ హైదరాబాదులో 71వ ర్యాంకర్‌ ఈసీఈ సీటు పొందారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌లోనూ ఇదే ధోరణి కనిపించింది.

* జేఎన్‌టీయూ హైదరాబాద్‌, ఆంధ్రా వర్శిటీ, ఓయూ, జేఎన్‌టీయూ కాకినాడ వర్శిటీ కళాశాలల అనంతరం మంచి ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యం ఇచ్చారు.

* ఎప్పటిలాగే ఈసారి కూడా ఈసీఈలో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యం ఇచ్చారు. ఈసీఈలో సీటు లభించకపోతే వరుసకమ్రంలో కంప్యూటర్‌ సైన్స్‌, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారు. ఈ ఒరవడి పాత కళాశాలల్లో అధికంగా ఉంది. మిగిలిన వాటి విషయంలో విద్యార్థులు తాము అనుకున్న కోర్సులో చేరడానికే మొగ్గుచూపారు.

* యాజమాన్య కోటాలోనూ విద్యార్థులు కళాశాలల నేపథ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
                                             - ఇట్టా సాంబశివరావు (న్యూస్‌టుడే, హైదరాబాద్‌)

1 comment:

  1. తెలుగు లో సివిల్స్ రాసే వారికోసం పుస్తకాలు తెలపండి ప్లీస్స్.........

    ReplyDelete