ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday, 30 November 2011

సివిల్స్ లో జనరల్‌ స్టడీస్‌ ఎలా?

సివిల్స్‌ ప్రిలిమినరీలోని రెండు పేపర్లలో ఏయే అంశాలుంటాయి? సముద్రంలాంటి జనరల్‌స్టడీస్‌ను చదివే విధానం ఏమిటి? నూతనంగా ప్రవేశపెట్టిన అంశాలపై అవగాహన ఎలా పెంచుకోవాలి?...

అభ్యర్థులకు ఉపయోగపడే సూచనలు అందిస్తున్నారు 'బ్రెయిన్‌ ట్రీ' డైరెక్టర్‌ గోపాలకృష్ణ!

ఏ పోటీ పరీక్షకైనా ఎలా సంసిద్ధం కావాలి? విద్యార్థులందరూ ఈ విషయంలో మూడంచెలను పాటించాల్సివుంటుంది.
1) సిలబస్‌ను చదివి, సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2) పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, అడిగిన ప్రశ్నల తీరును అవగాహన చేసుకోవాలి.
3) సిలబస్‌లోని అన్ని general areasచదవటంతో పాటు పరీక్షలో రావటానికి అవకాశమున్న ధోరణులపై (పూర్వ ప్రశ్నపత్రాల ఆధారంతో) దృష్టి పెట్టాలి.

సివిల్స్‌ ప్రిలిమినరీకి కూడా కూడా ఇదే విధానం వర్తిస్తుంది, కొన్ని మినహాయింపులతో!

రెండు కామన్‌ పేపర్లు
సివిల్స్‌ అభ్యర్థులందరూ ప్రిలిమినరీలో రెండు కామన్‌ పేపర్లు రాయాలి.

1) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1:
2) పేపర్‌-2:

పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌
వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ- పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు.

ఇన్ని అంశాలనూ కవర్‌ చేసి, ప్రతిదానిలోనూ ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి? తార్కికంగా చూసినా ఉన్న ఒకే మార్గం- trendsను గుర్తించి, అనుసరించటమే! అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరిగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ను ముందస్తుగా ఊహించటం కష్టం.

ఇది 'నల్లహంస' దృగ్విషయం లాంటిది. 
 (నల్లహంసల జాతి ఒకటుందని పదిహేడో శతాబ్దిలో కనిపెట్టేదాకా హంసలన్నీ తెల్లగా ఉంటాయనే నమ్మకం కొనసాగింది. లెబనీస్‌ రచయిత టాలెబ్‌ దీన్ని Black swan phenomenon గాcoinచేశారు. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తును ఊహించటానికి సాధ్యం కాని స్థితి!...

పరీక్షల సందర్భానికొస్తే పాత ప్రశ్నపత్రాల సాయంతో రాబోయే ప్రశ్నలను వూహించలేకపోవటం.)

ప్రిలిమినరీలో పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌ నిశ్చయంగా Black Swan. ఎవరూ వూహించటానికి వీల్లేకుండా యూపీఎస్‌సీ దీన్ని రూపొందిస్తుంది. మరి కర్తవ్యం?

మొదట మీ విశ్లేషణ కచ్చితంగా ఉండాలి. ఇది జ్ఞాపకశక్తిని పరీక్షించే factual paper అని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. ఈ కారణంతోనే చాలామంది మంచి అభ్యర్థులకు ఇది మొదటినుంచీ సమస్యగా ఉంటూ వచ్చింది. ఈ పేపర్‌తో సంబంధమున్న రీజనింగ్‌ భాగాన్ని చాలామంది అర్థం చేసుకోరు. 2011 నుంచి UPSCఅధికారికంగా 'ఆప్టిట్యూడ్‌' పరీక్షను ప్రవేశపెట్టింది కానీ, గత 4-5 ఏళ్ళ నుంచీ జనరల్‌స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ పరోక్షంగా కరిక్యులమ్‌లో భాగంగానే ఉంది.

ప్రాథమిక factualసమాచారంతో పాటు బలమైన రీజనింగ్‌ నైపుణ్యాలు అవసరమయ్యేలా UPSCప్రశ్నలను రూపొందిస్తోంది. కాబట్టి సారాంశంలో ఇది జనరల్‌స్టడీసూ కాదు; జనరల్‌ నాలెడ్జీ కాదు! ఇది జనరల్‌ స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (GSAT).

స్థిర, పరిణామశీల అంశాలు
* స్థిర (static)అంశాలు- భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ

* పరిణామశీల అంశాలు - వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జి. వీటికి తగిన నిర్వచనం, సిలబస్‌ అంటూ లేవు.

స్థిర అంశాల్లో సాధారణంగా స్కోరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. వీటిలో ఎంత ఎక్కువ సాధించగలిగితే అనిర్దిష్ట అంశాలైన వర్తమాన వ్యవహారాలూ, జి.కె.లపై ఆధారపడటం అంత తగ్గుతుంది. వీటిని మౌలిక అంశాల నుంచి నేర్చుకుని, నోట్సు ద్వారా పకడ్బందీగా పునశ్చరణ చేసుకోవాలి. భావనలు (concepts) పటిష్ఠపరచుకోవాలి. నమూనా టెస్టులు రాస్తే పరిజ్ఞానం విస్తృతమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

నిర్దిష్టత ఉండని వర్తమాన, జి.కె.లలో ప్రాథమిక వివరాలతో పాటు సూత్రాలూ, అమలూ కూడా అవగాహన చేసుకోవాలి. చాలినంత సమయం ఉంది కాబట్టి అభ్యర్థులు థియరిటికల్‌ అంశాల జాబితా తయారుచేసి, రోజువారీగా తాజా పరిణామాలను జోడించుకుంటూ ఉండాలి. ఈ తరహా ప్రశ్నలకు రీజనింగ్‌, factual data అవసరం కాబట్టి పైన చెప్పిన విధానం పాటిస్తే వాటిని పెంపొందించుకోవచ్చు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) ఎన్‌సీఈఆర్‌టీ ప్రాథమిక పుస్తకాలు
2) తెలుగు అకాడమీ ప్రచురణలు
3) హ్యుమానిటీస్‌ (ఇండియన్‌ పాలిటీ, సోషియాలజీ) లలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు
4) తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు
5) పబ్లికేషన్స్‌ డివిజన్‌ 'ఇండియా ఇయర్‌బుక్‌'
6) తెలుగు, ఇంగ్లిష్‌ల్లో ప్రచురితమయ్యే 'యోజన'
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు ఈ పేపర్‌ గురించి మరీ ఇబ్బందిపడనక్కర్లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్టు అంశాలతో తేలిగ్గానే పరిచయం పెంచుకోవచ్చు.

పేపర్‌-2
కాంప్రహెన్షన్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌- కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌- అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌- ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (పదో తరగతి స్థాయి), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ (పదో తరగతి స్థాయి)

గత ఏడాది కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యథావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్‌ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడివుంటుంది కాబట్టి ఈ పేపర్‌ కూడా మరో Black swanఅవ్వగలదు.

ఈ పేపర్లో ఉన్న అంశాలన్నిటిలోనూ పట్టు సాధించటం ఎక్కువమంది అభ్యర్థులకు సాధ్యం కాదు. అందుకని గరిష్ఠ మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయికంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పటిష్ఠపరుచుకోవటం కోసం మంచి వర్క్‌బుక్‌తో సాధన చేయాలి. ఒక నిర్దిష్టమైన తర్కంపై పట్టు లభిస్తే అది ఆత్మవిశ్వాసం పెంచి, ఇతర ప్రశ్నలను చేయటానికి కూడా ఉపకరిస్తుంది. అందుకే ఈ పేపర్‌ కోసం మంచి ప్రశ్నలను solve చేయటం చాలా ముఖ్యం.

పేపర్‌-1 static section లో ప్రశ్నల సంఖ్యది ప్రధాన పాత్ర. కానీ పేపర్‌-2లో నాణ్యమైన ప్రశ్నలు (సంఖ్యలో తక్కువైనప్పటికీ) చేయటం అవసరం. అప్పుడే దానిమీద అవగాహన పెరుగుతుంది. ఈ విధంగా ఈ విభాగంలో స్కోర్‌ చేయాలంటే smart work ప్రధానాంశం.

క్వాంటిటేటివ్‌ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం చాలా ప్రధానం. మొత్తం మార్కుల్లో వీటి భాగం ఎక్కువ. అభ్యర్థులు కష్టపడితే దీన్ని సులభంగా మల్చుకోవచ్చు. ఈ విభాగానికి సమయం కబళించటంలో చాలా పేరుంది కాబట్టి ప్రశ్నలను సత్వరం చేసేలా సమయపాలన పద్ధతులను మెరుగుపరుచుకోవాల్సిందే. లేకుంటే అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను రాయగలిగే అవకాశం లేకుండాపోతుంది.

ఇంగ్లిష్‌ మాధ్యమ నేపథ్యం లేనివారూ, ఈ భాషపై అంతగా పట్టు లేనివారూ ఆందోళన పడకూడదు. ఇప్పటివరకూ అనుసరించిన ప్రిపరేషన్‌ పద్ధతినే, తీరునే కొనసాగించాలి. యూపీఎస్‌సీ పేర్కొన్నట్టు- 'టెన్త్‌ క్లాస్‌ స్థాయి' నైపుణ్యాలను మాత్రమే పరీక్షిస్తారు కాబట్టి ఆందోళన పడనవసరంలేదు. సిలబస్‌లో లేని లోతైన అంశాలను చదువుతూ ప్రిపరేషన్‌ను సంక్లిష్టం చేసుకోకూడదు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) అరిథ్‌మెటిక్‌ ప్రాథమిక పుస్తకాలు
2) ఇంగ్లిష్‌ మౌలిక విషయాలుండే పుస్తకాలు
3) 'ఇగ్నో' ప్రచురించిన ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌ పుస్తకాలు
4) బ్యాంకింగ్‌ పరీక్షల పాత ప్రశ్నపత్రాలు
5) పేపర్‌-2కు సంబంధించిన మంచి manual
6) మంచి ఇంగ్లిష్‌ నిఘంటువు / ఇంగ్లిష్‌- తెలుగు నిఘంటువు

మొత్తమ్మీద రెండు పేపర్లకూ section వారీగా సంసిద్ధం కావాలి. మిగతా అంశాలను పకడ్బందీగా చదివివుంటే కొన్ని ఉప అంశాలను వదిలివేసినా ఇబ్బంది ఎదురవ్వదు. ప్రతి మార్కూ పెద్ద తేడాను సృష్టించే ఇలాంటి పోటీపరీక్షల్లో సమయ నిర్వహణ చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది.


కాబట్టి వచ్చే రోజుల్లో అభ్యర్థులు తమ సాధనను సమయ నిర్వహణతో అనుసంధానించుకోవటం శ్రేయస్కరం.

Tuesday, 29 November 2011

గ్రూప్‌-1 పరీక్ష ప్రకటన విడుదలైంది!

* మే 27న ప్రాథమిక పరీక్ష
* అక్టోబరు 3నుంచి ప్రధాన పరీక్షలు
* ఏపీపీఎస్సీ ప్రణాళిక విడుదల

హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
పక్కా ప్రణాళికతో గ్రూప్‌-1 ప్రకటనను ఏపీపీఎస్సీ సోమవారం జారీ చేసింది.

నిరుద్యోగ అభ్యర్థులు తొలినుంచి జాగ్రత్తగా, లక్ష్యంతో సిద్ధం కావడానికి వీలుగా ప్రాథమిక, ప్రధాన పరీక్షల తేదీల వివరాలను ముందుగానే ప్రకటించింది. ఇలా చేయడం కమిషన్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

కొత్తగా జారీ చేసిన గ్రూపు-1 ప్రకటనలో దాదాపు 19 విభాగాల్లో 263 పోస్టులున్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.  అయితే...


నవంబర్ 28న  ప్రకటించిన 263 పోస్టులకు మరో 41 పోస్టులను కలుపుతున్నట్లు ఏపీపీఎస్సీ   మంగళవారం ప్రకటించింది.
పెరిగిన 41 పోస్టుల్లో 39 ఎంపీడీవోలు, 4 డిఎస్పీలు వున్నాయి. 



మే 27న ప్రిలిమినరీ: 
గ్రూప్‌-1 పోస్టులకు దరఖాస్తులను డిసెంబరు 9 నుంచి 2012 జనవరి 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

గతంలో నోటిఫికేషన్‌ జారీచేసి దరఖాస్తులు స్వీకరించాక నెమ్మదిగా ప్రిలిమినరీ పరీక్ష తేదీలు ప్రకటించేవారు. పరీక్ష ఎప్పుడు జరుగుతుందో అభ్యర్థులకు స్పష్టంగా తెలిసేది కాదు. ఒక్కోసారి తేదీ ప్రకటించినా.. మళ్లీవాయిదా పడేవి. పరీక్షల నిర్వహణలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఈసారి.. నోటిఫికేషన్‌తో పాటు పరీక్ష తేదీలనూ కమిషన్‌ ప్రకటించింది.


నాలుగు నెలల సమయం: 
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌ పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం ఇచ్చారు. మే 27న ప్రిలిమినరీ పరీక్ష పూర్తయిన తరువాత ప్రధాన పరీక్షలు 2012 అక్టోబరు 3 నుంచి నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షకు మధ్య కచ్చితమైన సమయం ముందుగానే తెలియడం వల్ల అభ్యర్థులు ప్రణాళికాయుతంగా ప్రధాన పరీక్షలకు సిద్ధం కావడానికి వీలు కలుగుతుంది.

భర్తీ చేయనున్న పోస్టులివే: 
గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో....
డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, వాణిజ్యపన్నుల అధికారులు, సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, ఉపాధి కల్పన అధికారులు, ప్రాంతీయ రవాణా అధికారులు, కార్మిక శాఖ సహాయ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, గ్రేడ్‌-2 పురపాలక కమిషనర్లు, ఏపీజీఎల్‌ఐ అసిస్టెంట్‌ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ ఆడిటర్లు, జిల్లా బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ అధికారులు, జిల్లా రిజిస్టార్లు, ఎంపీడీవోలు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారులు, అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారులు, కోఆపరేటివ్‌ జిల్లా రిజిస్టార్‌ పోస్టులున్నాయి.



Monday, 28 November 2011

వైవిధ్యం... ఆతిథ్యం!


ప్రపంచంలో అత్యధిక వేతనాలు అందిస్తోన్న కెరియర్‌లలో ముఖ్యమైనది... హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌. 

 వంటలు చేయడం, హోటళ్లను అందంగా తీర్చిదిద్దడం లాంటివి చాలామందికి గొప్ప కెరియర్‌గా అనిపించకపోయినా, భారీ సంఖ్యలో నియామకాలతో అగ్రశ్రేణి కెరియర్‌గా హాస్పిటాలిటీ దూసుకెళుతోంది. హాస్పిటాలిటీ, సంబంధిత కోర్సులు చేసిన అభ్యర్థులకు హోటళ్లే కాదు, సేవారంగంలోని అనేక బహుళజాతి కంపెనీలు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.

నియామకాల విషయంలో హాస్పిటాలిటీ పరిశ్రమ ఐటీ, ఐటీఈఎస్‌ రంగాలను అధిగమించడం విశేషం. ప్రముఖ కన్సల్టెన్సీ Ma Foi Randstad సంస్థ ఇటీవల నిర్వహించిన 'ఎంప్లాయ్‌మెంట్‌ ట్రెండ్‌ సర్వే'లో హాస్పిటాలిటీ పరిశ్రమ గత జులై- సెప్టెంబరు మధ్య 48 వేల మందిని నియమించుకున్నట్లు తేలింది. ఇదేకాలంలో ఐటీ, ఐటీఈఎస్‌ రంగాల్లో 46 వేలమందికి ఉద్యోగాలు లభించాయి. ఈ ఏడాది చివరికి ఇంకా 40 వేలమందికి హాస్పిటాలిటీ రంగంలో అవకాశాలు లభించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. కొత్త హోటళ్లు నెలకొల్పడానికి అనుమతుల కోసం అనేక సంస్థలు వేచిచూస్తున్నాయి. పెద్ద నగరాలతోపాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు హాస్పిటాలిటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీనివల్ల ఈ రంగంలో అవకాశాలు బాగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం మనదేశంలో ఏటా దాదాపు 10వేల మంది హోటల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. సగటున ప్రతి నెలా ఒక కొత్త హోటల్‌ దేశంలో ప్రారంభమవుతోంది. అంతేగాక ప్రస్తుతం ఉన్న నిపుణుల కొరత, ఈ పరిశ్రమ నుంచి ఇతర సేవారంగాలకు వెళ్లే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుంటే డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఫుడ్‌, బేవరేజ్‌ సర్వీసెస్‌, కిచెన్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌, హౌస్‌ కీపింగ్‌ విభాగాల్లో మరిన్ని ఉద్యోగాలు లభించనున్నట్లు వెల్లడించింది.

ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులకు పూర్తిగా భిన్నమైనది... హాస్పిటాలిటీ. ఇంజినీరింగ్‌, ఇతర సాధారణ డిగ్రీల మోజులో తక్కువమంది విద్యార్థులు ఈ కెరియర్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు పెద్ద నగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాలకు కూడా పర్యాటకం, హోటల్‌ రంగాలు విస్తరిస్తున్నాయి. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ద్వారా లభించే శిక్షణ నౌకా రంగం నుంచి కాల్‌సెంటర్లలో ఉద్యోగాల వరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పౌర విమానయాన రంగంలో అనేక ఉద్యోగాలకు హాస్పిటాలిటీని ప్రధాన అర్హతగా పరిగణిస్తున్నారు. ఎయిర్‌ హోస్టెస్‌, ఫ్త్లెట్‌ స్టివార్టు, క్యాబిన్‌ క్రూ ఉద్యోగాలకు హాస్పిటాలిటీ డిగ్రీ అవసరం.

* రైల్వేలు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని క్యాటరింగ్‌ విభాగాల్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన అభ్యర్థులు ఉపాధి పొందవచ్చు. ఆరోగ్య సేవల రంగంలో పనిచేసే బీపీఓల్లో కూడా అవకాశాలుంటాయి.

* హాస్పిటాలిటీ, హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులు చేసినవారికి ఎక్కువగా లభించే ఉద్యోగాలు... హోటళ్లలో ఫ్రంట్‌ ఆఫీస్‌, హౌస్‌ కీపింగ్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీసెస్‌, రెస్టారెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు.

బహుళజాతి కంపెనీల్లో...
హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ కోర్సులు చేసినవారికి కార్పొరేట్‌ హోటళ్లలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలుంటాయి. ఒబెరాయ్స్‌, తాజ్‌ గ్రూప్‌ హోటళ్లు, ఐటీసీ షెరటాన్‌, ఐటీసీ ఫార్చ్యూన్‌ హోటళ్లు ఎక్కువగా నియామకాలు చేపడుతున్నాయి. వెల్‌కమ్‌, తాజ్‌ లాంటి ప్రైవేటు హోటళ్లు స్వయంగా శిక్షణ సంస్థలను నెలకొల్పాయి. ఐటీసీ, మేరియట్‌ ఇంటర్నేషనల్‌, లీలా వెంచర్స్‌, తదితర గ్రూప్‌లు ప్రస్తుతం విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నందున మరిన్ని అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. హెచ్‌ఎస్‌బీసీ, జీఈ, డెల్‌ కంప్యూటర్స్‌ లాంటి బహుళజాతి కంపెనీల్లో కేటరింగ్‌ విభాగాల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చు.

* హాస్పిటాలిటీ రంగంలో పెరుగుతోన్న పోటీని దృష్టిలో ఉంచుకొని శిక్షణలో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటాలిటీ నిపుణులకు వ్యాపార అంశాల్లో కూడా అవగాహన అవసరం. అందుకే బిజినెస్‌ ప్లానింగ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, ఎంప్లాయీస్‌ మేనేజ్‌మెంట్‌, టెక్నాలజీ లాంటి అంశాల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు.
 జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష
ఇటీవలి కాలంలో హాస్పిటాలిటీ, హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులను అందిస్తోన్న సంస్థల సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ కోర్సులకు 'ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌,  

 

క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌' (ఐహెచ్‌ఎం) చాలా పేరుపొందిన సంస్థ. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 24 శాఖలున్నాయి. హైదరాబాద్‌లో కూడా దీని కేంద్రం ఉంది. ఈ సంస్థ అందించే బి.ఎస్‌సి. హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో ప్రవేశానికి దేశవ్యాప్తంగా జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) నిర్వహిస్తారు.

జేఈఈ ద్వారా దేశవ్యాప్తంగా 7787 సీట్లు భర్తీకానున్నాయి. ఐహెచ్‌ఎంలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌లలో చేరడానికి కూడా జేఈఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 52 సంస్థలు జేఈఈ ద్వారా సీట్లను భర్తీచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఐహెచ్‌ఎంలో 242 సీట్లున్నాయి.

పరీక్ష ఎలా ఉంటుంది?
జేఈఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ఇందులో 5 విభాగాలు ఉంటాయి. అవి...
* న్యుమరికల్‌ ఎబిలిటీ అండ్‌ సైంటిఫిక్‌ ఆప్టిట్యూడ్‌: 30 ప్రశ్నలు
* రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌: 30 ప్రశ్నలు
* జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌: 30 ప్రశ్నలు
* ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: 80 ప్రశ్నలు
* ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌: 30 ప్రశ్నలు
దేశంలోని అన్ని ఐహెచ్‌ఎం కేంద్రాల్లో దరఖాస్తులు లభిస్తాయి. ఎన్‌సీహెచ్‌ఎంసీటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 28 నవంబరు 2011 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రింటెడ్‌ దరఖాస్తుల అమ్మకం 5 డిసెంబరు 2011 నుంచి మొదలవుతుంది.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13 ఏప్రిల్‌ 2012
* జేఈఈ తేదీ: 28 ఏప్రిల్‌ 2012
* కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు: జూన్‌ మొదటివారం, 2012 


Sunday, 27 November 2011

హిందూ - హితాచీ స్కాలర్‌షిప్‌లు

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ద హిందూ', జపాన్‌కు చెందిన హితాచీ లిమిటెడ్‌ కంపెనీ సంయుక్తంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

ఎంపికైన అభ్యర్థులకు టోక్యోలోని హితాచీ కంపెనీలో సాంకేతిక శిక్షణ లభిస్తుంది.

ఏటా ముగ్గురు అభ్యర్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌లను ఇస్తారు.

స్కాలర్‌షిప్‌ వ్యవధి ఆర్నెల్లు. జులై 2012 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.

అభ్యర్థులకు ఇండస్ట్రియల్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, పవర్‌ సిస్టమ్స్‌లో శిక్షణ లభిస్తుంది. శిక్షణలో పర్యావరణ అంశాలు, ఇంధన పొదుపునకు ఉపయోగపడే టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ కింద ప్రయాణ ఖర్చులతోపాటు వ్యక్తిగత ఖర్చులకుగాను ప్రతి నెలా కొంత మొత్తం లభిస్తుంది. అభ్యర్థుల వయసు 31 మార్చి 2012 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. బీఈ / బీటెక్‌ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్‌) పూర్తి చేసుండాలి. శిక్షణకు ఎంచుకున్న అంశాలకు సంబంధించిన కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది. కనీసం ఏడాది అనుభవం అవసరం.

* దరఖాస్తులు అన్ని హిందూ కార్యాలయాల్లో లభిస్తాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలోని ఆఫీసుల్లో దరఖాస్తులు పొందవచ్చు.

హిందూ వెబ్‌సైట్‌  నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తులను 'The Hindu, 859 & 860, Anna Salai, Chennai - 600002' చిరునామాకు పంపించాలి.

చివరితేదీ 31 డిసెంబరు 2011.

ఇంగ్లిష్ లో Boost + Confidence!

ఇంగ్లిష్ లో Boost తో పాటు confidence పదాన్ని కలిపి ప్రయోగిస్తారు. ఇలా కలిసి వచ్చే ఇతర పదబంధాలు- boost courage, boost export, boost trade.

 వివరంగా తెలుసుకోవడానికి కింది కథనం చదవండి...


Saturday, 26 November 2011

మేనేజ్ మెంట్ లో సర్టిఫికెట్‌ కోర్సులు


మేనేజ్‌మెంట్‌ కోర్సులకు అగ్రశ్రేణి సంస్థ లయోలా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (లీబా).

చెన్నైలోని ఈ సంస్థ ఉత్తమ బోధన, సౌకర్యాలు, ప్లేస్‌మెంట్లతో మేనేజ్‌మెంట్‌ కోర్సులను నిర్వహిస్తోంది. పూర్తిస్థాయి పీజీడీఎంతోపాటు మూణ్ణెల్ల వ్యవధి గల సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తోంది.

ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవడానికి, సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి ఈ కోర్సులు చాలా ఉపయోగపడతాయి.

ప్రోగ్రామ్‌ల వివరాలు...
* సర్టిఫికెట్‌ ఇన్‌ ఫైనాన్స్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, కంట్రోల్స్‌ అండ్‌ ఆడిట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ సప్లయ్‌ చైన్‌ మోడలింగ్‌ అండ్‌ ఎనాలిసిస్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌

కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌లకు అర్హులు. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం,

ఇతర వివరాలు సంస్థ వెబ్‌సైట్ http://liba.edu/index.php లో లభిస్తాయి.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 4 జనవరి 2012.

ప్రోగ్రామ్‌లు 22 జనవరి 2012 నుంచి ప్రారంభమవుతాయి.

పై ప్రోగ్రామ్‌లతోపాటు సర్టిఫికెట్‌ ఇన్‌ ఎక్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును కూడా లీబా నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) సహకారంతో ఈ కోర్సును అందిస్తోంది. దీనిలో ప్రవేశానికి అర్హత ఏదైనా డిగ్రీ. ఈ ప్రోగ్రామ్‌కు విడిగా నోటిఫికేషన్‌ వెలువడుతుంది.

Friday, 25 November 2011

గ్రూప్‌ 1, 2 ఇంటర్వ్యూల తేదీల ఖరారు

హైదరాబాద్‌ :  గ్రూప్‌-1, 2  సర్వీసుల నియామకానికి సంబంధించి  ఇంటర్వ్యూ తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది.

జనవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు గ్రూప్‌-1 ఇంటర్వ్యూలూ ,

మార్చి 3 నుంచి 31 వరకు గ్రూప్‌-2 ఇంటర్వ్యూలూ  నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

పిబ్రవరి 16 నుంచి 23 వరకు అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంటర్వ్యూలు,
ఫిబ్రవరి 13 నుంచి 15, 24 నుంచి మార్చి 2 వరకు పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

తొలిసారి ఒకే బోర్డు ద్వారా గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రోజుకు గరిష్ఠంగా 10 నుంచి 15 మందికి మాత్రమే ఇంటర్వ్యూలు చేయనున్నట్లు తెలిపారు.

బిట్స్‌లో పీహెచ్‌డీ

సాంకేతిక విద్య, పరిశోధనలకు ప్రసిద్ధిగాంచిన బిర్లా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌, పిలానీ) పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తోంది.

రెగ్యులర్‌ పద్ధతితోపాటు ఆఫ్‌ క్యాంపస్‌ విధానంలో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్సెస్‌, తదితర సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పిస్తోంది.

పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో ప్రవేశానికి బిట్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

బిట్స్‌లో పీహెచ్‌డీ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులను ప్రాజెక్టు లేదా రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌లకు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

వీటికి ఎంపికైతే ట్యూషన్‌ ఫీజుల్లో రాయితీతోపాటు నెలకు రూ.10000 నుంచి రూ.14000 స్టయిపెండ్‌ పొందే అవకాశం ఉంటుంది. ఈ అభ్యర్థులకు బిట్స్‌లోని బోధన, ఇతర అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

బిట్స్‌ క్యాంపస్‌లలో పీహెచ్‌డీకి అందుబాటులో ఉన్న సబ్జెక్టులు: 
బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనమిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, మేథమేటిక్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఫిజిక్స్‌, లాంగ్వేజెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌.

* ఇంటర్‌ డిసిప్లీనరీ సబ్జెక్టులు:
బయోటెక్నాలజీ, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌, రోబోటిక్స్‌, నానోసైన్స్‌ అండ్‌ నానోటెక్నాలజీ, వాటర్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ హెల్త్‌ మొదలైనవి.

రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తాత్కాలికంగా ప్రవేశం కల్పిస్తారు. తర్వాత అభ్యర్థులు క్వాలిఫైయింగ్‌ ఎగ్జామినేషన్‌ రాయాలి. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టులో తెలివితేటలు, ప్రాథమిక భావనలు, వాటిని వర్తింపచేయడంలో సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారినే ప్రోగ్రామ్‌కు అంతిమంగా ఎంపిక చేస్తారు.

బిట్స్‌ పీహెచ్‌డీ కోర్సులకు కనీసం 60 శాతం మార్కులతో ఎం.ఇ./ ఎం.ఫార్మ్‌/ ఎంబీఏ/ ఎం.ఫిల్‌. పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎం.ఎస్‌సి./ బి.ఇ./ బి.ఫార్మ్‌ అభ్యర్థులు కూడా పీహెచ్‌డీకి దరఖాస్తు చేయవచ్చు. వీరికీ 60 శాతం మార్కులు అవసరం. లాంగ్వేజెస్‌, హ్యుమానిటీస్‌లో పీహెచ్‌డీ చేయడానికి కనీసం 55 శాతం మార్కులతో ఎం.ఎ. పూర్తి చేసినవారు కూడా అర్హులు.

బిట్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 5 డిసెంబరు 2011. 

ఇతర వివరాలు బిట్స్‌ వెబ్‌సైట్‌ లో లభిస్తాయి.

Thursday, 24 November 2011

ఎస్‌.ఐ. రాత పరీక్షలో ఏవి ముఖ్యం?

దాదాపు మూడేళ్ల తర్వాత వెలువడిన ఎస్సై నియామక పరీక్షలకు అభ్యర్థులు గట్టిపోటీని ఎదుర్కొనబోతున్నారు. రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌బోర్డు నిర్వహించే పరీక్షల్లో ఎస్సై రాతపరీక్ష అత్యున్నతమైనది. ఈ పరీక్షను సవాలుగా తీసుకొని, ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతేనే ఉద్యోగం సాధించగలరు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌.ఐ.) నియామకాల కోసం నిర్వహించే రాత పరీక్షలో మొత్తం 4 పేపర్లుంటాయి. ఒక్కో పరీక్ష పేపర్‌ వ్యవధి 3 గంటలు.

సమాధానాలను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో మాత్రమే గుర్తించాలి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు, ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు గుర్తించినా అరమార్కు తీసేస్తారు.

ప్రతి పేపరులో కనీస మార్కులు ఉంటాయి. పేపర్‌ 1, పేపర్‌ 2లలో, కనీస మార్కులు సాధిస్తే సరిపోతుంది. పేపర్‌ 3, పేపర్‌ 4లు ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమంలో ఉంటాయి. అభ్యర్థి ఎందులోనైనా రాతపరీక్ష రాయవచ్చు.

పేపర్‌ 1, పేపర్‌-2
పేపర్‌ 1లో అభ్యర్థి ఇంగ్లిష్‌ భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ పేపరుకు సంబంధించిన ప్రతి అంశాన్ని తప్పకుండా రాయాలి. లేఖారచనలో ఫార్మాట్‌ అవసరం. పేరు, తేదీ, స్థలం అంశాలు మర్చిపోకుండా రాయాలి. జనరల్‌ ఎస్సే కోసం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధం ఉండే కొన్ని అంశాలు, ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి చదువుకుంటే సరిపోతుంది. అభ్యర్థికి గల కనీస భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించడం పేపర్‌ 1, పేపర్‌ 2 లక్ష్యం. ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి.

*  పేపర్‌ 2 తెలుగు భాషకు సంబంధించినది. తెలుగు భాషను సరిగా వాడటం, రాయడంలో సామర్థ్యాలను ఇందులో పరీక్షిస్తారు. షార్ట్‌ ఎస్సే, కాంప్రహెన్షన్‌, లెటర్‌ రైటింగ్‌, పేరాగ్రాఫ్‌ రైటింగ్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదం, తదితరఅంశాలపై ప్రశ్నలుంటాయి.

పేపర్‌ 3- అర్థమెటిక్‌, రీజనింగ్‌
ఈ పేపర్‌లో సంఖ్యలు వాటి ధర్మాలు, స్థాన విలువ, ముఖ విలువ, భాజనీయత సూత్రాలపై పట్టు సాధించాలి. బారువడ్డీలో కాలము, వడ్డీ, వడ్డీరేటు, అసలులలో ఏదో ఒకటి కనుక్కోవలసి ఉంటుది. వీటిని బాగా సాధన చేయాలి. సంవత్సరానికి, అర్థ సంవత్సరానికి, 3 నెలలకు, కొన్ని రోజులకు చక్రవడ్డీని లెక్కించడం, అదే విధంగా బారువడ్డీ, చక్రవడ్డీ మధ్య సంబంధంపై ఉండే ప్రశ్నలను సాధన చేయడం తప్పనిసరి.

* నిష్పత్తి- అనుపాతములో మిశ్రమ నిష్పత్తి, వర్గ నిష్పత్తి, ఘన నిష్పత్తి, విలోమ నిష్పత్తి, రెండు నిష్పత్తులకు ఒక సంఖ్య కలపడం లేదా తీసివేయడం మొదలైన ప్రశ్నలను సాధన చేయాలి.

* సగటులో సహజ సంఖ్యల సగటు, సగటు వేగం, ప్రధాన సంఖ్యల సగటు, సరి లేదా బేసి సంఖ్యల సగటు, తరగతిలోని విద్యార్థుల సగటు, మొదలైన అంశాలు ముఖ్యమైనవి.

* శాతం పాఠ్యాంశంలో పెరిగిన లేదా తగ్గిన శాతం, ఒక సంఖ్య మరో సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ, తదితర ప్రశ్నలు ఉంటాయి.

* లాభనష్టాలలో... ఒక వస్తువు కొన్న ధరకంటే ఎక్కువ లేదా తక్కువ ధరకు అమ్మితే వచ్చిన లాభం లేదా నష్టం అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

* కాలము-పనిలో... ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక పనిని కొన్ని రోజులలో చేసినట్లయితే, అందరు కలిసి ఎన్నిరోజులలో చేయగలరు? వచ్చిన డబ్బును ఏ విధంగా పంచుకోవాలి? మొదలైన అంశాలను సాధన చేయాలి.

* పని- వేతనం, కాలం -దూరం అంశాలపై కూడా ప్రశ్నలుంటాయి. కాలం-దూరం అంశంలో వేగం- దూరం - కాలం, సాపేక్ష వేగం, పరుగు పందేలు, తదితర ప్రశ్నలడగవచ్చు.

 * గడియారం, క్యాలెండర్‌, భాగస్వామ్యం, క.సా.గు., గ.సా.భా, వైశాల్యములు, ఘనపరిమాణములు, వయసులు, మొదలైన అంశాలపై కూడా ప్రశ్నలు అడగవచ్చు.

ఈ విభాగంలోని అంశాల కోసం 6, 7, 8, 9 తరగతుల్లోని గణిత పుస్తకాలను బాగా సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌, క్వికర్‌ మేథ్స్‌, టాటా మెక్‌గ్రాహిల్‌ పుస్తకాలను చదవాలి. ఆర్‌ఆర్‌బీ, ఐసెట్‌, క్యాట్‌ పరీక్షల్లో గతంలో అడిగిన ప్రశ్నలను సాధన చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.

రీజనింగ్‌లో ఏవి ముఖ్యం?
* వెర్బల్‌ రీజనింగ్‌లో దిశాత్మక పరీక్ష, కోడింగ్‌, డీకోడింగ్‌, పరిమాణ పరీక్ష, ర్యాంకింగ్‌ పరీక్ష, మిస్సింగ్‌ నంబర్‌, పోలిక, భిన్న పరీక్ష, గణిత పరీక్షలు, అక్షరమాల, నంబర్‌ సిరీస్‌, లాజికల్‌ వెన్‌ చిత్రాలు, తదితర అంశాల నుంచి ప్రశ్నలు రావచ్చు.

* నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌: ఇందులో పాచికలు, దర్పణ (అద్దం) ప్రతిబింబాలు, నీటి ప్రతిబింబాలు, శ్రేణులు, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, మొదలైన అంశాలు ముఖ్యమైనవి.

* లాజికల్‌ రీజనింగ్‌: ఇందులో ఊహనలు, ప్రకటనలు, తీర్మానాలు, తర్కవాదం, మొదలైన అంశాలను బాగా నేర్చుకోవాలి. ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌, టాటా మెక్‌గ్రాహిల్‌ రీజనింగ్‌ పుస్తకాలను బాగా చదివితే సరిపోతుంది.

జనరల్‌ స్టడీస్‌లో...
పేపర్‌-4 జనరల్‌ స్టడీస్‌కు సంబంధించింది. ప్రామాణిక జి.కె., కరెంట్‌ అఫైర్స్‌ అంశాలు ఇందులో చాలా ముఖ్యమైనవి. స్టాండర్డ్‌ జి.కె.లో సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అవార్డులు, బహుమతులు, క్రీడలు, విజేతలు, వార్తల్లోని వ్యక్తులు, ప్రధాన నియామకాలు, ప్రముఖ వ్యక్తుల మరణాలు, రాజీనామాలు, ప్రముఖుల పర్యటనలు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు, శాస్త్ర సాంకేతిక విశేషాలు, తదితర అంశాలపై ప్రశ్నలడుగుతారు.

* తీవ్రవాద సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ సామాజికాభివృద్ధి కార్యక్రమాలు, క్షిపణులు, ప్రధాన ఉద్యమాలు, పురాతన కట్టడాలు, మొదలైన అంశాలను కూడా చదవాలి. ఈ అంశాల కోసం ప్రముఖ దినపత్రికలు, టీవీలోని ముఖ్యమైన వార్తలను నోట్‌ చేసుకోవాలి.

* ఈ పేపర్‌లో భారతదేశ చరిత్ర -సంస్కృతి నుంచి ప్రశ్నలుంటాయి. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి జైనులు, బౌద్ధులు, సింధు, ఆర్య నాగరికతలు మొదలైనవి ముఖ్యమైన అంశాలు. ఆధునిక భారతదేశ చరిత్రలో... 1857 సిపాయిల తిరుగుబాటు, బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణ, జాతీయోద్యమాలు; మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి రాజవంశాలు, ఢిల్లీ సుల్తానులు మొదలైన పాఠ్యాంశాలు బాగా చదవాలి. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర గురించి సిలబస్‌లో ప్రస్తావించకపోయినా, భారతదేశ చరిత్రలో అది భాగం కాబట్టి దీన్ని తప్పకుండా చదవాలి. ఈ అంశాల కోసం 6, 7, 8, 9, 10 తరగతుల్లోని చరిత్ర అంశాలను చదవాలి.

* భారతదేశ భౌగోళిక శాస్త్రంలో నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణస్థితి, నదులు, అడవులు, ఖనిజ వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, జనాభా మొదలైన అంశాలు ఉంటాయి. దీనిలో దేశ, రాష్ట్ర అంశాలను పట్టిక రూపంలో తయారుచేసుకొని చదివితే బాగా అర్థమవుతాయి. 6 నుంచి 10 తరగతుల్లోని జాగ్రఫీ పాఠ్యాంశాలు బాగా చదవాలి.

* భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ సంస్కరణలు, కేంద్ర, రాష్ట్ర పాలనా వ్యవస్థలు, ఐరాస, అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, ముఖ్యమంత్రి, ఎన్నికలు, మంత్రిమండలి, ఆర్థిక కమిషన్లు, పంచవర్ష ప్రణాళిక, బడ్జెట్‌, జనాభా వృద్ధిరేటు మొదలైన అంశాలను చదవాలి. 8 నుంచి 10+2 వరకు సివిక్స్‌, తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి.

* జనరల్‌ సైన్స్‌లో మానవ నిర్మాణం, వ్యాధులు, రక్త గ్రూపులు, విటమిన్‌లు, ఉపగ్రహాలు, భారత రక్షణ వ్యవస్థలోని యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, పరిశోధనలు, తదితర అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు.

- విష్ణువర్థన్ రెడ్డి

Wednesday, 23 November 2011

వేగంగా, పారదర్శకంగా పోలీసు నియామకాలు!

రాష్ట్ర పోలీసు శాఖలో త్వరలో 20,429 పోలీస్‌ కానిస్టేబుళ్లు,  2,296 ఎస్‌.ఐ. పోస్టుల భర్తీకి నియామకాలు జరగనున్నాయి.

ఎలాంటి అనుమానాలకు చోటులేకుండా, పూర్తి పారదర్శకతతో వీటిని నిర్వహిస్తామని రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ ఎం.మాలకొండయ్య చెప్పారు. గరిష్ఠంగా ఏడాదిలోపు నియామక ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.

తాజా నియామకాలపై 'న్యూస్‌టుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విశేషాలివీ..

* కానిస్టేబుళ్ల నియామకంలో వేగం, పారదర్శకత విషయాల్లో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలేమిటి?
* ఎంపికలోని ప్రతి దశలోనూ పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది దరఖాస్తుల స్వీకరణ దశ నుంచే ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థి వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటాం. వీలైనంతవరకూ దరఖాస్తు చేసిన రోజే అభ్యర్థికి హాల్‌టికెట్‌ ఇస్తాం. దరఖాస్తులో పేర్కొన్న చెక్‌లిస్ట్‌ ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా? అనేది అప్పుడే వెరిఫై చేసుకుంటాం. దీనివల్ల అభ్యర్థి ఏదైనా సర్టిఫికెట్‌ నకలును దఖలు పరచకపోతే వెంటనే ఆ విషయాన్ని అతనికి తెలిపే వెసులుబాటు ఉంటుంది. కనీస విద్యార్హతలను పరిశీలించినతరువాత అర్హులైన అభ్యర్థులను మాత్రమే 5 కిలోమీటర్ల పరుగుకు అనుమతిస్తాం. తరువాత అర్హత పరీక్షలు, శారీరక సామర్థ్య పరీక్షలు, రాతపరీక్ష ఉంటాయి. ప్రతి దశలోనూ అర్హత సాధించినవారే ఎంపిక ప్రక్రియలో ముందుకు వెళతారు. కాబట్టి అభ్యర్థికి ఎప్పటికప్పుడే ఫలితం తెలిసిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం ఉంటాయి.

* ఏ శాఖలోనైనా ఉద్యోగ నియామకాలు జరిగే సమయంలో దళారులు ప్రత్యక్షమవుతూ ఉంటారు. పోలీసుల నియామకాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది?
* ఇక్కడ దళారుల ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ప్రతి దశలోనూ కచ్చితమైన ఫలితాలు వెలువడుతూ ఉంటాయి. అభ్యర్థులకు కూడా ఇతర అభ్యర్థుల పనితీరు, ఫలితాలు తెలుస్తూ ఉంటాయి. ఇక దళారులు కానీ, నాయకులు కానీ జోక్యం చేసుకునే అవకాశం ఎక్కడ? నేనే ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా చేయలేనంత పక్కాగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఫలితాలు ఉంటాయి. ఈ విషయంలో అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకూ లోను కాకూడదు. ఒకవేళ ఎవరైనా భిన్నంగా వ్యవహరిస్తే అనర్హత వేటు పడుతుంది. కాబట్టి, అభ్యర్థులు కేవలం ప్రతిభనే నమ్ముకోవాలి.

* పోలీసు ఉద్యోగం రిస్కుతో కూడుకున్నదనే అభిప్రాయాలూ ఉన్నాయి కదా? అభ్యర్థులు ఈ శాఖలో ఎందుకు చేరాలి?
*ఎందుకంటే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం, ఉద్యోగపరమైన సంతృప్తి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఆ అభిరుచి ఉన్నవారికి ఈ ఉద్యోగం బాగుంటుంది. విద్య, వైద్య రంగాల్లాగే ఈ రంగంకూడా ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది.

* తాజా నియామకాలు ఎప్పటిలోగా పూర్తవుతాయి?
*కనీసం తొమ్మిది నెలలు, గరిష్ఠంగా సంవత్సరం పట్టవచ్చు.

* ఎంపిక ప్రక్రియ ఆలస్యమైతే అక్రమాలకు ఆస్కారం ఉంటుంది కదా?
*దరఖాస్తుల నుంచీ ప్రక్రియ యావత్తూ కంప్యూటర్‌లో నిక్షిప్తమవుతుంది. మాన్యువల్‌గా ఎవ్వరూ ఎలాంటి అవకతవకలకూపాల్పడే అవకాశం ఉండదు. పారదర్శకత ఉన్నచోట అక్రమాలకు ఏమాత్రం ఆస్కారం లేదు. నియామకాల ప్రక్రియలో వేగం లోపిస్తే అనుమానాలు తలెత్తడం సహజమే. అందుకే అనుమానాలకు తావివ్వని విధంగా నియామకాలను నిర్వహిస్తాం. పలురకాల శారీరక సామర్థ్య పరీక్షలూ, రాతపరీక్షలూ నిర్వహించాలి కాబట్టి ఈ మాత్రం సమయం పడుతుంది. రాతపరీక్ష జరిగిన నెలలోగా ఫలితాలను ప్రకటిస్తాం. తరువాత మూడునెలల్లోగా నియామకాలు ఉంటాయి.

* పరీక్షలకు సంసిద్ధులయ్యే అభ్యర్థులకు మీరిచ్చే సలహా?
* పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రిపరేషన్‌ కూడా అదేస్థాయిలో ఉండాలి. ఇంటర్వ్యూలు ఉండవు. శారీరక సామర్థ్య పరీక్షలతో పాటు రాత పరీక్షలకు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధులు కావాలి. కానిస్టేబుళ్ల రాతపరీక్షలో కొన్ని కేటగిరీలకు 200 మార్కులకు, కొన్నిటికి వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నలన్నీ ఇంటర్‌మీడియట్‌ స్థాయిలో ఉంటాయి.

ఎస్‌.ఐ. పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. 
1. ఇంగ్లిష్‌
2. తెలుగు (ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి)
3. అరిథ్‌మెటిక్‌ (పదో తరగతి స్థాయి), టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ
4. జనరల్‌ స్టడీస్‌ (డిగ్రీ స్థాయి).

ఎస్‌.ఐ.లకు విధినిర్వహణలో ఆంగ్లంలో కూడా కొంత ప్రావీణ్యం అవసరమవుతుంది కాబట్టి డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ పేపర్‌ ఉంటుంది.

* ఈ నియామకాలతో పోలీసుల కొరత తీరుతుందని ఆశిస్తున్నారా?
* అవును. పట్టణ ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్ల కొరత ఎక్కువగా ఉంది. సుమారు 3 వేల పోస్టులు మహిళలతో భర్తీ చేయనున్నాం.

* గతంలో జరిగిన ఎంపిక ప్రక్రియలతో పోలిస్తే ఈ సారి చేసిన మార్పులను, వాటి ప్రయోజనాలనూ వివరిస్తారా?
* దరఖాస్తు ఫారాన్ని వెబ్‌సైట్‌ (www.apstatepolice.org)నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. కనీసార్హత ఉన్నవారినే 5 కి.మీ. పరుగుకు అనుమతించాలనేది ఈ సారి తీసుకున్న నిర్ణయం. ముందే వడపోత ఉండటంవల్ల ప్రయాస తగ్గుతుంది. ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగేందుకూ ఇది దోహదం చేస్తుంది. పరుగుపందెంలో ఫలితాలను కచ్చితంగా గణించడానికి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ (ఆర్‌.ఎఫ్‌.ఐ.డి.)ని ఉపయోగించాలని భావిస్తున్నాం. దీనివల్ల వందశాతం పారదర్శకత ఉంటుంది. గతంలో ఓఎంఆర్‌ షీట్‌పై జవాబులను పెన్సిల్‌తో గుర్తించేవారు. ఈ సారి బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పెన్‌తో గుర్తించాలని నిర్దేశించాం. పరీక్ష అనంతరం అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ కార్బన్‌ కాపీని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. దీనివల్ల అభ్యర్థి తనకు రాబోయే మార్కులను ముందుగానే కచ్చితంగా అంచనా వేసుకోవచ్చు. గతంలో ప్రశ్నకు నాలుగు ఆప్షన్లను ఇచ్చే సంప్రదాయం ఉంది. ఇప్పుడు ఆప్షన్లను అయిదుకు పెంచాం.

* సమీప భవిష్యత్తులో మళ్లీ నోటిఫికేషన్లు వస్తాయా?
*ప్రస్తుతం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. కాబట్టి సమీప భవిష్యత్తులో ఈ స్థాయిలో భర్తీలు ఉండకపోవచ్చు.

Tuesday, 22 November 2011

సివిల్స్‌ నగారా

సామాజిక స్పృహ, అంకితభావం ఉండి దేశానికి ఉపయోగపడాలని అభిలషించే నవ యువత మొదటి మొగ్గు సివిల్స్‌కే! ఆశావహ దృక్పథం, సరైన ప్రణాళిక, సహనం, సుదీర్ఘకాలం కష్టపడే స్వభావం ఉంటేనే దేశంలోని అత్యుత్తమమైన సివిల్‌ సర్వీసుల్లో ప్రవేశించగలుగుతారు. పరీక్షా పద్ధతి మారిందని నిరాశపడకుండా దానికి తగ్గట్టుగా తమను మల్చుకోగలిగితే తెలుగు మీడియం విద్యార్థులకూ సివిల్స్‌ శిఖరారోహణ సుసాధ్యమే అంటున్నారు బ్రెయిన్ ట్రీ గోపాలకృష్ణ !

సివిల్‌ సర్వీసుల ప్రకటన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానుంది. ఈలోపు పకడ్బందీగా పూర్వరంగం సిద్ధం చేసుకుంటే సులభంగా కార్యాచరణలోకి అడుగుపెట్టవచ్చు. గత ఏడాదే ప్రవేశపెట్టిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష మార్పుల గురించి తెలుసుకుంటే స్పష్టత ఏర్పడుతుంది.
గతంలో ప్రిలిమినరీ ఐచ్ఛిక (ఆప్షనల్‌) పేపర్‌ 300 మార్కులకూ, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ 150 మార్కులకూ ఉండేవి. ఆప్షనల్‌లో 120 ప్రశ్నలు. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు. జనరల్‌స్టడీస్‌లో సరైన జవాబుకు మార్కు చొప్పున 150 ప్రశ్నలు. తప్పు జవాబులకు 0.33 మార్కుల తగ్గింపు (మైనస్‌) ఉండేది. ఈ విధానంలో డిగ్రీలో చదివిన సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకునే వీలుండటం వల్ల తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. ఇంగ్లిష్‌లో ప్రశ్నలున్నప్పటికీ తెలిసివున్న సబ్జెక్టు కాబట్టి తేలిగ్గా రాయగలిగేవారు. ప్రతికూలతల్లో ప్రధానమైనది ఏమిటంటే... ఆప్షనల్స్‌ కటాఫ్‌ మార్కుల్లో రకరకాల తేడాలుండటం, కొన్ని మాత్రమే ఎక్కువ స్కోరింగ్‌గా ఉండి అభ్యర్థులందరికీ సమన్యాయం లభించకపోవటం. దీంతో సివిల్స్‌లో ఉమ్మడి (కామన్‌) పేపర్లు అవసరమనే వాదనకు మద్దతు ఏర్పడింది. ఫలితంగా 2011లో మార్పులు అమలయ్యాయి.



రెండు కామన్‌ పేపర్లు
సివిల్స్‌ అభ్యర్థులందరూ ఇప్పుడు రెండు కామన్‌ పేపర్లు రాయాలి.

1) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1:
వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ- పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు.

2) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2: 
కాంప్రహెన్షన్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌- కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌- అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌- ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (పదో తరగతి స్థాయి), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ (పదో తరగతి స్థాయి)


యూపీఎస్‌సీ నుంచి ప్రశ్నల సంఖ్య గురించి కానీ, ప్రశ్నల శైలి గురించి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. కొన్ని నమూనా ప్రశ్నలు మాత్రం ఇచ్చి ఊరుకున్నారు. దీంతో ఏ తరహా ప్రశ్నలు వస్తాయో ఎవరికీ అర్థం కాలేదు. అనిశ్చిత స్థితిలోనే అభ్యర్థులు పరీక్ష రాయాల్సివచ్చింది.
నిరాశాపూరితం
ఈ ఏడాది జూన్‌ నెల్లో ప్రిలిమినరీ పరీక్ష కొత్త విధానం అభ్యర్థులకు తొలిసారి అవగతమయింది. నూతన పద్ధతి నిరాశాపూరితంగా ఉందనటం అనుచితమైన వ్యాఖ్య ఏమీ కాదు. ప్రశ్నపత్రం సృజనాత్మకంగా లేదు; క్లిష్టంగానూ లేదు. ప్రచారం జోరుగా సాగిన సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలేమీ లేవు.

పేపర్‌-1 యథాప్రకారం కఠినంగా ఉంది. సూక్ష్మాంశాలతో కూడి ఉండటం వల్ల 50 శాతం కంటే మించి ఏ అభ్యర్థీ కచ్చితంగా జవాబులు గుర్తించలేకపోయారు. ఇలాంటి స్థితిలో పేపర్‌-2లో 75 శాతం తెచ్చుకున్నవారే పాసయ్యారు. ఉత్తీర్ణతకు అవసరమైన సాధారణ స్కోరు 200/ 400.

ఇంగ్లిష్‌లో మంచి ప్రావీణ్యమున్న పట్టణ విద్యార్థులకే ప్రశ్నపత్రం అనుకూలించినట్టుగా ఫలితాల తీరు తెలిపింది. నిజానికి గత పరీక్షా విధానంలో పరీక్షకు హాజరైవున్న చాలామంది నెగ్గలేకపోగా; అంతగా సిద్ధం కాకుండానే పరీక్ష రాసిన ఎక్కువమంది ఉత్తీర్ణులయ్యారు. ప్రాంతీయ భాషల మీడియంలో డిగ్రీ చదివినవారు విజయానికి దూరం కాగా, పట్టణ విద్యార్థులే ఎక్కువమంది విజేతలుగా నిలిచారు.

తెలుగు మీడియం విద్యార్థులు ఏం గమనించాలి?
* ఇంగ్లిష్‌ అంత సరిగా రాకుంటే ఈ భాష నేర్చుకోవటానికి కృషి చేయాల్సిందే. ఇంగ్లిష్‌ ప్రాథమికాంశాలను నేర్చుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు.
* పాఠశాల పుస్తకాల్లోని ప్రాథమిక వ్యాకరణం చదివి భాషను మెరుగుపర్చుకోవచ్చు. వాక్యనిర్మాణం అర్థం చేసుకోవటం, వాక్యాల భావాన్ని సరిగా బోధపరుచుకోవటం అవసరం.
* ఇంగ్లిష్‌లో ప్రాచుర్యం పొంది, తెలుగులోకి కూడా అనువాదం పొందిన పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. మొదట ఆంగ్ల భాగం చదివి, దాన్ని తెలుగులోకి మార్చాలి. సరిగా వచ్చిందో లేదో తెలుగు అనువాదంతో పోల్చి చూడాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ప్రక్రియను ఆసక్తిగా సంతోషంతో చేయాలి గానీ 'తప్పదు కదా' అనే ఉద్దేశంతో కాదు.
* పాత బ్యాంకింగ్‌ పరీక్షల నుంచి కాంప్రహెన్షన్‌ పాసేజ్‌లను తీసుకుని, జవాబులు రాయటం సాధన చేయాలి.
* మెంటల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ విభాగాల నుంచి ఎక్కువ స్కోర్‌ చేయటానికి ప్రయత్నించండి. వీటికి ఇంగ్లిష్‌తో సంబంధం లేదు.
* వీలైనంత త్వరగా ప్రిపరేషన్‌ మొదలుపెడితే ఇంగ్లిష్‌ నైపుణ్యాలు పెంచుకోవటానికి వ్యవధి చిక్కుతుంది.
* పేపర్‌-1లో మార్కులను గరిష్ఠంగా పెంచుకోవటానికి ప్రయత్నించాలి. పేపర్‌-2 అంశాలు మీకెటూ ఇబ్బంది కావు.
* సాధన చేసేటపుడు పొరపాట్లపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే... చేసే ప్రతి పొరపాటూ మార్కులను కోల్పోయేలా చేస్తుందని మరవకూడదు.

Monday, 21 November 2011

జాతీయ స్థాయిలో ర్యాంకులు పండిద్దాం!



వైద్యవిద్య లక్ష్యంగా ఉన్న విద్యార్థులు ఏ ప్రవేశపరీక్ష రాయాల్సివుంటుందో స్పష్టత లేక ఇటీవల గందరగోళపడ్డారు. 'నీట్‌' రాయటానికి రెండేళ్ళ వెసులుబాటు రాబోతుందంటూ వచ్చిన తాజా ప్రకటన ఊరటనిచ్చేదే! ఈ సమయంలో సీనియర్‌ ఇంటర్‌, లాంగ్‌ టర్మ్‌ విద్యార్థులు ఏ విధంగా సంసిద్ధమైతే జాతీయస్థాయి మెడికల్‌ పరీక్షల్లో రాణించగలరో, ఎంసెట్‌తో అనుసంధానం ఎలా చేసుకోవాలో పరిశీలిద్దాం!

జాతీయస్థాయి మెడికల్‌ ప్రవేశపరీక్షలూ, ఇంజినీరింగ్‌ జాతీయస్థాయి ప్రవేశపరీక్షలకూ సీట్ల పరంగా, విధి విధానాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంజినీరింగ్‌ విభాగంలో ఉన్న ఐఐటీ-జేఈఈ విషయం చూస్తే సీట్లలో రాష్ట్రాలకు కేటాయింపులు లేకపోవడం, పరీక్ష కూడా గణితం, భౌతిక రసాయనశాస్త్రాల్లో మాత్రమే జరగటం గమనించవచ్చు. అదే మెడికల్‌ ప్రవేశపరీక్షల్లో సీట్ల సంఖ్య చాలా స్వల్పం. వాటిలో రాష్ట్రాలకు కేటాయింపు ఉంది. పరీక్ష విధానంలో కూడా జీవశాస్త్రం, భౌతిక రసాయనశాస్త్రాలకు తోడుగా ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ఉంటాయి.

ఈ కారణాల వల్ల జాతీయ పరీక్షల మెడికల్‌ విభాగంలో సీట్లు సాధించే విద్యార్థుల సంఖ్య మన రాష్ట్రం నుంచి సాపేక్షంగా చాలా తక్కువగా ఉంటోంది. అందుకే ఇప్పటినుంచి ప్రణాళికాబద్ధంగా ప్రారంభిస్తే పరీక్షల సమయానికి మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్ర విద్యార్థులతో దీటుగా ప్రతిభ కనపరిచే అవకాశముంది.

నీట్‌... కథాకమామిషూ
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న మెడికల్‌ కళాశాలల్లో డిగ్రీలో చేరడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష NEET (National Eligibility cum Entrance Test). దీని ఉద్దేశం చాలా మంచిదే.

ఇప్పుడు జాతీయస్థాయిలో వైద్యవిద్య ప్రవేశపరీక్షలు దాదాపు పదికి పైగా జరుగుతున్నాయి. AIPMT, AIIMS, AFMC, JIPMER, MGIMS, BHU, AMU, CMC, MAHE, SRM, Comed Kమొదలైనవి. వీటిలో మన రాష్ట్ర విద్యార్థులు ఎనిమిదికి పైగా పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే ఒకే కోర్సుకు ఇన్ని రకాల ప్రవేశపరీక్షలు లేకుండా విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి వారిలో ఉన్న ప్రతిభను పూర్తిగా వెలికితీయాలనే 'నీట్‌'కు శ్రీకారం చుట్టారు. ఒకే పరీక్ష ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశమనేది నిజంగా హర్షణీయం.

అయితే సమస్యంతా కేవలం ఇప్పుడు సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు తగిన సమయం లేకపోవడమే! 'నీట్‌' వాయిదాకు ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాయటం, దాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇవ్వటం విద్యార్థులకు సంతోషకరమైన విషయం. త్వరగా ఈ ఆదేశాలు వెలువడితే ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో ప్రవేశపరీక్షలకు సిద్ధమవుతారు.

ప్రశ్నల సంఖ్యను తొలిగా 180కి పెంచి అభ్యాసం మొదలుపెట్టాలి. జాతీయ పరీక్షల అభ్యర్థులు 180 ప్రశ్నలతో (బోటనీ 45, జువాలజీ 45, ఫిజిక్స్‌ 45, కెమిస్ట్రీ 45) సాధన చేయాలి. తరవాత 200 ప్రశ్నలకు మారవచ్చు. ఇప్పటివరకు విద్యార్థులకు రుణాత్మక మార్కులపై అవగాహన లేదు. అభ్యాసం కూడా లేదు. జాతీయస్థాయి పరీక్షలన్నిటిలో రుణాత్మక మార్కులున్నాయి. అభ్యాసం లేక మన రాష్ట్ర విద్యార్థులు అధికంగా నష్టపోతున్నది ఈ మార్కుల వల్లనే!

తుది ర్యాంకు నిర్థారణ రుణాత్మక మార్కుల ఆధారంగానే జరుగుతుంది. విద్యార్థులు అభ్యాసం చేసేటప్పుడు తెలిసినవాటికే జవాబులు గుర్తించడం మంచిది. ఇక అభ్యాసం చేయబోయే పరీక్షల్లో 160 మార్కులకు కాకుండా ప్రశ్నల సంఖ్యను కనీసం 180కి పెంచి రుణాత్మక మార్కులతో సాధన చేయడం ప్రారంభించాలి. అన్ని పరీక్షలలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో ఎంసెట్‌ కన్నా ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రశ్నల సరళి ఎంసెట్‌ కంటే సులభంగా ఉంటుంది.

విద్యార్థులు సిద్ధాంతపరమైన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తూ, వాటికి తోడు లెవెల్‌-1, లెవెల్‌-2 వరకు ఉన్న ప్రశ్నలకుసన్నద్ధమయితే సరిపోతుంది. ఎక్కువగా సమయం నష్టపోయే లెవెల్‌-3, లేదా క్లిష్టమైన ప్రశ్నలను వదిలేస్తే సరి. ఉదాహరణకు భౌతికశాస్త్రంలోని విద్యుత్తు వలయాలు, కెపాసిటర్లు, రెసిస్టర్లతో ఉన్న ప్రశ్నలను పూర్తిగా వదిలేసినా ఎటువంటి నష్టమూ ఉండదు.

ఇక జాతీయస్థాయి మెడికల్‌ ప్రవేశపరీక్షలన్నిటిలో మన విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నది ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌. ఈ పరీక్షలు రాసేవారు ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాక ఇవి కొంత సాధన చేయాలి. నమూనా పరీక్షలు కూడా వీటిలో వీలైనన్ని ఎక్కువ అభ్యాసం చేయాలి.

భౌతిక శాస్త్రం
భౌతిక శాస్త్రంలో నీట్‌, ఇతర జాతీయ పరీక్షల సిలబస్‌ చూస్తే మన ఎంసెట్‌తో పోల్చితే ఎక్కువ మార్పులు లేవు. కొన్ని స్వల్పమైన అంశాలను అదనంగా జత చేశారు.

అవి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో...
*Circular motionలో Vehicle on level road,Banked Road (పాత సిలబస్‌లో ఉంది)
*Work done by variable force.
*Centre of mass of uniform rod
*Kepler's laws of planetory motion
*Kinetic theory of gases
ద్వితీయ సంవత్సర సిలబస్‌లో...
Unit - i 1. Vande graf generator (Electrostatics) Unit - iii Toroidal solenoids, Cyclotrn Unit-iv iii. Eddy Currents, AC Generator Unit-v iv. Displacement Current v. Electromagnetic Spectrum Unit-vi vi. Reflection of Light, Spherical Mirrors, Mirror Formula vii. Scattering of Light, blue color of the sky and reddish appearance of the sun at sunrise and sunset. viii. Human eye, image formation and accomodation, correction of eye defects using lenses. Unit-vii ix. Davisson - Gerner experiment Unit-Viii x. Bohrmodel, Energy Levels, Hydrozen Spectrum

ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌లలో భౌతికశాస్తంలో విద్యార్థి అదనంగా చదవవలసిన అంశాలు ఇవి. అయితే ఇవన్నీ మన సిలబస్‌లో కొద్దిగా పొడిగింపు మాత్రమే. ఇవి పెద్దగా వ్యవధి తీసుకోవు కాబట్టి మొదటగా ఎంసెట్‌ అంశాలనే సాధన చేసుకుంటూ పోవాలి. ఈ ఫిజిక్స్‌ అదనపు సిలబస్‌ సాధనకు 25 రోజులు చాలు. అంటే ఈ అదనపు భాగమంతా ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్‌లో నేర్చుకోవచ్చు. కారణం- ఈ జాతీయస్థాయి ప్రవేశపరీక్షలన్నీ మే-జూన్‌లలో ఉండటమే.

రసాయన శాస్త్రం
రసాయన శాస్త్రంలో సీబీఎస్‌ఈతో పోల్చినపుడు ఎంసెట్‌ సిలబస్‌ వ్యత్యాసాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. సీబీఎస్‌ఈ సిలబస్‌తో పోల్చినపుడు UNIT-1,2, 3, 4, 6,10,12, 14, 15 లలో ఎటువంటి మార్పూ లేదు.

UNIT-V 1. Suspensions 2. Multimolecular and macro molecular colloids UNIT-VI iii. In group 15: Preparation and properties of phosphine iv. In group 16: Trends in Physical and chemical properties of Dioxygen. v. In group 17: Preparation Properties and uses of Hydrochloric acid. UNIT-VII vi. Preparation and properties of K2, cr2, O7 and Kmno4 UNIT-IX vii. Crystal field theory. UNIT-XI viii. Mechanism of dehydrogen with special reference to Methanol. UNIT-XIII ix. Cyanides and iso cyanides

వీటిలో అధిక భాగానికి అదనపు కాలం నష్టపోకుండా సీనియర్‌ సిలబస్‌తో పాటే పూర్తి చేసుకోవచ్చు.
 -  పి.వి.ఆర్.కె. మూర్తి

Lay it on the line .... సంగతేంటి?

Take a severe beating, to lay it on the line, a foot in the door, run circles around ...నూతనంగా వాడుకలోకి వస్తున్న ఇలాంటి వ్యక్తీకరణల గురించి ఉదాహరణలతో సహా తెలుసుకుందాం!

Wilson: Scams, scams and nothing but scams- the country is going to dogs, I am sure.(కుంభకోణాలు, కుంభకోణాలు తప్ప ఇంకేం లేదు. దేశం భ్రష్టు పట్టిపోతోంది.)

Sunitha: The second term of the UPA has been troubled with these scams all the way down the line. We have in A.P., the OMC scam too- Congress has taken a severe beating, certainly. (UPA రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎప్పుడూ ఈ కుంభకోణాల ఇబ్బందే పడ్తోంది. మన రాష్ట్రంలో ఓబులాపురం గనుల కుంభకోణం.)

Wilson: I had to lay it on the line to my dad, though he is a Congress man. He is quite unhappy about it as well. He just hoped that better days would come. (మా నాన్న కాంగ్రెస్‌వాదే అయినా ఆయన్తో దీన్ని గురించి చెప్పటం తప్పటంలేదు. ఆయనా దీని విషయంలో అంత సంతోషంగా లేడు. మంచి రోజులొస్తాయనే ఆశతో ఉన్నాడు.)

Sunitha: But the other parties are not much better, are they? All that they want is a foot in the door, and then make as much money as possible. (ఇతర పార్టీలేం అంత మెరుగ్గా లేవు కదా! వాళ్లక్కావాల్సింది కూడా అవకాశమే. ఆ తర్వాత ఎంత వీలయితే అంత డబ్బు చేస్కోటం.)

Wilson: Looking for an honest politician in India is like searching for a needle in a hay stack. (భారత్‌లో నిజాయితీ గల రాజకీయవాది కోసం చూడ్డం, గడ్డివామిలో సూది వెదికినట్టే.)

Sunitha: Are the voters any the better? Aren't they corrupt too? It's either money or liquor that draws voters to the polling booth, isn't it? And another thing- politicians in other countries are corrupt too. (ఓటర్లంత కన్నా మెరుగా? వాళ్లూ అవినీతిపరులేగా? Polling boothలకు వెళ్లటం డబ్బు, మందు వల్లే కదా? / డబ్బు, మందూ లేనిదే ఓట్లు వేసేందుకు వెళ్లరు కదా? మరో విషయం- ఇతర దేశాల్లో రాజకీయవాదులు కూడా అవినీతిపరులే)

Wilson: But our politicians run circles around them. Their methods of making money are ingenious. (కానీ ఆ విషయంలో రాజకీయవాదులు వోటర్ల కంటే చాలా చాలా ఎక్కువ. డబ్బు చేస్కొనేందుకు వాళ్లకు చాలా తెలివయిన పద్ధతులుంటాయి.)

Sunitha: Is there any hope for us? Or is Anna Hazare fighting a losing battle? (ఏమన్నా ఆశ ఉందా మనకు, దేశం బాగుపడ్తుందని; లేకపోతే అన్నా హజారే పోరాటం ఓటమికేనా?)

Wilson: Let's hope it isn't. (అలా కాదని ఆశిద్దాం.)


Look at the following expressions from the conversation above.

1) Congress has taken a severe beating
present perfect tense of 'Take a severe beating = Be defeated/ lose something especially, money or prestige = ఓడిపోవటం/ కోల్పోవటం.

a) The English team has taken a/some/a severe beating in the last cricket series =మొన్న జరిగిన క్రికెట్‌ పోటీల్లో ఇంగ్లిష్‌ జట్టు ఘోరంగా దెబ్బతింది/ ఓటమిపాలయింది.
b) Bharat: Charith is nowhere to be seen. He has gone into hiding or what?(చరిత్‌ ఎక్కడా కన్పట్టంలేదు. ఎక్కడైనా దాక్కున్నాడా ఏంటి?)
(Go into hiding =దాక్కోవటం)

Pandavas went into hiding during their one year of unknown existence (అజ్ఞాతవాసం)

Subhas: You can say that. Havi ng taken a severe beating in the corruption case, he has no courage to face anybody (నువ్వా మాట అనొచ్చు. అవినీతి కేసులో పూర్తిగా దెబ్బతిని, ఎవర్నీ ఎదుర్కొనే ధైర్యం లేదతనికి)

2) To lay it on the line
ఇది చాలా modern expression = To tell somebody the truth they may not like=నిజం చెప్పేయటం, అవతలివాళ్లకు నచ్చకపోయినా/ బాధ కలిగించినా.

a) Charan: Why is Prameela so down? (ప్రమీల ఎందుకంత నిరాశగా ఉంది?)
Divya: The manager has laid it on the line - some people may not get promotions, Prameela among them. (Manager మనకు బాధ కల్గించే యదార్థాన్ని చెప్పాడు- ప్రమీలతో సహా కొంతమందికి promotions రాకపోవచ్చని)

b) Praneetha: What's worrying you? (ఎందుకంత ఆందోళనగా ఉన్నావు?)

Yashvanth: I have to lay it on the line to Mahesh and tell him that his work is no good and that he is going to lose his job (మహేష్‌కు నచ్చని నిజం చెప్పాలి నేను. అతని పనితీరేం బాగా లేదు అని, అతని ఉద్యోగం పోతుందని.)

c) Lay it on the line to her, she is not among those selected =ఆమెతో చెప్పేయ్‌, ఈ నిజం ఆమెకు నచ్చకపోయినా- ఎంపికయినవాళ్ళలో ఆమె లేదు.

3) Get/have a foot in the door =అవకాశం పొందటం (ఏ రంగంలోనైనా, పైకి వెళ్ళేందుకు)
a) She had always wanted to be a film star, but had to wait for two years to get a foot in the door/have a foot in the door =ఆమె సినిమా తార కావాలని కోరుకునేది. కానీ చిత్రసీమలో అడుగుపెట్టే అవకాశం పొందడానికి రెండేళ్లు పట్టింది.

b) Karim: Charles appears innocent. (Charles అమాయకుడిలా కన్పిస్తున్నాడు)
Abdulla: You are mistaken. He is quite Smart. Let him have just his foot in any thing, he will soon rise to the top (నువ్వు పొరబడ్డావు. అతను చాలా తెలివి కలవాడు. ఎక్కడైనా కాలూనేంత సందు దొరికితే చాలు, పైకి అల్లుకుపోతాడు)

4) Run circles around somebody = Run rings around somebody = ఇది కూడా modern expression=ఒకర్ని మించిపోవటం.
a) Purandhar: Hema is a great dancer, I know, but what about Rajitha? (హేమ గొప్ప నర్తకి అని నాకు తెలుసు. కానీ రజిత సంగతేంటి?)
Yugandhar: She is even greater. She can run circles/ rings around Hema =ఆమె ఇంకా గొప్పది. ఆమె హేమకన్నా చాలా రెట్లు ఎక్కువ/ హేమను ఎంతో మించిపోతుంది.

b) Dhanush: The shore temples of Mahabalipuram are a marvel of architecture and sculpture =మహాబలిపురం సముద్రతీరపు గుళ్ల వాస్తు, శిల్పశాస్త్రం అద్భుతాలు.
Avinash: They certainly are; but the temples of Konark and their sculptures run circles/rings around the Mahabalipuram temples. (కచ్చితంగా. కానీ కోణార్క గుళ్లు, శిల్పాలు వాటిని ఎన్నోరెట్లు/ చాలా రెట్లు మించిపోయాయి)

Sunday, 20 November 2011

ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ మేలు?


బీటెక్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌) చదువుతున్నాను. తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఏ స్పెషలైజేషన్లతో ఎంబీఏ చేస్తే ప్రయోజనం ఉంటుంది?
- జి. ప్రసన్నకుమార్‌, విశాఖపట్నం

బీటెక్‌ పూర్తయ్యాక ఎంబీఏ చేయడం ద్వారా మీ ఉద్యోగ అవకాశాలకు బాగా మెరుగుపరచుకోవచ్చు. సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాల ద్వారా మంచి కెరియర్‌ను అందుకోవచ్చు. ఎంబీఏలో అనేక ఫంక్షనల్‌ స్పెషలైజేషన్లు, సెక్టోరల్‌ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేన్ని ఎంచుకోవాలనే విషయంలో స్పష్టత అవసరం. మీ ఆసక్తి, అభిరుచిని బట్టి ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, తదితర ఫంక్షనల్‌ స్పెషలైజేషన్‌లను ఎంచుకోవచ్చు. కొన్ని ప్రత్యేక రంగాలపై ఆసక్తి ఉంటే సెక్టోరల్‌ స్పెషలైజేషన్లను తీసుకోవచ్చు. టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, మీడియా మేనేజ్‌మెంట్‌, మొదలైనవాటికి మంచి డిమాండ్‌ ఉంది. ఇవిగాక ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌, ఫారిన్‌ ట్రేడ్‌, ఐటీఈఎస్‌, తదితర రంగాలకు సంబంధించిన స్పెషలైజేషన్లు కూడా ఎంచుకోవచ్చు.

మంచి ప్రమాణాలు పాటించే బిజినెస్‌ స్కూల్‌లో మీకు నచ్చిన ఏ స్పెషలైజేషన్‌లో ఎంబీఏ చేసినా ప్రయోజనం ఉంటుంది. కొన్ని సంస్థల్లో డ్యుయల్‌ స్పెషలైజేషన్‌ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ కోర్సుల ద్వారా రెండు రంగాలకు సంబంధించిన మేనేజ్‌మెంట్‌ అంశాల్లో నైపుణ్యం సాధించవచ్చు.

* నేను ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలో బీబీఏ (ఫైనాన్స్‌) చదువుతున్నాను. బీబీఏ తర్వాత ఎంబీఏ చేయడం మంచిదేనా? బీబీఏతో ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
- కె. మధు, హైదరాబాద్‌

ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌తో బీబీఏ చేయడం మంచి ఆలోచన. బీబీఏ అభ్యర్థులకు ఆర్గనైజేషనల్‌ స్కిల్స్‌, మేనేజ్‌మెంట్‌ భావనలు, వ్యాపార క్రమశిక్షణ అంశాల్లో నైపుణ్యం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార ప్రణాళిక, ఆచరణాత్మక అంశాల్లో కూడా సామర్థ్యం ఉంటుంది. అందువల్ల సరైన సంస్థలో బీబీఏ చేసిన అభ్యర్థులకు ప్రస్తుతం కంపెనీలు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి.

బీబీఏ తర్వాత ఎంబీఏ చేయాలా, వద్దా అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి... మీ ఆప్టిట్యూడ్‌, కెరియర్‌ లక్ష్యాలు, ఆర్థిక అవసరాలు. బీబీఏ డిగ్రీతో ఏదైనా కంపెనీలు మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ లేదా ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీగా ఉద్యోగం సాధించవచ్చు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, కన్సల్టెన్సీ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, అడ్వర్టయిజింగ్‌, తదితర రంగాల్లోని కంపెనీలు బీబీఏ అభ్యర్థులకు మంచి వేతనాలతో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాయి. కనీస వేతనం రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. బీబీఏ పూర్తయ్యాక మంచి ఉద్యోగం రావాలంటే ఇప్పటినుంచే సాఫ్ట్‌స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ అంశాలపై దృష్టిపెట్టాలి. ఇంకా ఉన్నత కోర్సులు చేయాలనుకుంటే, ఎంబీఏ చదవచ్చు. క్యాట్‌, మ్యాట్‌, ఎక్స్‌ఏటీ, తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో మంచి స్కోరు సాధించి, పేరున్న సంస్థలో ఎంబీఏ చేయడం మంచిది. బీబీఏ తర్వాత రెండేళ్లు ఏదైనా కంపెనీలో పనిచేసి అనుభవం సాధించాక ఎంబీఏ చేయడం ఇంకా మంచిది. దీనికి నిబద్దత, అంకితభావం అవసరం.

* జీమ్యాట్‌ రాయబోతున్నాను. మనదేశంలోనే మంచి సంస్థలో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ జీమ్యాట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకునే సంస్థలను సూచించగలరు.
- ఆర్‌. నరేష్‌, గుంటూరు

జీమ్యాట్‌కు మనదేశంలో ఆదరణ పెరుగుతోంది. అనేక ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు జీమ్యాట్‌ను ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జీమ్యాట్‌ రాసే భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా www.mba.com/indiaపేరుతో ఓ అధీకృత వెబ్‌సైట్‌ ఉంది. వివిధ అంశాల్లో నాణ్యతా ప్రమాణాల ఆధారంగా బిజినెస్‌ స్కూళ్లను వర్గీకరించి జీమ్యాట్‌ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జీమ్యాట్‌ ఆధారంగా అంతర్జాతీయ స్థాయి బిజినెస్‌ స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకు ఈ వెబ్‌సైట్‌ చాలా ఉపయోగపడుతుంది. ఐఎస్‌బీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఐఎంలు, అనేక ఇతర ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ స్కూళ్లు జీమ్యాట్‌ స్కోరును ఆమోదిస్తున్నాయి. కొన్ని ప్రముఖ సంస్థలు... ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, హైదరాబాద్‌; ఇండియన్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంలు): అహ్మదాబాద్‌, బెంగళూరు, కలకత్తా, ఇండోర్‌, లక్నో; ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ, జంషెడ్‌పూర్‌; టాటా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ముంబాయి; ఎస్‌పీ జైన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, ముంబాయి; నార్సీ మోంజీ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ముంబాయి; ఐఐఎఫ్‌టీ, న్యూఢిల్లీ.

- ప్రొ. ఎం. భాస్కరరావు

Saturday, 19 November 2011

దూర విద్యలో ఎం.ఎడ్‌.


దూరవిద్య కోర్సులకు ప్రసిద్ధిగాంచిన ఇగ్నో మాస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎం.ఎడ్‌.) కోర్సును నిర్వహిస్తోంది.

ఈ కోర్సుకు ఎన్‌సీటీఈ గుర్తింపు ఉంది. విద్యారంగంలో పనిచేస్తోన్న వారికి ఈ కోర్సు వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తోన్న గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు, కాలేజీలు, ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థల్లో పనిచేస్తోన్నవారు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ ఇగ్నో ఎం.ఎడ్‌. చేయవచ్చు.

ఇగ్నో ఎం.ఎడ్‌. కోర్సు ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా నాలుగేళ్లలో కోర్సు పూర్తిచేయవచ్చు.

కనీసం 55 శాతం మార్కులతో బి.ఎడ్‌. ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎడ్‌ తర్వాత ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలు, విద్యా పరిశోధన సంస్థలో కనీసం రెండేళ్లు పనిచేసుండాలి.

కోర్సు మొత్తానికి ఫీజు రూ.36000. ప్రవేశ సమయంలో మొత్తం ఫీజు చెల్లించాలి. ప్రింటెడ్‌ మెటీరియల్‌, ఆడియో, వీడియో ప్రోగ్రామ్‌లు, ఫీల్డ్‌ ప్రాజెక్టులు, వర్క్‌షాప్‌లు, అసైన్‌మెంట్లు, టెలీకాన్ఫరెన్స్‌లు, తదితర సాధనాల ద్వారా కోర్సును నిర్వహిస్తారు.

దేశవ్యాప్తంగా 51 ఇగ్నో ప్రాంతీయ కేంద్రాల్లో, 33 ప్రోగ్రామ్‌ స్టడీ సెంటర్లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. కోర్సు జనవరి 2012 నుంచి ప్రారంభమవుతుంది.

దరఖాస్తులను ఇగ్నో వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా అన్ని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాల నుంచి పొందవచ్చు. మనరాష్ట్రంలో ఇగ్నో హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల నుంచి దరఖాస్తులు పొందవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ  20 నవంబరు 2011.

ఇతర వివరాలు ఇగ్నో వెబ్‌సైట్‌ లో లభిస్తాయి.