ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 20 September 2011

గ్రూప్‌-1... తుది మెరుగులు ఎలా?

    గ్రూప్‌-1 లో ప్రాథమిక పరీక్ష దశను విజయవంతంగా అధిగమించిన అభ్యర్థులు మరో ముఖ్య ఘట్టానికి చేరువవుతున్నారు. ఈ నెల 25 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు మొదలవబోతున్నాయి. పరీక్ష రాయబోయే అభ్యర్థులకు మిగిలిన ఈ ఐదు రోజులూ ఎంతో కీలకమైనవి. ఈ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేదెలా? టాపర్‌ చెపుతున్న కిటుకులు తెలుసుకోండి... ఆచరించండి... విజయీభవ!

    వ్యాసం రాసేటపుడు 800-900 పదాలు, లేదా 4 పేపర్లలో పూర్తి చేయడం మంచిది. ఇందులో విశ్లేషణ, గణాంకాలు సమపాళ్లలో ఉండాలి. సమకాలీన అంశాలు, ఉదాహరణలు ఇస్తూ సామెతలు, ప్రముఖ వ్యక్తుల సూక్తులను ఉపయోగిస్తూ రాస్తే ప్రభావశీలంగా ఉంటుంది.

2008 గ్రూప్‌-1 పరీక్షలో రాష్ట్రస్థాయి 4వ ర్యాంకును సాధించారు సి. నారాయణరెడ్డి. రాతపరీక్షలో రాష్ట్రస్థాయిలో ఆయన మొదటి ర్యాంకర్‌. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల ఆర్డీవోగా పనిచేస్తున్న నారాయణరెడ్డి అభ్యర్థులకు ఉపకరించే మెలకువలూ, సూచనలూ తెలిపారు. ఈ తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా విజయవంతంగా పరీక్షలు రాయాలీ... ఇవన్నీ ఆయన మాటల్లోనే చదవండి!


గ్రూప్‌-1 అంటే రాష్ట్రస్థాయిలో అత్యున్నత సర్వీసులు. బాగా పోటీ ఉండే ఈ పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తమ స్థాయిలో ప్రతిభ ప్రదర్శించటం తప్పనిసరి.

గ్రూప్‌-1 పరీక్షలు రాయబోయేవారు వివిధ సందేహాల్లో చిక్కుకుని ఆందోళన పడుతుంటారు. దీన్ని మొదట తగ్గించుకోవాలి. ఇప్పటివరకూ చదివిన అంశాలను ఎలా పునశ్చరణ (రివిజన్‌) చేయాలి, పరీక్ష కేంద్రంలో సమయం సరిపోతుందా, ఒక ప్రశ్నకు జవాబు ఎన్ని పదాల్లో రాయాలి, జవాబు సంక్షిప్తంగా రాయాలా... లేదా పాయింట్ల వారీగా రాయాలా, సైడ్‌ హెడింగులు వాడాలా వద్దా, రెడ్‌ పెన్‌ ఉపయోగించాలా వద్దా... ఇవన్నీ అనుమానాలే! ఓ పక్క ఇవి మనసును తొలిచేస్తుంటే ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించాలంటే..

* పరీక్ష టైంటేబుల్‌ను పరిశీలిస్తే పేపర్‌-1కు మధ్యలో ఎలాంటి విరామం లేకుండా పేపర్‌-2 ఉంది. మిగతా పేపర్లకు ఒకరోజు విరామం ఉంటుంది. కాబట్టి, అభ్యర్థులు మొదట పేపర్‌-1 సంబంధించి పునశ్చరణ చేయాలి. ఇలా 22వ తేదీ వరకు పూర్తిచేస్తూనే అవసరాన్నిబట్టి మిగతా పేపర్లకు సమయాన్ని కేటాయించాలి.

23, 24 తేదీల్లో పూర్తిగా జనరల్‌ ఇంగ్లిష్‌నే చదవాలి. అయితే చాలామంది ఇందులో కేవలం పాస్‌ మార్కులు వస్తే చాలు అన్నట్లుగా ఉంటారు. ఇక్కడే అభ్యర్థులు దెబ్బతింటున్నారు. దీని సన్నద్ధతకు ఇంటర్‌ స్థాయి ఇంగ్లిష్‌ గ్రామర్‌ (వ్యాకరణం) చదివితే చాలు.

* పేపర్‌-1 నుంచి పేపర్‌-4 వరకు ప్రతిరోజూ పరీక్ష రాసి వచ్చిన సాయంత్రం నుంచే మిగతా పేపర్లకు సంబంధించి పునశ్చరణ చేయాలి. ఇక్కడ మొత్తం సిలబస్‌ కవరయ్యేవిధంగా అధ్యయనం చేయాలి. వీలైనంత వరకు ఈ సమయంలో కొత్త ప్రశ్నలు, ప్రిపరేషన్‌ వైపు పోకూడదు. గతంలో తయారుచేసుకున్న నోట్సు/ పుస్తకాలనే చదవాలి. అంతేకానీ కొత్తవాటి జోలికి వెళ్ళకూడదు. ఇవన్నీ ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

* పేపర్‌-1లో మూడు వ్యాసాలను (ఎస్సేలు) రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి పునశ్చరణ సమయంలో తాను తయారుచేసుకున్న వ్యాసాలను క్షుణ్ణంగా చదవాలి. పరీక్ష సమయంలో ఒక వ్యాసం రాయటానికి గంట సమయం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ప్రశ్నలను మొదట పూర్తిగా చదవాలి.

ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి వ్యాసాన్ని ఎంపిక చేసుకోవాలి. జాగ్రత్తగా గమనిస్తే అడిగిన ప్రశ్నలోనే వ్యాసం 'స్కెలిటన్‌' దాగి ఉంటుంది.

ఒకవేళ చదివివుండని, తయారవ్వని వ్యాసం వస్తే? హైరానా పడకూడదు. మనం చదివిన విషయాలను ఉపయోగిస్తూ వీలైనంతవరకు వ్యాసాన్ని సమర్థంగా రాయటానికి ప్రయత్నించాలి.

రాసేటపుడు సైడ్‌ హెడింగులు, చిత్రాలు, పాయింట్‌ వారీగా రాస్తే మనం చెప్పాలనుకున్నది స్పష్టంగా ఉంటుంది. అయితే వ్యాసం రాసేటపుడు 800-900 పదాలు, లేదా 4 పేపర్లలో పూర్తి చేయడం మంచిది. ఇందులో విశ్లేషణ, గణాంకాలు (డాటా) సమపాళ్లలో ఉండాలి. వీలైనంతవరకూ సమకాలీన అంశాలు, ఉదాహరణలు ఇస్తూ సామెతలు, ప్రముఖ వ్యక్తుల సూక్తులను ఉపయోగిస్తూ రాస్తే ప్రభావశీలంగా ఉంటుంది.


* పేపర్‌-2లో ఎక్కువగా సబ్జెక్టు ఉంటుంది. 15 చాప్టర్లు కవరయ్యేవిధంగా ప్రణాళికాబద్ధంగా పునశ్చరణ చేయాలి. ముందుగా అన్ని అధ్యాయాలనూ (చాప్టర్లు) పూర్తి చేయాలి. అయితే ముందు చాప్టర్లకు ఎక్కువ సమయాన్ని కేటాయించి చివరివి వదిలిపెడతారు. ఇది సరి కాదు.

చరిత్రలో రాజవంశీయులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక, చిత్రకళా రంగాలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్లు తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. భారత రాజ్యాంగంలో ముఖ్యమైన ఆర్టికల్స్‌తో పాటు సమకాలీన రాజకీయ అంశాలను కూడా తప్పనిసరిగా మననం చేసుకోవాలి.

* పరీక్షా సమయంలో ప్రశ్నపత్రం తీసుకున్న వెంటనే ఒక విభాగం (సెక్షన్‌) లోని అన్ని ప్రశ్నలూ ఓసారి పూర్తిగా చదివి బాగా తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాయడం చేయాలి. దీనివల్ల ఆందోళన తగ్గుతుంది. రాతలో వేగం లేకపోవడం, అక్షరాలు సరిగా కుదరకపోవడం వంటి సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఒక విభాగానికి సంబంధించిన ప్రశ్నలను ఒకే దగ్గర రాయటం ఉత్తమం.

* పేపర్‌-3 లో భారత ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను సరిపోలుస్తూ చదవడం మంచిది. జవాబు రాసేటపుడు విశ్లేషణతో పాటు గణాంకాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. కచ్చితంగా తెలియని డాటాను సుమారుగా అనే పదాన్ని ఉపయోగించడం మంచిది. వీలైనంతవరకూ తెలియని గణాంకాల జోలికి వెళ్లరాదు.

* పేపర్‌-4 లో మూడు విభాగాలు, మూడు విభిన్న అంశాలు ఉంటాయి. అయితే ప్రతి సెక్షన్‌లో ప్రాథమిక శాస్త్రీయ అంశాలు పునశ్చరణ చేస్తూ వాటిని సమకాలీన సమాజంలో ఏవిధంగా ఉపయోగిస్తున్నారు అనేది తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. పరీక్షా సమయంలో వీలైనంతవరకు శాస్త్రీయ పదాలను ఉపయోగిస్తూ, సులభంగా విశ్లేషిస్తూ, సమకాలీన అంశాలను అన్వయిస్తూ జవాబులు రాయాలి.

* పేపర్‌-5 ముఖ్యంగా ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉన్న పేపర్‌. అయితే ఇది నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులను కొంత ఇబ్బంది పెట్టే అవకాశమున్న పేపర్‌ కూడా. ముఖ్యంగా పునశ్చరణ సమయంలో సూత్రాలు, సమస్యా పరిష్కార పద్ధతులు నేర్చుకోవాలి.

పరీక్షా సమయంలో ముందుగా ప్రశ్నలో ఏమి ఇచ్చారు.. ఏమి కనుక్కోమన్నారు.. అనేవి అర్థం చేసుకోవాలి. ఈపేపర్‌లో మనం చదివిన అంశాలపైనే ప్రశ్నలుంటాయని మర్చిపోరాదు. కాబట్టి ప్రశ్నలను చూడగానే ఆందోళన చెందరాదు.
 

No comments:

Post a Comment