ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 26 September 2011

గ్రూప్-2లో గెలుపు మలుపు!

 గ్రూప్‌-2 పరీక్ష మరో 20 రోజుల్లో!

ఈ తరుణంలో ఒత్తిడి పెరగటం సహజం. గ్రూప్‌-1 అభ్యర్థులు చాలామంది కారణాలు ఏవైనా,  గ్రూప్‌-2 వైపే మొగ్గు చూపి, ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. 2008 గ్రూప్‌-2 అభ్యర్థుల పోటీ ఎలాగూ ఉంటుంది.

లక్షలమంది కొత్తవారు రణక్షేత్రంలో ప్రవేశించారు.

మిగిలింది అంతిమ పరీక్షలూ, ఫలితాలే!

మరి గెలుపు మలుపులో ఉన్న మీలాంటి అభ్యర్థులు విజేతలు కావాలంటే ఏం చేయాలో వివరిస్తున్నారు కొడాలి భవానీ శంకర్‌.

 గ్రూప్స్‌ పరీక్ష అనగానే లక్షల మందితో పోటీ అనే భావన ఉంటుంది. కానీ అన్ని సామర్థ్యాలతో, లక్షణాలతో చివరివరకూ కొనసాగేవారు 10 వేలమంది లోపే. మళ్లీ వీరిలో సరైన అవగాహనతో చివరి రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు రెండు మూడు వేల మందే! వీరే అంతిమంగా విజయం సాధిస్తారు. అందువల్ల ఈ సమయాన్ని ఏకాగ్రతతో, ప్రణాళికాయుతంగా వినియోగించుకునే లక్షణాలుంటే పరీక్ష రాయకముందే లక్ష్యం చేరుకున్నట్లే!

ఇంతకీ గ్రూప్‌-2కి కావాల్సిన ఆ లక్షణాలు ఏమిటి?

మారుమూలవి సైతం...
ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి సిలబస్‌ అంశాలన్నిటినీ పరిగణించి చదవారా? లేదా? అన్నది కీలకం. 'నాకు ఈ చాప్టర్‌ కష్టం. ఈ పేపర్‌ కష్టం' అని నిర్థారించుకొని వాటిని వదిలేసివుంటే వాటిమీద ఇప్పుడు దృష్టి నిలపాలి. ఆబ్జెక్టివ్‌ విధానంలో బిట్‌ని ఎక్కడి నుంచైనా అడగవచ్చు. కాబట్టి మారుమూల అంశాల్ని సైతం పరిగణించాల్సిందే.

బిట్లు బిట్లుగా చదవొద్దు
ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు క్వశ్చన్‌ బ్యాంకుపై ఆధారపడి అధ్యాయాల వారీగా బిట్లు చదువుతూ ఉంటారు. ఇలాంటివారు ఈ ఇరవై రోజుల్లోనైనా, చాప్టర్లని టాపిక్‌ వారీగా చదవాలి. ఇందులో నుంచి ఏ బిట్లు వస్తాయనేది అంచనా వేయడం చేస్తుండాలి. ముఖ్యంగా విశ్లేషణాత్మక ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే ఈ తరహా సన్నద్ధత తప్పనిసరి.

పండ్లున్న చెట్టుకే రాళ్ళు వేయాలా?
ఈ సూత్రం పోటీ పరీక్షలకు వర్తించదు. సగటు గ్రూప్‌-2 అభ్యర్థి పేపర్‌-2లో ఎక్కువ మార్కులు తక్కువ శ్రమతో వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడతాడు. ఇది నిజం కూడా కావచ్చు. కానీ పరీక్షలో పేపర్‌-I, IIIలు కూడా 150 మార్కుల చొప్పున అంతే ప్రాధాన్యం కలిగినవేనని గుర్తించాలి. కొంతమంది పేపర్‌ III క్లిష్టమైనది కాబట్టి దాని సంగతి చూడాలని అధిక కాలం అందుకోసమే వెచ్చిస్తారు. ఇలాంటి ధోరణులలో ఇప్పటివరకూ సన్నద్ధత కొనసాగివుంటే ఈ పరిమిత సమయాన్ని ఇలా ఉపయోగించుకోవడం అనేది విజయానికి కావాల్సిన లక్షణమే.

గరిష్ఠ అవధి ఎంత?
పరీక్ష సిలబస్‌ అంశాలను బట్టి, సబ్జెక్టు స్వభావాన్ని బట్టి ఒక్కో సబ్జెక్టులో అధిక ఫలితం, ఒక్కో దానిలో తక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా గ్రూప్‌-2 సిలబస్‌ని బట్టి మూడు పేపర్లలో ఎలాంటి గరిష్ఠ స్కోరు సాధించే అవకాశం ఉందో చూద్దాం.
ఇలాంటి గరిష్ఠ పరిమితిని దృష్టిలో పెట్టుకొని, ఆ స్థాయికి చేరుతున్నామా? లేదా? అని ప్రశ్నించుకోవాలి. అందుకు అనుగుణంగా సన్నద్ధతలో మార్పుల్ని ఈ తరుణంలో వినియోగించుకోవడం మంచిది.

గణాంకాల ప్రాధాన్యం
చారిత్రక సంవత్సరాలు, రాజ్యాంగ సవరణలు, చట్టాలు, ఆర్టికల్స్‌ లాంటి గణాంకాలు పేపర్‌-2లో కీలకం. అలాగే జనరల్‌ స్టడీస్‌లో కూడా సబ్జెక్టుల వారీగా గణాంకాలు భారీగానే ఉన్నాయి. ఆబ్జెక్టివ్‌ పరీక్ష, పైగా గ్రూప్‌-2 స్థాయి కాబట్టి గణాంకాలపై ప్రశ్నలే అధికం. పేపర్‌-III విషయమైతే గణాంకాల కోణాన్ని ఇక చెప్పనక్కర్లేదు.

అయితే గణాంకాలు గుర్తించుకునేందుకు తెలివిగా తర్కాన్ని అభివృద్ధి చేసుకోవాలి. గణాంకాలలో వేటిని చదవాలి? వదిలేయాలి అని నిర్ణయించుకోవడమే స్మార్ట్‌ వర్క్‌. గణాంక సమాచారంపై ఇలాంటి దృష్టి పెట్టేందుకు కొంత సమయాన్ని వెచ్చించవచ్చు.


No comments:

Post a Comment