ఇంజినీరింగ్ /టెక్నాలజీ /ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశం కావాలి. అది కూడా విశ్వవిఖ్యాతి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీలతో పాటు ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో...!
'గేట్' రాస్తే ఇది సాధ్యమే!
ఈ పరీక్షలో చూపే ప్రతిభ ఆధారంగా పీజీ కోర్సుల్లో ప్రవేశంతో పాటు ఉపకారవేతనాలు కూడా లభిస్తాయి. రెండేళ్ల నుంచీ గేట్ పరీక్షలో కొన్ని మార్పులు జరిగాయి. 'గేట్' ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం!
దీన్ని రాసినవారు వై.వి. గోపాలకృష్ణమూర్తి
గేట్ స్కోరును ఇతర దేశాల్లో కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో కూడా గేట్‌ను ప్రామాణిక పరీక్షగా గుర్తిస్తారు. బార్క్, సిఎస్‌ఐఆర్ సంస్థల పోటీ పరీక్షల్లోనూ గేట్‌లో సాధించిన ప్రతిభకు తగిన ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా గేట్ స్కోరు ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి.
గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)ను ఐఐటీలు సంయుక్త ఆధ్వర్యంలో ఏటా ఫిబ్రవరి రెండో ఆదివారం నిర్వహిస్తాయి. ప్రశ్నపత్రం స్థాయి కూడా ఆ సంస్థలకున్న పేరు ప్రతిష్ఠలకు అనుగుణంగానే ఉంటుంది. అందువల్ల ఈ పరీక్ష రాయదలుచుకున్న ప్రతి ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థీ ప్రణాళికాబద్ధంగా శ్రమించాల్సిందే. ఈసారి గేట్ పరీక్షను ఐఐటీ-ఢిల్లీ నిర్వహించనుంది.
ప్రస్తుత గేట్ పరీక్ష విధానాన్ని పూర్తి ఆబ్జెక్టివ్ పేపర్‌గా పరిగణించలేము. కామన్ డేటా ఆధారిత ప్రశ్నలు, లింక్డ్ ఆన్సర్ ప్రశ్నలను సంప్రదాయ ప్రశ్నలుగానే భావించాలి. అందువల్ల ఐదు నుంచి పది నిమిషాల సమయం తీసుకునే సమస్యలను కూడా బాగా సాధన చేయాలి.
పరీక్ష విధానం
గేట్ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాలుంటాయి.
విభాగం- |: ఇందులో 1 నుంచి 25 వరకు ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
విభాగం- ||: 26 నుంచి 55 వరకు మొత్తం 30 ప్రశ్నలు ఈ విభాగంలో ఉంటాయి. వీటన్నింటికీ కలిపి 60 మార్కులు కేటాయించారు.
* 48 నుంచి 51 వరకు ఉండే ప్రశ్నలను 'కామన్ డేటాబేస్డ్' ప్రశ్నలంటారు. అంటే ఇచ్చిన డేటా నుంచి రెండు జతల ప్రశ్నలు (48-49, 50-51) ఇస్తారు.
* 52 నుంచి 55 వరకు ఉండే నాలుగు ప్రశ్నల్లో ఒక్కోదానికి రెండు మార్కులు కేటాయించారు. వీటిని 'లింక్డ్ ఆన్సర్' ప్రశ్నలంటారు. ఈ నాలుగు ప్రశ్నల్లో రెండు జతలు ఉంటాయి. వీటిలో రెండో ప్రశ్న సమాధానం మొదటి ప్రశ్న సమాధానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ జతలోని మొదటి ప్రశ్న సమాధానం సరైనదైతేనే రెండో ప్రశ్న సమాధానాన్ని పరిశీలిస్తారు. మొదటి ప్రశ్నకు సమాధానం తప్పు అయితే రెండో ప్రశ్న సమాధానం సరైనప్పటికీ పరిగణనలోకి తీసుకోరు.
విభాగం-|||: గత రెండేళ్ల నుంచి గేట్ పరీక్షలో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంగ్లభాషా ప్రావీణ్యం, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారు. వీటికి మొత్తం 15 శాతం ప్రాధాన్యం ఉంది. ఇవి 56 నుంచి 65వ ప్రశ్న వరకు ఉంటాయి. 56 నుంచి 60 వరకు ఉండే 5 ప్రశ్నలకు ఒక్కోదానికి 1 మార్కు, 61 నుంచి 65 వరకు ఉండే 5 ప్రశ్నలకు ఒక్కోదానికి 2 మార్కులు ఉంటాయి.
* ఆంగ్లభాషా ప్రావీణ్యానికి సంబంధించిన వ్యాకరణం, వాక్యపూరణం, వెర్బల్ ఎనాలజీ, వర్డ్‌గ్రూప్స్, ఇన్‌స్ట్రక్షన్స్, క్రిటికల్ రీజనింగ్, వెర్బల్ డిడక్షన్ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. ఈ ప్రశ్నలు ఐఐఎంలు నిర్వహించే క్యాట్, విదేశాలలో ఉన్నత విద్యకోసం నిర్వహించే GRE పరీక్షల్లోని ప్రశ్నల మాదిరి ఉంటాయి. కాబట్టి ఆ పుస్తకాలను కూడా చదవడం మంచిది.
న్యూమరికల్ ఎబిలిటీ: జనరల్ ఆప్టిట్యూడ్‌లో రెండేళ్ల నుంచి న్యూమరికల్ ఎబిలిటీని ప్రవేశపెట్టడం మరో కొత్త అంశం. ఇందులో న్యూమరికల్ కంప్యుటేషన్, న్యూమరికల్ ఎస్టిమేషన్, న్యూమరికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లకు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్యాట్ పరీక్షకు సంబంధించిన పుస్తకాల్లో ఈ సమాచారం లభిస్తుంది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల జనరల్ స్టడీస్ మెటీరియల్ కూడా ఉపయోగపడుతుంది.
ఈ విభాగం IIIలోని సిలబస్ గేట్ అభ్యర్థులకు కొంత భారంగా అనిపించవచ్చు. కానీ ఈ సన్నద్ధత అనేక ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని సవాలుగా తీసుకుని సిద్ధం కావాలి.
నెగటివ్ మార్కులతో జాగ్రత్త
గేట్ పరీక్షలో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం నెగిటివ్ మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున నెగిటివ్ మార్కులుంటాయి. అయితే విభాగం ||లోని లింక్డ్ ఆన్సర్ ప్రశ్నల్లో రెండో దానికి సమాధానం తప్పు అయినప్పటికీ నెగటివ్ మార్కులుండవు.
ప్రస్తుత గేట్ పరీక్ష విధానాన్ని పూర్తి ఆబ్జెక్టివ్ పేపర్‌గా పరిగణించలేము. కామన్ డేటా ఆధారిత ప్రశ్నలు, లింక్డ్ ఆన్సర్ ప్రశ్నలను సంప్రదాయ ప్రశ్నలుగానే భావించాలి. అందువల్ల ఐదు నుంచి పది నిమిషాల సమయం తీసుకునే సమస్యలను కూడా బాగా సాధన చేయాలి.
ప్రామాణిక పుస్తకాలనే...
గేట్ రాయబోయే అభ్యర్థులు మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం ప్రధానం. గత ప్రశ్నపత్రాలు, యు.పి.ఎస్.సి. నిర్వహించే ఇంజినీరింగ్, సివిల్ సర్వీసెస్ పరీక్షా పత్రాలను అధ్యయనం చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగటానికి అవకాశం ఉంటుందో తెలుస్తుంది. విషయాన్ని నేర్చుకుంటూనే రాబోయే ప్రశ్నలను అభ్యర్థి తనకు తానుగా విశ్లేషించుకోవడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది.
* గేట్ విజయం సాధించాలంటే అభ్యర్థులు ఇప్పటి నుంచే రోజూ కనీసం 6, 8 గంటలు సాధనకు కేటాయించాలి. ప్రతీ వారాంతం, నెలకోసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. ప్రిపరేషన్‌లో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యమని అభ్యర్థులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయడం కష్టం. 3 గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు సాధించగలమనేది జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మరీ కష్టంగా అనిపించేవీ, ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలనూ వదిలేయడం మంచిది.
ప్రిపరేషన్‌లో కూడా ఇదే సూత్రం పాటించాలి. అందుబాటులో ఉన్న 5 నెలల సమయంలో ఏ అంశాలను చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో నిర్ణయించుకోవాలి.
* గేట్‌లో రెండు మార్కుల లింక్డ్ ఆన్సర్ ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్ చాలా కీలకం కానున్నాయి. వీటిపై అధిక శ్రద్ధ, సాధన తప్పనిసరి.
* ఇంజినీరింగ్ అభ్యర్థులు ఇంజినీరింగ్ మ్యాథ్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. మ్యాథ్స్‌పై తగిన శ్రద్ధ చూపాలి. దీనికి దాదాపు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
No comments:
Post a Comment