డీసీసీ బ్యాంకుల్లో వివిధ ఉద్యోగాల భర్తీ జరగబోతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే నియామక ప్రకటన ఇవ్వకుండా ఆయా జిల్లాల్లో విడివిడిగా ప్రకటనలు ఇస్తున్నారు.
దీనిపై ఆది, సోమవారాల్లో... ఇంకా మంగళవారం ఈనాడు ప్రధాన సంచికలో వచ్చిన వార్తలను ఇక్కడ ఇస్తున్నాం.
హైదరాబాద్ - న్యూస్‌టుడే:
చాలాకాలంగా వూరిస్తూ వస్తున్న సహకార బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో 2,553 పోస్టుల భర్తీకి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) ఆదివారం ప్రకటన జారీ చేయనుంది. ఈ పోస్టుల్లో 1,593 గుమస్తా (క్లరికల్) స్థాయి కాగా 960 సహాయ మేనేజర్ల (ఏఎం) పోస్టులు. ఈ రెండింటికి కూడా కనీస విద్యార్హత డిగ్రీ. అయితే ఏఎం పోస్టులకు డిగ్రీలో 60 శాతం, ఆపైన మార్కులు వచ్చిన వారే అర్హులు. నియామక బాధ్యతను ముంబయిలోని ఐబీపీఎస్‌కు 'ఆప్కాబ్' అప్పగించింది.
ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు.
సెప్టెంబరు 30 ఆఖరు తేదీ.
జిల్లాల వారీగా ఖాళీలను ఆప్కాబ్ తెలియజేస్తుంది. ఉద్యోగాల భర్తీలో స్థానిక రిజర్వేషన్లను పాటిస్తారు. అభ్యర్థులు ఆయా జిల్లాల్లోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
అక్టోబరు 30న రాత పరీక్ష ఉంటుంది.
పరీక్షకు మొత్తం 200 మార్కులు కేటాయించారు.
ఇందులో రాత పరీక్షకు 175 మార్కులు కాగా ఇంటర్వ్యూకు 25 మార్కులు నిర్దేశించారు.
డీసీసీబీ చైర్మన్ అధ్యక్షతన ఇంటర్వ్యూ కమిటీ ఉంటుంది. డీసీసీబీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) జిల్లా మేనేజర్ (డీజీఎం) ఇందులో సభ్యులు. డీసీసీబీ చైర్మన్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసినా ప్రభుత్వం వారి పదవీ కాలాన్ని రెండు దఫాలు పొడిగించింది. ఈ గడువు కూడా అక్టోబరులో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను నిర్వహించే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికలు జరిగితే కొత్త డీసీసీబీ చైర్మన్ల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. అయితే మరో దఫా ఎన్నికలను వాయిదా వేసి, మళ్లీ ప్రస్తుత డీసీసీబీ చైర్మన్లను కొనసాగించే అవకాశముంది. ఇంటర్వ్యూ కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారన్న విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
నియామక ప్రక్రియను డిసెంబరులోగా పూర్తి చేయాలన్న అభిప్రాయంలో 'ఆప్కాబ్' ఉంది.
No comments:
Post a Comment