ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 12 September 2011

‘అంతర్జాలం’ కాదు... ‘ఇంటర్నెట్’!

   
శీర్షిక చూస్తే ఇదేదో భాషా చర్చలా అనిపిస్తుంది కానీ, అది  కాదు!

గ్రూప్-1  మెయిన్స్ కు సంబంధించిన అంశం. ఈ పరీక్షల్లో తెలుగు భాషలో సమాధానాలు రాసేవారు  ఆంగ్ల పదాలను తక్కువగానే వాడాలి.

ఒకవేళ ఇంగ్లిష్‌ పదమే వాడాల్సివస్తే?  తెలుగులిపిలో ఆంగ్లపదం రాయాలి.

మరి పత్రికా భాషను యథాతథంగా రాయవచ్చా?

అలా చేయటం అంత సరైంది కాదు.

ఉదాహరణకు ...  ఇంటర్నెట్‌ అనే పదాన్ని 'అంతర్జాలం' అని పత్రికలు రాస్తున్నాయి కదా? కానీ మీరు గ్రూప్-1 పరీక్షల్లో మాత్రం ‘ఇంటర్నెట్‌’ అని రాయటమే మంచిది. మార్కులు రావటం మనకు ముఖ్యం కదా? అందుకన్నమాట !

కొడాలి భవానీ శంకర్‌ రాసిన ఈ కథనం ఇవాళ చదువు పేజీలో ప్రచురితమైంది. దాన్ని ఇక్కడ చదవండి!
  
 గ్రూప్‌-1 గెలుద్దాం!
    రాష్ట్రస్థాయి నియామకాల్లో ప్రధానమైనది గ్రూప్‌-1 సర్వీస్‌. ఈ సర్వీసులో ఎంపిక కోసం నిర్వహించే మెయిన్స్‌ రాతపరీక్ష తేదీలు దగ్గరపడుతున్నాయి. ఈ కీలక సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అంత ప్రయోజనం! పరీక్షను తిరుగులేని విధంగా రాసేలా సన్నద్ధం కావాల్సిన తరుణమిది!

రెండు వారాల కంటే తక్కువ సమయమే ఉంది గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు! ఏ పోటీపరీక్ష అభ్యర్థుల్లోనైనా వివిధ రకాల ఆలోచనలతో ఉండేవారు కనపడతారు.

* మరో 45 రోజులు వాయిదా పడితే బాగుణ్ణు అనుకునేవారు కొంతమంది.

* ఈ ప్రిపరేషన్‌ ఏదో ఇంకో 30 రోజులముందే ప్రారంభించివుంటే ఎంత బాగుండేది అన్పించేవాళ్ళు కొందరు.

* పరీక్ష ముగిస్తే ఒక పనైపోతుందని ఆలోచించేవాళ్ళు మరికొంతమంది. తమ ప్రిపరేషన్‌ స్థాయే వారిని ఇలా రకరకాలుగా ఆలోచింపజేస్తుంది.

కాలం ఎవరికోసమూ ఆగదు కదా? మరి ఇలాంటి ఆలోచన్లతో ఒత్తిడికి గురయ్యేబదులు ఎలాంటి సంసిద్ధతతో గెలుపు సాధించవచ్చు?

ఎ) ఈ 14 రోజులే కీలకం
2008 గ్రూప్‌-1లో సీటీవోగా ఎంపికై ఉన్నత సర్వీసు పొందేందుకు మళ్ళీ సిద్ధమవుతున్న అభ్యర్థి- 'చివరి నెలలో పడిన శ్రమవల్లనే నాకు విజయం సాధ్యమైంది' అని ప్రస్తావించారు. ఆర్డీవోగా ఎంపికైన రవినాయక్‌ కూడా 'చివరి 15 రోజుల్లో జరిగిన ప్రిపరేషన్‌ నాకు మంచి మార్కులు తెచ్చింద'న్నారు. పరీక్ష దగ్గరయ్యేకొద్దీ రకరకాల ఒత్తిళ్ళ వల్ల విజయానికి దూరమయ్యేవారే ఎక్కువ.

బి) విహంగ వీక్షణం విలువైనది
ఈ రెండువారాల సమయంలో ప్రతి పేపర్లో ఉన్న సిలబస్‌ అంశాల్నీ, చాయిస్‌గా వదిలేయదగిన వాటినీ, తప్పనిసరిగా సిద్ధమవ్వాల్సిన విషయాల్నీ మరొక్కసారి విహంగవీక్షణం చేయాలి. ముఖ్యంగా ప్రశ్నలవారీగా చదివిన అభ్యర్థులు ఈ ధోరణిని అలవర్చుకోకపోతే- ప్రశ్నల మధ్య ఉండే సంబంధంతో జవాబులు తయారుచేస్తే బోల్తాపడే ప్రమాదముంది.

ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యస్థితిపై సమాధానం రాయాల్సివస్తే ఎకానమీలోని 'ప్రాంతీయ అసమానతలు', పేపర్‌-4లోని 'ఆరోగ్య పరిరక్షణ' అంశాలు మొదలైనవాటి మధ్య సంబంధాలు అర్థం చేసుకోవాలంటే ఈ దశలో చేసే విహంగ వీక్షణం బాగా ఉపయోగపడుతుంది. సివిల్స్‌, గ్రూప్స్‌లలో ఈ స్థూల అవగాహన ప్రధానమని గుర్తిస్తే అకడమిక్‌ పరీక్షలకూ, పోటీ పరీక్షలకూ మధ్య తేడా కూడా అర్థమవుతుంది!

సి) ఇంగ్లిష్‌ అర్హత పరీక్షే కానీ..
పేపర్ల ప్రిపరేషన్లో పడి ఇప్పటివరకూ జనరల్‌ ఇంగ్లిష్‌ని పెద్దగా పట్టించుకోనివారే అధికం. 2008 గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఇంగ్లిష్‌ పేపర్లో అర్హత పొందకపోవటంతో పేపర్స్‌లో మంచి మార్కులు వచ్చినా ఇంటర్వ్యూకు ఎంపిక కాలేకపోయినవారున్నారు. గ్రామీణ అభ్యర్థులు ఈ పేపర్‌పై దృష్టి పెట్టటం తక్షణావసరం. పట్టణ అభ్యర్థులకు కూడా స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో నైపుణ్యం ఉండొచ్చేమో కానీ వ్యాకరణంపై పట్టు పెద్దగా ఉండదు. అందువల్ల ఈ 14 రోజులూ అభ్యర్థులందరూ ప్రతిరోజూ కనీసం గంట సమయమైనా దీనికి వెచ్చించాలి.

డి) శిక్షణ కేంద్రాల నోట్సుతో జాగ్రత్త
కోచింగ్‌ సెంటర్ల నోట్సునే ఎక్కువమంది అభ్యర్థులు యథాతథంగా చదువుతున్నారు. సమాధానాలు అదే ధోరణిలో రాసే అవకాశం ఉంటుంది ఈ ధోరణి సమాధానాలు దిద్దేవారిని మెప్పించటం కష్టం. అందువల్ల ప్రెజెంటేషన్‌ జాగ్రత్తలు తీసుకుంటూ రాయాలి. ఇలా చేస్తేనే మిగతావారి కంటే అధిక మార్కులు సాధించటానికి వీలుంటుంది. ఈ కోణంలో ఇప్పుడున్న సమయాన్ని వెచ్చించండి.


పట్టు పెంచే 10 అంశాలు
1. ముందస్తు నిర్ణయాలు చేటు
'ఫలానా పేపర్లో తక్కువ వస్తాయనీ', 'పెద్దగా మార్కులు రావనీ'... ఇలా మానసికంగా ముందే నిర్ణయించుకోవద్దు.

2. కష్టంగా ఉంటే కంగారొద్దు
ఏదో ఒక పేపర్‌ కష్టంగా వచ్చిందనుకోండీ. 'ఇక మనకి ఉద్యోగం రానట్టే'నని నిర్ణయించేసుకుని మిగతా పేపర్లను పాడుచేసుకోవద్దు. 'కష్టం' అనేది అభ్యర్థులందరికీ ఒకటే!

3. ఒత్తిడి ఇలా దూరం
'ఇది చాలా ముఖ్యం', 'ఇది ఏమంత ఇంపార్టెంట్‌ కాదు'... ఇలా నిర్ణయించుకుంటే పరీక్ష రాసేటపుడు భంగపడాల్సిందే. 'నాకు అర్థం కాని ప్రశ్నలు కూడా కొన్ని రావొచ్చు' అని ముందుగానే మానసికంగా సిద్ధపడటం మేలు. ఇలా భావించటం వల్ల 'అంచనాలు తలకిందులై' ఒత్తిడికి గురయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది.

4. ప్రతి ప్రశ్నా కొంత
2008 పరీక్షల్లో 24 సంవత్సరాల వయసులో మొదటిసారిగా గ్రూప్‌-1 పరీక్ష రాసి డీఎస్‌పీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థి ఏమన్నారో తెలుసా?- 'ఒక్క ప్రశ్న కూడా వదలకుండా అన్ని ప్రశ్నలూ ఎంతో కొంత సమాధానాలు రాయటమే నా విజయ రహస్యం!' జవాబు తెలియని ప్రశ్నలకు కూడా ఏదో ఒక ప్రశ్నపదం ఆధారం చేసుకుని రాయటం వల్ల కూడా తనకు మార్కులు పెరిగాయని తెలిపారు ఆయన.

5. సాగదీసి రాస్తే లాభం సున్నా
మెయిన్స్‌ పరీక్షలో 'బరువు'కి ప్రాధాన్యం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. ఎడిషనల్‌ పేపర్లు తీసుకుని సమాధానాలు తెగ రాసేస్తుంటారు. డాక్టర్‌ వృత్తి నుంచి సీటీఓగా ఎంపికైన ఓ అభ్యర్థిని- 'చాలా తక్కువ పేజీలు రాశాను. కానీ సూటిగా ప్రశ్నలకు అనుగుణంగా రాశాను' అని చెప్పారు. అందువల్ల రాసేది చక్కగా, విషయం సరిగా లేకుండా ఎడిషనల్స్‌పైన ఎడిషనల్స్‌ రాయటం వల్ల దిద్దేవారికి తలనొప్పి తప్ప లాభం ఉండదు. పరీక్ష కేంద్రంలో ఇతరులను గమనిస్తూ పోటాపోటీగా ఎడిషనల్‌ పేపర్లు తీసుకుని గందరగోళంగా చాటభారతం రాసెయ్యటం వల్ల ప్రయోజనమేమీ ఉండదు.

6. మార్కులను బట్టి జవాబు తీరు
ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు కేటాయించారో గమనిస్తూ సమాధానం పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. అనవసరమైన సోదిని రాస్తూ సమయం వృథా చేసుకోకూడదు.

7. చికాకు కలిగించకూడదు
మీకు బాగా పట్టు ఉన్న ప్రశ్నలకు ముందుగా సమాధానం రాయటం మంచిదే. పేపర్‌ దిద్దేవారికి మీపై మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. అలా అని విభాగాలూ ప్రశ్నలూ కలగాపులగంగా చేసేలా రాయకపోవటం మేలు. ఒక విభాగంలోని ప్రశ్నలను ముందుగా పూర్తిచేసుకుని తర్వాతి విభాగంలోకి వెళ్తేనే మంచిది. దీనివల్ల దిద్దేవారికి చికాకు తగ్గుతుంది. 'ఎన్ని ప్రశ్నలు రాశాడు? ఎక్కడ రాశాడు?' అంటూ వెతుక్కునే శ్రమను ఇవ్వకూడదు.

8. వ్యాసానికి ప్రణాళిక
వ్యాసాలలో ప్రణాళిక వేసుకునేటపుడు చిత్తుప్రతిగా ప్రధాన బుక్‌లెట్‌ చివరిపేజీలో రాయండి. 'చిత్తు ప్రతి' అని రాస్తే చాలు, కొట్టివేయవచ్చు.

9. భాషల మిశ్రమం వద్దు
వేర్వేరు ప్రశ్నలను వేర్వేరు భాషల్లో రాయవద్దు. తెలుగు భాషలో సమాధానాలు రాసేవారు ఇంగ్లిష్‌ పదాలను తక్కువగా వాడాలి. ఒకవేళ ఇంగ్లిష్‌ పదమే వాడాల్సివస్తే తెలుగులిపిలో ఆంగ్లపదం రాయాలి. పత్రికా భాషను యథాతథంగా రాయవద్దు. ఇంటర్నెట్‌ అనే పదాన్ని 'అంతర్జాలం' అని పత్రికలు రాస్తున్నాయి. కానీ మీరు ఇంటర్నెట్‌ అని రాయటమే మంచిది.

10. చిన్న మెలకువలు
పెద్ద పేరాగ్రాఫ్‌లు రాయకపోవటం, చిన్న చిన్న వాక్యాల నిర్మాణం, మార్జిన్ల నిర్వహణ మొదలైన మెలకువలు మార్కులు పెంచుతాయని గ్రహించండి.

2 comments:

  1. భావనలు అర్థం చేసుకోవటానికి అనువాదం కావాలి కానీ.. కొత్త పదాలు పుట్టినపుడు అన్ని భాషల్లో అవే పదాలు ఉపయోగిస్తే మంచిది.. ఒక తిక్క శంకరయ్య ఇంటర్నెట్ ను అంతర్జాలం అనీ, ఫైర్ఫాక్స్ ని మంట నక్క అనీ... ఇంకొన్ని ఇలాగే అనువదించి తిక్క బిరుదు పొందాడు..

    ReplyDelete
  2. గ్రూప్-1 మెయిన్స్ 25 వ తేదీ నుంచి... సమయం బాగా దగ్గరపడింది, ‘భాషా విచికిత్స’కిప్పుడు వ్యవధి లేదు! :)

    ReplyDelete