'ఉన్నత విద్య అభ్యసించాలంటే విశ్వవిద్యాలయం ఎంపిక కీలకం.. తొందరపాటు తగదు.. ప్రపంచంలో ఎక్కడ చదవాలనుకున్నా.. తొలుత సమగ్ర అధ్యయనం అవసరం. అనేక విధాలుగా విశ్వవిద్యాలయాల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవాలి. అందుకు అనేక మార్గాలున్నాయి. వాటిని వినియోగించుకుంటే మున్ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు...' అని అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు మైఖేల్ మెక్ రాబీ అన్నారు.
11 రోజుల భారతదేశ పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం 'న్యూస్‌టుడే'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ విశేషాలు ఇవాళ ఈనాడు హైదరాబాద్ సిటీ ఎడిషన్లో వచ్చాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ ఇస్తున్నాం.
అమెరికా విశ్వవిద్యాలయాలకు ఇచ్చే ర్యాంకింగ్ చాలా ప్రతిష్ఠాత్మకమైందని చెప్పిన మైఖేల్ మెక్ రాబీ.. అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే విద్యార్థులను చేర్చాలని సూచించారు. షాంఘై, బీజింగ్ స్థాయిలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చాలా విషయాలు తనను అబ్బుర పరిచాయన్నారు.
ఇంకా అనేక అంశాలపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ప్రశ్న: అమెరికాలో విశ్వవిద్యాలయాలు మూసివేయడం వల్ల భారతీయ విద్యార్థులు కష్టాల పాలవుతున్నారు. ఇందుకు పరిష్కారం ఏమిటి?
జవాబు: ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంది. వివిధ కారణాలరీత్యా ఇటీవల అమెరికాలో రెండు విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. అందువల్ల భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. అయితే విశ్వవిద్యాలయాల ఎంపికలో తొందరపాటు పనికి రాదు. సమగ్ర అధ్యయనం, పరిశీలన తరువాతే వాటిని ఎంపిక చేసుకోవాలి.
ప్ర: విశ్వవిద్యాలయాలను ఎలా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది?
జ: అమెరికాలో వందల సంఖ్యలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసినవి ఆ రెండు మాత్రమే. అంత మాత్రాన అన్నింటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగును ప్రామాణికంగా తీసుకోవాలి. సమాచారం కోసం భారతదేశంలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించవచ్చు. అక్కడ పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అంతర్జాలం(ఇంటర్‌నెట్) ద్వారా తెలుసుకోవచ్చు. ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. విశ్వవిద్యాలయం ఎప్పుడు పుట్టింది? ఎంతమంది విద్యార్థులున్నారు? ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫలితాల తీరు తెన్నులు ఏమిటి? ఆ విశ్వవిద్యాలయానికి ఉన్న గుడ్‌విల్ ఎలా ఉంది? ఇలా అన్ని విషయాలు పరిశీలించాలి. ఆ తరువాతే వాటిని ఎంపిక చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నది నా అభిప్రాయం.
ప్ర: హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో కుదిరిన అవగాహనఒప్పందం విద్యార్థులకు ఎలా ఉపయుక్తం కానుంది?
జ: మేధో సంపత్తి విస్తృతమయ్యే కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు ఆవిష్కృతం అవుతున్నాయి. అక్కడి నుంచి బోధనా సిబ్బందిని ఇక్కడికి పంపటం ద్వారా విద్యార్థులకు పలు అంశాలపై మరింత మేథస్సును పంచేందుకు అవకాశం దొరుకుతుంది. ఆయా అంశాలు వృత్తిగత జీవితానికి ఎంతో ఉపకరిస్తాయి. పరిశోధనాంశాల్లో కూడా రెండు విశ్వవిద్యాలయాలు ఇకనుంచి ముందడుగు వేస్తాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పచ్చదనం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడి ఫ్యాకల్టీ చాలా బాగుంది. వివిధ విషయాలకు సంబంధించిన 12 మంది డీన్స్‌తో అనేకాంశాలను చర్చించాను. వారి ఎక్స్‌పోజర్ ఎంతో విస్తృతంగా ఉంది. నన్ను ఆకట్టుకుంది.
ప్ర: మీ పరిశోధనల్లో ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న పర్యావరణానికి ఎలాంటి స్థానం ఉంది? ఆ రంగంలో అవకాశాలు ఎలా ఉన్నాయి?
జ: పర్యావరణానికి సంబంధించిన ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఈ విషయంలో సామాజిక బాధ్యత కూడా ఉంది. ఇక్కడ చేసిన పరిశోధనల్లో అంశాలు, విధాన నిర్ణయాలుగా కూడా మారాయి. భారతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి పర్యావరణంపై పరిశోధనలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ రంగంలో అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి.
ప్ర: అంతర్జాతీయ విద్యలో భాగంగా చైనా, కెన్యా, మెక్సికోతదితర దేశాల్లో మాదిరిగా 'అవుట్ రీచ్' ప్రాజెక్టుల జాబితాలో భారతదేశం ఉందా?
జ: మా ప్రాథమ్యాల్లో భారతదేశం ఎప్పుడూ ఉంటుంది. అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌ను ప్రస్తుతం భారత్‌లో ప్రవేశపెట్టే యోచన లేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేను. ఇక్కడి విధానాలు సైతం ఒక కారణం కావచ్చు. రెండోది ప్రస్తుతం చేపట్టిన దేశాల్లో వెనుకబాటుతనం చాలా అధికంగా ఉంది.
ప్ర: జీవన ప్రమాణాల మెరుగుదలకు మీ విశ్వవిద్యాలయం లైఫ్‌సైన్సెస్‌లో కీలక పరిశోధనలు చేస్తోంది. వాటిని భారతదేశ విశ్వవిద్యాలయాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయా?
జ: నిస్సందేహంగా ఉన్నాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో చర్చించాల్సిన అజెండాలో ఆ అంశాన్ని చేర్చుకుని వచ్చాను. చర్చించాను కూడా. ఈ విశ్వవిద్యాలయం కూడా మెడికల్ సైన్సెస్ రంగంలోకి రాబోతుందని తెలుసుకున్నాం. మా లైఫ్ సైన్స్‌స్ విభాగం అమెరికాలో రెండో స్థానంలో ఉంటుంది. అతిపెద్ద నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. వాటిని చెప్పలేనుగానీ చాలా కీలకం అని మాత్రం చెప్పగలను. ఈ రంగంలోనూ హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాం.
ప్ర: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో మీకు నచ్చిన అంశాలు ఏమిటి? అంతర్జాతీయంగా ఏ స్థాయిలో ఉంటుందని భావిస్తారు?
జ: అక్కడి ప్రమాణాల గురించి వ్యాఖ్యానించటం సాహసమే.ఐఐఎంకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. అందుకే అక్కడికి వెళ్లాను. పరిశీలించాను. పలు అంశాలపై చర్చించాను. వారు చేస్తున్న కృషి ఘనంగా ఉంది.
ప్ర: 11 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో పర్యటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. మీరు గుర్తించిన అంశాలు ఏమిటి?
జ: హైదరాబాద్ రావటం ఇదే మొదటిసారి. విస్తృతంగా పర్యటించలేక పోయాను. ఇక్కడ జరిగిన, జరుగుతున్న అభివృద్ధి మాత్రం విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమే. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ హైదరాబాద్ రావడం అంటే చిన్న విషయం కాదు. షాంఘై, బీజింగ్ స్థాయిలో ఈ నగరం అభివృద్ధి జరుగుతోందని నా భార్య లారీ బర్న్స్‌కు ఇంతకుముందే చెబుతూ వచ్చాను. ఇతర నగరాలతో పోల్చినా హైదరాబాద్ అందంగా కనిపిస్తోంది.
(హైదరాబాద్ - న్యూస్‌టుడే)
No comments:
Post a Comment