ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday, 30 September 2011

ఆంధ్ర మహిళా సభలో పీజీ డిప్లొమా, టీపీటీ

హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ (ఏఎంఎస్‌) ఆధ్వర్యంలో కొనసాగుతోన్న కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ వివిధ జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులను అందిస్తోంది.

2011-12 సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌, తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ (టీపీటీ) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులకు అర్హులు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా ఏఎంఎస్‌ కొనసాగుతోంది.

* పీజీ డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌: అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సులకు ఎన్‌సీటీఈ గుర్తింపు ఉంది.

* తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌: తెలుగు ఆప్షనల్‌ సబ్జెక్టుగా బీఏ లేదా ఎం.ఎ. తెలుగు లేదా బీఏ లాంగ్వేజెస్‌ చదివుండాలి.

ఈ కోర్సులకు సంబంధించిన ఇతర వివరాలు, దరఖాస్తులను ఏఎంఎస్‌ కార్యాలయం నుంచి పొందవచ్చు.

చిరునామా: కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్ర మహిళా సభ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ రోడ్‌, హైదరాబాద్‌.

వీటితోపాటు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులకు అనేక పారామెడికల్‌ కోర్సులను కూడా ఏఎంఎస్‌ అందిస్తోంది. వీటి వ్యవధి రెండేళ్లు. మేనేజ్‌మెంట్‌ కోటాలో కింది పారామెడికల్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఏఎంఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది...
* రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌
* పెర్‌ఫ్యూజన్‌ టెక్నీషియన్‌
* ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌
* క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌


ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌ బైపీసీ లేదా ఎంపీసీ గ్రూప్‌లు చదివిన అభ్యర్థులు అర్హులు. బైపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

వీటితోపాటు ఏడాది వ్యవధి గల 'ఈసీజీ టెక్నీషియన్‌'  కోర్సును కూడా అందిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులు దీనికి అర్హులు.

దరఖాస్తులను ఏఎంఎస్‌, డి.డి. కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, విద్యానగర్‌, హైదరాబాద్‌ నుంచి పొందవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ  30 సెప్టెంబరు 2011.

Thursday, 29 September 2011

సివిల్స్ లో వెరీ ఇంపార్టెంట్...!

క్టోబరు చివరి వారంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.

పునశ్చరణ పకడ్బందీగా పూర్తిచేసినవారు ఇప్పుడున్న పరిమిత సమయంలో చేయాల్సింది- అత్యంత ముఖ్యమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించటం. దీనివల్ల మెరుగైన ఫలితం లభిస్తుంది.

వివిధ సబ్జెక్టుల్లో  అలాంటి ముఖ్యమైన  టాపిక్స్  జాబితా ఇది... (దీన్ని తయారుచేసినవారు- ‘బ్రెయిన్ ట్రీ’ గోపాలకృష్ణ). 


HISTORY:  
• The Constitution and Sardar Patel. • Growth of Education in India.  • Causes for the rise of revolutionary terrorism in the early decade of the 20th Century.

CULTURE :
* Vedic Divinities *  Samhitas * Vihara Constructions * Minhaj–Us-Siraj  *  Ravi Verma  * Tulsi Das  *  Onam * Vivekananda Rock Memorial  * Sriranga Patnam * Kathakali * Kosambhi   * Nathadwara  * Nandalal Bose *  Purandaradasa   * Manasarova * Pinjore Garden.

GEOGRAPHY  /  ECONOMIC GEOGRAPHY:  
• Bio-diversity and conservation • Floods. • Earthquakes and Tsunamis • Fukushima Nuclear Disasters • Global Warming • India’s stand on Climate change.  • National Action Plan on Climate Change its merits and demerits.  • Jawaharlal Nehru National Solar Machine.   • Sustainable Management of Natural Resources.  • Challenges of urbanization etc. • Energy • Promoting Energy Efficiency.

POLITY:  
• Comptroller and Auditor General • Judiciary • ‘State politics’ Vs ‘National politics’ • Lokpal Bill • Khap Panchayats • Central Bureau of Investigation • Terrorism •  Issues with reference to the Right to Information Act.

ECONOMY:

• Macro Economic Frame Work  •  Inflation Vs Growth • Black Money  • Public Distribution System  •  Goods and Services Tax •  Twelfth  Five Year Plan • Fuel Price Hike  • Direct Taxes Code •  Flagship Programmes like  MGNREGA, NRHM, etc.

CURRENT AFFAIRS AND SOCIAL PROBLEMS:  
• Corruption  • Paid News  • Caste Census  • Inter-State River Water disputes • Micro Finance • Internal Security • India’s Nuclear Doctrine • Problems of the aged  • Ethical Issues involved in Stem Cell Research. • Central Strategy to deal with Naxalism. • National Knowledge Commission and Indian Systems of Medicine. • Recent Measures for Social Protection. • Racial Attacks  • Social Networking  • Social Audit  • Exclusion of Women from Productive Employment  • National Innovation Council.

INDIA AND THE WORLD:
• Directions of India’s Foreign Policy • East Asia summit. • Indo-US relations •  Indo-French •  SAARC  • Indian Diaspora in ‘Cyber – Space’.  • Indian Diasporic Writing. • Chinese Diaspora Vs. the Indian Diaspora •  Asean  • G-8 • UN Forum for Women.   

SCIENCE AND TECHNOLOGY:
•  Mile stones in India’s Space Programme
• Health Care in India •  Super Bug •  India’s Super Computer •  Global Environment and Disaster Management •  National Ganga River Basin Project •  National Green India Mission •  E.Coli.

PEOPLE / EVENTS / PROGRAMMES / PLACES IN THE NEWS:  
•  Dr. Binayak Sen  • M.F. Hussain    • Harish Hande • Kisan Babu Rao Hazare  • Satya Sai Baba • Narayana Murthy • Angela Merkel.   • Goran Hadzic

'ఉస్మానియా'లో హెల్త్‌కేర్‌ కోర్సులు

   హెల్త్‌కేర్‌ రంగంలో పెరుగుతోన్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ అనేక పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులు, అడ్వాన్స్‌డ్‌ పీజీ డిప్లొమా కోర్సును ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రులు, వైద్య విద్యాసంస్థల సహకారంతో విభిన్న కోర్సులను నిర్వహిస్తోంది. వీటి వివరాలు...

పీజీ డిప్లొమా కోర్సులు...
* ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ
* కార్డియాక్‌ అనస్థీషియా టెక్నాలజీ
* మెడికల్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌
* క్యాథ్‌ల్యాబ్‌ టెక్నాలజీ
* పెర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ
* కార్డియాక్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ
* కార్డియాక్‌ పల్మనరీ ఫిజియోథెరపీ
* ఎకో కార్డియోగ్రఫీ అండ్‌ సోనోగ్రఫీ

అడ్వాన్స్‌డ్‌ పీజీ డిప్లొమా కోర్సులు...
* ఫిజిషియన్‌ అసిస్టెంట్‌
* ఎమర్జెన్సీ మెడికల్‌ కేర్‌
* మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ
* కార్డియాక్‌ టెక్నాలజీ
* డయాలసిస్‌ టెక్నాలజీ
* ఎనస్థీషియా టెక్నాలజీ
* మెడికల్‌ ఇన్ఫర్మేటిక్స్‌

ఉపాధి అవకాశాలు ఎలా?
ఉస్మానియా యూనివర్సిటీ అందిస్తోన్న పీజీ డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సుల ద్వారా ఆసుపత్రులు, ఎమర్జన్సీ వైద్య కేంద్రాలు, ప్రైవేటు ల్యాబ్‌లు, రక్తదాన కేంద్రాలు, డాక్టర్లు నిర్వహించే క్లినిక్‌లలో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన లేబొరేటరీ మేనేజర్లు, కన్సల్టెంట్లు, సూపర్‌వైజర్లుగా స్థిరపడవచ్చు. హెల్త్‌కేర్‌ టెక్నాలజిస్టులు పని అనుభవంతో ఆసుపత్రులు, పాథాలజీ ల్యాబ్‌లలో సూపర్‌వైజర్‌, మేనేజ్‌మెంట్‌ స్థాయులకు చేరుకోవచ్చు.

కార్డియాక్‌ సంబంధిత డిప్లొమా కోర్సులు చేసిన అభ్యర్థులకు కార్డియాక్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఇతర వైద్యసంస్థల్లోని కార్డియాలజీ విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. మెడికల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ కోర్సు ద్వారా ఈ రంగంలో స్థిరపడటానికి అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు.

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో శిక్షణ
ఉస్మానియా యూనివర్సిటీ అందిస్తోన్న డిప్లొమా కోర్సులన్నీ పూర్తిగా ఆచరణాత్మక రీతిలో రూపొందించినవి. అన్ని కోర్సులను పూర్తి స్థాయిలో మౌలిక సౌకర్యాలు గల కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే ఓయూ నిర్వహిస్తోంది. ప్రముఖ కార్పొరేట్‌ వైద్య సంస్థలైన యశోదా, కేర్‌, మెడ్విన్‌, కిమ్స్‌, ఇన్నోవా, గ్లోబల్‌ ఆసుపత్రులతో ఉస్మానియా యూనివర్సిటీ శిక్షణకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థలను ఓయూకి అనుబంధ హోదాతో ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

కోర్సుల కాలవ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లుగా కోర్సులను నిర్వహిస్తారు. శిక్షణ తర్వాత ఆర్నెళ్లు లేడా ఏడాదిపాటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో ఇంటర్న్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు. శిక్షణలో కోర్సుకు సంబంధించిన ముఖ్య సామర్థ్యాలతోపాటు కంప్యూటర్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.

అర్హతలు, దరఖాస్తు విధానం
అభ్యర్థులు లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టులతో డిగ్రీ చదివుండాలి. మెడికల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ కోర్సుకు ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ మినహా, ఏ డిగ్రీ అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో మార్కుల ఆధారంగా వివిధ ప్రోగ్రామ్‌లకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేంద్రీకృత కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు.

* కోర్సుల వారీగా ఫీజులు, ఇతర వివరాలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. దరఖాస్తులను డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, యూనివర్సిటీ ప్రెస్‌ దగ్గర, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందవచ్చు.

వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 అక్టోబరు 2011.

Wednesday, 28 September 2011

సివిల్స్‌ మెయిన్స్‌లో.. మార్కుల వ్యూహం

 
సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌... సిసలైన సత్తాను పరీక్షకు పెట్టే డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే పరీక్ష!

దీనిలో విజయవంతమైతే సివిల్స్‌ ప్రస్థానంలో విజయానికి దాదాపు చేరువైనట్లే. వచ్చేనెల చివరివారంలో ఈ పరీక్ష ప్రారంభమవుతున్న సందర్భంగా అత్యధిక మార్కులను స్కోరు చేసే వ్యూహం వివరిస్తున్నారు గోపాలకృష్ణ.

తగిన పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉన్నంతమాత్రాన ఎవరూ ఉత్తమ సివిల్‌ సర్వెంట్లు కాలేరు. అంకితభావం, సామాజిక అంశాలపై స్పందన, రాజ్యాంగ ఆదర్శాలపట్ల నిబద్ధత మొదలైన విలువలు ప్రధానం. ఇలాంటివారిని గుర్తించే లక్ష్యంతోనే సివిల్స్‌ నియామక ప్రక్రియ పనిచేస్తుంది.

తొమ్మిది పేపర్లతో డిస్క్రిప్టివ్‌ విధానంలో సాగే మెయిన్స్‌ పరీక్ష 20 రోజుల వ్యవధిలో ముగుస్తుంది. అభ్యర్థుల విద్యాపరమైన ప్రతిభను మాత్రమే కాకుండా వారి సమన్వయ సామర్థ్యాన్నీ, స్వీయ పరిజ్ఞానాన్ని స్పష్టంగా సమర్పించే తీరునూ పరీక్షించేలా మెయిన్స్‌ను రూపొందించారు.

క్వాలిఫైయింగ్‌ పేపర్లు
అభ్యర్థి ప్రాథమిక నైపుణ్యాలను మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌లలో పరీక్షిస్తారు. ఈ పేపర్లలో మార్కులను ర్యాంకింగ్‌కు లెక్కించరు కానీ, వీటిలో కనీసం 33 శాతం మార్కులు తెచ్చుకోవటం తప్పనిసరి.

* మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌: తెలుగు/ హిందీ రాయటం తగ్గిపోయిన అభ్యర్థులు చాలామందే ఉంటారు. ఇలాంటివారు రోజుకు కనీసం అరగంటైనా రైటింగ్‌ సాధన చేయాల్సివుంటుంది. భాషను సాధన చేయటం కోసం అక్టోబరు 1 నుంచి రోజుకు అరగంట చొప్పున వారానికి 4 రోజులు కేటాయించుకోవాలి. తెలుగుమీడియంలో డిగ్రీ చేసినవారూ, తెలుగు సాహిత్యం ఐచ్ఛికంగా ఉన్న విద్యార్థులూ ఈ పేపర్‌పై ఎక్కువ సమయం వెచ్చించనక్కర్లేదు.

* జనరల్‌ ఇంగ్లిష్‌: మన రాష్ట్ర విద్యార్థుల్లో చాలామందికి ఈ పేపర్‌ సమస్యే కాదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన గ్రామీణప్రాంతాల్లో ఇంగ్లిష్‌ బోధన మెరుగేనని చెప్పాలి. కాబట్టి తెలుగుమీడియం నేపథ్యం వారు కూడా దీనికి ఎక్కువగా సన్నద్ధం కానక్కర్లేదు. గత సంవత్సరాల పేపర్లు చూసి, మానసికంగా సిద్ధమవ్వాలి.

జనరల్‌ ఎస్సే

ర్యాంకును సాధించటంలో వ్యాసం పాత్ర నిర్ణయాత్మకం. చాలామంది టాపర్లు సగటు మార్కుల కంటే అధికంగా తెచ్చుకునే పేపరిది. గరిష్ఠమార్కులు పొందాలంటే తగిన అంశాన్ని ఎంచుకోవటం, క్రమపద్ధతిలో దాన్ని విశ్లేషించటం అవసరం.

ఈ ఏడాది ఆశించదగ్గ టాపిక్స్‌:
1) Role of Audit in Democratic India

2) Judicial Accountability and Democracy

3) Food Security, Food inflation and Public Distribution System

4) What the Next five year Plan should focus upon Five priority items

5) Information Technology for the Masses: Bridging the Digital Divide

  
స్కోరు సాధించేదెలా?
* వ్యాసానికి ఎంచుకున్న అంశం (టాపిక్‌) సందర్భాన్ని అభ్యర్థి సరిగా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. లేకపోతే ఆ అంశానికి న్యాయం చేయలేము.

* అందుకే మొదటి 10 నిమిషాలూ టాపిక్‌ ఎంచుకోవటానికే వెచ్చించాలి.

* ఇచ్చిన సందర్భాన్ని సరిగా అర్థం చేసుకున్నామా లేదా అనేది ఒకటికి రెండుసార్లు నిర్థారించుకోవాలి.

* అంశం ఎంచుకున్నాక దాని గురించి మీ దగ్గరున్న సమాచారం గురించి పాయింట్లుగా రాయాలి.

* వాటిని తార్కిక పద్ధతిలో అమర్చాలి.

* ప్రతి పాయింటునూ రాసేటపుడు విస్తరిస్తూ రాయాలి. ఉదా: Judicial accountability and democracy అనే అంశం. ఈ క్రమంలో ముందుకుసాగవచ్చు-

The need for judicial accountability in a democracy

> The problems of ensuring judicial accountability in practice

> Significant features of the proposed judicial standards and accountability bill

> Mechanism for making the proposed bill effective.

కంపల్సరీ పేపర్లలో ముఖ్యాంశాలు గుర్తించాలి. తర్వాత ఇదే కసరత్తును ఆప్షనల్స్‌లో కూడా చేయాలి. వాటిపై మనసు కేంద్రీకృతం చేయాలి. ఇలాంటి ప్రయత్నం పరీక్షలో మంచి ఫలితాలను అందిస్తుంది.

భర్తీ చేయబోయే పోస్టుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి 2011 సంవత్సరం అభ్యర్థులు ముందడుగు వేయటానికి సరైన సంవత్సరం. ఆత్మవిశ్వాసంతో విజయవ్యూహాన్ని ఆచరణలో పెడితే... మెయిన్స్‌లో విజయం సాధించి... ఇంటర్వ్యూ దశకు చేరుకున్నట్టే!

ఇవి గుర్తుంచుకోండి!
* జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ పూర్తిగా అనూహ్యంగా ఉంటుంది. ఇలా ఉండటం అసాధారణమేమీ కాదు. అందుకని అందుకు మానసికంగా సిద్ధం కావాలి.

* ఎస్సే ప్రశ్నలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎక్కువ ప్రశ్నలు షార్ట్‌ నోట్సు, 5 మార్కులు, 10 మార్కులవి ఉండొచ్చు.

* అన్ని అంశాలనూ కవర్‌ చేయటం దాదాపు అసాధ్యం. అందుకని అలా చేయాలనుకోవద్దు.

* కిందటి సంవత్సరం విజేతల్లో చాలా తక్కువమందే 300/600 కంటే మించి స్కోర్‌ చేశారు. ఇదే ధోరణి కొనసాగుతుంది. అందుకని జనరల్‌స్టడీస్‌ సన్నద్ధతకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వొద్దు. దీనికంటే ఆప్షనల్స్‌పై దృష్టిపెట్టటం సముచితం. ఎందుకంటే మార్కుల నిష్పత్తి 2:1 ఉంటుంది.

Tuesday, 27 September 2011

ఐఐటీలో పీజీ 'జామ్‌' జామ్ గా!

ఐటీ జామ్‌ 2012 పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది.

ఈసారి జామ్‌ పరీక్షలో గమనించాల్సిన మార్పు ఏమిటంటే... గతంలోకంటే మూణ్ణెల్లు ముందుగా పరీక్షను నిర్వహించనున్నారు.

ఏటా సాధారణంగా మే నెలలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 12, 2012న దేశవ్యాప్తంగా జామ్‌ జరగనుంది. దీనివల్ల డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌కు చాలా తక్కువ సమయం లభిస్తుంది. మంచి ప్రణాళికతో, సమయపాలనతో చదివితేనే జామ్‌లో మంచి ర్యాంకు దక్కించుకోగలరు.

ఏటా ఏదో ఒక ఐఐటీ కొత్త పీజీ కోర్సులను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ బాంబే కెమిస్ట్రీలో ఎం.ఎస్సీ - పీహెచ్‌డీ డ్యుయల్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. నాలుగేళ్ల ఎం.ఎస్సీ ఫిజిక్స్‌ - ఎం.టెక్‌. మెటీరియల్‌ సైన్స్‌ (నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో) కోర్సును కూడా ఐఐటీ బాంబే ప్రవేశపెట్టింది. ఐఐటీ బాంబేతోపాటు ఢిల్లీ, హైదరాబాద్‌, గౌహతి, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, రూర్కీ ఐఐటీలు జామ్‌ ద్వారా ఎం.ఎస్‌సి., ఎం.ఎస్‌సి- పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ, ఇతర ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కల్పిస్తున్నాయి.


పరీక్ష ఎలా ఉంటుంది?
ఐఐటీ జామ్‌లో మొత్తం 8 పేపర్లుంటాయి. అవి... బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథమేటిక్స్‌, మేథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌. వీటిలో ప్రతిభ ఆధారంగా మొత్తం 33 రకాల పీజీ, డ్యుయల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అభ్యర్థులు ప్రవేశం కోరుకుంటున్న కోర్సును బట్టి ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవాలి. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

పరీక్ష వ్యవధి మూడు గంటలు. బయోటెక్నాలజీ, ఎంసీఏ కోర్సుల ప్రశ్నపత్రాలు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. కెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథ్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ పేపర్‌లు ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. ఈ పేపర్లలో 30 శాతం ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, 70 శాతం సబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. తప్పు సమాధానాలకు (ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు) నెగటివ్‌ మార్కులు కూడా ఉంటాయి. అందువల్ల ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు కచ్చితంగా సరైన సమాధానం తెలిస్తేనే రాయడం మంచిది.

* బయోటెక్నాలజీ ఎంట్రెన్స్‌ పేపర్‌లో 44 శాతం ప్రశ్నలు బయాలజీ, 20 శాతం కెమిస్ట్రీ, 18 శాతం ఫిజిక్స్‌, 18 శాతం మేథమేటిక్స్‌ ప్రశ్నలుంటాయి. మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ కోర్సును బాంబే, రూర్కీలోని ఐఐటీలు మాత్రమే అందిస్తున్నాయి. అందువల్ల ఈ బయోటెక్నాలజీ సబ్జెక్టుకు పోటీ అధికంగా ఉంటుంది.

* ఇతర పేపర్లకు 30 శాతం మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. వీటికి ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. ఈ ప్రశ్నల మొత్తానికి 90 మార్కులు వెయిటేజ్‌ ఉంటుంది. మిగిలిన 70 శాతం ప్రశ్నలు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. వీటికి 210 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

ఏ ఐఐటీలో ఏ కోర్సు?
* ఐఐటీ బాంబే ఎనర్జీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.

* ఐఐటీ ఖరగ్‌పూర్‌ కెమిస్ట్రీ, జియోఫిజిక్స్‌, జియోలాజికల్‌ సైన్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌లలో ఎం.ఎస్సీ, పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.

* ఐఐటీ హైద్రాబాద్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో ఎం.ఎస్‌సి. కోర్సును నిర్వహిస్తోంది.

* ఎంసీఏ ప్రోగ్రామ్‌ను ఐఐటీ రూర్కీ మాత్రమే అందిస్తోంది.

* ఐఐటీ బాంబే గత ఏడాది నుంచి బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌ రిసెర్చ్‌లో ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది.

ఇతర ఐఐటీల్లో ప్రోగ్రామ్‌లు, వాటికి అవసరమైన అర్హతల వివరాలు జామ్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

ప్రాథమిక అంశాలపై పట్టు...
కోర్సులతోపాటు ప్రవేశ పరీక్షల్లో కూడా ఐఐటీలు ఉన్నత ప్రమాణాలు పాటిస్తాయి. జామ్‌ ప్రశ్నపత్రాలు విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్ధ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన అభ్యర్థులు జామ్‌లో విజయం సాధించడం తేలిక. అభ్యర్థులు ముందుగా 10+2 సిలబస్‌తో తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ప్రాథమిక భావనలపై అవగాహన కోసం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తెలుగు అకాడమీ పుస్తకాలను చదవచ్చు. తర్వాత బీఎస్సీ సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.

* ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ ఎంట్రెన్స్‌లో ఎంబైపీసీ నేపధ్యం గల విద్యార్థులు ఎక్కువగా మంచి ర్యాంకులను సాధిస్తున్నారు. బయాలజీతోపాటు మేథ్స్‌ మీద కూడా వీరికి పట్టు ఉండటం దీనికి ప్రధాన కారణం. అందువల్ల బయాలజీ విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీతోపాటు మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులను కూడా బాగా నేర్చుకోవాలి. బీఎస్సీలో బీజడ్‌సీ చదివిన అభ్యర్థులు బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, మాలెక్యులర్‌ బయాలజీ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ఒకవేళ డిగ్రీలో ఆధునిక బయాలజీ స్పెషలైజేషన్లు (బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ మొదలైనవి) తీసుకున్నట్లయితే, బోటనీ, జువాలజీ సిలబస్‌ను క్షుణ్నంగా చదవాలి.

* బయోటెక్నాలజీ పరీక్ష సిలబస్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ అభ్యర్థులు ఇతర పరీక్షలు రాసేవారికంటే అధికంగా సమయం కేటాయించాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు రోజూ కనీసం ఐదారు గంటలు తప్పనిసరిగా ఏకాగ్రతతో చదవాలి.

* ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ రాసే విద్యార్థులు ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీతోపాటు మేథ్స్‌లో ఇచ్చిన సిలబస్‌ను కూడా అధ్యయనం చేయాలి.

* ఎం.ఎస్‌సి. ఫిజిక్స్‌ పేపర్‌ రాసే అభ్యర్థులు ఫిజికల్‌ ఆప్టిక్స్‌, క్వాంటమ్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆసిలేషన్స్‌ అండ్‌ వేవ్స్‌, క్వాంటమ్‌ ఫిజిక్స్‌, స్పెక్ట్రోస్కోపీ, న్యూక్లియర్‌ అండ్‌ అటామిక్‌ ఫిజిక్స్‌, హీట్‌, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌ సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.

* ఎం.ఎస్‌సి. మేథమేటిక్స్‌ రాసే అభ్యర్థులు మేట్రిక్స్‌, డెరివేటివ్స్‌, కాలిక్యులేషన్స్‌, వెక్టార్‌, త్రికోణమితి, కోర్డానేట్‌ జామెట్రీ సబ్జెక్టులను బాగా సాధన చేయాలి. సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా చదవడం, అన్వయించడం చాలా ముఖ్యం.

ప్రణాళికతో ప్రారంభం...
జామ్‌ ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో ఐఐటీలు దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో అమల్లో ఉన్న సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల రాష్ట్రంలోని అభ్యర్థులు కేవలం డిగ్రీ కోర్సుల సిలబస్‌ మీదనే ఆధారపడితే సరిపోదు. జామ్‌ సిలబస్‌ను డిగ్రీ సిలబస్‌తో పోల్చి చూసుకోవాలి. డిగ్రీ సిలబస్‌లో లేని కొత్త అంశాలను వాటికి సంబంధించిన మెటీరియల్‌ను కూడా సేకరించి చదువుకోవాలి.

* దీర్ఘకాలిక ప్రిపరేషన్‌ ఉంటే జామ్‌లో సులభంగా విజయం సాధించవచ్చు. డిగ్రీ మొదటి ఏడాది నుంచే ప్రాథమిక భావనలపై దృష్టిపెడుతూ సబ్జెక్టుపై అవగాహన పెంపొందించుకోవాలి. మౌలిక భావనలను అర్థం చేసుకుంటూ దాన్ని వాస్తవ పరిస్థితులకు అన్వయించుకోవడం అలవాటు చేసుకోవాలి.

* డిగ్రీ చివరి సంవత్సరంలో ఉంటే, ముందుగా పరీక్ష స్వభావాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, సబ్జెక్టులో బలాబలాల ఆధారంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.

* డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు మార్చి- ఏప్రిల్‌లో బీఎస్సీ పరీక్షలు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొదటి నుంచీ జామ్‌ ప్రిపరేషన్‌కు కొంత సమయం కేటాయిస్తే మంచిది. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిమీద పట్టు సాధించాలి.


సాధన తప్పనిసరి...
జామ్‌ డిస్క్రిప్టివ్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రంలోనే జవాబులు రాయడానికి కూడా నిర్దిష్ట స్థలం కేటాయిస్తారు. ఆ కేటాయించిన స్థలంలోనే జవాబును సమగ్రంగా రాయాలి. అందువల్ల మీరు నేర్చుకున్న అంశాలను సంగ్రహంగా నిర్దిష్ట స్థలంలో రాయడం సాధన చేయాలి. తక్కువ పాయింట్లతో ఎక్కువ సమాచారాన్ని పొందుపరచడం నేర్చుకోవాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదివిన విద్యార్థులు అనేకమంది జామ్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అందువల్ల మాధ్యమం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయడం, వ్యాసరూప ప్రశ్నలు రాయడం నేర్చుకుంటే సరిపోతుంది.

* ఎంత సమయం చదివారనే దానికంటే, సబ్జెక్టును ఇష్టపడి ఏకాగ్రతతో చదవడం ముఖ్యం. సానుకూల దృక్పథంతో శ్రమిస్తే తప్పనిసరిగా జామ్‌లో మంచి ర్యాంకు సాధించవచ్చు.

ఈ మెలకువలను అందించిన రచయిత... ఎస్‌.కిరణ్‌కుమార్‌.

Monday, 26 September 2011

గ్రూప్-2లో గెలుపు మలుపు!

 గ్రూప్‌-2 పరీక్ష మరో 20 రోజుల్లో!

ఈ తరుణంలో ఒత్తిడి పెరగటం సహజం. గ్రూప్‌-1 అభ్యర్థులు చాలామంది కారణాలు ఏవైనా,  గ్రూప్‌-2 వైపే మొగ్గు చూపి, ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. 2008 గ్రూప్‌-2 అభ్యర్థుల పోటీ ఎలాగూ ఉంటుంది.

లక్షలమంది కొత్తవారు రణక్షేత్రంలో ప్రవేశించారు.

మిగిలింది అంతిమ పరీక్షలూ, ఫలితాలే!

మరి గెలుపు మలుపులో ఉన్న మీలాంటి అభ్యర్థులు విజేతలు కావాలంటే ఏం చేయాలో వివరిస్తున్నారు కొడాలి భవానీ శంకర్‌.

 గ్రూప్స్‌ పరీక్ష అనగానే లక్షల మందితో పోటీ అనే భావన ఉంటుంది. కానీ అన్ని సామర్థ్యాలతో, లక్షణాలతో చివరివరకూ కొనసాగేవారు 10 వేలమంది లోపే. మళ్లీ వీరిలో సరైన అవగాహనతో చివరి రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు రెండు మూడు వేల మందే! వీరే అంతిమంగా విజయం సాధిస్తారు. అందువల్ల ఈ సమయాన్ని ఏకాగ్రతతో, ప్రణాళికాయుతంగా వినియోగించుకునే లక్షణాలుంటే పరీక్ష రాయకముందే లక్ష్యం చేరుకున్నట్లే!

ఇంతకీ గ్రూప్‌-2కి కావాల్సిన ఆ లక్షణాలు ఏమిటి?

మారుమూలవి సైతం...
ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి సిలబస్‌ అంశాలన్నిటినీ పరిగణించి చదవారా? లేదా? అన్నది కీలకం. 'నాకు ఈ చాప్టర్‌ కష్టం. ఈ పేపర్‌ కష్టం' అని నిర్థారించుకొని వాటిని వదిలేసివుంటే వాటిమీద ఇప్పుడు దృష్టి నిలపాలి. ఆబ్జెక్టివ్‌ విధానంలో బిట్‌ని ఎక్కడి నుంచైనా అడగవచ్చు. కాబట్టి మారుమూల అంశాల్ని సైతం పరిగణించాల్సిందే.

బిట్లు బిట్లుగా చదవొద్దు
ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు క్వశ్చన్‌ బ్యాంకుపై ఆధారపడి అధ్యాయాల వారీగా బిట్లు చదువుతూ ఉంటారు. ఇలాంటివారు ఈ ఇరవై రోజుల్లోనైనా, చాప్టర్లని టాపిక్‌ వారీగా చదవాలి. ఇందులో నుంచి ఏ బిట్లు వస్తాయనేది అంచనా వేయడం చేస్తుండాలి. ముఖ్యంగా విశ్లేషణాత్మక ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే ఈ తరహా సన్నద్ధత తప్పనిసరి.

పండ్లున్న చెట్టుకే రాళ్ళు వేయాలా?
ఈ సూత్రం పోటీ పరీక్షలకు వర్తించదు. సగటు గ్రూప్‌-2 అభ్యర్థి పేపర్‌-2లో ఎక్కువ మార్కులు తక్కువ శ్రమతో వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడతాడు. ఇది నిజం కూడా కావచ్చు. కానీ పరీక్షలో పేపర్‌-I, IIIలు కూడా 150 మార్కుల చొప్పున అంతే ప్రాధాన్యం కలిగినవేనని గుర్తించాలి. కొంతమంది పేపర్‌ III క్లిష్టమైనది కాబట్టి దాని సంగతి చూడాలని అధిక కాలం అందుకోసమే వెచ్చిస్తారు. ఇలాంటి ధోరణులలో ఇప్పటివరకూ సన్నద్ధత కొనసాగివుంటే ఈ పరిమిత సమయాన్ని ఇలా ఉపయోగించుకోవడం అనేది విజయానికి కావాల్సిన లక్షణమే.

గరిష్ఠ అవధి ఎంత?
పరీక్ష సిలబస్‌ అంశాలను బట్టి, సబ్జెక్టు స్వభావాన్ని బట్టి ఒక్కో సబ్జెక్టులో అధిక ఫలితం, ఒక్కో దానిలో తక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా గ్రూప్‌-2 సిలబస్‌ని బట్టి మూడు పేపర్లలో ఎలాంటి గరిష్ఠ స్కోరు సాధించే అవకాశం ఉందో చూద్దాం.
ఇలాంటి గరిష్ఠ పరిమితిని దృష్టిలో పెట్టుకొని, ఆ స్థాయికి చేరుతున్నామా? లేదా? అని ప్రశ్నించుకోవాలి. అందుకు అనుగుణంగా సన్నద్ధతలో మార్పుల్ని ఈ తరుణంలో వినియోగించుకోవడం మంచిది.

గణాంకాల ప్రాధాన్యం
చారిత్రక సంవత్సరాలు, రాజ్యాంగ సవరణలు, చట్టాలు, ఆర్టికల్స్‌ లాంటి గణాంకాలు పేపర్‌-2లో కీలకం. అలాగే జనరల్‌ స్టడీస్‌లో కూడా సబ్జెక్టుల వారీగా గణాంకాలు భారీగానే ఉన్నాయి. ఆబ్జెక్టివ్‌ పరీక్ష, పైగా గ్రూప్‌-2 స్థాయి కాబట్టి గణాంకాలపై ప్రశ్నలే అధికం. పేపర్‌-III విషయమైతే గణాంకాల కోణాన్ని ఇక చెప్పనక్కర్లేదు.

అయితే గణాంకాలు గుర్తించుకునేందుకు తెలివిగా తర్కాన్ని అభివృద్ధి చేసుకోవాలి. గణాంకాలలో వేటిని చదవాలి? వదిలేయాలి అని నిర్ణయించుకోవడమే స్మార్ట్‌ వర్క్‌. గణాంక సమాచారంపై ఇలాంటి దృష్టి పెట్టేందుకు కొంత సమయాన్ని వెచ్చించవచ్చు.


Saturday, 24 September 2011

ఆంగ్లంలో ‘గోరంతలు... కొండంతలు’ !

ఇంగ్లిష్‌ భాషలో  నూతన వ్యక్తీకరణలు ఎన్నో వాడుకలోకి  వస్తుంటాయి. వీటి గురించి ‘ఈనాడు చదువు’ Modern English Usage  శీర్షికలో వారం విడిచి వారం  ప్రచురిస్తోంది.

ఈసారి ఈ శీర్షిక ...  Overkill, blowing things out of proportion మొదలైన expressions  గురించి!

చదవండి...

Friday, 23 September 2011

ఐఐటీ బాంబేలో ఇంటర్న్‌షిప్‌లు

వృత్తి విద్యాకోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌లు చాలా కీలకమైన భాగం. అభ్యర్థి ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ల మీద ఆధారపడుతుంటాయి. మంచి పేరున్న సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు చేసిన అభ్యర్థులు ఉద్యోగం సాధించడం సులభం.

విద్యార్థుల్లో పరిశోధనాభిలాషను పెంపొందించడం లక్ష్యంగా ఐఐటీ బాంబే అనేక అధ్యయన అంశాల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పిస్తోంది. బి.టెక్‌.తోపాటు ఎం.ఎ., ఎం.ఎస్‌సి. అభ్యర్థులకు కూడా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందుబాటులో ఉండటం విశేషం.

ఉన్నత విద్య, పరిశోధనలకు అవసరమైన పరిజ్ఞానం, అనుభవాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఐఐటీ బాంబే 'రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌ అవార్డు'లను అందిస్తోంది. సంస్థలోని ఇంజినీరింగ్‌, సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులను బట్టి ఇంటర్న్‌ల సంఖ్య ఆధారపడి ఉంటుంది.

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి నాలుగు నుంచి ఆర్నెల్ల వరకు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు పూర్తి సమయాన్ని దీనికోసమే కేటాయించాలి.
ఇంటర్న్‌షిప్‌ కాలంలో నెలకు రూ.10000 స్టయిపెండ్‌ లభిస్తుంది. వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు.

సైన్సెస్‌, ఇంజినీరింగ్‌లో శిక్షణ, పరిశోధనలకు ఐఐటీ బాంబే అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

ఇందులో ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్న విభాగాలు:
ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌,
బయోసైన్సెస్‌ అండ్‌ బయో ఇంజినీరింగ్‌,
సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌,
సెంటర్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఇన్‌ రిసోర్సెస్‌ ఇంజినీరింగ్‌,
కెమికల్‌ ఇంజినీరింగ్‌,
కెమిస్ట్రీ,
సివిల్‌ ఇంజినీరింగ్‌,
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌,
ఎర్త్‌ సైన్సెస్‌,
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌,
ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌,
హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌,
ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌,
మేథమేటిక్స్‌,
మెకానికల్‌ ఇంజినీరింగ్‌,
మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌,
మేనేజ్‌మెంట్‌.


ప్రతిభావంతులకే అవకాశం...
ఐఐటీ బాంబే అందిస్తోన్న రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తాము చదివే కాలేజీల్లో సంబంధిత విభాగంలో టాప్‌-10 శాతం మంది ప్రతిభావంతుల జాబితాలో ఉండాలి. దీనితోపాటు అవసరమైన ఇతర అర్హతలు...

* మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ రెండో ఏడాది లేదా బ్యాచిలర్స్‌ ప్రోగ్రామ్‌ మూడు / నాలుగో ఏడాది చదువుతుండాలి. బ్రాంచి లేదా సబ్జెక్టు ప్రాజెక్టును బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ ప్రాజెక్టుకు ఏ బ్రాంచి అభ్యర్థులు అర్హులనేది ఐఐటీబీ ఇంటర్న్‌షిప్‌ గైడ్‌ నిర్ణయిస్తారు.

* అభ్యర్థి ఫుల్‌ టైమ్‌ విద్యార్థిగా కొనసాగుతుండాలి. ఇంటర్న్‌షిప్‌ కాలంలో ఎలాంటి కోర్సు వర్క్‌ ఉండకూడదు. ఇంటర్వ్యూ సమయంలో వీటికి సంబంధించిన సర్టిఫికెట్‌లను సమర్పించాలి.

దరఖాస్తుల తొలిదశ స్క్రీనింగ్‌ పూర్తయ్యాక అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అవసరమైతే ఆయా విభాగాలు ప్రత్యేకంగా పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహించవచ్చు. అభ్యర్థులకు మంచి అకడమిక్‌ రికార్డు అవసరం. కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచి ఉండాలి. టెక్‌ఫెస్ట్‌, ఒలింపియాడ్స్‌, నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

* అర్హులైన అభ్యర్థులకు నవంబరు 2011లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఎం.టెక్‌. లేదా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరడానికి ప్రోత్సహిస్తారు.

ఐఐటీ బాంబే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి తనకు ఏ ప్రాజెక్టులో, ఎందుకు ఆసక్తి ఉందో వివరించాలి. ప్రాజెక్టుకు తగిన సామర్థ్యాలు, అనుభవాలను 250 పదాలకు మించకుండా ప్రస్తావించాలి. వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, వాటికి అవసరమైన అర్హతలు కూడా వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 15 అక్టోబరు 2011
* ఇంటర్వ్యూ తేదీలు (తాత్కాలికం): 15-30 నవంబరు 2011
* ఇంటర్న్‌షిప్‌ కాలం: డిసెంబరు 2011 - జూన్‌ 2012.

Thursday, 22 September 2011

లైఫ్‌ సైన్సెస్‌కూ గేట్‌


  గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) ద్వారా ఇంజినీరింగ్‌ అభ్యర్థులకే కాదు... బేసిక్‌ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌ అభ్యర్థులకు కూడా మంచి ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.  ఈ విశేషాలను ఎస్‌.కిరణ్‌కుమార్‌ రాసిన ఈ కథనంలో తెలుసుకుందాం.

   గేట్‌లో మంచి స్కోరు సాధించిన లైఫ్‌ సైన్సెస్‌ అభ్యర్థులు ప్రఖ్యాతిగాంచిన ఐఐటీలు, సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని ముప్పైకిపైగా శాస్త్ర పరిశోధన సంస్థల్లో ఎం.టెక్‌. లేదా పీహెచ్‌డీ చేయవచ్చు. ప్రముఖ సంస్థల్లో ప్రాజెక్టు అసిస్టెంట్‌లుగా కూడా పనిచేయవచ్చు.

లైఫ్‌ సైన్సెస్‌, బేసిక్‌ సైన్సెస్‌లో ఉన్నత విద్య, పరిశోధనల పట్ల ఆసక్తి గల అభ్యర్థులు గేట్‌ ద్వారా తమ లక్ష్యం నెరవేర్చుకోవచ్చు.

బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మేథ్స్‌లో పీజీ చేసిన విద్యార్థులు గేట్‌ స్కోరు ఆధారంగా ఐఐటీల్లో ఎం.టెక్‌., పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. లైఫ్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌ అభ్యర్థులు సీసీఎంబీ, ఐఐసీటీ, ఐఐఎస్‌సీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఎన్‌సీఎల్‌, తదితర ప్రముఖ సంస్థల్లో పరిశోధనలు చేయవచ్చు. అనేక సంస్థల్లో పరిశోధన ప్రాజెక్టుల్లో పనిచేయడానికి కూడా గేట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. చాలా సంస్థలు సీఎస్‌ఐఆర్‌ -నెట్‌కు ప్రత్యామ్నాయంగా గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సింగపూర్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ కూడా గేట్‌ స్కోరు ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశం కల్పిస్తోంది.

* గేట్‌ (లైఫ్‌ సైన్సెస్‌) పరీక్షలో 65 ప్రశ్నలు ఉంటాయి. వీటికి కేటాయించిన మొత్తం మార్కులు 100. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగటివ్‌ మార్కులు ఉంటాయి. అందువల్ల కచ్చితంగా సరైన సమాధానం తెలిస్తేనే రాయడం మంచిది.

బయోటెక్నాలజీలో ఏవి ముఖ్యం?
గేట్‌ బయోటెక్నాలజీ (బీటీ) పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మేథ్స్‌ ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. గేట్‌ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష సిలబస్‌లో ఇటీవలి కాలంలో అనేక మార్పులు కూడా చేశారు. మేథమేటిక్స్‌ సంబంధిత అంశాలను చేర్చడం ఇందులో భాగమే. మేథ్స్‌ సిలబస్‌లో లీనియర్‌ ఆల్జీబ్రా, కాలిక్యులస్‌, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, న్యుమరికల్‌ మెథడ్స్‌ మొదలైన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. బయోటెక్నాలజీ అభ్యర్థులు ఈ అంశాలపై కూడా పట్టు సాధించాలి. బయోటెక్నాలజీ సిలబస్‌లో రీకాంబినెంట్‌ డీఎన్‌ఏ టెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్‌, ఇమ్యునాలజీ, మాలెక్యులర్‌ బయాలజీ, జెనెటిక్స్‌, ప్లాంట్‌ బయోటెక్‌, ఏనిమల్‌ బయోటెక్‌, బయోప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ప్రాసెస్‌ బయోటెక్నాలజీ, తదితర అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఈ పేపర్‌కు బీటెక్‌ (బయోటెక్నాలజీ), ఎం.ఎస్‌సి. లైఫ్‌ సైన్సెస్‌ విద్యార్థులు అర్హులు.

వేటికి ప్రాధాన్యం?
గేట్‌ లైఫ్‌ సైన్సెస్‌ (ఎక్స్‌ఎల్‌) రాసే అభ్యర్థులు బోటనీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్‌ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ నుంచి ఏవైనా రెండు ఆప్షనల్స్‌ను ఎంచుకోవాలి. వీటితోపాటు కెమిస్ట్రీ తప్పనిసరి పేపర్‌గా ఉంటుంది. కెమిస్ట్రీకి 25 మార్కులు వెయిటేజ్‌ ఉంటుంది. కెమిస్ట్రీలో కెమికల్‌ బాండింగ్‌, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ రియాక్షన్స్‌ మెకానిజమ్‌, స్టీరియో కెమిస్ట్రీ, కెమికల్‌ కైనెటిక్స్‌, థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ, గ్రూప్స్‌, ఎరోమాటిసిటీ, తదితర అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల ప్రిపరేషన్‌లో వీటికి ఎక్కువ సమయం కేటాయించాలి.

* మైక్రోబయాలజీ ఎంచుకున్న అభ్యర్థులు జనరల్‌ మైక్రోబయాలజీ, మైక్రోబియల్‌ జెనెటిక్స్‌, మైక్రోబియల్‌ ఎకాలజీ అంశాలను క్షుణ్నంగా చదవాలి.
* బయోకెమిస్ట్రీ ఎంచుకుంటే... ఇమ్యునాలజీ, ఆర్‌డీఎన్‌ఏ టెక్నాలజీ, బయోమాలెక్యూల్స్‌, ప్రొటీన్స్‌, ఎంజైమ్స్‌, మాలెక్యులర్‌ బయాలజీ, కార్బొహైడ్రేట్‌ మెటబాలిజం, తదితర అంశాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి.


కెమిస్ట్రీలో కీలకం!
గేట్‌ పరీక్షలో కెమిస్ట్రీకి బాగా పోటీ ఉంటుంది. అభ్యర్థులు బి.ఎస్‌సి. సిలబస్‌ నుంచి ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ప్రాథమిక అంశాలను బాగా నేర్చుకున్న తర్వాత పీజీ సిలబస్‌ను చదవడం మంచిది. ఫిజికల్‌, ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ... మూడింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.

* ఫిజికల్‌ కెమిస్ట్రీలో క్వాంటమ్‌ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్‌, కెమికల్‌ కైనెటిక్స్‌, సాలిడ్‌ స్టేట్‌, మొదలైన అంశాల్ని బాగా చదవాలి. * ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో స్టీరియో కెమిస్ట్రీ, రియాక్షన్‌ మెకానిజమ్‌, పెరిసైక్లిక్‌ రియాక్షన్స్‌, ఫొటోకెమిస్ట్రీ, బయో మాలెక్యూల్స్‌, స్పెక్ట్రోస్కోపీ, తదితర పాఠ్యాంశాలను బాగా అధ్యయనం చేయాలి.

* ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో ప్రధానంగా మెయిన్‌ గ్రూప్‌ ఎలిమెంట్స్‌, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఇనార్గానిక్‌ స్పెక్ట్రోస్కోపీ, మొదలైన అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.

ఫిజిక్స్‌, మేథ్స్‌ అభ్యర్థులకు...
* గేట్‌ ఫిజిక్స్‌ (పీహెచ్‌) రాసే అభ్యర్థులు ముఖ్యంగా క్లాసికల్‌ మెకానిక్స్‌, ఎలక్ట్రో మేగ్నటిక్‌ థియరీ, క్వాంటమ్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఫిజిక్స్‌, అటామిక్‌ అండ్‌ మాలెక్యులర్‌ ఫిజిక్స్‌, సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ అండ్‌ పార్టికిల్‌ ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ పాఠ్యాంశాలను బాగా అధ్యయనం చేయాలి.

* గేట్‌ మేథ్స్‌ (ఎం.ఎ.) రాసే అభ్యర్థులు... లీనియర్‌ ఆల్జీబ్రా, కాంప్లెక్స్‌ ఎనాలిసిస్‌, రియల్‌ ఎనాలిసిస్‌, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, ఫంక్షనల్‌ ఎనాలిసిస్‌, పార్టికల్‌ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, మెకానిక్స్‌, టోపోలజీ, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, లీనియర్‌ ప్రోగ్రామింగ్‌, కాలిక్యులస్‌ ఆఫ్‌ వేరియేషన్‌, ఇంటెగ్రల్‌ ఈక్వేషన్స్‌, తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.

లైఫ్‌ సైన్సెస్‌, బేసిక్‌ సైన్సెస్‌ అభ్యర్థులు సబ్జెక్టు భావనలపై బాగా పట్టు సాధించాలి. పాఠ్యపుస్తకాలతోపాటు రిసెర్చ్‌ జర్నళ్లను కూడా అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టులోని తాజా అంశాలను నేర్చుకోవచ్చు. అలాగే పాత ప్రశ్నపత్రాలను, నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా ప్రిపరేషన్‌ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. సమయపాలన కూడా అలవాటవుతుంది.

* గేట్‌కు ఈ ఏడాది నుంచి విద్యార్హతల్లో మార్పులు చేశారు. ఈ వివరాల కోసం ఇదే బ్లాగులో కథనాన్ని  ఇక్కడ. క్లిక్ చేసి చదవండి.

Wednesday, 21 September 2011

సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు!

 ఐబీపీఎస్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనెల్‌ సెలక్షన్‌) నిర్వహించే పరీక్షల జాబితాలో మరోటి చేరింది. బ్యాంకు పీఓ, క్లర్కుల పోస్టుల ప్రకటనల తర్వాత, మూడో పరీక్షకు కూడా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇవి జిల్లాస్థాయి సహకార బ్యాంకుల్లో కొలువుల నియామకానికి సంబంధించినవి. డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఓ, క్లర్కుల అభ్యర్థులు కొత్తగా ఏమీ చదవకుండానే ఈ పరీక్షను రాసెయ్యవచ్చు. అదనపు శ్రమ లేకుండానే అదనపు కొలువు అవకాశాలకు నిజంగా ఇదో గొప్ప సహకారం!

‘ఈనాడు చదువు’ పేజీలో ప్రచురించిన ఈ కథన రచయిత ఎస్. అరుణ్ మోహన్. 


జాతీయ బ్యాంకులూ, గ్రామీణ బ్యాంకులూ ఐబీపీఎస్‌ ద్వారా వేలకొద్దీ ఉద్యోగాలకు ప్రకటనలు వెలువరిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగార్థులకు అపూర్వ అవకాశాలు లభిస్తున్న ఈ తరుణంలోనే ఏపీ సహకార బ్యాంకు డీసీసీబీల ద్వారా అవకాశాలను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంఆ 1593 క్లర్కు ఉద్యోగాలు, 960 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయబోతున్నారు!

ఈ పోస్టులకు ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు జిల్లాలవారీగా దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. ప్రతి జిల్లాకూ వేర్వేరు వెబ్‌సైట్లున్నాయి.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 3, 2011.

పరీక్ష తేదీలు
* క్లర్కులు/, స్టాఫ్‌ అసిస్టెంట్లు: అక్టోబరు 30, 2011, ఉదయం.
* అసిస్టెంట్‌ మేనేజర్‌ పరీక్ష: అక్టోబరు 30, 2011, మధ్యాహ్నం.

రిజర్వేషన్లు
ప్రస్తుత ఖాళీల్లో అన్ని క్యాటగిరీలలో స్త్రీలకు 30 శాతం రిజర్వేషన్‌ పాటిస్తున్నారు.

క్లర్కు ఉద్యోగాలకు ఉన్న మొత్తం ఖాళీల్లో 25 శాతం పోస్టులను ఆయా జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (Primary Agricultural Co-operative Societies - PACS) పనిచేస్తున్న ఉద్యోగులకు కేటాయించారు. కనీసం 10 సంవత్సరాలు ఆయా సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. PACSలో పనిచేస్తున్న అర్హత గల అభ్యర్థుల గరిష్ఠ వయః పరి మితి 45 సంవత్సరాలు.

సాధారణ అభ్యర్థుల వయః పరిమితి 18 సం. నుంచి 30 సంవత్సరాల మధ్య.

(క్లర్కు ఉద్యోగాలకు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు ఒకే వయః పరిమితి)

అభ్యర్థి ఏ జిల్లాలో ఉద్యోగాన్ని ఆశిస్తున్నాడో తప్పనిసరిగా అదే జిల్లాకు చెందినవాడై ఉండాలి. ఆయా జిల్లాల్లో స్థానిక (లోకల్‌) అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. ఒక జిల్లాకు లోకల్‌ అభ్యర్థులు వేరే జిల్లాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.

విద్యార్హతలు
* క్లర్కు ఉద్యోగానికి కనీస విద్యార్హత- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
* అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లేదా కామర్స్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత

కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ఇంగ్లిష్‌ భాషాజ్ఞానం కూడా అవసరం. తెలుగు రాయటం, చదవటం, మాట్లాడటం... ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం
ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. 1) రాతపరీక్ష 2) మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ).

175 మార్కులతో 2 గంటల కాలవ్యవధిలో ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకూ, క్లర్కు ఉద్యోగాలకూ విడివిడిగా జరుగుతుంది.

అలాగే 25 మార్కులతో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకూ, క్లర్కు ఉద్యోగాలకూ విడివిడిగా ఇంటర్వ్యూలు ఉంటాయి.

రాత పరీక్షలో మెరిట్‌ జాబితా ఆధారంగా 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలోనూ, రాతపరీక్షలోనూ సంయుక్తంగా వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఆబ్జెక్టివ్‌ రాతపరీక్షలో సబ్జెక్టులు
* స్టాఫ్‌ అసిస్టెంట్స్‌/ క్లర్కు పరీక్ష
* అసిస్టెంట్‌ మేనేజర్‌ పరీక్ష
1)టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌
1) రీజనింగ్‌, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌
2) టెస్ట్‌ ఆఫ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ
2) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
3) టెస్ట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌, క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌
3)జనరల్‌, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌
4) టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
4) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌


ఎలా తయారవ్వాలి?
ఐబీపీఎస్‌ క్లర్కు ఉద్యోగాలకూ, ఐబీపీఎస్‌ పీఓ ఉద్యోగాలకూ సిద్ధమయ్యే అభ్యర్థులు అదనంగా సిద్ధం కావలసిన సబ్జెక్టులు ఏమీ లేవు.

పరీక్ష అక్టోబరు 30న జరగబోతోంది కాబట్టి ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష నిన్న రాసినవారు సాధన (ప్రాక్టీస్‌) కొనసాగిస్తే ఈ పరీక్షను చాలా సులభంగా రాయవచ్చు.

అలాగే ఐబీపీఎస్‌ క్లర్కు ఉద్యోగాలకు నవంబరు 27న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ పరీక్ష చక్కటి అభ్యాసంగా ఉపయోగపడుతుంది.

ఐబీపీఎస్‌ పరీక్షతో పోలిస్తే ఈ బ్యాంకు పరీక్ష కేవలం జిల్లాలకు పరిమితం. కాబట్టి పోటీ కూడా జిల్లాకే పరిమితం. ఈ బ్యాంకులో ఉద్యోగంలో చేరితే సర్వీస్‌ అంతా ఒకే జిల్లాలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది! దూరప్రాంతాలకు బదిలీ బెడద అసలుండదు.

అదనపు ప్రిపరేషన్‌ అవసరం లేకుండా ఐబీపీఎస్‌ పరీక్షల ప్రిపరేషన్‌తోనే సహకార బ్యాంకులో కొలువు సంపాదించగల చక్కని అవకాశం ఇప్పుడు అభ్యర్థుల ముందుంది!

Tuesday, 20 September 2011

గ్రూప్‌-1... తుది మెరుగులు ఎలా?

    గ్రూప్‌-1 లో ప్రాథమిక పరీక్ష దశను విజయవంతంగా అధిగమించిన అభ్యర్థులు మరో ముఖ్య ఘట్టానికి చేరువవుతున్నారు. ఈ నెల 25 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు మొదలవబోతున్నాయి. పరీక్ష రాయబోయే అభ్యర్థులకు మిగిలిన ఈ ఐదు రోజులూ ఎంతో కీలకమైనవి. ఈ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేదెలా? టాపర్‌ చెపుతున్న కిటుకులు తెలుసుకోండి... ఆచరించండి... విజయీభవ!

    వ్యాసం రాసేటపుడు 800-900 పదాలు, లేదా 4 పేపర్లలో పూర్తి చేయడం మంచిది. ఇందులో విశ్లేషణ, గణాంకాలు సమపాళ్లలో ఉండాలి. సమకాలీన అంశాలు, ఉదాహరణలు ఇస్తూ సామెతలు, ప్రముఖ వ్యక్తుల సూక్తులను ఉపయోగిస్తూ రాస్తే ప్రభావశీలంగా ఉంటుంది.

2008 గ్రూప్‌-1 పరీక్షలో రాష్ట్రస్థాయి 4వ ర్యాంకును సాధించారు సి. నారాయణరెడ్డి. రాతపరీక్షలో రాష్ట్రస్థాయిలో ఆయన మొదటి ర్యాంకర్‌. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల ఆర్డీవోగా పనిచేస్తున్న నారాయణరెడ్డి అభ్యర్థులకు ఉపకరించే మెలకువలూ, సూచనలూ తెలిపారు. ఈ తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా విజయవంతంగా పరీక్షలు రాయాలీ... ఇవన్నీ ఆయన మాటల్లోనే చదవండి!


గ్రూప్‌-1 అంటే రాష్ట్రస్థాయిలో అత్యున్నత సర్వీసులు. బాగా పోటీ ఉండే ఈ పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తమ స్థాయిలో ప్రతిభ ప్రదర్శించటం తప్పనిసరి.

గ్రూప్‌-1 పరీక్షలు రాయబోయేవారు వివిధ సందేహాల్లో చిక్కుకుని ఆందోళన పడుతుంటారు. దీన్ని మొదట తగ్గించుకోవాలి. ఇప్పటివరకూ చదివిన అంశాలను ఎలా పునశ్చరణ (రివిజన్‌) చేయాలి, పరీక్ష కేంద్రంలో సమయం సరిపోతుందా, ఒక ప్రశ్నకు జవాబు ఎన్ని పదాల్లో రాయాలి, జవాబు సంక్షిప్తంగా రాయాలా... లేదా పాయింట్ల వారీగా రాయాలా, సైడ్‌ హెడింగులు వాడాలా వద్దా, రెడ్‌ పెన్‌ ఉపయోగించాలా వద్దా... ఇవన్నీ అనుమానాలే! ఓ పక్క ఇవి మనసును తొలిచేస్తుంటే ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించాలంటే..

* పరీక్ష టైంటేబుల్‌ను పరిశీలిస్తే పేపర్‌-1కు మధ్యలో ఎలాంటి విరామం లేకుండా పేపర్‌-2 ఉంది. మిగతా పేపర్లకు ఒకరోజు విరామం ఉంటుంది. కాబట్టి, అభ్యర్థులు మొదట పేపర్‌-1 సంబంధించి పునశ్చరణ చేయాలి. ఇలా 22వ తేదీ వరకు పూర్తిచేస్తూనే అవసరాన్నిబట్టి మిగతా పేపర్లకు సమయాన్ని కేటాయించాలి.

23, 24 తేదీల్లో పూర్తిగా జనరల్‌ ఇంగ్లిష్‌నే చదవాలి. అయితే చాలామంది ఇందులో కేవలం పాస్‌ మార్కులు వస్తే చాలు అన్నట్లుగా ఉంటారు. ఇక్కడే అభ్యర్థులు దెబ్బతింటున్నారు. దీని సన్నద్ధతకు ఇంటర్‌ స్థాయి ఇంగ్లిష్‌ గ్రామర్‌ (వ్యాకరణం) చదివితే చాలు.

* పేపర్‌-1 నుంచి పేపర్‌-4 వరకు ప్రతిరోజూ పరీక్ష రాసి వచ్చిన సాయంత్రం నుంచే మిగతా పేపర్లకు సంబంధించి పునశ్చరణ చేయాలి. ఇక్కడ మొత్తం సిలబస్‌ కవరయ్యేవిధంగా అధ్యయనం చేయాలి. వీలైనంత వరకు ఈ సమయంలో కొత్త ప్రశ్నలు, ప్రిపరేషన్‌ వైపు పోకూడదు. గతంలో తయారుచేసుకున్న నోట్సు/ పుస్తకాలనే చదవాలి. అంతేకానీ కొత్తవాటి జోలికి వెళ్ళకూడదు. ఇవన్నీ ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

* పేపర్‌-1లో మూడు వ్యాసాలను (ఎస్సేలు) రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి పునశ్చరణ సమయంలో తాను తయారుచేసుకున్న వ్యాసాలను క్షుణ్ణంగా చదవాలి. పరీక్ష సమయంలో ఒక వ్యాసం రాయటానికి గంట సమయం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ప్రశ్నలను మొదట పూర్తిగా చదవాలి.

ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి వ్యాసాన్ని ఎంపిక చేసుకోవాలి. జాగ్రత్తగా గమనిస్తే అడిగిన ప్రశ్నలోనే వ్యాసం 'స్కెలిటన్‌' దాగి ఉంటుంది.

ఒకవేళ చదివివుండని, తయారవ్వని వ్యాసం వస్తే? హైరానా పడకూడదు. మనం చదివిన విషయాలను ఉపయోగిస్తూ వీలైనంతవరకు వ్యాసాన్ని సమర్థంగా రాయటానికి ప్రయత్నించాలి.

రాసేటపుడు సైడ్‌ హెడింగులు, చిత్రాలు, పాయింట్‌ వారీగా రాస్తే మనం చెప్పాలనుకున్నది స్పష్టంగా ఉంటుంది. అయితే వ్యాసం రాసేటపుడు 800-900 పదాలు, లేదా 4 పేపర్లలో పూర్తి చేయడం మంచిది. ఇందులో విశ్లేషణ, గణాంకాలు (డాటా) సమపాళ్లలో ఉండాలి. వీలైనంతవరకూ సమకాలీన అంశాలు, ఉదాహరణలు ఇస్తూ సామెతలు, ప్రముఖ వ్యక్తుల సూక్తులను ఉపయోగిస్తూ రాస్తే ప్రభావశీలంగా ఉంటుంది.


* పేపర్‌-2లో ఎక్కువగా సబ్జెక్టు ఉంటుంది. 15 చాప్టర్లు కవరయ్యేవిధంగా ప్రణాళికాబద్ధంగా పునశ్చరణ చేయాలి. ముందుగా అన్ని అధ్యాయాలనూ (చాప్టర్లు) పూర్తి చేయాలి. అయితే ముందు చాప్టర్లకు ఎక్కువ సమయాన్ని కేటాయించి చివరివి వదిలిపెడతారు. ఇది సరి కాదు.

చరిత్రలో రాజవంశీయులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక, చిత్రకళా రంగాలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్లు తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. భారత రాజ్యాంగంలో ముఖ్యమైన ఆర్టికల్స్‌తో పాటు సమకాలీన రాజకీయ అంశాలను కూడా తప్పనిసరిగా మననం చేసుకోవాలి.

* పరీక్షా సమయంలో ప్రశ్నపత్రం తీసుకున్న వెంటనే ఒక విభాగం (సెక్షన్‌) లోని అన్ని ప్రశ్నలూ ఓసారి పూర్తిగా చదివి బాగా తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాయడం చేయాలి. దీనివల్ల ఆందోళన తగ్గుతుంది. రాతలో వేగం లేకపోవడం, అక్షరాలు సరిగా కుదరకపోవడం వంటి సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఒక విభాగానికి సంబంధించిన ప్రశ్నలను ఒకే దగ్గర రాయటం ఉత్తమం.

* పేపర్‌-3 లో భారత ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను సరిపోలుస్తూ చదవడం మంచిది. జవాబు రాసేటపుడు విశ్లేషణతో పాటు గణాంకాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. కచ్చితంగా తెలియని డాటాను సుమారుగా అనే పదాన్ని ఉపయోగించడం మంచిది. వీలైనంతవరకూ తెలియని గణాంకాల జోలికి వెళ్లరాదు.

* పేపర్‌-4 లో మూడు విభాగాలు, మూడు విభిన్న అంశాలు ఉంటాయి. అయితే ప్రతి సెక్షన్‌లో ప్రాథమిక శాస్త్రీయ అంశాలు పునశ్చరణ చేస్తూ వాటిని సమకాలీన సమాజంలో ఏవిధంగా ఉపయోగిస్తున్నారు అనేది తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. పరీక్షా సమయంలో వీలైనంతవరకు శాస్త్రీయ పదాలను ఉపయోగిస్తూ, సులభంగా విశ్లేషిస్తూ, సమకాలీన అంశాలను అన్వయిస్తూ జవాబులు రాయాలి.

* పేపర్‌-5 ముఖ్యంగా ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉన్న పేపర్‌. అయితే ఇది నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులను కొంత ఇబ్బంది పెట్టే అవకాశమున్న పేపర్‌ కూడా. ముఖ్యంగా పునశ్చరణ సమయంలో సూత్రాలు, సమస్యా పరిష్కార పద్ధతులు నేర్చుకోవాలి.

పరీక్షా సమయంలో ముందుగా ప్రశ్నలో ఏమి ఇచ్చారు.. ఏమి కనుక్కోమన్నారు.. అనేవి అర్థం చేసుకోవాలి. ఈపేపర్‌లో మనం చదివిన అంశాలపైనే ప్రశ్నలుంటాయని మర్చిపోరాదు. కాబట్టి ప్రశ్నలను చూడగానే ఆందోళన చెందరాదు.
 

Monday, 19 September 2011

ఇంజినీరింగ్ లో చేరారా? ఇది మీకోసం!



ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తయి, రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి.

మనరాష్ట్రంలో ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. కానీ వీరిలో చాలా తక్కువమంది మాత్రమే మంచి ఉద్యోగాలు  సాధించ గలుగుతున్నారు.

కాలేజీలో ప్రవేశించిన రోజు నుంచే ఇంజినీరింగ్‌ కోర్సు స్వభావం, కెరియర్‌పై విద్యార్థులు అవగాహన పెంపొందించుకుంటే ఆశించిన ఫలితం ఉంటుంది.

ఇంజినీరింగ్‌ను విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు, మంచి భవిష్యత్తును అందుకోవాలంటే... మొదటి ఏడాది నుంచే చక్కటి ప్రణాళికతో కార్యాచరణను రూపొందించుకోవాలి.

దీనికి ఉపకరించే సూచనలతో ఈ కథనం... రచయిత డి.నిరంజన్‌బాబు


ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మొదటగా కాలేజీ వాతావరణంలో త్వరగా ఇమిడిపోవడానికి ప్రయత్నించాలి. చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకొని ఇంజినీరింగ్‌ కోసం నగరాలకు వెళ్తున్నారు. అందువల్ల విద్యార్థులు మొదట కాలేజీ పరిసరాలకు అలవాటుపడటం, ఇతర విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగడం, కాలేజీలో అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలను తెలుసుకోవడం ముఖ్యం.

మీరు చేరిన యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. బ్రాంచికి సంబంధించిన తొలి ఏడాది సిలబస్‌, అవసరమైన పాఠ్యపుస్తకాలను సేకరించుకోవాలి. కాలేజీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించుకోవాలి.

తరగతి నుంచి నేర్చుకునేది సగమే..!
మనరాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొదటి ఏడాది ఇంజినీరింగ్‌ తరగతులు సాధారణంగా సెప్టెంబరు మధ్య నుంచి ప్రారంభమై, ఏప్రిల్‌-మే 2012తో ముగుస్తాయి. సెలవులను మినహాయిస్తే 7-8 నెలల్లో క్లాస్‌ వర్క్‌ పూర్తవుతుంది. సెమిస్టర్‌ పద్ధతైనా, వార్షిక పద్ధతైనా... మొదటి ఏడాది విద్యా ప్రణాళిక తీరిక లేకుండా ఉంటుంది. విద్యార్థులకు విశ్రాంతి తీసుకునే సమయం పెద్దగా ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు స్వల్ప, దీర్ఘ కాలాలకు పటిష్ఠమైన ప్రణాళికను తయారుచేసుకోవాలి. ఏప్రిల్‌ నాటికి ఇంజినీరింగ్‌ కోర్సును విజయవంతంగా పూర్తిచేయడం ఎలాగనేది దీర్ఘకాలిక ప్రణాళిక కిందికి వస్తుంది. రోజువారీ తరగతులు, చదువుకోవడం, ఇంటర్నల్‌ పరీక్షలను ఎదుర్కోవడం మొదలైనవి స్వల్పకాల ప్రణాళికగా రూపొందించుకోవాలి.

* తరగతులకు హాజరవడం, కాలేజీకి తిరగడానికి పట్టే సమయంపోగా మిగిలిన కాలాన్ని హోమ్‌ వర్క్‌కు, పాఠ్యపుస్తకాలు చదువుకోవడానికి, ఇతర అంశాలకు ప్రణాళికా బద్ధంగా కేటాయించుకోవాలి.

* వృత్తివిద్యా కోర్సుల్లో కాలేజీ తరగతుల నుంచి నేర్చుకునేది 50 శాతమే ఉంటుంది. మిగతా సగాన్ని లైబ్రరీ, బృంద చర్చలు, ఫ్యాకల్టీతో మాట్లాడటం ద్వారా నేర్చుకోవాలి. విద్యార్థి సొంత ప్రణాళిక, ఆసక్తి, చొరవపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఈ దశ నుంచే సొంతగా నేర్చుకోవడం అలవాటు చేసుకోవడం కెరియర్‌కు చాలా మంచిది. పాఠ్యపుస్తకాలను చదవడం, స్వయంగా నోట్సు తయారుచేసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.


క్లాసులో జరిగే బోధన నుంచి విద్యార్థులు వీలైనంత ఎక్కువగా గ్రహించడానికి కృషిచేయాలి. దీనికి అవసరమైన కొన్ని సూచనలు...

* క్లాసులోకి ప్రవేశించే ముందు మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలి. బోధన ప్రారంభం కావడానికి పది నిమిషాల ముందే క్లాసుకు చేరుకోవాలి.
* అధ్యాపకులు చెప్పే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి.
* రన్నింగ్‌ నోట్సు రాసుకోవాలి. ముఖ్యమైన సాంకేతిక అంశాలను నోట్‌ చేసుకోవాలి.
* క్లాసులో, డిపార్ట్‌మెంట్‌లో మీకు తలెత్తే సందేహాలను అడిగి, నివృతి చేసుకోవడానికి ప్రయత్నించాలి.
* క్లాసులో నీరసంగా ఉండకూడదు, నిద్రపోవద్దు.
* క్రమం తప్పకుండా కాలేజీకి, క్లాసులకు హాజరవ్వాలి. చాలా యూనివర్సిటీల్లో హాజరుకు కూడా మార్కులుంటాయి.
* ఏరోజు హోమ్‌వర్క్‌ ఆరోజు పూర్తిచేయాలి.
* క్లాసులో చెప్పబోయే పాఠ్యాంశాన్ని ఇంటిదగ్గర ముందుగానే ఒకసారి చూసుకొని వెళ్లడం మంచిది.

తరగతులు పూర్తయ్యాక...
క్లాసులు పూర్తయ్యాక ఏం చేస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. రోజూ లైబ్రరీకి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. క్లాసులో చెప్పిన అంశాలపై లైబ్రరీలోని వివిధ పాఠ్యపుస్తకాలను చదివి అవగాహన పెంపొందించుకోవాలి. పాఠ్యాంశాలపై మరింత స్పష్టత కోసం అవసరమైతే ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్‌లో ప్రముఖ సంస్థల అధ్యాపకుల ఉపన్యాసాలు, మెటీరియల్‌ లభిస్తాయి. మీరు ఎంచుకున్న బ్రాంచిలో, సబ్జెక్టుల్లో తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం తప్పనిసరి. వారానికోసారి అకడమిక్‌ జర్నళ్లను, మేగజీన్లను చదవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

* క్లాసులోని ఇతర విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలి. ఒకట్రెండు వారాలు సహ విద్యార్థులను పరిశీలించి, మీ ప్రవర్తన, ఆలోచనా ధోరణికి సరిపోయేవారితో పరిచయం పెంచుకోవచ్చు. వారితో సబ్జెక్టు గురించి చర్చించవచ్చు. పాఠ్యపుస్తకాలు, మెటీరియల్‌ లాంటివి పంచుకోవచ్చు. దీనివల్ల భయం, ఇతరులకంటే తాను తక్కువ ప్రతిభ గలవాడినేమోననే ఆందోళన దూరమవుతాయి. అధ్యాపకులతో కలివిడిగా మెలుగుతూ సబ్జెక్టు సందేహాలను నివృతి చేసుకోవాలి.

సిద్ధాంతం - ఆచరణ
వృత్తివిద్యా కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. ఇంజినీరింగ్‌లో రాణించాలంటే ప్రాక్టికల్స్‌లో ప్రతిభ చూపాలి. సిద్థాంతాలు, ప్రయోగాలను కలిపి అర్థం చేసుకోవడం ద్వారా సబ్జెక్టుపై స్పష్టత పెరుగుతుంది. ప్రాక్టికల్స్‌లో ఎంత ఎక్కువగా అనుభవం ఉంటే అంత మంచిది. దీనివల్ల విశ్లేషణ సామర్థ్యాలు పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.

* మొదటి ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సులో 75 శాతం సబ్జెక్టులు సైన్స్‌, హ్యుమానిటీస్‌కు సంబంధించి ఉంటాయి. మిగిలిన 25 శాతం కామన్‌ సబ్జెక్టులు ఉంటాయి. దాదాపు అన్ని యూనివర్సిటీల పరిధిలో మొదటి సంవత్సరం 90 శాతం సబ్జెక్టులు అన్ని బ్రాంచీల విద్యార్థులకు ఒకే విధంగా ఉంటాయి. ఒకట్రెండు పేపర్ల విషయంలో తేడాలు ఉండొచ్చు. పాఠశాల స్థాయి నుంచి చదువుతుంటారు కాబట్టి ప్రాథమిక సబ్జెక్టులైన మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సంబంధిత అంశాలను తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.

* ఇంజినీరింగ్‌ సంబంధిత సబ్జెక్టులైన డ్రాయింగ్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ అండ్‌ సర్క్యూట్‌ థియరీ (సర్క్యూట్‌ బ్రాంచిల వారికి); కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ సబ్జెక్టులు విద్యార్థులకు కష్టం అనిపించవచ్చు. క్లాసులో ఇచ్చే వర్క్‌షీట్‌లను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా ఈ సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే పాత ప్రశ్నపత్రాలను, పాఠ్యపుస్తకాల్లో ఇచ్చే అభ్యాసాలను సాధన చేస్తే వీటిపై పట్టు సాధించవచ్చు.



భవిష్యత్తుకు పునాది...
దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మీకు ఏ రంగం అంటే బాగా ఆసక్తి ఉందో తెలుసుకోవాలి. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఉన్నత చదువులకు వెళ్లవచ్చు లేదా ఉద్యోగం చూసుకోవచ్చు. ఎం.టెక్‌., ఎం.ఎస్‌., ఎంబీఏ, తదితర ఉన్నత కోర్సులు చేయాలంటే గేట్‌, జీఆర్‌ఈ, టోఫెల్‌, క్యాట్‌ లాంటి పరీక్షలు రాయాలి. వీటిపై ఇప్పటినుంచే అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా పరీక్షల స్వభావం ఎలా ఉంటుంది, ఏ అంశాలుంటాయో తెలుసుకొని సంబంధిత మెటీరియల్‌ను సేకరించుకోవాలి. బీటెక్‌ తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు అవసరమైన సామర్థ్యాలపై దృష్టిపెట్టాలి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, సీఎంసీ, హెచ్‌సీఎల్‌, తదితర కంపెనీల నియామక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలి. ఐఈఎస్‌, యూపీఎస్‌సీ, ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలైన ఇస్రో, డీఆర్‌డీఓ, బీఈఎల్‌, భెల్‌, ఎన్టీపీసీ, వీఎస్‌పీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ మొదలైన కంపెనీల్లో మీ బ్రాంచీకి లభించే ఉద్యోగాలు, కంపెనీల నియామక విధానాల గురించి తెలుసుకోవాలి.

* క్యాంపస్‌ నియామకాల సందర్భంలో కంపెనీలు సబ్జెక్టు తెలివితేటలతోపాటు కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు, చురుకుదనం, నాయకత్వ లక్షణాలు, నలుగురిలో కలిసి పనిచేయడం, పని పట్ల నిబద్ధత, సాఫ్ట్‌ స్కిల్స్‌, ప్రవర్తన, వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణి, తదితర లక్షణాలను క్షుణ్నంగా పరిశీలిస్తాయి. అందువల్ల ఇప్పటి నుంచే వీటిపై అవగాహన ఏర్పరచుకొని, సామర్థ్యాలను పెంపొందించుకోవాలి.

* ఇంగ్లిష్‌లో భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు నేటి అవసరం. ఇందులో వెనుకబడిన విద్యార్థులు ప్రత్యేకంగా దృష్టిపెట్టి నేర్చుకోవాలి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అభ్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎన్డీటీవీ లాంటి ఇంగ్లిష్‌ వార్తా చానెళ్లను చూస్తూ ఉచ్చారణను గమనించాలి. ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సిన అవసరం వస్తే 'ఎస్‌' లేదా 'నో' అని ముగించకుండా, చిన్న చిన్న వాక్యాలు మాట్లాడటానికి ప్రయత్నించాలి. రోజూ కొంత సమయం ఆంగ్ల దినపత్రికలను చదవడానికి కేటాయించాలి. ఆసక్తికరమైన సైన్స్‌ జర్నళ్లను చదవొచ్చు. క్రాస్‌వర్డ్స్‌, జంబుల్స్‌ లాంటివి సాధన చేస్తే ప్రయోజనం ఉంటుంది.

Saturday, 17 September 2011

ఇంగ్లిష్ భాషణ ప్రభావశీలంగా... సహజంగా!

Collocations ఉపయోగించటం వల్ల  మన ఇంగ్లిష్  సంభాషణలు సహజంగానే కాకుండా  effectiveగా ఉంటాయి.

1) Gift for something
2) Exceed expectations
3) Make a living
4) One could hear even a soft whisper
5) Let off crackers
6) One of the crackers went off close to my feet.


 ....ఇవన్నీ నిత్యజీవితంలో ఉపయోగించే collocationsలో కొన్ని. వీటి గురించి తెలుసుకుందామా? 

చదువు పేజీలో ప్రచురించిన ఈ వ్యాసం చూడండి...


Friday, 16 September 2011

రెండేళ్ళలో ఎంటెక్, ఎంఎస్సీ!

ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు జేఎన్‌టీయూ కాకినాడ, బీటీహెచ్‌ (స్వీడన్‌) సంయుక్తంగా డబుల్‌ డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (సిగ్నల్‌ ప్రాసెసింగ్‌) కోర్సును అందిస్తున్నాయి.

దీని ద్వారా రెండేళ్లలో ఎం.టెక్‌., ఎం.ఎస్‌సి. డిగ్రీలు అందుకోవచ్చు.

వీటిలో...
 

* ఎంటెక్‌ డిగ్రీని జేఎన్‌టీయూ కాకినాడ,
* ఎం.ఎస్‌సి.ని బీటీహెచ్‌ ప్రదానం చేస్తాయి.


జేఎన్‌టీయూకే - బీటీహెచ్‌ అందిస్తోన్న ఈ కోర్సులో మొత్తం సీట్లు 10. విదేశాల్లో ఉన్నత విద్య, మంచి ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కోర్సును రూపొందించారు.

కోర్సు వ్యవధి 4 సెమిస్టర్లు (24 నెలలు). అభ్యర్థులు బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ చదివుండాలి. ఈసీఈ, ఈఐఈ, ఏఎంఐఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌), ఏఎంఐఈటీ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలిమేటిక్స్‌ ఇంజినీరింగ్‌) బ్రాంచిలు చదివుండాలి.

* అర్హత పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు అవసరం. కోర్సులో భాగంగా సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ పేపర్‌ చదివుండాలి.

 కోర్సు ఫీజు రూ.1,50,000.

*  అభ్యర్థులు మొదటి సెమిస్టర్‌ మాత్రమే జేఎన్‌టీయూలో చదవాల్సి ఉంటుంది. మిగిలిన మూడేళ్లు బీటీహెచ్‌, స్వీడన్‌లో చదవాలి. చివరి సెమిస్టర్‌లో థీసిస్‌ వర్క్‌ ఉంటుంది.

* దరఖాస్తులను జేఎన్‌టీయూ కాకినాడ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అభ్యర్థులను కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 17 సెప్టెంబరు 2011.

* కౌన్సెలింగ్‌ తేదీ: 19 సెప్టెంబరు 2011

Thursday, 15 September 2011

రెండు అగ్రశ్రేణి సంస్థలు నిర్వహించే కోర్సు

ఇంజినీరింగ్‌లో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న సంస్థ- ఐఐటీ బాంబే.

ఆస్ట్రేలియాలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటి మొనాష్‌ యూనివర్సిటీ. ఉన్నత స్థాయి ఇంజినీరింగ్‌ పరిశోధనలకు ఈ సంస్థ పేరు పొందింది.  

ఈ రెండూ కలిసి పీహెచ్‌డీ కోర్సును అందిస్తున్నాయి!

ప్రపంచంలోని రెండు అగ్రశ్రేణి సంస్థలు కలిసి నిర్వహిస్తోన్న కోర్సు ఇది. దీని ద్వారా అభ్యర్థులు ఉన్నత స్థాయి కెరియర్‌ను అందుకోవచ్చు. ప్రత్యేక అంశాల్లో పరిశోధనలు చేయడానికి ఈ సంస్థలు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నాయి.

ఐఐటీ బాంబేలో ప్రత్యేకంగా 'ఐఐటీబీ మొనాష్‌ రిసెర్చ్‌ అకాడమీ' పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పీహెచ్‌డీ కోర్సును నిర్వహిస్తున్నాయి.

కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ఐఐటీ బాంబే, మొనాష్‌ అకాడమీ సంయుక్తంగా డిగ్రీని ప్రదానం చేస్తాయి. రెండు సంస్థలకు చెందిన బోధన సిబ్బంది ప్రోగ్రామ్‌ నిర్వహణలో పాలుపంచుకుంటారు.

 డిసెంబరు 2011 సెషన్‌కు నోటిఫికేషన్‌ వెలువడింది. ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులు కింది అంశాల్లో పరిశోధనలు నిర్వహించాలి.

1. అడ్వాన్స్‌డ్‌ కంప్యూటేషనల్‌ ఇంజినీరింగ్‌, సిమ్యులేషన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చర్‌
2. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌ 

3. క్లీన్‌ ఎనర్జీ
4. వాటర్‌
5. నానోటెక్నాలజీ
6. బయోటెక్నాలజీ అండ్‌ స్టెమ్‌ సెల్‌ రిసెర్చ్‌


అభ్యర్థులు ఎక్కువకాలం ఐఐటీ బాంబేలో పరిశోధనలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యవేక్షకుల మార్గనిర్దేశం, శిక్షణ ఇక్కడ లభిస్తుంది. రెండు సంస్థలకు చెందిన పర్యవేక్షకులు అభ్యర్థులను ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేస్తారు. కోర్సులో భాగంగా మొనాష్‌ యూనివర్సిటీలో 3 నెలలు పరిశోధనలు చేయవచ్చు. ఇన్ఫోసిస్‌, గూగుల్‌, టీసీఎస్‌, కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం తదితర సంస్థలు ఇండస్ట్రీ భాగస్వాములుగా ఉన్నాయి.

స్కాలర్‌షిప్‌లు, అర్హతలు
ఎంపికైన అభ్యర్థులకు అద్భుతమైన స్కాలర్‌షిప్‌ అందుబాటులో ఉండటం ఈ కోర్సు ప్రత్యేకత.
కోర్సు కాలంలో ఏడాదికి సుమారు రూ.2,24,000 స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

ఇవిగాక ఆస్ట్రేలియాలో పరిశోధనలు నిర్వహించడానికి ప్రత్యేకంగా గ్రాంట్‌లు లభిస్తాయి. అభ్యర్థుల అర్హతలు, గ్రేడ్‌లు, పరిశోధనల తీరును బట్టి స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని నిర్ణయిస్తారు. జూన్‌ 2011 సెషన్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.

* ఇంజినీరింగ్‌ లేదా సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్‌ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లకు గేట్‌లో మంచి స్కోరు కూడా అవసరం. గేట్‌ స్కోరు లేకపోతే కనీసం రెండేళ్ల పరిశోధన అనుభవం కావాలి.

* దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్.‌  నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ  3 అక్టోబరు 2011.

Wednesday, 14 September 2011

మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మెరుగైన విద్యాసంస్థలు

దేశంలో అనేక కార్పొరేట్‌ విద్యా సంస్థలు సాధారణ యూనివర్సిటీలకంటే నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఆధునిక సౌకర్యాలు, మంచి ప్లేస్‌మెంట్లతో ఐఐఎంలకు దీటుగా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి.

అలాంటి కొన్ని సంస్థల గురించి గత సంచికల్లో తెలుసుకున్నాం.

ఇదో కోవలోకి వచ్చే మరికొన్ని...

* ఎస్‌పీ జైన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, ముంబయి (ఎస్‌పీజేఐఎంఆర్‌);
* మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్ స్టిట్యూట్‌ (ఎండీఐ), గుర్గావ్‌;
* భారతీదాసన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బీఐఎం), తిరుచిరాపల్లి.


ఈ సంస్థల్లో అందిస్తోన్న మేనేజ్‌మెంట్‌ కోర్సులు, వాటి ప్రత్యేకతలు, ప్రవేశ వివరాలు తెలుసుకుందాం.

అంతర్జాతీయ గుర్తింపు సంస్థల అక్రెడిటేషన్‌తో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోన్న అరుదైన సంస్థ ఎండీఐ, గుర్గావ్‌. ఈ సంస్థకు లండన్‌లోని అసోసియేషన్‌ ఆఫ్‌ ఎంబీఏస్‌ (ఏఎంబీఏ) గుర్తింపు ఉంది. ఉన్నత అర్హతలు, అనుభవం గల జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్‌ల నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. పారిశ్రామికంగా మంచి గుర్తింపు పొందిన గుర్గావ్‌లో ఈ సంస్థ ఉండటం సంస్థకు, విద్యార్థులకు సానుకూల అంశం.

ఎండీఐలో ఆధునిక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అనేక పార్ట్‌టైమ్‌, పీజీపీఎం, డాక్టొరల్‌ ప్రోగ్రామ్‌లు చేయవచ్చు. ముఖ్యమైన ప్రోగ్రామ్‌లు కొన్ని...

* పీజీపీ ఇన్‌ ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌
* పీజీపీ ఇన్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌
* పీజీపీ ఇన్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌
* పీజీపీ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ మేనేజ్‌మెంట్‌
* ఫెలో/ ఎగ్జిక్యూటివ్‌ ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌
* నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎగ్జిక్యూటివ్‌ పీజీడీఎం)
* సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌

ఎండీఐ అందిస్తోన్న మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లకు ఏఐసీటీఈ, ఎన్‌బీఏ గుర్తింపు ఉంది. నేషనల్‌ హెచ్‌ఆర్‌డీ నెట్‌వర్క్‌ సహకారంతో పీజీపీ - హెచ్‌ఆర్‌ను నిర్వహిస్తోంది. పరిశోధనలకు కూడా ఈ సంస్థ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, కార్పొరేట్‌ గవర్నన్స్‌, తదితర అంశాల్లో పరిశోధనలు చేయవచ్చు. కంపెనీల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగుల కోసం అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తోంది.

అనేక విదేశీ బిజినెస్‌ స్కూళ్లతో స్టూడెంట్‌ ఎక్చేంజ్‌ ప్రోగ్రామ్‌లను ఎండీఐ నిర్వహిస్తోంది. వీటిలో పాల్గొనడానికి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్‌లతోపాటు ఎండీఐ మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు, ఒ.పి. జిందాల్‌ స్కాలర్‌షిప్‌లు పొందవచ్చు.

* పీజీపీఎం (2012-14)లో ప్రవేశానికి ఎండీఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. క్యాట్‌ 2011 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆదారంగా ఎండీఐలో ప్రవేశం లభిస్తుంది.

* అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎండీఐ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఫిబ్రవరి- ఏప్రిల్‌ 2012లో గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

* దరఖాస్తులకు చివరితేదీ 20 అక్టోబరు 2011.

బీఐఎం, తిరుచిరాపల్లి
ప్రధాన స్రవంతి యూనివర్సిటీలకు చెందిన మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ప్రముఖమైనది... భారతీదాసన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బీఐఎం- తిరుచిరాపల్లి). టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈఓగా పనిచేసిన ఎస్‌. రామదొరై పాలనా నేతృత్వంలో బీఐఎం కొనసాగుతోంది. మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, సిస్టమ్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లతో ఎంబీఏ కోర్సును బీఐఎం అందిస్తోంది. ఐఐఎంలు, ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల నిపుణులతో శిక్షణ అందిస్తోంది.
యూనివర్సిటీలో భాగంగా ఉన్నప్పటికీ ప్రత్యేక బిజినెస్‌ స్కూల్‌ మాదిరిగా బీఐఎం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతోంది. భారతీదాసన్‌ యూనివర్సిటీ పరిధిలో స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా గుర్తింపు పొందింది. మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల రూపకల్పన, మార్పులు, చేర్పులలో ప్రభుత్వ రంగ కంపెనీ బీహెచ్‌ఈఎల్‌, సీఐఐ పాలుపంచుకుంటున్నాయి. విద్యార్థులకు బీహెచ్‌ఈఎల్‌ ప్రాజెక్టులను కూడా ఇస్తోంది. అనేక కార్పొరేట్‌ కంపెనీల్లో సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు చేసే అవకాశం ఉంటుంది. క్యాట్‌ 2011 స్కోర్లను మాత్రమే బీఐఎం పరిగణనలోకి తీసుకుంటుంది. క్యాట్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ వివిధ కేటగిరీల అభ్యర్థులకు ఇలా ఉండాలి... ఓసీ-90; బీసీ-75; ఎంబీసీ-60; ఎస్సీ-50, ఎస్టీ-50.

* కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు. అభ్యర్థులు క్యాట్‌ 2011 పరీక్ష తప్పనిసరిగా రాయాలి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో బీఐఎంకు దరఖాస్తు చేయవచ్చు. ఐఎంఎస్‌ లెర్నింగ్‌ సెంటర్లలో కూడా దరఖాస్తులు లభిస్తాయి. 1 డిసెంబరు 2011 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది.

చివరితేదీ 30 జనవరి 2012.


'రిటైల్‌' ప్రత్యేకతకు 'లీబా' - చెన్నై
నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ కోర్సులను మరో రెండు అగ్రశ్రేణి ప్రైవేటు సంస్థలు... లయోలా ఇన్  స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (లీబా- చెన్నై), జేవియర్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (భువనేశ్వర్‌).

* వ్యాపార రంగంలో జాతీయ, అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సమర్థులైన నిపుణులను తయారుచేయడానికి మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను రూపొందించిన సంస్థ లయోలా ఇన్ స్టిట్యూట్‌. జనరల్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, సిస్టమ్స్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, రిటైలింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్పెషలైజేషన్లతో పీజీడీఎం కోర్సులను నిర్వహిస్తోంది. ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ. - ఎక్స్‌ఏటీ ఆధారంగా ఎంపిక చేస్తుంది. తర్వాత జీడీ, ఇంటర్వ్యూ ఉంటాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కావచ్చు.

* జేవియర్‌ ఇన్ స్టిట్యూట్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఎం, రూరల్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్లతో పీజీడీఎం, ఫెలోప్రోగ్రామ్‌లను ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. తొలిదశలో క్యాట్‌ లేదా జేవియర్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోర్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తర్వాత గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటాయి. వీటితోపాటు అకడమిక్‌ రికార్డు, పని అనుభవం కూడా ఎంపికలో కీలకంగా పనిచేస్తాయి. అభ్యర్థులు ఎక్స్‌ఐఎంబీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేయవచ్చు.

చివరితేదీ 21 నవంబరు 2011.

Tuesday, 13 September 2011

డిగ్రీ, పీజీ విద్యార్థులకు సెంట్రల్‌ స్కాలర్‌షిప్‌లు

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రాడ్యుయేషన్‌, పీజీ కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రవేశ పెట్టింది.

'సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఆఫ్‌ స్కాలర్‌షిప్స్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌' పేరుతో వీటిని అమలుచేస్తోంది.

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యాబోర్డులకు వీటిని కేటాయిస్తుంది. 18-25 ఏళ్ల మధ్య గల జనాభాను దృష్టిలో ఉంచుకొని ఆయా బోర్డులకు స్కాలర్‌షిప్‌ల సంఖ్యను నిర్ణయిస్తుంది.

మొత్తం మీద ఈ పథకం ద్వారా జాతీయ స్థాయిలో 82 వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించనుంది.

మొత్తం స్కాలర్‌షిప్‌లలో సగం అమ్మాయిలకు కేటాయిస్తారు. సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు 3:2:1 నిష్పత్తిలో విభజిస్తారు.

కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ / +2 ఉత్తీర్ణులైనవారు వీటికి అర్హులు. మార్చి 2011కు ముందు ఇంటర్మీడియట్‌ / 10+2 ఉత్తీర్ణులైనవారు అర్హులు కాదు. అభ్యర్థులు 2011-12లో డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సులో చేరి ఉండాలి.

ఎంపికైన విద్యార్థులకు.... 
* డిగ్రీలో నెలకు రూ.1000 చొప్పున స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. 
* పీజీ కోర్సులకు నెలకు రూ.2000 లభిస్తుంది. 

మొత్తం స్కాలర్‌షిప్‌ వ్యవధి ఐదేళ్లు. డిగ్రీ మూడేళ్లు, పీజీ రెండేళ్లు స్కాలర్‌షిప్‌ పొందవచ్చు. ఒక విద్యాసంవత్సరంలో పదినెలలు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

ఎంపిక ఇంటర్మీడియట్‌ తర్వాత డిగ్రీ స్థాయిలో మాత్రమే జరుగుతుంది. డిగ్రీ పూర్తిచేశాక పీజీ కోర్సులకు స్కాలర్‌షిప్‌ దానంతటదే రెన్యువల్‌ అవుతుంది. ప్రొఫెషనల్‌ కోర్సులకు కూడా ఇవి వరిస్తాయి. ప్రభుత్వం గతంలో అమలుచేసిన నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను మెరుగుపరచి రెండేళ్ల కిందట ఈ కొత్త స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు.

అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షలకు మించరాదు. ఈ స్కీమ్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు 6097 స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ చదివిన విద్యార్థులకు సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌ స్ట్రీమ్‌లలో కటాఫ్‌లు (జనరల్‌ అభ్యర్థులకు) కింది విధంగా నిర్ణయించారు.
* సైన్స్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 967 మార్కులు, అమ్మాయిలకు 969  మార్కులు.
* కామర్స్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 882 మార్కులు, అమ్మాయిలకు 883 మార్కులు.
* హ్యుమానిటీస్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 690 మార్కులు, అమ్మాయిలకు 714 మార్కులు.

ఓబీసీ విద్యార్థులకు పరిగణనలోకి తీసుకునే కటాఫ్‌లు...
* సైన్స్‌ స్ట్రీమ్‌:  అబ్బాయిలకు 956 మార్కులు, అమ్మాయిలకు కూడా 956 మార్కులు.
* కామర్స్‌ స్ట్రీమ్‌:  అబ్బాయిలకు 824 మార్కులు, అమ్మాయిలకు 827 మార్కులు. 
* హ్యుమానిటీస్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 632 మార్కులు, అమ్మాయిలకు 654  మార్కులు

ఇంటర్మీడియట్‌లో మార్కుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తాత్కాలిక జాబితాను ఆయా కాలేజీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పంపిస్తుంది. విద్యార్థులు తమ తమ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపల్‌ వద్ద నుంచి సంబంధిత దరఖాస్తులను పొందవచ్చు.

బీఐఈఏపీ వెబ్‌సైట్‌ నుంచి కూడా దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ దరఖాస్తులను అన్ని వివరాలతో డిగ్రీ/ ప్రొఫెషనల్‌ కాలేజీల ద్వారా 'సెక్రటరీ, బీఐఈ, ఏపీ, నాంపల్లి, హైదరాబాద్‌' చిరునామాకు పంపించాలి.

ఇతర అభ్యర్థులు +2కు సంబంధించిన తమ బోర్డులను సంప్రదించాలి.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 30 సెప్టెంబరు 2011.
       

ఖాళీగా ఉన్న ఎమ్మెస్సీ సీట్లు!

ప్రసిద్ధ విశ్వవిద్యాలయం జేఎన్‌టీయూ (హైదరాబాద్) కొన్ని పీజీ కోర్సులకు విద్యార్థులను వెతుక్కుంటోంది.

ఎమ్మెస్సీ కి సంబంధించిన  ఒక్కో కోర్సులో 25 సీట్లు ఉంటే అందులో సగం నిండటం కష్టమవుతోంది.

ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా ఫీజు కట్టి కోర్సులో చేరవచ్చని చెబుతున్నారు.

ఈ వివరాలన్నీ ఇవాళ ఈనాడు హైదరాబాద్ ఎడిషన్లో ప్రచురించిన ఈ కథనంలో చూడండి...


Monday, 12 September 2011

‘అంతర్జాలం’ కాదు... ‘ఇంటర్నెట్’!

   
శీర్షిక చూస్తే ఇదేదో భాషా చర్చలా అనిపిస్తుంది కానీ, అది  కాదు!

గ్రూప్-1  మెయిన్స్ కు సంబంధించిన అంశం. ఈ పరీక్షల్లో తెలుగు భాషలో సమాధానాలు రాసేవారు  ఆంగ్ల పదాలను తక్కువగానే వాడాలి.

ఒకవేళ ఇంగ్లిష్‌ పదమే వాడాల్సివస్తే?  తెలుగులిపిలో ఆంగ్లపదం రాయాలి.

మరి పత్రికా భాషను యథాతథంగా రాయవచ్చా?

అలా చేయటం అంత సరైంది కాదు.

ఉదాహరణకు ...  ఇంటర్నెట్‌ అనే పదాన్ని 'అంతర్జాలం' అని పత్రికలు రాస్తున్నాయి కదా? కానీ మీరు గ్రూప్-1 పరీక్షల్లో మాత్రం ‘ఇంటర్నెట్‌’ అని రాయటమే మంచిది. మార్కులు రావటం మనకు ముఖ్యం కదా? అందుకన్నమాట !

కొడాలి భవానీ శంకర్‌ రాసిన ఈ కథనం ఇవాళ చదువు పేజీలో ప్రచురితమైంది. దాన్ని ఇక్కడ చదవండి!
  
 గ్రూప్‌-1 గెలుద్దాం!
    రాష్ట్రస్థాయి నియామకాల్లో ప్రధానమైనది గ్రూప్‌-1 సర్వీస్‌. ఈ సర్వీసులో ఎంపిక కోసం నిర్వహించే మెయిన్స్‌ రాతపరీక్ష తేదీలు దగ్గరపడుతున్నాయి. ఈ కీలక సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అంత ప్రయోజనం! పరీక్షను తిరుగులేని విధంగా రాసేలా సన్నద్ధం కావాల్సిన తరుణమిది!

రెండు వారాల కంటే తక్కువ సమయమే ఉంది గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు! ఏ పోటీపరీక్ష అభ్యర్థుల్లోనైనా వివిధ రకాల ఆలోచనలతో ఉండేవారు కనపడతారు.

* మరో 45 రోజులు వాయిదా పడితే బాగుణ్ణు అనుకునేవారు కొంతమంది.

* ఈ ప్రిపరేషన్‌ ఏదో ఇంకో 30 రోజులముందే ప్రారంభించివుంటే ఎంత బాగుండేది అన్పించేవాళ్ళు కొందరు.

* పరీక్ష ముగిస్తే ఒక పనైపోతుందని ఆలోచించేవాళ్ళు మరికొంతమంది. తమ ప్రిపరేషన్‌ స్థాయే వారిని ఇలా రకరకాలుగా ఆలోచింపజేస్తుంది.

కాలం ఎవరికోసమూ ఆగదు కదా? మరి ఇలాంటి ఆలోచన్లతో ఒత్తిడికి గురయ్యేబదులు ఎలాంటి సంసిద్ధతతో గెలుపు సాధించవచ్చు?

ఎ) ఈ 14 రోజులే కీలకం
2008 గ్రూప్‌-1లో సీటీవోగా ఎంపికై ఉన్నత సర్వీసు పొందేందుకు మళ్ళీ సిద్ధమవుతున్న అభ్యర్థి- 'చివరి నెలలో పడిన శ్రమవల్లనే నాకు విజయం సాధ్యమైంది' అని ప్రస్తావించారు. ఆర్డీవోగా ఎంపికైన రవినాయక్‌ కూడా 'చివరి 15 రోజుల్లో జరిగిన ప్రిపరేషన్‌ నాకు మంచి మార్కులు తెచ్చింద'న్నారు. పరీక్ష దగ్గరయ్యేకొద్దీ రకరకాల ఒత్తిళ్ళ వల్ల విజయానికి దూరమయ్యేవారే ఎక్కువ.

బి) విహంగ వీక్షణం విలువైనది
ఈ రెండువారాల సమయంలో ప్రతి పేపర్లో ఉన్న సిలబస్‌ అంశాల్నీ, చాయిస్‌గా వదిలేయదగిన వాటినీ, తప్పనిసరిగా సిద్ధమవ్వాల్సిన విషయాల్నీ మరొక్కసారి విహంగవీక్షణం చేయాలి. ముఖ్యంగా ప్రశ్నలవారీగా చదివిన అభ్యర్థులు ఈ ధోరణిని అలవర్చుకోకపోతే- ప్రశ్నల మధ్య ఉండే సంబంధంతో జవాబులు తయారుచేస్తే బోల్తాపడే ప్రమాదముంది.

ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యస్థితిపై సమాధానం రాయాల్సివస్తే ఎకానమీలోని 'ప్రాంతీయ అసమానతలు', పేపర్‌-4లోని 'ఆరోగ్య పరిరక్షణ' అంశాలు మొదలైనవాటి మధ్య సంబంధాలు అర్థం చేసుకోవాలంటే ఈ దశలో చేసే విహంగ వీక్షణం బాగా ఉపయోగపడుతుంది. సివిల్స్‌, గ్రూప్స్‌లలో ఈ స్థూల అవగాహన ప్రధానమని గుర్తిస్తే అకడమిక్‌ పరీక్షలకూ, పోటీ పరీక్షలకూ మధ్య తేడా కూడా అర్థమవుతుంది!

సి) ఇంగ్లిష్‌ అర్హత పరీక్షే కానీ..
పేపర్ల ప్రిపరేషన్లో పడి ఇప్పటివరకూ జనరల్‌ ఇంగ్లిష్‌ని పెద్దగా పట్టించుకోనివారే అధికం. 2008 గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఇంగ్లిష్‌ పేపర్లో అర్హత పొందకపోవటంతో పేపర్స్‌లో మంచి మార్కులు వచ్చినా ఇంటర్వ్యూకు ఎంపిక కాలేకపోయినవారున్నారు. గ్రామీణ అభ్యర్థులు ఈ పేపర్‌పై దృష్టి పెట్టటం తక్షణావసరం. పట్టణ అభ్యర్థులకు కూడా స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో నైపుణ్యం ఉండొచ్చేమో కానీ వ్యాకరణంపై పట్టు పెద్దగా ఉండదు. అందువల్ల ఈ 14 రోజులూ అభ్యర్థులందరూ ప్రతిరోజూ కనీసం గంట సమయమైనా దీనికి వెచ్చించాలి.

డి) శిక్షణ కేంద్రాల నోట్సుతో జాగ్రత్త
కోచింగ్‌ సెంటర్ల నోట్సునే ఎక్కువమంది అభ్యర్థులు యథాతథంగా చదువుతున్నారు. సమాధానాలు అదే ధోరణిలో రాసే అవకాశం ఉంటుంది ఈ ధోరణి సమాధానాలు దిద్దేవారిని మెప్పించటం కష్టం. అందువల్ల ప్రెజెంటేషన్‌ జాగ్రత్తలు తీసుకుంటూ రాయాలి. ఇలా చేస్తేనే మిగతావారి కంటే అధిక మార్కులు సాధించటానికి వీలుంటుంది. ఈ కోణంలో ఇప్పుడున్న సమయాన్ని వెచ్చించండి.


పట్టు పెంచే 10 అంశాలు
1. ముందస్తు నిర్ణయాలు చేటు
'ఫలానా పేపర్లో తక్కువ వస్తాయనీ', 'పెద్దగా మార్కులు రావనీ'... ఇలా మానసికంగా ముందే నిర్ణయించుకోవద్దు.

2. కష్టంగా ఉంటే కంగారొద్దు
ఏదో ఒక పేపర్‌ కష్టంగా వచ్చిందనుకోండీ. 'ఇక మనకి ఉద్యోగం రానట్టే'నని నిర్ణయించేసుకుని మిగతా పేపర్లను పాడుచేసుకోవద్దు. 'కష్టం' అనేది అభ్యర్థులందరికీ ఒకటే!

3. ఒత్తిడి ఇలా దూరం
'ఇది చాలా ముఖ్యం', 'ఇది ఏమంత ఇంపార్టెంట్‌ కాదు'... ఇలా నిర్ణయించుకుంటే పరీక్ష రాసేటపుడు భంగపడాల్సిందే. 'నాకు అర్థం కాని ప్రశ్నలు కూడా కొన్ని రావొచ్చు' అని ముందుగానే మానసికంగా సిద్ధపడటం మేలు. ఇలా భావించటం వల్ల 'అంచనాలు తలకిందులై' ఒత్తిడికి గురయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది.

4. ప్రతి ప్రశ్నా కొంత
2008 పరీక్షల్లో 24 సంవత్సరాల వయసులో మొదటిసారిగా గ్రూప్‌-1 పరీక్ష రాసి డీఎస్‌పీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థి ఏమన్నారో తెలుసా?- 'ఒక్క ప్రశ్న కూడా వదలకుండా అన్ని ప్రశ్నలూ ఎంతో కొంత సమాధానాలు రాయటమే నా విజయ రహస్యం!' జవాబు తెలియని ప్రశ్నలకు కూడా ఏదో ఒక ప్రశ్నపదం ఆధారం చేసుకుని రాయటం వల్ల కూడా తనకు మార్కులు పెరిగాయని తెలిపారు ఆయన.

5. సాగదీసి రాస్తే లాభం సున్నా
మెయిన్స్‌ పరీక్షలో 'బరువు'కి ప్రాధాన్యం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. ఎడిషనల్‌ పేపర్లు తీసుకుని సమాధానాలు తెగ రాసేస్తుంటారు. డాక్టర్‌ వృత్తి నుంచి సీటీఓగా ఎంపికైన ఓ అభ్యర్థిని- 'చాలా తక్కువ పేజీలు రాశాను. కానీ సూటిగా ప్రశ్నలకు అనుగుణంగా రాశాను' అని చెప్పారు. అందువల్ల రాసేది చక్కగా, విషయం సరిగా లేకుండా ఎడిషనల్స్‌పైన ఎడిషనల్స్‌ రాయటం వల్ల దిద్దేవారికి తలనొప్పి తప్ప లాభం ఉండదు. పరీక్ష కేంద్రంలో ఇతరులను గమనిస్తూ పోటాపోటీగా ఎడిషనల్‌ పేపర్లు తీసుకుని గందరగోళంగా చాటభారతం రాసెయ్యటం వల్ల ప్రయోజనమేమీ ఉండదు.

6. మార్కులను బట్టి జవాబు తీరు
ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు కేటాయించారో గమనిస్తూ సమాధానం పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. అనవసరమైన సోదిని రాస్తూ సమయం వృథా చేసుకోకూడదు.

7. చికాకు కలిగించకూడదు
మీకు బాగా పట్టు ఉన్న ప్రశ్నలకు ముందుగా సమాధానం రాయటం మంచిదే. పేపర్‌ దిద్దేవారికి మీపై మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. అలా అని విభాగాలూ ప్రశ్నలూ కలగాపులగంగా చేసేలా రాయకపోవటం మేలు. ఒక విభాగంలోని ప్రశ్నలను ముందుగా పూర్తిచేసుకుని తర్వాతి విభాగంలోకి వెళ్తేనే మంచిది. దీనివల్ల దిద్దేవారికి చికాకు తగ్గుతుంది. 'ఎన్ని ప్రశ్నలు రాశాడు? ఎక్కడ రాశాడు?' అంటూ వెతుక్కునే శ్రమను ఇవ్వకూడదు.

8. వ్యాసానికి ప్రణాళిక
వ్యాసాలలో ప్రణాళిక వేసుకునేటపుడు చిత్తుప్రతిగా ప్రధాన బుక్‌లెట్‌ చివరిపేజీలో రాయండి. 'చిత్తు ప్రతి' అని రాస్తే చాలు, కొట్టివేయవచ్చు.

9. భాషల మిశ్రమం వద్దు
వేర్వేరు ప్రశ్నలను వేర్వేరు భాషల్లో రాయవద్దు. తెలుగు భాషలో సమాధానాలు రాసేవారు ఇంగ్లిష్‌ పదాలను తక్కువగా వాడాలి. ఒకవేళ ఇంగ్లిష్‌ పదమే వాడాల్సివస్తే తెలుగులిపిలో ఆంగ్లపదం రాయాలి. పత్రికా భాషను యథాతథంగా రాయవద్దు. ఇంటర్నెట్‌ అనే పదాన్ని 'అంతర్జాలం' అని పత్రికలు రాస్తున్నాయి. కానీ మీరు ఇంటర్నెట్‌ అని రాయటమే మంచిది.

10. చిన్న మెలకువలు
పెద్ద పేరాగ్రాఫ్‌లు రాయకపోవటం, చిన్న చిన్న వాక్యాల నిర్మాణం, మార్జిన్ల నిర్వహణ మొదలైన మెలకువలు మార్కులు పెంచుతాయని గ్రహించండి.

ప్రధాన కోర్సులకు ప్రవేశ ద్వారం


ఇంజినీరింగ్‌ /టెక్నాలజీ /ఆర్కిటెక్చర్‌  పీజీ కోర్సుల్లో ప్రవేశం కావాలి. అది కూడా విశ్వవిఖ్యాతి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌, ఐఐటీలతో పాటు ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో...!

'గేట్‌' రాస్తే ఇది సాధ్యమే! 

ఈ పరీక్షలో చూపే ప్రతిభ ఆధారంగా పీజీ కోర్సుల్లో ప్రవేశంతో పాటు ఉపకారవేతనాలు కూడా లభిస్తాయి. రెండేళ్ల నుంచీ గేట్‌ పరీక్షలో కొన్ని మార్పులు జరిగాయి. 'గేట్‌' ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం!

దీన్ని రాసినవారు వై.వి. గోపాలకృష్ణమూర్తి


గేట్‌ స్కోరును ఇతర దేశాల్లో కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. సింగపూర్‌, మలేసియా తదితర దేశాల్లో కూడా గేట్‌ను ప్రామాణిక పరీక్షగా గుర్తిస్తారు. బార్క్‌, సిఎస్‌ఐఆర్‌ సంస్థల పోటీ పరీక్షల్లోనూ గేట్‌లో సాధించిన ప్రతిభకు తగిన ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా గేట్‌ స్కోరు ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి.

గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)ను ఐఐటీలు సంయుక్త ఆధ్వర్యంలో ఏటా ఫిబ్రవరి రెండో ఆదివారం నిర్వహిస్తాయి. ప్రశ్నపత్రం స్థాయి కూడా ఆ సంస్థలకున్న పేరు ప్రతిష్ఠలకు అనుగుణంగానే ఉంటుంది. అందువల్ల ఈ పరీక్ష రాయదలుచుకున్న ప్రతి ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థీ ప్రణాళికాబద్ధంగా శ్రమించాల్సిందే. ఈసారి గేట్‌ పరీక్షను ఐఐటీ-ఢిల్లీ నిర్వహించనుంది.

ప్రస్తుత గేట్‌ పరీక్ష విధానాన్ని పూర్తి ఆబ్జెక్టివ్‌ పేపర్‌గా పరిగణించలేము. కామన్‌ డేటా ఆధారిత ప్రశ్నలు, లింక్డ్‌ ఆన్సర్‌ ప్రశ్నలను సంప్రదాయ ప్రశ్నలుగానే భావించాలి. అందువల్ల ఐదు నుంచి పది నిమిషాల సమయం తీసుకునే సమస్యలను కూడా బాగా సాధన చేయాలి.

పరీక్ష విధానం
గేట్‌ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాలుంటాయి.

విభాగం- |: ఇందులో 1 నుంచి 25 వరకు ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.

విభాగం- ||: 26 నుంచి 55 వరకు మొత్తం 30 ప్రశ్నలు ఈ విభాగంలో ఉంటాయి. వీటన్నింటికీ కలిపి 60 మార్కులు కేటాయించారు.

* 48 నుంచి 51 వరకు ఉండే ప్రశ్నలను 'కామన్‌ డేటాబేస్డ్‌' ప్రశ్నలంటారు. అంటే ఇచ్చిన డేటా నుంచి రెండు జతల ప్రశ్నలు (48-49, 50-51) ఇస్తారు.
* 52 నుంచి 55 వరకు ఉండే నాలుగు ప్రశ్నల్లో ఒక్కోదానికి రెండు మార్కులు కేటాయించారు. వీటిని 'లింక్డ్‌ ఆన్సర్‌' ప్రశ్నలంటారు. ఈ నాలుగు ప్రశ్నల్లో రెండు జతలు ఉంటాయి. వీటిలో రెండో ప్రశ్న సమాధానం మొదటి ప్రశ్న సమాధానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ జతలోని మొదటి ప్రశ్న సమాధానం సరైనదైతేనే రెండో ప్రశ్న సమాధానాన్ని పరిశీలిస్తారు. మొదటి ప్రశ్నకు సమాధానం తప్పు అయితే రెండో ప్రశ్న సమాధానం సరైనప్పటికీ పరిగణనలోకి తీసుకోరు.

విభాగం-|||: గత రెండేళ్ల నుంచి గేట్‌ పరీక్షలో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంగ్లభాషా ప్రావీణ్యం, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారు. వీటికి మొత్తం 15 శాతం ప్రాధాన్యం ఉంది. ఇవి 56 నుంచి 65వ ప్రశ్న వరకు ఉంటాయి. 56 నుంచి 60 వరకు ఉండే 5 ప్రశ్నలకు ఒక్కోదానికి 1 మార్కు, 61 నుంచి 65 వరకు ఉండే 5 ప్రశ్నలకు ఒక్కోదానికి 2 మార్కులు ఉంటాయి.

* ఆంగ్లభాషా ప్రావీణ్యానికి సంబంధించిన వ్యాకరణం, వాక్యపూరణం, వెర్బల్‌ ఎనాలజీ, వర్డ్‌గ్రూప్స్‌, ఇన్‌స్ట్రక్షన్స్‌, క్రిటికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ డిడక్షన్‌ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. ఈ ప్రశ్నలు ఐఐఎంలు నిర్వహించే క్యాట్‌, విదేశాలలో ఉన్నత విద్యకోసం నిర్వహించే GRE పరీక్షల్లోని ప్రశ్నల మాదిరి ఉంటాయి. కాబట్టి ఆ పుస్తకాలను కూడా చదవడం మంచిది.

న్యూమరికల్‌ ఎబిలిటీ: జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో రెండేళ్ల నుంచి న్యూమరికల్‌ ఎబిలిటీని ప్రవేశపెట్టడం మరో కొత్త అంశం. ఇందులో న్యూమరికల్‌ కంప్యుటేషన్‌, న్యూమరికల్‌ ఎస్టిమేషన్‌, న్యూమరికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లకు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్యాట్‌ పరీక్షకు సంబంధించిన పుస్తకాల్లో ఈ సమాచారం లభిస్తుంది. సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షల జనరల్‌ స్టడీస్‌ మెటీరియల్‌ కూడా ఉపయోగపడుతుంది.

ఈ విభాగం IIIలోని సిలబస్‌ గేట్‌ అభ్యర్థులకు కొంత భారంగా అనిపించవచ్చు. కానీ ఈ సన్నద్ధత అనేక ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని సవాలుగా తీసుకుని సిద్ధం కావాలి.

నెగటివ్‌ మార్కులతో జాగ్రత్త
గేట్‌ పరీక్షలో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం నెగిటివ్‌ మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున నెగిటివ్‌ మార్కులుంటాయి. అయితే విభాగం ||లోని లింక్డ్‌ ఆన్సర్‌ ప్రశ్నల్లో రెండో దానికి సమాధానం తప్పు అయినప్పటికీ నెగటివ్‌ మార్కులుండవు.

ప్రస్తుత గేట్‌ పరీక్ష విధానాన్ని పూర్తి ఆబ్జెక్టివ్‌ పేపర్‌గా పరిగణించలేము. కామన్‌ డేటా ఆధారిత ప్రశ్నలు, లింక్డ్‌ ఆన్సర్‌ ప్రశ్నలను సంప్రదాయ ప్రశ్నలుగానే భావించాలి. అందువల్ల ఐదు నుంచి పది నిమిషాల సమయం తీసుకునే సమస్యలను కూడా బాగా సాధన చేయాలి.


ప్రామాణిక పుస్తకాలనే...
గేట్‌ రాయబోయే అభ్యర్థులు మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం ప్రధానం. గత ప్రశ్నపత్రాలు, యు.పి.ఎస్‌.సి. నిర్వహించే ఇంజినీరింగ్‌, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా పత్రాలను అధ్యయనం చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగటానికి అవకాశం ఉంటుందో తెలుస్తుంది. విషయాన్ని నేర్చుకుంటూనే రాబోయే ప్రశ్నలను అభ్యర్థి తనకు తానుగా విశ్లేషించుకోవడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది.

*  గేట్‌ విజయం సాధించాలంటే అభ్యర్థులు ఇప్పటి నుంచే రోజూ కనీసం 6, 8 గంటలు సాధనకు కేటాయించాలి. ప్రతీ వారాంతం, నెలకోసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. ప్రిపరేషన్‌లో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యమని అభ్యర్థులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయడం కష్టం. 3 గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు సాధించగలమనేది జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మరీ కష్టంగా అనిపించేవీ, ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలనూ వదిలేయడం మంచిది.

ప్రిపరేషన్‌లో కూడా ఇదే సూత్రం పాటించాలి. అందుబాటులో ఉన్న 5 నెలల సమయంలో ఏ అంశాలను చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో నిర్ణయించుకోవాలి.

*  గేట్‌లో రెండు మార్కుల లింక్డ్‌ ఆన్సర్‌ ప్రశ్నలు, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ చాలా కీలకం కానున్నాయి. వీటిపై అధిక శ్రద్ధ, సాధన తప్పనిసరి.
*  ఇంజినీరింగ్‌ అభ్యర్థులు ఇంజినీరింగ్‌ మ్యాథ్స్‌ విషయంలో జాగ్రత్త వహించాలి. మ్యాథ్స్‌పై తగిన శ్రద్ధ చూపాలి. దీనికి దాదాపు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.